31, అక్టోబర్ 2020, శనివారం

పోత‌న త‌ల‌పులో...99

 పోత‌న త‌ల‌పులో...99


తరువాత పరీక్షిత్తు శుకమహర్షిని ఇలా అడిగాడు –


            **

విను శుకయోగికి మనుజేశుఁ డిట్లను-

  మునినాథ! దేవదర్శనము గలుగ

నారదమునికిఁ బంకేరుహభవుఁ డెఱిం-

  గించిన తెఱఁగు సత్కృప దలిర్ప

గణుతింప సత్వాదిగుణశూన్యుఁ డగు హరి-

  కమలాక్షు లోకమంగళము లైన

కథలు నా కెఱిఁగింపు; కైకొని నిస్సంగ-

  మైన నా హృదయాబ్జ మందుఁ గృష్ణు


భవ్యచరితుని నాద్యంతభావశూన్యుఁ

జిన్మయాకారు ననఘు లక్ష్మీసమేతు

నిలిపి, యస్థిరవిభవంబు నిఖిల హేయ

భాజనంబైన యీ కళేబరము విడుతు.

                         **



 ఓ మునీశ్వరా!

 బ్రహ్మదేవుడు నారదమునికి భగవత్సాక్షాత్కారం కలగడానికి చెప్పిన ఉపాయం దయతో నాకు చెప్పండి సత్త్వరజస్తమోగుణాలకు అతీతుడు, పద్మనేత్రుడు అయిన శ్రీహరి కథలు లోకానికి మంగళం చేకూరుస్తాయి. అవి నాకు తెలియపరచండి. మీరు చెప్పింది విని సంగరహితమయిన నా హృదయకమలంలో శుభచరిత్రుడు, తుది మొదళ్లు లేనివాడు, చిన్మయస్వరూపుడు, పాపరహితుడు, లక్ష్మీ సహితుడు అయిన కృష్ణుణ్ణి నిలుపుకొంటాను.

 చంచలము, హేయాలన్నిటికీ నెలవు అయినట్టి ఈ శరీరాన్ని విడిచి పెడతాను.


          **

ఎవ్వని నాభియం దెల్ల లోకాంగ సం-

  స్థానకారణపంకజంబు వొడమె

నం దుదయించి సర్వావయవస్ఫూర్తిఁ-

  దనరారునట్టి పితామహుండు

గడఁగి యెవ్వని యనుగ్రహమున నిఖిల భూ-

  తముల సృజించె నుత్కంఠతోడ

నట్టి విధాత యే యనువున సర్వేశు-

  రూపంబు గనుఁగొనె రుచిర భంగి



నా పరంజ్యోతి యైన పద్మాక్షునకును

నలినజునకుఁ బ్రతీకవిన్యాసభావ

గతులవలనను భేదంబు గలదె? చెపుమ;

యతిదయాసాంద్ర! యోగికులాబ్ధిచంద్ర!

           **

పరంజ్యోతి స్వరూపుడైన పద్మాక్షుడి నాభిలో సమస్తలోకాల ఉనికికీ హేతువైన పద్మం పుట్టింది, ఆ పద్మంలో, ప్రభవించి సర్వాంగ సుందరంగా ప్రకాశించే బ్రహ్మ ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఔత్సుక్యంతో సమస్త ప్రాణులనూ సృష్టించాడు. మరి ఆ బ్రహ్మ సర్వేశ్వరుని స్వరూపాన్ని ఏ విధంగా సాక్షాత్కరింప జేసుకొన్నాడు? అలాంటి పద్మాక్షుడికీ, బ్రహ్మదేవునికి అవయవ నిన్యాసంలోను, భావ గతిలోను భేదమున్నదా?

 ఓ పరమకరుణాసాంద్ర! యోగికుల జలధిచంద్ర! నాకు తెలియజెప్పవయ్యా అని శుక‌యోగీంద్రుల వారిని ప‌రీక్షిత్తు వేడుకుంటున్నాడు.

                 **

దానికి బ‌దులుగా శుక‌యోగీంద్రుల‌వారు చెబుతున్నారు.....

                  **

భూపాలకోత్తమ భూతహితుండు సు-

  జ్ఞానస్వరూపకుఁ డైనయట్టి

ప్రాణికి దేహసంబంధ మెట్లగు నన్న-

  మహి నొప్పు నీశ్వరమాయ లేక

కలుగదు; నిద్రలోఁ గలలోనఁ దోఁచిన-

  దేహబంధంబుల తెఱఁగువలెను

హరియోగ మాయా మహత్త్వంబునం బాంచ-

  భౌతిక దేహసంబంధుఁ డగుచు



నట్టి మాయాగుణంబుల నాత్మ యోలి

బాల్య కౌమార యౌవన భావములను

నర సుపర్వాది మూర్తులఁ బొరసి యేను

నాయదిది యను సంసారమాయఁ దగిలి.

                     **


“ఓ రాజశ్రేష్ఠుడ! జీవుడు భూతాలకెల్ల మేలు చేకూర్చేవాడు, జ్ఞానమే స్వరూపంగా కలవాడు, అలాంటి వానికి శరీరంతో సంబంధం ఎలా కలిగింది అంటావా జగతీతల మంతా వ్యాపించివున్న ఈశ్వరుని మాయ అనేది లేకపోతే జీవునికి దేహంతో సంబంధం కలుగదు. నిద్రించే వేళ స్వప్నంలో దేహాలతో సంబంధం గోచరిస్తుదికదా, అలాగే నారాయణుని యోగమాయా ప్రభావంవల్ల జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతో సంబంధం కలవాడవుతాడు. ఆ మాయాగుణాలవల్లనే క్రమంగా బాల్యం, కౌమారం, యౌవనం అనే దశలు పొందుతాడు. మనుష్య, దేవతాది ఆకారాలను గూడ స్వీకరిస్తాడు. నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని పెంచుకొంటాడు. సంసారమాయలో బద్దుడవుతాడు.


🏵️పోత‌న ప‌దం🏵️

‌🏵️జ్ఞాన‌స్వ‌రూపం🏵️

కామెంట్‌లు లేవు: