పుష్పక విమానంలో గోవర్ధన కృష్ణుడు రూపంలో శ్రీ మలయప్ప
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధనగిరి దారుడైన శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు పుష్పక విమానంలో అభయమిచ్చారు.
పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు.
ఈ ప్రత్యేకమైన విమానం కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేశారు. ఇది 15 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పు 750 కేజిల బరువు ఉంటుంది. ఇందులో 150 కేజిల మల్లి, కనకాంబరం, మొల్లలు, వృక్షి, చామంతి, లిల్లి, తామరపూలు, రోజాలు తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పలు ఉపయోగించారు.
శ్రీవారి పుష్పక విమానాన్ని మూడు దశలలో ఏర్పాటు చేశారు. విమానంకు ఇరువైపులా శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుడళ్వార్ నమస్కరిస్తున్నట్లుగా, మొదటి దశలో అష్టలక్ష్ములు, రెండవ దశలో ఏనుగులు, చిలకలు, మూడవ దశలో నాగ పడగల ప్రతిమలతో రూపొందించారు.
తమిళనాడులోని సేలంకు చెందిన 20 మంది, టిటిడి గార్డెన్ విభాగంకు చెందిన 10 మంది వారం రోజుల పాటు శ్రమించి ఈ అద్భుతమైన విమానంను సిద్ధం చేశారని టిటిడి గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు. తమిళనాడు చెన్నైకు చెందిన దాత శ్రీ రాంప్రసాద్ బట్టు శ్రీవారి పుష్పక విమానాన్ని ఆకర్షణీయంగా రూపొందించేందుకు సహాకారాన్ని అందించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి