*సద్విమర్శ*
🍁🍁🍁🍁
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగితే అంత కఠినమైన పరీక్షలను, విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది.
ప్రపంచ చరిత్రలో మహత్కార్యాలను సాధించిన మహనీయులెందరో ఎన్నో అపజయాలను, విమర్శలను చవిచూశారు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అద్భుతాలు సాధించారు.
సాహసాలు, సత్కార్యాలు సాధించాలనుకున్నప్పుడు ఇతరులు ఎగతాళి చేసినా, విమర్శించినా వెనకంజ వేయకూడదు.
ఏకాగ్రతతో మన పని మనం చేసుకుంటూ ముందుకుసాగాలి. మార్పును అభిలషించాలి. నవ్విన నాపచేను పండుతుందని, మనల్ని అవహేళన చేసినవాళ్లే మన గురించి గొప్పగా చెప్పుకొనే రోజులు వస్తాయని గట్టిగా నమ్మాలి.
విమర్శలు కటువుగా ఉంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. అందుకే ఎవరినైనా విమర్శించేటప్పుడు విజ్ఞత పాటించాలి. సాధ్యమైనంత వరకు మన విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి. అవే మనిషి మానసిక వికాసానికి తోడ్పడతాయి.
స్వామి వివేకానంద ఎదుటి వారిని ‘నీవు బాగా పనిచేయడం లేదని అనడం కన్నా- నువ్వు చక్కగా చేస్తున్నావుకాని ఇంకా చక్కగా చేయగలవు’ అని సున్నితంగా సూచనలివ్వాలని అనేవారు. విమర్శలు ఎదుటివారు చేస్తున్న పనిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉండాలి. అంతే తప్ప, వారిని తప్పు పడుతున్నట్లుగా ఉండకూడదు.
విమానం కనిపెట్టేముందు రైట్ సోదరులు, అమెరికా అధ్యక్షుణ్ని కావాలని ఉందని చిన్నప్పుడే అనుకున్న బిల్‌క్లింటన్ సైతం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమతమ రంగాల్లో పరిణతి సాధించారు. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా తనకున్న ఆత్మవిశ్వాసమే థామస్ ఆల్వా ఎడిసిన్‌ను ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టేలా చేసింది.
ఇతరుల ఉన్నతిని చూసి కొంతమంది ఈర్ష్యతో రగిలిపోతుంటారు. ఎవరైనా మంచిపని చేస్తే మెచ్చుకునే బదులు విపరీత బుద్ధితో విమర్శించే కుసంస్కారులే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఒకరి ఉన్నతిని చూసి సహించలేకపోవడం మాత్సర్యం. అది లేనప్పుడే ఆత్మతత్వం తెలుస్తుంది.
దైవాంశ సంభూతుడైన కపిలమహర్షి తన తల్లికి వేదాంత సారాన్ని బోధిస్తూ ఇలా అంటారు ‘నేను నిరంతరం అన్ని జీవుల్లోనూ ఆత్మ స్వరూపుడనై ఉన్నాను. కాబట్టి మానవుడు తన తోటి మానవుణ్ని కించపరిస్తే అది ఆత్మస్వరూపుడైన నన్నే కించపరచడమవుతుంది’!
ఎదుటివారిని కించపరచేవాళ్లు చేసే పూజలు పూజలు కావు. జీవులను అవమానించే స్వభావం ఉన్నవారు నానాఫల, పుష్పాదుల చేత చేసే పూజలతో దైవం సంతృప్తి చెందే ప్రసక్తే తలెత్తదు. అంటరానితనం పాటించడం, తోటి మానవుల్ని నీచంగా చూడటం, కులమత వైషమ్యాలకు ఆజ్యంపోయడం లాంటి కార్యాలు చేయడం దైవానికి సమ్మతం కావు.
‘సర్వజీవుల్లోనూ ఆత్మస్వరూపుడనైన నన్ను అభేద భావంతో అర్చించడమే నాకు ప్రీతికరం’- ఇది సజీవ జీవకోటిలో ఉన్న దైవాన్ని ఎలా అర్చించాలో కపిలమహర్షి వివరించిన వైనం.
తోటివారిలో భగవంతుణ్ని చూసేవారు ఎవరినీ నిందించరు. కటువుగా విమర్శించరు. మంచి సలహాలతో, సద్విమర్శలతో ఎదుటివారిని ప్రోత్సహిస్తారు.
సద్విమర్శలు మన పురోగమనానికి దారిచూపే కాంతిపుంజాలు. మన వికాసానికి తగిన పాఠాలై అవి మార్గదర్శకాలవుతాయి. మన వివేచనను, వివేకాన్ని జాగృతం చేస్తాయి. వాటిని స్వీకరించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను తప్పక సాధిస్తాం. విజయ శిఖరాలను అధిరోహిస్తాం!
(ఈనాడు అంతర్యామి)
🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి