31, అక్టోబర్ 2020, శనివారం

స్నేహంలో ఆనందం

 *స్నేహంలో ఆనందం* ✍🏻నారంశెట్టి ఉమామహేశ్వరరావు 

 ​

ఒక అడవిలో ఒక గుర్రం ఉండేది. అది ఒంటికన్నుతోనే పుట్టింది. దాని తల్లిని ఏదో జంతువు చంపేసింది. అది ఒంటరిదయింది. అక్కడా ఇక్కడా గడ్డి మేస్తూ బ్రతికేది. ఒంటరిగా ఉండే కంటే ఎవరైనా స్నేహితులంటే బాగుణ్ణని  అనుకుంది గుర్రం. 

      ​కొత్తస్నేహితుడిని వెదుకుతూ బయల్దేరిందది. ఒక గాడిద కనిపించగానే పలకరించి “నాతో  స్నేహం చేస్తావా?” అని అడిగింది  గుర్రం. “నీలాంటి ఒంటికన్ను గుర్రంతో ఎవరైనా స్నేహం చేస్తారా” అనేసి  వెళ్ళిపోయింది గాడిద.

      ​అదేమీ పట్టించుకోకుండా గుర్రం ముందుకు  వెళుతుంటే పచ్చికను మేస్తున్న దున్నపోతు కనిపించింది. స్నేహం చేయమని దాన్ని అడగగానే “నాది పెద్ద  కుటుంబం. వాళ్ళతో గడిపేసరికి రోజు గడచిపోతుంది. మరెవరితోనూ స్నేహం చెయ్యను” అనేసి మేత మేయడంలో మునిగిందది .  

 పట్టు విడవకుండా వెళుతున్న గుర్రానికి  ఎలుగుబంటి ఎదురయింది. దాన్ని కూడా స్నేహం చెయ్యమనగానే “వేగంగా పరుగెత్తే నీకూ నాకూ సరిపోదు. నాకేమో పెద్ద గోళ్లున్నాయి. నీకు లేవు.తేనెతుట్టలు, చీమల పుట్టలు, చెరుకు గడలు ఇష్టంగా తింటాను. నువ్వేమో గడ్డీగాబు మేస్తావు. మనకి కుదరదు” అని చెప్పింది  ఎలుగుబంటి. 

      ​ఆవు, జింక,కుందేళ్లను అడిగి భంగపడింది  గుర్రం. తనతో ఎవరూ స్నేహం చెయ్యక పోయేసరికి గుర్రానికి ఏడుపొచ్చింది.       ​దగ్గర్లోని చెరువు గట్టున ఒక  చెట్టు క్రింద కూలబడి గట్టిగా ఏడిచింది గుర్రం. “ఎందుకేడుస్తున్నావని” ఒకేసారి అడిగాయి చెట్టు, చెరువు.

“ఎవరూ లేనిదాన్ని. స్నేహం కోసం ఎవరినడిగినా కుదరదన్నారు.  ఒంటి కన్ను గుర్రాన్నని ఎవరికీ నాతో స్నేహం ఇష్టం లేదు” అంది గుర్రం ఏడుస్తూనే..

చెరువు “బాధపడకు. నీతో స్నేహం చేస్తాను. ఈ క్షణం నుండి ఇక్కడెక్కడో గడ్డిమేసి  నా నీరు త్రాగుతూ ఉండు. నేనెలాగూ కదలలేను.  అడవి ఊసులేవో నాకు చెప్పు. వింటాను”  అంది.

చెట్టు కూడా “ నేనూ స్నేహం చేస్తాను. నా నీడలో ఎండకు, వానకు తల దాచుకో. నేనెటూ వెళ్ళలేను. ఆ కబుర్లేవో నేనూ వింటాను“ అంది.

గుర్రానికి ఒకేసారి ఇద్దరు స్నేహితులు  దొరికేసరికి  సంతోషమయింది. అది మొదలు తన కష్టసుఖాలను చెరువు, చెట్టులకు చెప్పుకునేది. ఎక్కడ తిరిగిందో,  ఏమేమి చూసిందో  సాయంత్రానికల్లా  వచ్చేసి పూసగుచ్చినట్టు చెప్పేది గుర్రం వాటికి.  

 గుర్రం చెప్పే కబుర్లను ఆసక్తిగా వినేవి చెరువులో చేపలు, కప్పలు, తాబేళ్లు. వాటికి కూడా గుర్రంతో స్నేహం చెయ్యాలనిపించి  “ గుర్రమన్నా! మేము కూడా  చెరువు దాటి వెళ్లలేని వాళ్ళము.  నీ కబుర్లు నచ్చాయి మాకు. మాతో స్నేహం చెయ్యవా”  అని అడిగాయి అవన్నీ. 

ఒకప్పుడు తనతో స్నేహానికి ఒక్కరూ రామన్నారు. ఇప్పుడేమో స్నేహం చేస్తామని అడుగుతున్నారని సంబర పడింది గుర్రం. వాటికి సరేనని  చెప్పింది.

 అది అడవిలో తిరిగినప్పుడు పండ్లు,  పురుగులు  దొరికితే తెచ్చి చెరువులో వేసేది. వాటిని ఇష్టంగా తినేవి చేపలు. “నువ్వు  మంచివాడివి. మాకోసం కబుర్లు చెబుతున్నావు. ఆహారం తెస్తున్నావు. నీతో స్నేహం బాగుంది” అని మెచ్చుకునేవి చేపలు.

చెరువుకి నీరు త్రాగడానికి వచ్చిన గాడిద, దున్నపోతు,  ఎలుగుబంటి చెరువులోని  చేపల మాటల్ని విన్నాయి. ఒంటికన్నుదే అయినా మంచివాడైన గుర్రంతో   స్నేహం వద్దనడం తప్పని  తెలుసుకున్నాయి. 

“ఒంటికన్ను చూసి అప్పుడు నీ  స్నేహం వద్దన్నాము. మమ్మల్ని క్షమించు. ఇప్పుడు మాతో స్నేహం చెయ్యు ” అని అడిగాయి ఆ జంతువులు.

“సరే” అంది సంతోషంగా గుర్రం. “కొత్త స్నేహితులొచ్చారని మమ్మల్ని మరచిపోకు” అన్నాయి చెరువు, చెట్టు, చేపలు.

“మీరంతా కావాలి. కొత్త స్నేహితులు వచ్చినా సరే ఇక్కడి చెట్టుక్రింద పడుకుని, చెరువు నీరే త్రాగుతూ, మీతో ముచ్చట్లు చెబుతానంది” గుర్రం.  చెరువులోని చేపలన్నీ ఒక్కసారి  గాలిలో ఎగిరి పల్టీలు కొడుతూ “భలేభలే గుర్రం. చాలా మంచి నేస్తం” అని పాటందుకున్నాయి. తన సంతోషాన్ని తెలుపుతూ కొమ్మల్ని  గట్టిగా  ఊపింది చెట్టు. ఒక అలను గుర్రం కాళ్ళ వైపు పంపి సంతోషం తెలిపింది చెరువు.కప్పలన్నీ బెకబెకా అరిచి  గోల చేశాయి. చాలాకాలం వరకు స్నేహంలో ఉన్న మజాను అవన్నీ కలిసి అనుభవించి ఆనందించాయి.

*తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు  క్రింది లింక్ ద్వారా చేరండి*

https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ

కామెంట్‌లు లేవు: