*7. కాళరాత్రి*
*ఓం శ్రీమాత్రే నమః!*
*ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా*
*లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ*
*వామపాదోల్లపల్లోహలతాకంటక భూషణా*
*వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ*
దుర్గామాత ఏడవ శక్తి కాళరాత్రి అను పేర ఖ్యాతివహించినది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరైయుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమెకు గల త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరించుచుండును. ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనుపముండ్ల ఆయుధమును, మఱొక ఎడమచేతిలో ఖడ్గమును ధరించియుండును.
కాళరాత్రి స్వరూపము చూచటకు మిక్కిలి భయానకము కాని ఈమె ఎల్లప్పుడును శుభఫలములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను శుభంకరి అనియు అందురు. కావున భక్తులు ఈమెను జూచి ఏ మాత్రము భయమును గాని ఆందోళననుగాని పొందనవసరమేలేదు.
దుర్గా నవరాత్రులైన ఈ ఎడవ రోజు సాధకుని మనస్సు *సహస్రారచక్రము* నందు స్థిరంగును. అతనికి బ్రహ్మాండము నందలి సమస్త సిద్ధులు కరతలామలక మగును. ఈ చక్రము నందు స్థిరబడిన సాధకుని మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వరూపము నందే నిమగ్నమై యుండును. ఈమె సాక్షాత్కారము వలన భక్తునకు మహాపుణ్య ఫలములు లభించును. అతని సమస్త పాపములు, ఎదురగు అన్ని విఘ్నములు పటాపంచలగును. అతనికి అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలుగును.
కాళరాత్రిమాత దుష్టులను అంతమొందించును. ఈమెను స్మరించినంత మాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు భూతప్రేత పిశాచములు భయముతో పాఱిపోవుట తథ్యము. ఈమె అనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించు వారికి అగ్ని, జలము, జంతువులు, మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రమును ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు. కాళరాత్రిమాత విగ్రహమును హృదయమునందు నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసింపవలెను యమనియమ సంయమములను పూర్తిగా పాటింపవలెను. త్రికరణ శుద్ధి కలిగియుండవలెను. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించువారికి కలుగు శుభములు అనంతములు. మనము నిరంతరము ఈమె స్మరణ ధ్యానములను, పూజలను చేయుట ఇహపర ఫలసాధకము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి