17, ఆగస్టు 2020, సోమవారం

శ్రీమద్ఒ భాగవతం

Srimadhandhra Bhagavatham -- 91 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

కనాడు కృష్ణభగవానుడు పరమసంతోషంగా రుక్మిణీ దేవి మందిరంలోకి ప్రవేశించారు. అది అసురసంధ్య వేళ దాటిన కాలం. ఆ ఇల్లు కర్పూరము,  అగరు మొదలయిన సువాసనలతో ఉన్నది. కృష్ణ పరమాత్మ ఆగమనమును తెలుసుకున్న రుక్మిణీదేవి గబగబా వెళ్లి ఆ పరిచారిక చేతిలో ఉన్న దండమును తాను తీసుకొని కృష్ణ పరమాత్మకి విసురుతోంది. కృష్ణుడు రుక్మిణి వంక చూసి పరమ ప్రసన్నుడై ఆమెతో 'రుక్మిణీ! నిన్ను చూస్తే చాలా పొరపాటు చేశావేమో అనిపిస్తున్నది. నేను ఐశ్వర్య హీనుడను, దరిద్రుడను. ఎక్కడో సముద్రగర్భంలో ఇల్లు కట్టుకున్న వాడిని. నీకు శిశుపాలుడి వంటి మహా ఐశ్వర్యవంతునితో వివాహం సిద్ధం చేశాడు నీ అన్న. నిష్కారణంగా అంత  మంచి సంబంధం విడిచి పెట్టి ఏమీ చేతకాని వాడిని, పిరికివాడిని, సముద్ర గర్భంలో ఉన్నవాడిని, దరిద్రుడిని అయిన నన్ను నీవు చేపట్టేవేమో అనిపిస్తోంది. నీవు చేసిన పొరపాటును దిద్దుకోవాలని నీ మనసులో కోరిక ఉంటే అలాంటి అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈమాటలు వింటున్నప్పుడు రుక్మిణీ దేవి ముఖ కవళికలు మారిపోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా అదిరిపోయి స్పృహ తప్పి క్రింద పడిపోయింది.  ఇన్ని మాటలు మాట్లాడిన కృష్ణుడు గబగబా రుక్మిణీ దేవి దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో ఎత్తి ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒళ్ళు చల్లబడడం కోసం ఒళ్ళంతా గంధమును రాశాడు. కళ్ళనుండి వెలువడే కన్నీటిని పన్నీటితో కడిగాడు. కర్పూర వాసనవచ్చే పలుకులు ఆమె చెవులలోకి ఊదాడు. ఆమె నేలమీద పడిపోయినప్పుడు ఆమె వేసుకున్న హారములన్నీ చిక్కుపడిపోయాయి. వాటి చిక్కులు విడదీసి గుండెల మీద చక్కగా వేశాడు. చెమట పట్టి కరిగిపోతున్న కుంకుమను చక్కగా దిద్ది చెమటనంతా తుడిచివేశాడు. తామర పువ్వురేకులతో చేసిన పెద్ద విసనకర్రను తెప్పించి దానితో విసిరాడు. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్లు ఆమె ప్రసన్న మయేటట్లు ప్రవర్తించి ఆవిడను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అదేమిటి రుక్మిణీ నేను నీతో విరసోక్తులాడాను. ఆ మాటలకు నీవు ఇంత నొచ్చుకుని అలా పడిపోయావేమిటి’ అన్నాడు.

కృష్ణుడు ఇలా మాట్లాడవచ్చునా? అని  అనుమానం రావచ్చు. కృష్ణుడు అలా మాట్లాడడానికి ఒక కారణం ఉన్నది. రుక్మిణీదేవి యందు చిన్న దోషం కలిగింది.  చిన్న దోషమును స్వామి సత్యభామ యందు భరిస్తాడు కానీ రుక్మిణీదేవియందు భరించడు. రుక్మిణీ దేవికి కొద్దిపాటి అతిశయం వచ్చింది. ‘అష్టమహిషులలో నేను పట్టమహిషిని. కృష్ణ పరమాత్మ తప్పకుండ నా మందిరమునకు విచ్చేస్తూ ఉంటారు’ అని ఆమె మనస్సులో కొద్దిపాటి అహంకారం పొడసూపింది.  యథార్థమునకు కృష్ణ పరమాత్మ పదహారు వేల ఎనిమిది మంది గోపికల ఇంట్లోనూ కూడా కనపడతాడు. ప్రతిరోజూ ఉంటాడు. అందరితోనూ క్రీడించినట్లు ఉంటాడు.  ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. అది మేధకు అందే విషయం కాదు. రుక్మిణీదేవికి కలిగిన చిన్న అతిశయం పెరిగి పెద్దదయి పోతే ఆవిడ ఉపద్రవమును తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆవిడ లక్ష్మి అంశ. కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఈ అతిశయ భావనను ఆమెనుండి తీసివేస్తే ఆమె పరమ మంగళప్రదురాలిగా నిలబడుతుంది. అందుకు కృష్ణుడు ఆమెను దిద్దుబాటు చెయ్యాలని మాట్లాడిన మాట తప్ప ఆయన ఏదో కడుపులో పెట్టుకుని మాట్లాడిన మాట కాదు.  కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించిన తీరు ఆమె అభ్యున్నతి కొరకు ప్రవర్తించిన ప్రవర్తన.

కృష్ణుని మాటలు విన్న  అమ్మవారు చాలా అద్భుతమయిన విషయమును చెప్పింది. ‘కృష్ణా! మీరు చెప్పిన అన్నీ పరమ యదార్థములు. నేను చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని, మీకు మాత్రమే పత్నిని కావాలని పలవరించి పలవరించి మీకు భార్యనయ్యాను. మీరు లోకులు అందరివలె ఉండేవారు కాదు. మీరు పరమాత్మ. అందుకే మిమ్మల్ని చేరుకున్నాను. ధనగర్వం కలిగిన ఐశ్వర్యవంతులెవరు నీకు చుట్టాలు కారు. తాము ఐశ్వర్యవంతులమనే గర్వం కలిగి మిగిలిన వారిని చిన్నచూపు చూసే వారు నీకు చుట్టాలు కారు. అన్నీ ఉన్నా అన్నిటినీ విడిచిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుని కోసమే జీవితం గడిపే పరమ భాగవతోత్తములకు  చెందినవాడవు. పరబ్రహ్మ స్వరూపుడవు. నీ నడవడి ఒకరు అర్థం చేసుకోలేని రీతిలో ఉండేవాడవు. అన్నీ విడిచిపెట్టేసి ఒక్క ఈశ్వరునే చెయ్యి చాపి అడగడమే తప్ప, వేరొకరి దగ్గర చెయ్యి చాపనని అన్నవాడి దగ్గర చెయ్యి చాపేవాడివి.

సౌందర్య వంతులయిన కాంతలతో నీకు పని లేదు. నీకు బాహ్య సౌందర్యముతో పనిలేదు. నీకు కావలసినది అంతఃసౌందర్యము. కృష్ణా, నీవు అన్న మాటలలోని  చమత్కారమును నేను గ్రహించగలిగాను. ఇటువంటి వాడివి కాబట్టే నిన్ను చేరుకున్నాను. ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం అదే. చాతక పక్షి వలె నా జన్మ ఉన్నంత కాలము నీ పాదములను సేవించే దానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేతకాని, వాక్కు చేతకాని, చేరేదానను కాను. నీవు ఇవ్వగలిగిన వరం ఉన్నట్లయితే నాకు దానిని ఇవ్వు’ అని అడిగింది. కృష్ణుడు ‘రుక్మిణీ! నీవు పరమ పతివ్రతవు. ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గరయినా నిలబడి తనను క్షమించమని అడిగిన సందర్భం లేదు. మొట్టమొదటి సారి రుక్మిణీ దేవి దగ్గర అడిగాడు. అనగా ఈశ్వరుడు తన కింకరుడిగా ఉండాలని కోరుకున్న వాని దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఈశ్వరుడు అంతవశుడు అవుతాడని తెలియజేస్తూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవలసిన విధానమును విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్లుగా చూపించిన ఒక మహోత్కృష్టమయిన ఘట్టం ఈ ఘట్టం. రుక్మిణీ దేవి కృష్ణుడిని వశం చేసుకుని తన వాడిని చేసుకుంది. ఇది రుక్మిణీ విజయం. దానిని మన విజయంగా మనం మార్చుకోవడంలో భాగవతం వినడం చేత మనం పొందవలసిన విజయము.

బలరాముడు రుక్మిని చంపుట

రుక్మికి రుక్మిణీ దేవి అంటే చాలా ఇష్టం. కృష్ణుని మీద మాత్రం అంత పెద్ద ప్రీతి లేదు. పాము చుట్టం పడగ విరోధం. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా కుటుంబాలలో ఈ లక్షణం ఉంటుంది. అల్లుడుగారు కావాలి.  అల్లుడుగారి నాన్న గారు, అమ్మగారు ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడు అవ్వాలి. ఆ పిల్లవాడికి అక్క చెల్లెళ్ళు, ఉండకూడదు. అల్లుడు గారు తన భార్య అక్క చెల్లెళ్ళను ఎంతగానో ఆదరించాలి. ఆ పిల్లవాడు తన అక్కచెల్లెళ్ళను చూడకూడదు. కొంతమంది ఆలోచనలు ఇంత హేయంగా ఉంటాయి. ఇది వ్యక్తులకు ఉండవలసిన లక్షణం కాదు. రుక్మికి సంబంధించిన ఈ ఘట్టం ఇందుకు సంబంధించిన విషయములను విశదపరుస్తుంది. పురాణమును మన జీవితమునకు సమన్వయము చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దాని వలన మనం ప్రయోజనమును పొందగలుగుతాము. లేకపోతే అది జీవితమును ఉద్ధరించదు.

రుక్మికి రుక్మిణి అంటే తోడపుట్టింది కాబట్టి ప్రేమ. కృష్ణ భగవానుడు అంటే అంత ప్రీతి లేదు. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతిని మేనల్లుడయిన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. తన వేరొక కుమార్తె అయిన చారుమతిని కృతవర్మకు ఇచ్చి వివాహం చేశాడు. మనవరాలయిన రుక్మలోచనను కృష్ణుని మనుమడయిన అనిరుద్ధునకిచ్చి వివాహం చేశాడు. ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుని వివాహమునకు కృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి విదర్భ రాజ్యమునకు వెళ్ళారు. అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా జరిగిపోయాయి. వేడుకలు పూర్తి అయిన పిమ్మట కొత్త పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు అందరు బయలుదేరి పోవడానికి సిద్ధపడుతున్నారు. అక్కడికి కళింగరాజు వచ్చాడు. కళింగ రాజు లేనిపోని పెద్దరికం తెచ్చిపెట్టుకునే తత్త్వం కలిగిన వాడు. కడుపులో చాలా బాధ పడిపోతున్నాడు. వారందరూ అలా సుఖంగా ఉండడం అతనికి సహింపరానిది అయింది. వెంటనే అతను రుక్మి దగ్గరకు వెళ్లి ‘ నీకేమయినా బుద్ధి ఉన్నదా? నీకు జరిగిన అవమానమును ఎంత తొందరగా మర్చిపోయావు. నీ కూతురుని కృష్ణుడు కొడుకుకు ఇచ్చి వివాహం చేస్తావా?  ఆరోజున కృష్ణుడు తన ఉత్తరీయం తీసి నిన్ను బండి చక్రమునకు కట్టి కత్తిపట్టి నీ జడను పాయలు పాయలుగా గొరిగి వదిలిపెట్టాడు.  రాజులందరూ నిన్ను చూసి నవ్వితే నీవు భోజ కటకమును రాజధానిగా చేసుకుని ఉండిపోయావు. ఇవాళ ఆ రుక్మిణీ దేవికి కృష్ణునియందు పుట్టిన కొడుక్కి నీ కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తావా! నీకు జరిగిన అవమానం చాలా తొందరగా మర్చిపోయావే. నీ మనస్సు మంచిదే. నీవు చాల తొందరగా నీ అవమానములు మర్చిపోతావు’ అన్నాడు.

ఇతని మాటలు విన్న రుక్మి ‘బలరామ కృష్ణులను ఎలా అవమానించ గలను?’అని కళింగ రాజుని అడిగాడు.  కళింగ భూపతి ‘బలరాముడికి ద్యూతం ఆడడం అంత బాగా రాదు. ద్యూతమునకు రమ్మనమని ఆహ్వానిస్తే రానని అనడు కదా! కాబట్టి బలరాముణ్ణి ద్యూతమునకు రమ్మనమని పిలు. అతను వస్తాడు. పందెములు పెట్టు. వరుసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా నవ్వుతూ ఉండు. బలరాముడు కుపితుడయిపోతాడు. అన్నగారు అలా ఓడిపోతూ నువ్వు నువ్వుతుంటే కృష్ణుడి మనస్సు ఖేదపడిపోతుంది. అలా నువ్వు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి’ అన్నాడు.

ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. రుక్మి బలరాముని ద్యూతమునకు పిలిచి ఓడిపోయినప్పుడల్లా ఉండేవాడు. బలరాముడు సహిస్తున్నాడు. కృష్ణుడు అన్నీ ఎరిగి ఉన్నవాడు  ఏమీ తెలియని వాడిలా చూస్తున్నాడు. ఆఖరున బలరాముడికి కోపం వచ్చి లక్ష రూకలను ఒడ్డాడు. బలరాముడు గెలిచాడు. ‘నేను గెలిచాను’ అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి. అక్కడ కూర్చున్న వారు రుక్మి పక్షం వహించినట్లుగా ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు.  బలరాముడు సరే వేరొకసారి లక్ష ఒడ్డుతున్నానని మళ్ళీ ఆడి గెలిచాడు. ఇప్పుడు కూడా నేనే గెలిచాను అని అన్నాడు రుక్మి. అశరీరవాణి  ఈ ఆటలో బలరాముడే గెలిచాడని పలికింది. ఇంత అశరీర వాణి చెప్పినా రుక్మి నవ్వుతూ నువ్వు గొల్లలలో పుట్టిన వాడివి, ఆవుల వెంట, దూడల వెంట అరణ్యములలో తిరుగుతూ గోవులను కాసుకునే వాడివి. నీవు రాజులతో ద్యూతం ఆడడం ఏమిటి? నీవేమి మాట్లాడుతున్నావు? అన్నాడు. బలరాముడు ఇంక వీడిని ఊరుకోవడానికి వీలు లేదని అనుకున్నాడు. రుక్మిని ప్రోత్సహించిన కళింగ భూపతిని చూసి తను కూర్చున్న ఆసనం మీదనుంచి లేచి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు. పళ్ళు ఊడిపోయి క్రింద పడిపోయి కళింగ భూపతి నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు. రుక్మి దగ్గరకు వచ్చి కంఠం క్రింద చెయ్యి వేసి పైకెత్తి ఒక్కదెబ్బ కొట్టాడు. మూతి వెనక్కు వెళ్ళిపోయి నెత్తురు కక్కుకుని రుక్మి చచ్చిపోయాడు.  కృష్ణుడు లేచి ‘రుక్మిణీ బయలు దేరదామా’ అన్నాడు.  తప్పకుండా బయలుదేరదాము అన్నది. ఆవిడకి కృష్ణుడు ఎంత చెప్తే అంత తన పుట్టింటివారనే మమకారములు ఆవిడకు లేవు. ‘నా భర్త ధర్మమూర్తి. ఆయనకు తెలుసు ఏమిచేయాలో, ఆయన ఏమి చేస్తే అదే యధార్థం. అని ఆమె భావించింది. తన భర్తతో కలిసి రుక్మిణీ దేవి రథం ఎక్కి వెళ్ళిపోయింది. బలరాముడు వెళ్ళిపోయాడు. యాదవులు వెళ్ళిపోయారు.
*****************************

కామెంట్‌లు లేవు: