22, అక్టోబర్ 2020, గురువారం

కాత్యాయనీ దుర్గా

 కాత్యాయనీ దుర్గా



🌸 నవదుర్గల్లో ఆరో అవతారం కాత్యాయనీ దుర్గాదేవి. నవరాత్రుల్లో ఆరవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు. సింహ వాహనంపై అధిరోహించి కరవాలం చేతబట్టి రాక్షసత్వాన్ని నశింపజేసే జగద్రక్షణిగా నేడు కాత్యాయనీ దేవి శోభిల్లుతుంది. బీజాక్షరాల మధ్య మహామంత్ర స్వరూపిణియై విరాజిల్లుతూ కాత్యాయని దుర్గాదేవి అంశగా పూజలందుకుంటుంది.


🌸 పురాణం కధనం ప్రకారం : పూర్వం ‘కత’ అనే మహర్షి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. అతనికి ‘కాత్య’ అనే పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. చిన్నతనం నుండి తండ్రి వద్ద భక్తిని అలవర్చుకున్న ఆయనకే ‘కాత్యాయునుడు’ అని పేరు వచ్చింది. ఇతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఇతను దేవి భక్తుడు కావడం చేత దేవినే పుత్రికగా పొందదలచి గొప్ప తపస్సు చేస్తాడు. దేవి ప్రసన్నురాలై మహర్షికి పుత్రికగా జన్మిస్తుంది. కాత్యాయనిని పుత్రికగా జన్మించుట చేత ఆ తల్లి కాత్యాయనిగా పేరు గాంచింది.


🌸 మహిషాసురుడిని అంతమొందించడానికి ముక్కోటి దేవతలు మరియు త్రిమూర్తుల తేజస్సుల అంశతో కాత్యాయనీ దేవికి శక్తిని ప్రసాదించి లోకకల్యాణం గావించారు. అనేకమంది రాక్షసులను అంతమొందించిన కాత్యాయనీదేవి భక్తుల పాలిట కల్పవల్లి. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్ధాలు సిద్ధిస్తాయి. రోగములు, భయాలు, శోకములు నశిస్తాయి. ఆయురారోగ్యైశ్వర్యాలు కలుగుతాయి.


🌸 మార్కండేయ పురాణం, దేవి భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు. బౌద్ధ, జైన గ్రంధాలలో కూడా ఈ అమ్మవారి గురించి ఉండటం విశేషం. ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయనీదేవి గురించి ప్రస్తావస్తూ ఓడిశా ప్రదేశం జగన్నాధునికీ, కాత్యాయనీ దేవికి పీట వంటిది అని వివరించారు.


🌸 హిందూ శాస్త్రాలు, యోగ, తంత్ర విద్యల ప్రకారం కాత్యాయనీ దేవి అజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం.

కామెంట్‌లు లేవు: