31, అక్టోబర్ 2020, శనివారం

16-24-గీతా మకరందము

 16-24-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - కాబట్టి శాస్త్రోక్తపద్ధతి ననుసరించియే కార్యము లాచరించులాగున అర్జునునకు శ్రీకృష్ణపరమాత్మ బోధించుచున్నారు- 


తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ | 

జ్ఞాత్వా శాస్త్రవిధానో క్తం 

కర్మ కర్తుమిహార్హసి || 


తాత్పర్యము:- కావున చేయదగినదియు, చేయరానిదియు నిర్ణయించునపుడు నీకు శాస్త్రము ప్రమాణమైయున్నది. శాస్త్రమునందు చెప్పబడినదానిని తెలిసికొని దాని ననుసరించి నీ వీ ప్రపంచమున కర్మమును జేయదగును.


వ్యాఖ్య:- ఏ కార్యమును చేయవలెను? ఏ కార్యమును చేయరాదు? అను వితర్కము కలిగినపుడు శాస్త్రమే యిట ప్రమాణమైయున్నది. దాని ననుసరించియే వర్తించవలెనని భగవాను డిచట బోధించుచున్నారు.‘తస్మాత్' అనగా, పూర్వశ్లోకము నుందు చెప్పబడినరీతిగ శాస్త్రవిరుద్ధముగ నాచరించినచో సుఖముగాని, మోక్షముగాని గలుగదు కాబట్టి - అని యర్థము. ఈ వాక్యములవలన భగవద్దృష్టి యందు వేదశాస్త్రము లెంతటి పరమప్రమాణములో విదితమగుచున్నది. మఱియు అవి గొప్ప ప్రమాణములని సాక్షాత్ భగవానుడే సెలవిచ్చుట వలన ఇక నట్టిశాస్త్రాదులందు జనులెంతటి విశ్వాసముంచవలయునో యోచించుకొనవలసి యున్నది. కావున ఇక వేదశాస్త్రముల గొప్పతనము విషయమై, ప్రామాణ్యము విషయమై జనులకేమాత్రము సందేహము యుండరాదు. అకుంఠితవిశ్వాసముతో వానియందు బోధించిన రీతి యనుష్ఠించిన చాలును. మనుజుడు తరించిపోగలడు.


‘జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం' అని చెప్పుటవలన కర్మాచరణకు పూర్వము శాస్త్రజ్ఞాన మవసరమని తేలుచున్నది. శాస్త్రాదులద్వారా కర్మచేయు పద్ధతిని తెలిసికొని పిదప కర్మచేయుట ఉత్తమము. శాస్త్రపరిచయమువలన అనగా అపరావిద్యవలన ఉత్తమ కర్మాచరణము సాధ్యమై క్రమముగ చిత్తశుద్ధి గలుగగా పరావిద్యయు అనగా బ్రహ్మానుభూతియు అచిరకాలములో (అభ్యాసవశమున) లభించుట కవకాశమేర్పడుచున్నది.


"కర్మ కర్తుమిహార్హసి” - అని బోధించుటవలన కర్మచేయుటలో తప్పులేదనియు, అయితే ఆ కర్మ శాస్త్రానుకూలముగా నుండవలెననియు గీత తెలుపుచున్నది. కనుకనే అర్జునుని అట్టి శాస్త్రోపదిష్ట కర్మము నాచరింపవలసినదిగా భగవాను డిచట నుద్బోధించుచున్నారు.


ప్రశ్న: - ఏ కార్యము చేయవలెను, ఏకార్యము చేయరాదు, అనువిషయమందు ప్రమాణమెయ్యది? 

ఉత్తరము:- శాస్త్రము. కావున శాస్త్రోపదిష్టపద్ధతి ప్రకారమే ఆచరించవలెను. 

ప్రశ్న:- కర్మనెపుడు చేయవలెను?

ఉత్తరము:- శాస్త్రవిధానమెట్లున్నదో తెలిసికొని ఆపిదప చేయవలెను.

ప్రశ్న:- కర్మ నెట్లుచేయవలెను?

ఉత్తరము: - శాస్త్రములందు ఉపదేశింపబడినరీతి చేయవలెను.


ఓమ్ 

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 

శ్రీకృష్ణార్జునసంవాదే దైవాసుర సంపద్విభాగయోగోనామ 

షోడశోఽధ్యాయః 


ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,

శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు  దైవాసుర సంపద్విభాగ యోగమను 

పదునాఱవ అధ్యాయము 

ఓమ్ తత్ సత్

కామెంట్‌లు లేవు: