22, అక్టోబర్ 2020, గురువారం

రామాయణమ్ .100

 రామాయణమ్ .100

...

భరద్వాజ మహర్షి ఇచ్చిన విందుతో మైమరచిపోయారందరూ.ఏ పానీయం కావాలంటే ఆ పానీయం నది రూపంలో ప్రవహించినదక్కడ. 

.

ఏ జవరాలి చేతిలో చిక్కితే మగవాడు తనను తాను మరచిపోయి చిత్తయిపోతాడో అలాంటి జవరాండ్రు వేలకువేలు ప్రత్యక్షమయ్యారక్కడ. 

.

నారదుడు,తుంబురుడు,గోపుడు భరతుని ఎదుట గానం చేశారు.

.

భరద్వాజుని ఆజ్ఞచేత ఆయన మునివాటికలోని వృక్షాలన్నీ రకరకాల మనుష్యరూపాలు ధరించాయి.

.

మారేడు చెట్లు మృదంగవాయిద్యకారులుగాను,తాండ్రచెట్లు తాళమువేసేవారుగానూ,రావిచెట్లు నర్తకులుగానూ ,సరళ,తాళ,తిలక,నక్తమాల,వృక్షములు అంతఃపురములో సంచరించే కుబ్జలుగాను,వామనులుగానూ మారిపోయినాయి.

శింశుపా,ఆమలకి,జంబూ,మల్లికా,మాలతి,జాజి లతలు లతాంగులైనవి.

.

ఒక్కొక్కపురుషుని ఏడుగురు స్త్రీలు చుట్డుముట్టి నలుగుపెట్టి స్నానము చేయించారు.మరల వారి శరీరమర్దనమునకు అందమైన కళ్ళుగల స్త్రీలు త్వరగా వచ్చారు. శరీరముతుడుచుటకు ఒకతి ,సురాపానము చేయించుటకొకతి.అందరూ వళ్ళుమరచి ఆనందంతో తైతక్కలాడసాగారు.ఆ విందులూ చిందులూ పొందులూ సైనికులను అదే శాశ్వతము అనుకునేటట్లుచేసింది.వారికి రాజేలేడన్నట్లుగా ,అదే సుఖము జీవితాంతము ఉండి అక్కడే ఉండిపోవాలని కోరుకున్నారు..వారికి భరతుడులేడు ,రాముడు లేడు ఆయన దండకారణ్యములేదు ఎవరికి వారు విచ్చలవిడిగా రెచ్చిపోయి తాగితూలుతూ పచ్చిపచ్చిగా నచ్చిననెచ్చెలితో విహరిస్తూ సర్వమూ మరచిపోయారు.

( మానవ మనస్తత్వ చిత్రణ ఇది మనిషికి అన్నీ దొరికితే ఎవడినీ లెక్కపెట్టడు ).

.

తెల్లవారింది మహర్షి ఆజ్ఞ ఇవ్వగా ఎక్కడివారక్కడికి వెళ్ళిపోయారు మరల మునివాటిక ,అరణ్యము ప్రత్యక్షమయ్యింది అంతా ఒక కలలా అనిపించింది ! కానీ కలకాదు ! రాత్రి తాగిన మత్తువదలక అంతా అడవిలోని నేలపై పడిదొర్లుతున్నారు.

.

భరతుడు వినయంగా మహర్షిని సమీపించి స్వామీ మీ ఆతిధ్యము అనితరసాధ్యము.నేను నా పరివారము అందరమూ సంతుష్టులమైనాము మాకు ఇక సెలవు ఇప్పించండి .మా అన్నగారు బసచేసిన తావు చూపించండి అని ప్రార్ధించాడు.

.

భరతా ! ఇక్కడికి మూడున్నర యోజనముల దూరములో నిర్జనవనమున్నది అక్కడ అందమైన సెల ఏరులతో కూడిన అడవులు కల చిత్రకూటపర్వతమున్నది .దానికి ఉత్తరాన మందాకిని నది నీవు ఆనదిని దాటిగానీ పర్వతాన్ని చేరుకోలేవు .ఆ పర్వతమే ప్రస్తుతం నీ అన్నగారి నివాసము .దక్షిణంగా కానీ ,నైరుతిమార్గంలో కానీ వెడితే నీకు రాముడు కనపడతాడు.

.

రాముడి ప్రసక్తి రాగానే దశరధుడి భార్యలు మువ్వురూ భరద్వాజమహర్షి వద్దకు వచ్చారు.

.

వారిలో కృంగి,కృశించి దీనురాలై వణుకుతూ ఉన్న కౌసల్యాదేవి ,సుమిత్రాదేవి మహర్షి పాదాలకు ప్రణమిల్లారు.

.

తనకోరిక నెరవేరని సర్వలోకనిందిత ( అందరూ తిట్టే) అయిన కైక సిగ్గుపడుతూ మహర్షి పాదాలను తాకింది.

.

అప్పుడు భరద్వాజుడు వీరిని పరిచయం చేయమని కోరగా భరతుడు, ఓ మునిచంద్రా ఇదుగో ఇక్కడ ఉపవాసములతో కృశించి ,దీనంగా ఉండి దేవతాసదృశురాలైన ఈ మాతృమూర్తి కౌసల్యామాత. రాముని కన్నతల్లి.

.

వనమధ్యములో పూవులురాలిన పెనువృక్షమువలే ఉండి దుఃఖిస్తున్న మనస్సుతో కౌసల్యామాత ఎడమప్రక్కన నిలబడ్డ ఈ మాతృమూర్తి ఇద్దరు ధీశాలురు ,సచ్చరిత్రులు అయిన లక్ష్మణశత్రుఘ్నులను కన్నతల్లి సుమిత్ర.

.

కోపస్వభావము,వివేకశూన్య,గర్వితురాలు,నేనే అందమైన దానను అనుగర్వము కలది,

ఐశ్వర్యమునందు కోరిక కలది 

ఆర్యురాలు లాగ కనపడే అనార్య,

క్రూరురాలు, 

ఆవిడ నిశ్చయాలు పాపానికి దారితీసేవి అయిన ఈవిడ నా కన్నతల్లి కైకేయి. 

ఈవిడ మూలానే 

రాముడికి అరణ్యవాసము,

దశరధమహారాజుకు స్వర్గలోకప్రాప్తి సంభవించినవి. 

.

తల్లిగురించి మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళు ఎర్రబారాయి,పగబట్టిబుసకొట్టేపాములాగ మాటిమాటికీ నిట్టూరుస్తున్నాడు భరతుడు.

.

అప్పుడు మహర్షి భరద్వాజుడు భరతుని చూసి ఒకేఒక వాక్యంలో ఇలా హితవు పలికాడు.

.

నాయనా భరతా! నీవు నీతల్లి విషయంలో దోషము చూడవద్దు. రాముడి అరణ్యగమనము లోక కళ్యాణము కొరకే .మున్ముందు సుఖకరమైన ఫలితాలు లభిస్తాయి..

.

అదివిని భరతుడు మరొక్కమారు మహర్షికి ప్రదక్షిణము చేసి సైన్యాన్ని కదలమని ఆజ్ఞ ఇచ్చాడు.

.

వూటుకూరు జానకిరామారావు 

.

కామెంట్‌లు లేవు: