31, అక్టోబర్ 2020, శనివారం

ఏకశ్లోకి సుందరాకాండ

 ఏకశ్లోకి సుందరాకాండ



🍁🍁🍁🍁



వాల్మీకి సుందరకాండ చాలా మహిమాన్విత మైనది. సమయం చాలనప్పడు, ఈ శ్లోకం ఒక్కటైన చదివినా (భక్తిశ్రద్ధలతో) మంచి ఫలితం వస్తుందని పెద్దల నమ్మకం. 


హనుమ అమ్మవారి జాడ గురించి లంక అంతా వెదుకుతాడు. అమ్మవారిని కనుగోలేక నైరాస్యం చెందుతాడు. ఒకానొక సమయంలో ప్రాయోపవేశాని కూడా సిద్ధపడతాడు. చివరకు అమ్మవారినే ప్రార్థన చేస్తాడు. అప్పుడు మహర్షి, హనుమ చేత ఈ శ్లోకాన్ని పలికిస్తారు.


"నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ

దేవ్యైచ తస్మై జనకాత్మజాయై

నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యో

నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః"

{13 వ సర్గ లోని 59వ శ్లోకం}


భావము: లక్ష్మణుని (భక్తుని) తో కూడి ఉన్న రామచంద్రునికి (పరమాత్మ) నమస్కారం. జనకాత్మజ అయిన సీతమ్మతల్లి కి (పరాశక్తి) నమస్కారం. మరియు రుద్ర, సూర్య, చంద్ర, ఇంద్ర, యమ, వరుణ మొదలైన మరుత్తు గణాలకు ( ప్రకృతి శక్తులకు) నమస్కారం.

 

దీనినే ఏక శ్లోకి సుందరకాండ అంటారు. ఈ శ్లోకం గురించి మరికొన్ని వాస్తవాలు:


1) మార్గనిర్దేశిక శ్లోకం: ఒక్కొక్క సారి మనం క్లిష్టమైన పరిస్తితులను ఎదుర్కొంటాం. అప్పడు ఏంచెయ్యాలొ, ఏం చెయ్యకూడదో తెలియని గందరగోళం మనం ఎదుర్కొన్నప్పుడు, భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకం పఠిస్తే, గాయత్రీ స్వరూపమైన అమ్మవారు, మన బుద్ధి ప్రచోదనం చేసి, మనకు సద్భుద్ధిని కలిగిస్తుంది. ఎటువంటి ఆపదల్లో కూడా, మనం మంచి నిర్ణయాలు తీసుకోగలం. (సమత్వం యోగవుచ్యతే- భగవద్గీత సాంఖ్యయోగం)


2) ప్రార్ధనా శ్లోకం: ఇది ప్రార్థనాశ్లోకంగా నిత్యం చదువకోదగ్గది. అట్లాగే, రామాయణ పారాయణమున దీనిని ప్రార్ధనగా ఉపయోగిస్తారు. శ్రీ భాష్యం అప్పలాచార్యులు గారు దీనిని కార్యసిద్ధి మంత్రం గా వర్ణించేవారు.


3)జాతకం: ఎవరిదైనా జాతక చక్రంలో బుధుడు నీచ స్థితి లో వుంటే లేదా బుధమహా దశ / బుధ అంతరదశ వుంటే, ఈ శ్లోకం నిరంతరం పఠిస్తారు. 

ప్రారబ్ధం వలన జరగవలసిన చెడు ఫలితాలు కూడా కొంతమేర తగ్గుతుంది. కొంత చెడు జరిగినా, అది మన మానసిక ధైర్యాన్ని దెబ్బతీయదు సరి కదా ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది.


4)నమస్కారం: నమస్కారం ప్రాముఖ్యత గురించి తెకలియజేసినది వేదం. 

(రుద్ర నమకం -యజుర్వేదం) అటువంటి నమః పునరుక్తి మనకు మొదటిసారిగా 

రామాయణం సుందరకాండ లోని ఈ శ్లోకాలో కనిపిస్తుంది. 


భగవంతుని నమస్కరించునపుడు, భగవద్భక్తుల ద్వారా, పరాశక్తి ద్వారానే ఆశ్రయింపవలయును- అను నియమాలను ఇందు హనుమ ద్వారా పాటించి, మహర్షి మనకు తెలియజేసారు.


సుందరకాండ పారాయణం చాలా మంచి ఫలితాలను ఇస్తుందని మన పూర్వీకుల నమ్మకం. అపారమైన విశ్వాసంతో నమ్మకాన్ని నిజం చేద్దాం.


జై శ్రీమన్నారాయణ 🙏


🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: