మహాభారతము ' ...57.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
సభా పర్వం.
పాండవుల వనవాస ప్రయాణం మొదలుకాగానే విదురుని పిలిపించాడు ధృతరాష్ట్రుడు, మానసిక సంఘర్షణకు లోనై.
విదురుడు రాగానే, ' విదురా ! పాండవులు ఇక్కడనుండి వెళ్లిన విధానంచెప్పు. నాకు చాలా వ్యాకులముగా వున్నది వారిగురించి. ' అని అడిగాడు. ' మహారాజా ! ఏమి చెప్పుదును వారి భావోద్వేగము. వంచించబడినామని, వారు ప్రతిఒక్కరు దుఃఖ పడుతున్నారు. ధర్మజుడు, యింటికి పెద్దవాడు. తన వ్యధ బయటపడకుండా, ముఖమును వస్త్రంతో కప్పివేసుకుని, లోలోన కుమిలిపోతూ ముందునడిచాడు. భీముడు తన విశాలమైన భుజాలను మన రాకుమారుల ముందు ప్రదర్శిస్తూ , హెచ్చరికలు చేస్తున్నట్లు నడిచాడు. ఇక అర్జునుడు తన చేతితో గుప్పిళ్లలో యిసుకను తీసుకుని, అటూయిటూ జల్లుతూ, శత్రుమూకకు యిదే గతి పడుతుంది అని చెప్పినట్లుగా నడిచాడు. '
' నకులుడైతే, తన వంటినిండా దుమ్ము పులుముకుని, తమను మోసగించినవారిని, ధూళిలో కలిపేస్తాను. అని చెప్పినట్లు జనులు అనుకుంటున్నారు. సహదేవుడు తన ముఖంముందు వస్త్రాన్ని ఆడిస్తూ, యిది రాబోయేకాలంలో వీరందరి శవాలపై కప్పే వస్త్రం గా భావించమని సంకేతాలు యిచ్చాడు. '
' ద్రౌపది అయితే, దుఃఖంతో రోదిస్తూ, తనన పొడవాటి నల్లని శిరోజాలను ముఖం కప్పుకోవడానికి మార్గంగా చేసుకుని తనరోదన కనబడకుండా వుండాలని, విశ్వ ప్రయత్నం చేసింది. అందరికంటే ఎక్కువగా, వారి పురోహితుడు ధౌమ్యుడు రౌద్రంగా స్పందిస్తూ, పితృకార్యాలలో చదువవలసిన మంత్రాలు చదువుతూ, కౌరవులనుద్దేశించి వారి భవిష్యత్తు చెప్పకనే చెప్పినట్లు అనిపించింది. '
అని విశదంగా చెప్పాడు విదురుడు.
' పాండవులది సహజస్పందనే. రాజ్యం పోయిన దుఃఖంలో అలా ప్రవర్తించారని అను కోవచ్చు. కానీ ప్రజలెలా స్పందించారు నిస్సంకోచంగా చెప్పు విదురా ! ' అని అడిగాడు ధృతరాష్ట్రుడు, ఉత్సుకత ఆపుకోలేక. ' ఈ ప్రశ్న నీవు అడుగకున్నా బాగుండేది మహారాజా ! అయినా అడిగావు కనుక చెబుతున్నాను విను. ప్రజలు ఈ హఠాత్ పరిణామము తట్టుకోలేక మిక్కిలి దుఃఖించారు. కురువృద్దులనందరినీ, చేతగానివాళ్లమని, బాలకులకన్నా అన్యాయంగా ప్రవర్తించామనీ, యెగతాళిగా మాట్లాడుకున్నారు. మీ పుత్ర వాత్సల్యం మీ వంశనాశనానికే గాక అపార జననష్టం కలిగిస్తుందని, భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు. పాండవులవెంట అరణ్యాల లోనికి తామూ వెళ్తామని, మీ గొడుగు క్రింద వుండే అవకాశం లేదనీ, తాము అనాధలమై పోయామని పరిపరి విధాలా ఆక్రోశిస్తున్నారు ప్రజలు మహారాజా ! ' అన్నాడు విదురుడు, యేమాత్రం సంకోచం లేకుండా.
' ధృతరాష్ట్రా ! పాండవులు వెళుతుంటే, అనేక అపశకునాలు తోచాయి. భూమి కంపించింది. కొన్ని చోట్ల పట్టపగలే తోకచుక్కలు కనిపించాయి. వినాశకాలం యిక ఆట్టే దూరంలేదు. మనవారు జూదంలో పెట్టిన పదమూడు సంవత్సరాల గడువు మాత్రమే మిగిలి వున్నట్లున్నది కురువంశ నాశనానికి. ' అని కూడా విడమరిచి చెప్పాడు.
వీరి సంభాషణ యిలా జరుగుతుండగా, నారదమునీంద్రులు అక్కడకువచ్చి, విదురులు యే విధమైన కాలనిర్దేశం చేశారో, కురువంశ నాశనానికి, అదే పదమూడు సంవత్సరాల కాలం నారదుడు కూడా నిర్దేశించి, వెంటనే, ధృతరాష్ట్రునికి, మాట్లాడే అవకాశం యివ్వకుండా, అక్కడనుండి, అంతర్ధానమయ్యాడు.
నారదుల రాక, విదుర భవిష్యత్ నిర్దేశం విన్న కౌరవులకు కూడా భయం పట్టుకున్నది. పాండవులను వనవాసానికి పంపిన ఆనందం లేశమైనా వారిలో కనబడలేదు. దుర్యోధనుడు శకునిని, కర్ణుని వెంట పెట్టుకుని, ద్రోణాచార్యుని వద్దకువెళ్లి, తమకు అండగా వుండమని, యుద్ధం కనుక సంప్రాప్తిస్తే, తనను అంటిపెట్టుకునే వుండాలని, అప్పుడే ఆయనను అభ్యర్ధించారు.
ద్రోణుడు తన మనసులోనిది దాచుకోకుండా, ' దుర్యోధనా ! పాండవులు దైవాంశసంభూతులు. తెలిసో తెలియకో నీకు వారితో వైరం యేర్పడింది. మేము యెంతమంది చెప్పినా నీ తలకెక్కలేదు. నేను యుద్ధంలో నీవైపే వుంటాను కానీ, వారి అరణ్య, అజ్ఞాతవాసాల అనంతరం వారు పగతోరగిలిపోతూ వుంటారు. వారిని జయించడం అసాధ్యం. ఇక నా విషయం అంటావా, నన్ను చంపేవాడు ద్రుపదుని కుమారుడు ధృష్టద్యుమ్నుడు వారిపక్షాన వున్నాడు. ద్రౌపది సోదరుడు. అర్జునునికి ప్రీతి పాత్రుడు. విధి బలీయమైనది. ఇప్పుడు వారి వనవాసం యెలా తప్పించలేకపోయామో, అలాగే, మన పరాజయం కూడా తప్పదేమో ! ' అని సూటిగా చెప్పాడు.
' దుర్యోధనా ! ఈ పదునాలుగు సంవత్సరాలే నీకు మంచి కార్యాలు చెయ్యడానికి వున్న సమయం. దీనిని సద్వినియోగం చేసుకో. యజ్ఞయాగాదులు చెయ్యి. దుష్ట ఆలోచనలు మానుకో ! ' అనికూడా చెప్పాడు ద్రోణుడు దుర్యోధనునితో.
ద్రోణుడు దుర్యోధనునకు చెప్పిన మాటలు ధృతరాష్ట్రునికి కూడా తెలిసింది. ఈ లోపు సంజయుడు కూడా అక్కడికి వచ్చి ధృతరాష్ట్రునితో ' ఇది నీస్వయంకృతాపరాధం. ఇప్పుడు వగచి యేమిప్రయోజనం. ' అని తనవంతు మాటగా చెప్పాడు. ' మహారాజా ! యముడు యెప్పుడూ స్వయంగా వచ్చి యెవరితలా నరకడు. మనం చేసే కార్యాలే మనమీద యితరులు కత్తిపెట్టే పరిస్థితి తెచ్చిపెట్టి మనలను యమునివద్దకు పంపుతాయి. '
' ద్రౌపది అయోనిజ, యజ్ఞ గుండములోనించి వుద్భవించిన సాధ్వీమణి. పాండవులను నీ కుమారులు సేవకులుగా యెలా వూహించుకోగలిగారు. వారి పరాక్రమాల ముందు వీరు యేపాటి ? అని దుర్యోధనుని దుష్టచింతనను తేటతెల్లం చేశాడు సంజయుడు.
అంతావిని ధృతరాష్ట్రుడు, ' సంజయా ! నాకు యివన్నీ ముందేతెలిసి ద్రౌపదికి మూడు వరాలిచ్చి పరిస్థితి చక్కదిద్దాలనుకున్నాను. కానీ, పుత్రప్రేమతో యెవరెన్ని చెప్పినా వినకుండా మళ్ళీ వారిని జూదానికి పిలిచాను. విధి నాకు, నాకుమారులకూ విధించే శిక్షకు యెదురుచూస్తూ కాలం గడుపుతాను. అంతకుమించి యేమి చెయ్యగలను ? ' అని విచారంగా, నిస్సహాయంగా, అన్నాడు ధృతరాష్ట్రుడు.
సభాపర్వం ఈరోజుతో పరిసమాప్తం అయింది.
స్వ స్తి.
వ్యాసానుగ్రహంతో వనవాస పర్వం ( అరణ్య పర్వం ) రేపటి నుండి తెలుసుకుందాం.
తీర్థాల రవి శర్మ
9989692844
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి