21, జులై 2021, బుధవారం

దుర్గా సప్తశతి

 *దుర్గా సప్తశతి గ్రంథ పరిచయం..*  *(మొదటి భాగం)*


అమ్మవారి భక్తులకు దుర్గా సప్తశతి ఒక ప్రధానమైన పారాయణ గ్రంధము.   ఈ పుస్తకంలో వర్ణింపబడిన అమ్మవారి చరిత్ర దేవీభాగవతానికి సంక్షేప రూపంలోనూ సార రూపంలోనూ ఉంటుంది. 


వేద వ్యాసులవారు రచించిన  మార్కండేయ పురాణంలో సావర్ణి మన్వంతర విభాగంలో దేవీ మహత్మ్యం లో 13 అధ్యాయాలలో దుర్గా సప్తశతి విస్తరించి ఉన్నది. 


*మొత్తం సప్తశతి 13 అధ్యాయాలు ప్రధానంగా మూడు భాగాలుగా ఉంటుంది. వాటిని ప్రథమ చరిత్ర మధ్యమ చరిత్ర ఉత్తర/ఉత్తమ చరిత్ర అని పిలుస్తారు..*


మొత్తం పుస్తకం యొక్క పారాయణ మే కాకుండా ఈ పుస్తకంలో అత్యంత శక్తివంతమైన  స్తోత్రాలు విడివిడిగా పారాయణ చేసుకునేవి ఉన్నాయి. ఆ స్తోత్రాలు కూడా చాలా ప్రసిద్ధమైనవి చాలామంది నిత్యం పారాయణ చేసుకుంటూ ఉంటారు.  మొదటి అధ్యాయం లో 70 -87 శ్లోకాలు లో ఉన్న బ్రహ్మ దేవుడు చేసిన నిద్రాదేవత (కాళికా) స్తుతి. 4వ అధ్యాయం లో 3-27 శ్లోకాల లో ఉన్న దేవతలచే  చేయబడిన దుర్గా స్తోత్రం. ఐదవ అధ్యాయము లో 9-82 శ్లోకాల లో   యా దేవీ సర్వ భూతేషు అనివచ్ఛే   అపరాజిత దేవి స్తుతి . 11వ అధ్యాయములో 3-35 శ్లోకాల లో ఉన్న కాత్యాయని దేవి స్తుతి అంటే నారాయణి నమోస్తు తే అని వచ్ఛే నారాయణీ స్తోత్రము మొదలైనవి ఆ ప్రధానమైన స్తోత్రాలు. ఈ స్తోత్రాలకు వేదంలోని సూక్తాల  కున్నంత ప్రామాణ్యత గౌరవము ఉన్నాయి.  ఈ స్తోత్రాలు చాలామంది కి నోటికి వచ్చి రోజూ చదువుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళలో చాలామందికి ఈ స్తోత్రాలు  సప్తశతిలో ఉన్నాయి అన్న విషయం తెలియక పోవచ్చు.


అలాగే ఈ సప్తశతిలోని కొన్ని భాగాలను ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. అవి ప్రాధానికం రహస్యం, వైకృతికం రహస్యం, మూర్తి రహస్యం అనేవి. ఈ మూడింటినీ కలిపి రహస్య త్రయం అని ప్రత్యేకంగా పారాయణం చేస్తారు. 


పెద్దలూ గురువులూ సప్తశతిలోని కొన్ని శ్లోకాలు సిద్ధ మంత్రాలు గా గుర్తించి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఫలితాన్ని నిర్ణయించారు. అంటే ఏ కోరిక కోరుకునే వాళ్లకు దానికి సంబంధించిన ఆ మంత్రము జపం చేసుకోవాలి. ఆ సిద్ద మంత్రాల వివరాలన్నీ సాధారణంగా దేవీ సప్తశతి పారాయణ పుస్తకాలలో ఉంటాయి.


సూక్ష్మంలో మోక్షం కోరుకునే వాళ్లకోసం సప్తశతి లో నుంచి ఏడు శ్లోకాలను తీసి "సప్తశ్లోకీ దుర్గా" అని వాటిని పారాయణ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా శక్తివంతమైన పారాయణ మంత్రము. ఆ ఏడు శ్లోకాలు కూడా చదువ లేని వాళ్ళ కోసం అందులో ఉన్న "సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే" శ్లోకం ఒకటైనా చదువుకోమంటారు.


*సప్తశతి లో ఉండకపోయినా సప్తశతి పారాయణమప్పుడు పఠించే అనుబంధ స్తోత్రాలు ::  దేవీ కవచము, అర్గలా స్తోత్రము, సిద్ద కుంజికా స్తోత్రము మొదలైనవి  ఉన్నాయి.*


సప్తశతి లో 587 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలను స్వతంత్రమైన వాక్యాలు గాను మంత్రాల గాను విభజించడం జరిగింది. అలా విభజించినప్పుడు 535 పూర్తి శ్లోకాలు, 42 అర్ధ శ్లోకాలు,  66 త్రిపాన్మంత్రాలు  ఇవి కాక రాజోవాచా  వైశ్య ఉవాచ మొదలైన ఉవాచ వాక్యాలు 57 ఉంటాయి. ఇవి మొత్తం కలిపితే 700 అవుతాయి. సప్తశతి అంటే 700 అని అర్థము. సప్తశతి లో మంత్రం కానటువంటి వృధా పదం అనేది ఏదీ లేదు.


*హిందూమతంలో వేదమంత్రాలను  ఉపయోగించి మాత్రమే వివిధ రకాలైన హోమాలు చేస్తుంటారు. పురాణాలలో మంత్రాలూ స్తోత్రాలూ ఉపయోగించి హోమాలు చెయ్యరు. కానీ సప్తశతి పురాణాలలోది అయినా దీనిని ఉపయోగించి చండీ హోమం జరపడం సాంప్రదాయంగా వస్తోంది.  చండీ హోమం మొత్తం కూడా దుర్గా సప్తశతి లోపలుండే ఏడు వందల మంత్రాల తోనే జరుగుతుంది.* *ప్రధానంగా సప్తశతి ని ఆధారం చేసుకుని చండీ హోమం జరుగుతుంది.* 


అందులోఅక్కడక్కడ పైన చెప్పిన స్తోత్రాలతోనూ నవార్ణ మంత్రజపము  తో కూడిన మరికొన్ని హోమాలు ఉంటాయి. రుద్ర, గణపతి మొదలైన హోమాలు కూడా మధ్య మధ్యలో ఉపాంగాలు గా ఉంటాయి..

సప్తశతి కి వేద భాగంగా పరిగణించేటంత మంత్రశక్తి, ప్రభావము ఉన్నాయన్నమాట...


.....ఇంకా వుంది.


*పవని నాగ ప్రదీప్*

కామెంట్‌లు లేవు: