*శ్రీనివాస మంగాపురం - వెంకన్న సేవలో వెర్రి బాగులమ్మ*
శ్రీనివాసమంగాపురంలో పుట్టనుండి బయటపడిన శ్రీనివాసునికి సేవలందించడానికి మరో వకుళమాత ప్రత్యక్షమయ్యింది. ఈమె చరిత్రకెక్కని వకుళమాత ! ఆమె పేరు 'తాయారమ్మ!
ఆమె విచిత్ర గాథ ఏమిటో! వింతగాథ ఏమిటో! అవ్పటి “వకుళమాత”లాగా వివరంగా తెలియకపోయినా ఇప్పటి ఈ “తాయారమ్మ”ను గూర్చి తెలిసినంతవరకు చెప్పుకుందాం!
*వెంకన్న సేవలో వెర్రి బాగులమ్మ*
శ్రీనివాసమంగాపురంలో ఒక రోజున ఉన్నపళంగా ఒక వెర్రి బాగుల స్త్రీ ప్రత్యక్షమయింది. ఆమె ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. ఏ ఊరినుంచి వచ్చిందో తెలియదు. పిచ్చిదానిలాగా చూపులుచూస్తూ వెర్రి నవ్వు నవ్వుతూ వుందేది. చూపులు బయటికి చూస్తున్నా అంతర్లీనంగా ఎక్కడో చూస్తున్నట్లు, ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా తనలో తానే గొణిగేది. అలా గొణుక్కుంటునే వెర్రినవ్వులు నవ్వేది. గట్టిగా మాత్రం కాదు. చిరునవ్వు, నవ్వేది. పక్కన ఎవరున్నా గమనించేది కాదు. ఎవరేమన్నా పట్టించుకొనేది కాదు.
ఆ నవ్వు మొగంతో ఆతల్లి ఆకర్షణీయంగా కనపడుతుండేది. చెరగని నవ్వుతోవున్న ఆమె శరీరం ముడతలు పడ్డా, పసుపుపచ్చని నిమ్మపండులాగా నిగనిగలాడుతూ నుదుటున గుండ్రని కుంకుమబొట్టుతో చేతులనిండా మట్టిగాజులతో పెద్దముత్తెదువులాగా, యోగినిలాగా కనబడేది. మితంగా మాట్లాడేది. మితంగా ఏదో అడిగేది. వెంటనే నవ్వేది. ఇంతే..
ఒక ఉన్మ్నాదస్థితిలో, అవధూతలాగా, యోగినిలాగా వున్న ఆమెను మాత్రం ఆ ఊరివాళ్లు ఏవేవో ప్రశ్నలు అడిగే వాళ్లు. కొందరు ఎక్కడి నుండి వచ్చావు! అని అడిగేవాళ్లు. మరి కొందరు ఏవం పేరు? మీరు బ్రాహ్మణులా? ఇలా ఎన్ని ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడిగినా నవ్వడమే ఆమె జవాబు.
పాపం! బ్రాహ్మణ స్రీ అయివుండవచ్చు. ఎక్కడి నుంచి వచ్చిందో? ఎవరికెరుక అనుకునేవాళ్లు. ఆ తర్వాత ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం పూర్తిగా మానివేశారు. కాని ఆమెను ఆ ఊళ్లో అందరూ “తాయారమ్మ” అని పిలిచేవాళ్లు.
పుట్టలతో చెట్లతో నిండిన శ్రీనివాస ఆలయమే తాయారమ్మ నివాసం! ఆమె ఊళ్లోని ఇంటింటికి వెళుతుంది. రవ్వంత చమురు ఇయ్యరూ స్వామికి దీపం పెట్టాల అని అడుగుతుంది. కొందరు డబ్బులియ్యబోతే నాకెందుకూ కాసులు?కొంచం బియ్యం పప్పు పెట్టండి! అని అడిగి ఇప్పించుకుంటుంది.
కొందరు ఏమిచ్చినా తీసుకొనేది కాదు. కొంతమందిదగ్గర పదేపదే అడిగి తీసుకుంటుంది. ఇలా ఇంటింటికి వెళ్ళి పప్పు, ఉప్పు, బియ్యం, నూనె .... ఇలా వస్తువుల్ని సేకరించి గుడికి వచ్చి మూడురాళ్ల పొయ్యి పెట్టి, మట్టి కుండలో అన్నీ కలియకలిపి ఉడికేసెది. ఆ తర్వాత మట్టిమూకుట్లో నూనె పోసి వత్తి వెలిగించి గుళ్లో దీపం వెలిగిస్తుంది.
కటికచీకట్లో గాఢాంధకారంలో తాటిమట్టల్ని వెలిగించి దాని మంటల వెలుగుల్లో గుడిలోకి వెళ్ళేది. దారిలో పుట్టల్లోని పాములు చిన్నవీ పెద్దవీ 'బుస్' అంటూ బుసకోట్టేవి. పడగ విప్పేవి. ఇవేవీ పట్టించుకోకుండా తాయారమ్మ “ఒరే నాగా! ఒరే శేషూ! స్వామికి ఆకలేన్తుందంట! పక్కకు తప్పుకొండర్రా! జరగండర్రా” అంటూ ముద్దుగా మురిపెంగా ప్రేమగా పిలుస్తూ ఏమాత్రం జంకుగొంకు లేకుండా లోనికి వెళ్లి స్వామివారిని అందినంతవరకు తుడిచి, తెచ్చిన పూలను పాదాలపై సమర్పించేది.
తదుపరి మట్టి మూకుట్లో దీపారాధన చేసి, తానువండిన మట్టికుండ అన్నాన్ని నిండుగా అట్లాగే స్వామికి నివేదించి సమర్పించేది. అంతే ఆమె భక్తి! లోపల ఏదేదో గొణిగేది. అవి ఏం మాటలో ఏం మంత్రాలో ఎవరికీ తెలియదు. ఆమెకే తెలియాల. ఆ స్వామికే తెలియాల. అంతే!
నైవేద్యం అయినవెంటనే ఆ ప్రసాదాన్ని అక్కడ ఆ గుడి ఆవరణలోవున్న పసులకాపరులకు పంచి పెడుతుంది. మిగతా తాను ఆరగిస్తుంది. ఒక్కొక్కసారి పసులకాపరులను అడిగి ఆవుపాలను స్వామికి నివేదించి అక్కడ గుళ్లో వుండే సర్పాలకు కూడా మూకుళ్లలో పెడుతూ ఒరే నాగులూ! పాలు తాగండర్రా! మీకోసమే! అంటూ పాలుపెట్టేది ఆ తల్లి! ఆ పాములు కూడా ఒదిగి ఒదిగి ఆమె చెప్పినట్లుగానే ఆమె పెట్టిన పాలను తాగేవి.
ప్రతిరోజు 'లేవడం, ఊళ్లో బిచ్చమెత్తడం. వాటీని వండి స్వామికి సమర్పించడం!... ఇదే ఆమె నిత్యకృత్యం, రామనామం! శ్రీనివాసుని గుడే ఆమె నివాసం! పగలంతా అక్కడ గుళ్లో మేసే ఆవులు, మేకలు, బర్రెలు, గొర్రెలు .... వాటిని మేపే పసులకాపరులు... వాళ్లే ఆమెకు నేస్తాలు!
ఇక రాత్రివేళల్లో! అయితే అక్కడి పుట్టల్లోని పాములే ఆమె దోస్తులు!
ఆమెకు నిరంతరం స్వామిమీదే ధ్యాస! స్వామి ఊసే ఆమెకు ఊపిరి. మరోమాట లేదు మంతీ లేదు. ఇలా సుమారు 40 ఏండ్లు జరిగింది. ఒక రోజున తాయారమ్మ తాను నిత్యం భిక్షకు వెళ్లే ప్రతి ఇంటింటికీ వెళ్లింది. ఆ ఇంటి వాళ్లందర్నీ ఆప్యాయంగా పిలిచి చెప్పింది.
ఈ రోజుతో నాపూజలు సరి! ఇక రేపట్నించీ నేను భిక్షకు రాను. “రేపు ఒక స్వాములోరు వస్తారంట! ఆయన బాగా మంత్రాలతో పూజ చేస్తారంట!ఇప్పట్నుంచి ఈ గుడి వృద్ధిలోకి వస్తుందంట!” ఈ విషయాలన్నీ గుళ్లోని శ్రీనివాసుదే నాకు చెప్పినాడు! “ఈ రోజే నేను తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాను. అక్కడినుండి తుంబురు కోనకు (తిరుమలకొండ మీది తీర్థం) పోయి జపం చేసుకుంటాను- అంటూ ఇంటింటి దగ్గరే కాదు. కనపడిన ప్రతి వాళ్లందరికీ చెప్పింది. పిల్లా పెద్దా, ఆడా, మగా ఇలా ఆ ఊళ్లోని అందరికీ చెప్పింది. ఆవుపాలు ఇచ్చిన పసువులకాపర్లందరికీ ఇదే మాటల్ని చెప్పింది. పోయివస్తానంటూ.
ఆమె చెప్పేమాటల్ని విన్న వాళ్లందరూ ఎదో తెలియని వెలితికి లోనయ్యారు. ఇది రోజూవున్న సణుగుడేలే! అనుకున్నారు కొందరు. గుళ్లోని స్వామికీ నమస్కరించింది! పుట్టల్లోని పాములకు నమస్కరించి వీడ్మోలు చెప్పింది. అక్కడవున్న చెట్లను, తీగలను ప్రేమగా స్పృశించి, వీడ్కోలు చెప్పి రాత్రికి రాత్రే ఎటో వెళ్లిపోయింది వెర్రిబాగులతల్లి తాయారమ్మ! కాదు కాదు పరమయోగిని, భక్తురాలు తాయారమ్మ! ఇంకెక్కడికి పోయుంటుంది? తిరుమల వెంకన్న దగ్గరికి తప్ప!
విచిత్రాతి విచిత్రం! భక్తురాలు, కర్మయోగిని తాయారమ్మ చెప్పినట్లుగానే ఆ మరునాడే కంచినుంచి " సుందరరాజ స్వామి " అనే భక్తుడు అతి ప్రయాసతో మారుమూలగా వున్న శ్రీనివాసమంగాపురాన్ని వెతుక్కుంటూ వచ్చాడు.
తిరుమల వెంకన్న చేసే విచిత్రాలు ఎన్నెన్నో! ఎవరికెరుక!
\!/ ఓం నమో వేంకటేశాయ \!/
రచన : జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు, తిరుపతి.
ప్రచురణ : టీటీడీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి