22, అక్టోబర్ 2020, గురువారం

పోత‌న త‌ల‌పులో....90

 పోత‌న త‌ల‌పులో....90

 నార‌దా,  హ‌య‌గ్రీవావ‌తారం గురించి చెబుతాను విను....

                  ***

అనఘచరిత్ర! మన్మఖము నందు జనించె హయాననాఖ్యతన్

వినుత సువర్ణ వర్ణుఁడును వేదమయుం డఖిలాంతరాత్మకుం

డనుపమ యజ్ఞపూరుషుఁడునై భగవంతుఁడు దత్సమస్త పా

వనమగు నాసికాశ్వసనవర్గములం దుదయించె వేదముల్. 

                      ***

నారద! సచ్చరిత్ర! మేలిమిబంగారు కాంతికలవాడు, వేదస్వరూపుడు, సర్వాంతర్యామి, సాటిలేని యజ్ఞపురుషుడు హయగ్రీవునిగా దేవదేవుడు నేను చేసిన యజ్ఞంలోనుండి అవతరించాడు. సర్వాన్నీ పవిత్రం చేసే ఆ హయగ్రీవుని ముకుపుటాలలోని శ్వాసవాయువులనుండి వేదాలు ప్రాదుర్భవించాయి.


మ‌త్స్యావ‌తారం గురించి వినుము నార‌దా.....


ఘనుఁడు వైవస్వతమనువుకు దృష్టమై-

  యరుదెంచునట్టి యుగాంత సమయ

మందు విచిత్రమత్స్యావతారము దాల్చి-

  యఖిలావనీమయం బగుచుఁ జాల

సర్వజీవులకు నాశ్రయభూతుఁ డగుచు నే-

  కార్ణవంబైన తోయముల నడుమ

మన్ముఖశ్లథ వేదమార్గంబులను జిక్కు-

  వడకుండ శాఖ లేర్పడఁగఁ జేసి


దివ్యు లర్థింప నా కర్థిఁ దెచ్చి యిచ్చి

మనువు నెక్కించి పెన్నావ వనధి నడుమ

మునుఁగకుండంగ నరసిన యనిమిషావ

తార మేరికి నుతియింపఁ దరమె? వత్స! 

               ***

ప్రళయకాలంలో సమస్తము జలమయమైపోయింది. ఆ పరిస్థితి ముందే తెలిసిన‌ వైవస్వతమనువు ఒక పడవపై ఎక్కి కూర్చున్నాడు. అంతట భగవంతుడు విచిత్రమైన మత్స్యావతార మెత్తాడు. భూతలానికి ఆశ్రయమైన ఆ దేవుడప్పుడు ఎల్లప్రాణులకూ నివాసభూతుడైనాడు. నా వదనంనుండి జారిపోయిన వేదశాఖలు సంకీర్ణం కాకుండా విభజించి దేవతల కోరికమేరకు మళ్ళీ నాకు ప్రీతితో అందజేశాడు. వైవస్వతమనువు అధిష్ఠించిన నావ, సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. నాయనా! ఆ మత్స్యావతార మహత్యాన్ని వివరించడం ఎవరికి సాధ్యం. అని మ‌త్స్యావ‌తార విశేషాన్ని వివ‌రించాడు బ్ర‌హ్మ‌.


🏵️పోత‌న ప‌దం🏵️

🏵️దివ్య‌ ప‌థం🏵️

కామెంట్‌లు లేవు: