అరణ్యపర్వము – 3
సాళ్వుని వధ
కామ్యక వనంలో ఉన్న పాండవుల వద్దకు ఒకనాడు శ్రీకృష్ణుడ్ వచ్చాడు. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి ” కృష్ణా! నీవు పురాణ పురుషుడవు. నీవు గంధమాదన పర్వతం మీద పదివేల సంవత్సరాలు తపస్సు చేసావు. పుష్కరంలో పదుకొండు వేల సంవత్సరాలు తపస్సు చేశావు. సరస్వతీ తీరంలో పన్నెండు సంవత్సరాలు వ్రతం చేసావు. దితి కుమారులను దనువు కుమారులను సంహరించి ఇంద్ర పదవి సుస్థిరం చేసావు. నీవు అదితి కుమారుడివి. ఇంద్రుని తమ్ముడవు ఉపేంద్రుడివి. మొదట వామనుడిగా తరువాత త్రివిక్రమునిగా లోకాలను ఆక్రమించావు.లోక కంటకులైన శిశుపాల కంసులను వధించావు. నీవు అవతార మూర్తివి. అనృతం ,మదము, కోపం, మత్సరం నీ దగ్గరకు రావు ” అని స్తుతించాడు. అప్పడు శ్రీకృష్ణుడు అర్జునినితో ” అర్జునా! నీవు నరుడవు. నేను నారాయణుడను. మనం ఒకరికి ఒకరం మిత్రులం ” అన్నాడు.
అప్పుడు ద్రౌపది కృష్ణుని చూసి ” దేవా! నీవు యజ్ఞ పురుషుడివి. సర్వవ్యాపివి. సజ్జనులకు నీవే దిక్కు. నీకు తెలియనిది లేదు. నాకు జరిగిన పరాభవం చెప్తాను. నేను చక్రవర్తి పాండురాజు కోడలిని. పాండవుల భార్యను. మహావీరుడైన దుష్టద్యుమ్నుని సోదరిని. అట్టి నన్ను దుశ్శాశనుడు వెండ్రుకలు పట్టి ఈడ్పించాడు. నా వలువలు విప్పాడు. దారుణంగా నిండు సభలో అవమానించాడు. భీమార్జునులు నా మొర ఆలకించ లేదు. వీరి పరక్రమమెందుకు? కర్ణుడు నన్ను చూసి నవ్వాడు. ఎందరూ ఉండి ఎవరూ లేనిదానిని అయ్యాను. ఆ నవ్వు నా మనస్సును కాలుస్తుంది. ఆ కౌరవులు భీమునకు విషం పెట్టారు, పాములతో కరిపించారు. లక్క ఇంట్లో పెట్టి కాల్చాలనుకున్నారు. ఇప్పుడు జూదమాడి మా రాజ్యం లాక్కున్నారు. పాండవులు తమ శౌర్యం మరచి ఉన్నారు. కాని నేను మరువలేకున్నాను ” అన్నది. కృష్ణుడు ” అమ్మా! అర్జునిని శరాఘాతాలకు కౌరవులు చచ్చుట తధ్యం ఊరడిల్లుము ” అన్నాడు . శ్రీకృష్ణుడు ” ధర్మరాజా ! జరిగినదంతా యుయుధానుడు చెప్పగా విని దుఃఖించాను. ఆసమయంలో నేను మీదగ్గర లేను. ఉంటే ఇంత అనర్ధం జరిగేది కాదు. నేను ఆ సమయంలో సాల్వుడితో యుద్ధం చేస్తున్నాను ” అన్నాడు. దర్మరాజు శ్రీకృష్ణునితో ” కృష్ణా ! ఆ వృత్తాంతం వివరించు ” అన్నాడు.
శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు ” రాజసూయయాగం సమయంలో శిశుపాలుడు నా చేతిలో మరణించిన విషయం తెలుసు కదా. శిశుపాలుని తమ్ముడు సాళ్వుడు. అన్నను చంపిన దానికి పగ తీర్చుకోవడానికి ద్వారక మీదకు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు నేను మీ వద్ద ఉన్నాను. ద్వారకాపురిని ముట్టడించి నగరం వెలుపలి వనాలను నాశనం చేసాడు. ఆ సమయంలో ద్వారకలో ఉన్న సాంబుడు, ప్రద్యుమ్నుడు సాళ్వునితో ఘోరంగా యుద్ధం చేసారు. ప్రద్యుమ్నుడు సాళ్వునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. సాళ్వుడు మూర్ఛపోయాడు. ప్రద్యుమ్నుడు సాళ్వుని చంపబోగా నారదుడు అడ్డుపడి ” కుమారా ! ఇతనిని నువ్వు చంపరాదు. ఇతడు నారాయణుని చేతిలో హతుడు కావలసి ఉంది ” అన్నాడు. కనుక ప్రద్యుమ్నుడు ఊరుకున్నాడు. సాళ్వుడు తిరిగి వెళ్ళాడు.
నేను ద్వారకకు వెళ్ళగానే సాళ్వుడు ధ్వంశం చేసిన వనాలను చూసాక నాకు కోపం వచ్చింది సాళ్వుని మీదకు యుద్ధానికి వెళ్ళాను. సాళ్వునికి నాకు ఘోర యుద్ధం జరిగినది. సాళ్వుడు నాతో గెలవలేక మాయా యుద్ధం మొదలు పెట్టాడు. నేను వాడి మాయలు వమ్ము చేసాను. ఇంతలో ద్వారక నుండి వసుదేవుడు సాళ్వుని చేతిలో చిక్కాడని నేను వెళ్ళి రక్షించాలని వార్త వచ్చింది.” ద్వారకలో బలరాముడు ఉండగా వసుదేవుడు సాళ్వునికి ఎలా చిక్కాడు? ” అనుకున్నాను. ఇంతలో సౌంభకమను సాళ్వుని రథం నుండి వసుదేవుడు దిగటం చూసి నా చేతిలో ధనస్సు జారి కింద పడింది. నాకు కొంత సేపు స్పృహ తప్పింది. తెలివి వచ్చి చూసేసరికి సౌంభకంలో వసుదేవుడు లేక పోవడం చూసి అది రాక్షస మాయ అని గ్రహించాను. మరల నాకు సాళ్వునికి మధ్య ఘోరయుద్ధం జరిగింది. చివరికి సాళ్వునిపై చక్రాయుధాన్ని ప్రయోగించి అతడిని వధించాను ” అని శ్రీకృష్ణుడు చెప్పాడు.
తరువాత శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్రను తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. దుష్టద్యుమ్నుడు ఉపపాండవులను తీసుకుని పాంచాలదేశం వెళ్ళాడు. బ్రాహ్మణులు తమ ముఖ్య సేవకుడైన ఇంద్రసేనుని, ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులని తీసుకుని ద్వైతవనానికి వెళ్ళారు. ధర్మరాజు ” ఈ అడవిలో కౄరమృగాలు ఉన్నాయి.రాక్షసులు ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి ” అని మిగిలిన వారితో అన్నాడు. వారు అక్కడ కుటీరాలు నిర్మించుకుని సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఒకరోజు మార్కడేయ మహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆ మహర్షిని తగురీతి సత్కరించాడు. ” ధర్మరాజా ! నాడు తండ్రి ఆజ్ఞమేరకు అడవులకు వెళ్ళిన రాముడిని , సీతను, లక్ష్మణుని చూసాను తరువాత మిమ్మల్ని చూస్తున్నాను. పూర్వపు రాజులైన సగరుడు, నలుడు, భరతుడు, యయాతి, వైన్యుడు, నభాగుడు మొదలైన వారు సత్య ధర్మాలు పాటించు ఉత్తమ లోకాలు పొందారు. మీకు శుభం కలుగుతుంది ” అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి