22, అక్టోబర్ 2020, గురువారం

రామాయణమ్ 162

 రామాయణమ్ 162

...

తనను తప్పించుకొని ఎగిరిపోబోతున్న రావణుని చూసిన జటాయువు శరీరములోకి ఒక్కసారిగా ఓపికను, శక్తిని కూడగట్టుకొని రయ్యిన లేచి ఎగిరి వెళ్ళి రావణుని మార్గానికి అడ్డుగా నిలబడ్డాడు..

.

ఓరి రావణా  సీతాపహరణము వజ్రాయుధప్రహారము వంటిది   నాశనమై పోతావు జాగ్రత్త ,

ఓయీ సీతాపహరణము  తెలిసితెలిసి విషము కలిపిన పానీయము తాగటము వంటిది.

సీతాపహరణము వల్ల మాంసపుముక్కను కట్టిన గేలమును మింగిన చేపలాగ అయిపోతావు నీవు

.

రావణా ! నీవు చేసిన అవమానము రామలక్ష్మణులు సహిస్తారనుకొంటున్నావా?

.

దొంగలు వెళ్ళే దారిలో వెళ్ళావు ! 

వీరులు వెళ్ళవలసిన దారా ఇది?

.


హెచ్చరిస్తూ  ఈ విధంగా ఎన్ని చెప్పినప్పటికీ రావణుడు వినలేదు ,

అతని పాపపు పని సహించలేక అత్యంత వేగంగా వెళ్ళి రావణుని వీపుమీద వాలాడు జటాయువు.

.

వాలటము వాలటమే వజ్రసమానము మరియు వాడి యైన తన గోళ్ళతో వీపు అంతా రక్కిపెట్టి పొడుస్తూ ,చీరుస్తూ వాడి జుట్టు పీకుతూ పీడించసాగాడు. మహాభయంకరమైన యుద్ధం జరింది ఇరువురి మధ్య!

.

సీతను ఎడమచంకలో జారిపోకుండా ఇరికించుకొని కుడి అరచేతితో చరిచాడు రావణుడు అందుకు కోపించిన గృధ్రరాజు తన వాడిగోళ్ళతో వాడి పది భుజాలను గీరసాగాడు రావణుడి వంటినుండి రక్తం ధారలు కట్టింది.

.

ఇకలాభంలేదు అనుకొని తన ఒర నుండి ఒడుపుగా ఖడ్గముతీసి జటాయువు రెక్కలు రెండూ,పాదములురెండూ, పార్శ్వములను  నరికివేశాడు రావణుడు.

.

రెక్కలు కొట్టబడిన వాడై నిస్సహాయంగా నేలమీద రక్తమోడుతూ పడిపోయాడు జటాయువు. 

.

సీత రావణుని తప్పించుకొని పరుగుపరుగున నేలమీదపడిపోయిన జటాయువును కౌగలించుకొని ఏడ్వసాగింది!.

.

రామాయణమ్ 163

.

...

జటాయువు మరణము రగిల్చిన వేదన మనసును దహించి వేస్తుండగా చెట్టూ పుట్డా పట్టుకొని తిరుగుతూ రామా లక్ష్మణా రండి ఇప్పుడు మీరు నన్ను రక్షించండి అంటూ రావణునకు అందకుండా పరుగెడుతున్న సీతవెనుక తానుకూడా నిలునిలు అంటూ పరుగెత్తుతూ ఆవిడను దొరకబుచ్చుకుని చేతితో జుట్టుపట్టుకుని అమాంతము లేపి గాలిలోకి ఎగిరినాడు రావణుడు.

.

ఒక్కసారిగా మృగములు పక్షులు రామలక్ష్మణులు ఉన్నవైపుకు పరుగెడుతుండటం చూసి తన అపహరణ వార్త ఎరిగించటానికే అనుకొని ఓ పశుపక్ష్యాదులారా రామునికి ఎరుకపరచండి అంటూ అరుస్తూ ఆకాశమార్గాన తీసుకొని పోబడుతున్న సీతను దివ్యదృష్టితో గమనించిన బ్రహ్మదేవుడు రావణునుని మరణసమయము ఆసన్నమయినదని సంతసించాడు.

.

ఋషి,ముని ,దేవగణాలకు సంతోషము ,దుఃఖము ఒకదానితో ఒకటి కలిసి పోయి హృదయమందు వర్ణనాతీతమైన భావతరంగాలు ఉవ్వెత్తున లేచినవి.

సీతా రాముల వియోగము,సీత కష్డము వారికి దుఃఖకారణము ,రావణసంహారమునకు పడిన బీజము వారికి సుఖకరము మరియు సంతోషదాయకము.

.

ఆకాశంలో సీతాదేవి కట్టుకున్న పచ్చని పట్టువస్త్రము గాలికిరెపరెపలాడుతూ  మేఘమండలములోని మెరుపులా భాసిల్లింది.

కామెంట్‌లు లేవు: