సంస్కృతాంధ్ర సాహితీసౌరభం
श्लोकम् :
वार्धकं वयसा नास्ति मनसानैव तद्भवेत ।
सन्ततोद्यमशीलस्य नास्ति वार्धक पीडनम् ।।
శ్లోకం:
వార్ధకం వయసా నాస్తి, మనసా నైవ తద్భవేత్ ।
సంతతోద్యమ శీలస్య, నాస్తి వార్ధక పీడనమ్ ।।
పద విభాగం:
వార్ధకం, వయసా, నాస్తి, మనసా, నైవ, తత్, భవేత్,
సంతత, ఉద్యమ శీలస్య, నాస్తి, వార్ధక పీడనమ్,
ప్రతిపదార్థం:
వార్ధకం = ముసలితనం, వయసా = వయస్సుచేత, నాస్తి = లేదు, మనసా = మనస్సుచేత, ఏవ = అయిననూ, తత్ = అది, న భవేత్ = అవకూడదు,
సంతత = నిరంతరమూ, ఉద్యమ శీలస్య = ఉద్యమ శీలునికి అంటే ప్రయత్నము చేయువానికి, వార్ధక పీడనమ్ = వయోబాధ, నాస్తి = లేదు,
Meaning:
Being old is not due to the advancement of the age. Even it should not occur from the very thinking of your mind. The one who always works hard there is no burden of being old.
తాత్పర్యం:
ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం.
ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం. దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే. కొంతమంది యాభయ్యవ పడిలోకి రాగానే వృద్ధులయ్యారంటారు. కొందరు అరవై సంవత్సరాలకు ముసలివారనిపించుకుంటారు. 70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది.
పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు. అటువంటివారు సమాజ ప్రగతికే కాక సొంత ప్రగతికి కూడా శత్రువులే. అతి పిసినారితనం, స్వార్థం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం వంటి దురలవాట్లు శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీన పరుస్తాయి. అకాల వార్ధక్యానికి దారి తీస్తాయి. ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అటువంటి వృద్ధులు తమ కుటుంబాలకు సమాజానికి కూడా భారమే. మానసిక ఒత్తిడులు, కుంగుబాటు వల్ల వచ్చే ముసలితనం చెద పురుగులాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది.
మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయ కూడదు. ‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి. భారతీయ సంప్రదాయంలో జ్ఞాన వార్దక్యాన్ని అంగీకరించారు గానీ వయో వార్ధక్యాన్నికాదు. భరద్వాజ మహర్షి మూడు ఆయుర్దాయాల కాలం తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించాడని పురాణ ప్రతీతి. నిత్య వ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతత క్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు.
మనకి గురువు గారు ప్రతి సారి చెబుతూ నే ఉంటారు
యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమ స్తస్యై నమో నమః.
భరద్వాజ మహర్షి మూడు ఆయుర్దాయాల కాలం తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించాడని మనకి భాగవత ప్రవచనం లో గురువు గారు తెలియచేసారు . నిత్యవ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు అని శ్రీమద్ భాగవతం నుంచి మనం నేర్చుకుంటున్నాము
ఇట్లు
శివ పరివారం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి