22, అక్టోబర్ 2020, గురువారం

దత్తకృప

 దసరా లో దత్తకృప..


"నమస్కారమండీ.. నాపేరు వైదేహి..హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను..దేవీ నవరాత్రుల సమయం లో అవధూత దత్తాత్రేయ స్వామివారి మందిరానికి రావాలని అనుకుంటున్నామండీ..మేము మొత్తం ముగ్గురం వస్తాము..నేను, నా ఇద్దరు కుమార్తెలు..అక్కడ ఉండటానికి వసతి ఉంటుందా?..మేము మూడు రాత్రులు అక్కడ నిద్ర చేయాలని అనుకున్నాము.." అని ఆవిడ ఫోన్ చేశారు.."అమ్మా..ఒక రూమ్ ఖాళీ ఉన్నది..మీ పూర్తి పేరు, చిరునామా తెలిపితే..రిజిస్టర్ లో నమోదు చేసుకుంటాము.." అని చెప్పాను..ఆవిడ తన వివరాలు తెలిపారు..పోయిన సంవత్సరం దసరా నాటి సంఘటన ఇది..


ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి..ఆ సమయం లో మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర ప్రాంగణంలో అమ్మవారి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి..10 రోజుల పాటు రోజూ రెండుపూటలా నైవేద్యాలు సమర్పించి..11 వరోజు ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాము..ఈ పదకొండు రోజుల్లో సుమారు 100మంది భవానీదీక్ష స్వీకరిస్తారు..స్వామివారి మందిరం వద్ద దసరా రోజుల్లో కొద్దిపాటి కోలాహలంగా ఉంటుంది.. సరిగ్గా పాడ్యమి రోజు ఉదయం 8గంటల బస్సులో వైదేహి గారు తన ఇద్దరు కుమార్తెలతో సహా మందిరానికి వచ్చారు..వాళ్ళు వచ్చే సమయానికి మా దంపతులము భవానీ దీక్ష ఇస్తున్నాము..ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యేదాకా ఆ తల్లీకూతుళ్ళు అక్కడే నిలబడి వున్నారు..ఆ తరువాత మా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుని.. తమకు కేటాయించిన గదికి వెళ్లారు..


మరో గంట తరువాత..వైదేహి గారు స్వామివారి సమాధిని దర్శించుకొని..మా దంపతుల దగ్గరకు వచ్చారు.."ప్రసాద్ గారూ..ఏదో చిన్న గుడికి వెళుతున్నాము..ఏర్పాట్లు ఎలా ఉంటాయో అని మేము ఇక్కడికి వచ్చేదాకా అనుకున్నాము..వసతులు బాగానే ఉన్నాయి..ఒక సమస్యతో ఇక్కడికి వచ్చామండీ..నేను గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నానండీ..మావారు కూడా గవర్నమెంట్ జాబ్ చేసేవారు..మూడేళ్ల క్రితం మరణించారు.. మాకు ఇద్దరూ అమ్మాయిలే..పెద్దమ్మాయి బీటెక్ పూర్తి చేసింది..సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది..రెండో పాప కూడా బీ టెక్ ఫైనల్ లో ఉంది..భగవంతుడి దయవల్ల ఆర్ధిక సమస్యలు లేవండీ..ఆయన వుండి ఉంటే..మాకు వుండే ధైర్యం వేరు..ఇప్పుడు ప్రతి పని భయం  తో చేస్తున్నాము..ఇప్పుడు సమస్య ఏమిటంటే..పెద్దమ్మాయి గత మూడు నెలలుగా చాలా ముభావంగా ఉంటోంది.. అప్పుడప్పుడూ పెద్దగా ఏడుస్తుంది..మళ్లీ ఒక అరగంటకు సర్దుకుంటుంది..ఇద్దరు ముగ్గురు డాక్టర్ల కు చూపించాను..పెద్దగా ఫలితం లేదు..ఈ మధ్య ఈ స్వామివారి గురించి చదివాను..ఎందుకనో ఇక్కడికి ఒకసారి వచ్చి వెళితే అమ్మాయి బాగు పడుతుందని గట్టిగా అనిపించింది..స్వామివారి ఫోటో కు దణ్ణం పెట్టుకున్నాను..ఇక్కడికి రావడానికి అమ్మాయి కూడా ఒప్పుకున్నది.. అందుకని ముగ్గురమూ బయలుదేరి వచ్చాము..పెళ్లి కావాల్సిన పిల్ల ప్రసాద్ గారూ..దీని గురించి బెంగ, భయము రెండూ ఉన్నాయి.." అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు..


"అమ్మా..మీరు మూడురోజులు ఇక్కడ నిద్ర చేయాలని అనుకోని వచ్చారు..ఈరోజు నుంచి ప్రతిరోజూ అమ్మాయి చేత ఈ ప్రాంగణంలో 108 ప్రదక్షిణలు చేయించు..అలాగే మనస్ఫూర్తిగా స్వామివారిని శరణు వేడుకోండి.. ఫలితం వుంటుంది.." అని మేమిద్దరం చెప్పాము.."అలాగే.." అని చెప్పి వెళ్లిపోయారు..


ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆ తల్లీకూతుళ్ళు తలారా స్నానం చేసి..స్వామివారి మందిరం లో 108 ప్రదక్షిణలు పూర్తి చేశారు..సాయంత్రం ఆరు గంటలకు ముందుగా అమ్మవారి విగ్రహం వద్ద, ఆ తరువాత స్వామివారి మంటపం లో హారతి తీసుకున్నారు..ఆరోజు రాత్రి స్వామివారి మంటపం లోనే..భవానీదీక్ష తీసుకున్న స్వాముల తో పాటు నిద్ర చేశారు..వరుసగా మూడు రోజులు అదే నిష్ఠతో కొనసాగించారు..మూడోరోజు సాయంత్రం నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..మేము మూడు రాత్రుళ్ళు ఇక్కడ నిద్ర చేయాలనే సంకల్పం తో వచ్చాము..కానీ..ఈ దసరా అయిపోయేదాకా ఇక్కడే స్వామివారి సన్నిధిలో ఉండాలని అనుకున్నాము..మీకు వీలుంటే మాకు కేటాయించిన గదిని ఇవ్వండి..లేకపోయినా ఇబ్బందిలేదు..ఈ మంటపం లోనే ఉంటాము..ఇంతమంది స్వాములు, భక్తులు అందరూ ఇక్కడే వుంటున్నారు..మేమూ ఉంటాము.." అన్నారు.."మీ గది లోనే మీరు వుండండి.." అని చెప్పాను..


వైదేహి గారు తన కుమార్తెలతో కలిసి..ఆ పదకొండు రోజులూ వున్నారు..అమ్మవారి విగ్రహం నిమజ్జనం అయిపోయిన తరువాతి రోజు సాయంత్రం తమ ఊరికి వెళ్లారు..వెళ్లేముందు "ప్రసాద్ గారూ..మా అమ్మాయిలో ఎంతో మార్పు వచ్చిందండీ..మళ్లీ త్వరలోనే వచ్చి మరో వారం ఉంటాము..అనుకోకుండా దసరా..అమ్మవారి వేడుకలు కూడా కళ్లారా చూసాము.. ఈ దసరా లో దత్తుడి కృప మా పై కలిగింది.." అన్నారు..


ఆ తరువాత ఒకరోజు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..దత్తజయంతి రోజు నేనూ మా పిల్లలూ అక్కడికి వస్తున్నాము..స్వామివారి దయవల్ల అమ్మాయి పూర్తిగా కోలుకున్నది.. ఇప్పుడు మామూలుగా తన పని చేసుకుంటూ ఉన్నది..నాలో కూడా మునుపటి భయం లేదండీ..మాకు అండగా ఆ అవధూత దత్తాత్రేయుడు వున్నాడు అని అనిపిస్తున్నది.. అంతా స్వామివారి కృప..అమ్మాయికి వివాహం చేద్దామని అనుకుంటున్నాను..ముందుగా ఆ స్వామివారి వద్దకు వచ్చి..ఆయన ఆశీర్వాదం పొందాలని అనుకున్నాము..అందుకే దత్తజయంతి రోజు అక్కడ వుండి.. స్వామివారి సమాధి దర్శించుకొని..మా కోరిక ఆ దత్తుడికి విన్నవించుకొని వస్తాము.." అన్నారు..


వైదేహి గారు, ఆమె కూతుళ్లు స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మారు..ఆ స్వామి కృప కలగడానికి వాళ్ళు పడిన తపన..చూపిన నిష్ఠ మేము కళ్లారా చూసాము..వారి నమ్మకమే వారిని స్వామివారి కృపకు పాత్రులను చేసింది..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: