31, అక్టోబర్ 2020, శనివారం

జగదంబ’ పలుకు

 'జగదంబ’ పలుకు

               ************

విశాఖపట్నంలోని జగదంబ సెవెంటీ ఎంఎం థియేటర్ కి యాభై ఏళ్లు పూర్తయ్యాయని తెలియగానే ఆ థియేటర్ తో నా జ్ఞాపకాలు రింగులు రింగులుగా కళ్ళ ముందు కదిలాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ మీతో పంచుకోవాలని ఇది మొదలుపెట్టాను. (వాడుకలో ‘జగదాంబ’ అనేస్తారు గానీ అసలు ఉచ్చారణ ‘జగదంబ’ కాబట్టి అలాగే రాస్తాను.)

**********

ఈ జగదంబ థియేటర్ రాక ముందు ఆ ఏరియా అంతా చెట్టూ చేమలతో చిన్న అడివిలా ఉండేది. లోపల ఎక్కడో ఎల్లమ్మ అనే గ్రామదేవత గుడి ఉండేది. ఆ దేవత పేరు మీద ఆ ప్రాంతాన్ని ‘ఎల్లమ్మ తోట’ అని పిలిచేవారు. నిజానికి ఆ ప్రాంతమంతా దసపల్లా సంస్థానానిది. ఇప్పుడు విశాఖలో మనకి తెలిసిన హోటల్ దసపల్లా, దసపల్లా చిత్రాలయ ఉన్న జాగాలు ఒరిజినల్ గా ఆ సంస్థానానివే. ఒరిస్సాకి చెందిన ఈ సంస్థానానికి విశాఖలోనే కాకుండా ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భూములుండేవి.

దసపల్లా సంస్థానాధీశులు కలకత్తాలో ఉండేవారు. వారి సంస్థానం వ్యవహారాలు చూసుకోడానికి మా తాతగారు (మాతామహులు) పన్యాల వెంకట రాజగోపాల రావు గారిని దివానుగా నియమించారు. (అవును..ఆయన పేరునే నాకు పెట్టారు). అప్పట్లో మా తాతగారు విశాఖపట్నం డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. రెవెన్యూ చట్టాలు, రైతుల వ్యవహారాల్లో ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దసపల్ల సంస్థానాధీశులు మా తాతగారి మీద భూముల అజమాయిషీ బాధ్యతను పెట్టి నిశ్చింతగా కలకత్తాలో కాలం గడిపేవారు.

సరే.. ఈ దసపల్లా సంస్థానం ముచ్చట్లు ఆపి, మళ్లీ జగదంబ థియేటర్ దగ్గరికి వద్దాం.

***********

అనగా అనగా వేగి వీరు నాయుడు. వీరికి విశాఖ, పూర్ణా మార్కెట్ లో ఉల్లిపాయల హోల్ సేల్ బిజినెస్ తోపాటు విశాఖలో రామకృష్ణా థియేటర్ కూడా ఉండేది. వీరు నాయుడు గారబ్బాయి వేగి భద్రాచలం (ఆయన్ని రాంబాబు అనేవారు) థియేటర్ వ్యవహారాలు చూసుకునేవారు. ఓసారి రాంబాబు గారు సినిమా బిజినెస్ పనుల మీద మద్రాస్ వెళ్లినప్పుడు అక్కడి సెవెంటీ ఎంఎం థియేటర్లు ఆయన మనసుని ఆకట్టుకున్నాయి. అలాంటి థియేటర్ ని విశాఖలో కట్టాలని నిర్ణయించుకున్నారు.

అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ లో, 1965 లో దివంగత కుమారుడి పేరు మీద ఎన్టీఆర్ నిర్మించిన రామకృష్ణా సెవెంటీ ఎంఎం థియేటర్ మాత్రమే రాష్ట్రానికి ఏకైక సెవెంటీ ఎంఎం థియేటర్ గా నీరాజనాలు అందుకుంటూ ఉండేది. ఇంకెక్కడా.. ఆఖరికి సినిమా ఎగ్జిబిటర్లకు హెడ్డాఫీసు అయిన విజయవాడలో కూడా అప్పటికి ఎంఎం థియేటర్ లేదు. అలాంటిది మారుమూల విశాఖలో బోలెడంత ఖర్చుతో సెవెంటీ ఎంఎం థియేటర్ కట్టాలనుకోవడం సాహసోపేత నిర్ణయమే.

మరి అంత పెద్ద థియేటర్ కట్టాలంటే విశాఖలో సరైన చోట విశాలమైన జాగా కావాలి కదా. రాంబాబు గారి దృష్టి ఎల్లమ్మ తోట సెంటర్ లో ఉన్న దసపల్లా స్థలం మీద పడింది. వెంటనే సంస్థానం దివానుగా ఉన్న మా తాతగారిని సంప్రదించి, తన ప్రతిపాదనను ఆయన ముందు పెట్టారు. మా తాతగారు ఆ ప్రతిపాదనను దసపల్లా సంస్థానాధీశులకు నివేదించారు.

అప్పటికే సంస్థానాధీశులు భూముల విక్రయం ఆలోచనలో ఉన్నట్టున్నారు. రాంబాబు గారి ప్రతిపాదనకు అంగీకరించి, ఎల్లమ్మ తోట దగ్గరున్న స్థలాన్ని ఆయనకి విక్రయించారు. ఆ సంప్రదింపులు, రాతకోతలు అన్నీ మా తాతగారి చేతుల మీదుగానే జరిగాయి.

***********

అప్పట్లో, అంటే 1970 లో నేను విశాఖ ఏవీఎన్ కాలేజీలో బీకాం ఫస్టియర్ చదువుతూ ఉండేవాణ్ణి. అప్పుడు అన్నీ ప్రైవేట్ సిటీ బస్సులే. మా పదమూడో నెంబరు బస్సు ఎల్లమ్మతోట, కేజీహెచ్ మీదుగా మా కాలేజీకి వెళ్లేది.

విశాఖలో కీలకమైన జాగాని సొంతం చేసుకున్న రాంబాబు గారు ఓ శుభ ముహూర్తాన ఎల్లమ్మ తోట సెంటర్ లో తన తల్లిగారి పీరు మీదుగా జగదంబ థియేటర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. శరవేగంతో సాగిపోతున్న ఆ నిర్మాణాన్ని ప్రతి రోజూ కాలేజీకి వెళ్తున్నప్పుడు మా సిటీ బస్సు కిటికీలోంచి కళ్ళప్పగించి చూడడం నాకు అలవాటైపోయింది. అలా నా కళ్ళ ముందే కోస్తాంధ్రలో (ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో) మొట్టమొదటి సెవెంటీ ఎంఎం థియేటర్ అన్ని హంగులతో ముస్తాబై ప్రారంభోత్సవానికి సిద్దమైంది.

1970 అక్టోబర్ 25న జగదంబ థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో ఆర్భాటంగా జరిగింది. స్థల విక్రయంలో కీలక పాత్ర వహించిన మా తాతగారైన దసపల్లా దివాన్ పన్యాల వెంకట రాజగోపాల రావు గారితో పాటు మనవడు, ఈ బచ్చా రాజగోపాలుడు కూడా జగదంబ థియేటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రారంభ సినిమాగా ‘వేర్ ఈగిల్స్ డేర్’ సెవెంటీ ఎంఎం ఇంగ్లీష్ సినిమాని ప్రదర్శించారు.

ఒక్క లీలా మహల్ లో తప్ప మిగతా అన్ని సినిమా హాళ్ళలో చెమటోడ్చి సినిమాలు చూడడం అలవాటై పోయిన జనాలకి జగదంబ థియేటర్ ఒక మహా అద్భుతంగా కనిపించింది. చల్లటి వాతావరణంలో, కూరుకుపోతున్నట్టు ఉండే కుషన్ సీట్లలో కూర్చుని, ఎంతో వెడల్పుగా ఉండే తెరమీద మెడ అటూ ఇటూ తిప్పుతూ సెవెంటీ ఎంఎం సినిమాలు చూడడం ఒక గొప్ప అనుభూతిగా మిగిలిపోయింది. భాష అర్ధం కాక అంతవరకూ ఇంగ్లీషు సినిమాలు చూడనివారు కూడా ఈ అనుభూతి కోసమే జగదంబ థియేటర్ కి వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. (ఇవన్నీయాభై ఏళ్ల కిందటి సంగతులు, అనుభూతులు సుమా.. ఇప్పుడు దాని బాబులాంటి థియేటర్లు వచ్చాయి. అధునాతన థియేటర్లు చూసిన కళ్ళతో ఇప్పుడు జగదంబ థియేటర్ ని చూస్తే ‘రాజుని చూసిన కళ్ళతో,,’ సామెత గుర్తుకి రాక మానదు.)

జగదంబ థియేటర్ అతి త్వరలోనే ఎంతగా సూపర్ హిట్టయిందంటే అది విశాఖకి ఒక ల్యాండ్ మార్క్ గా మారిపోయింది. అంతవరకూ ఆ ప్రాంతాన్ని ‘ ఎల్లమ్మతోట’ అని పిలిచేవారు కూడా ఆ పేరు మర్చిపోయి “జగదంబ సెంటర్’ అనడం ప్రారంభించారు. ఇప్పుడు విశాఖలో సిటీ బస్సు ఎక్కి “ఎల్లమ్మ తోటకి ఒక టిక్కెట్టివ్వండి” అని అడిగి చూడండి. కండక్టరు వెర్రి చూపులు చూడకపోతే ఒట్టు.

                            -- మంగు రాజగోపాల్

కామెంట్‌లు లేవు: