19, ఏప్రిల్ 2022, మంగళవారం

వివిధ కావ్యాల్లో పేర్కొన్న వంటకాల జాబిత

 సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో శ్రీనాథుడు  వివిధ కావ్యాల్లో పేర్కొన్న వంటకాల జాబితా ఆరుద్ర యిస్తే, అది ఆరు పేజీలొచ్చింది. వాటిలో  పేర్లు కొత్తగా, ఆసక్తికరంగా వున్నవి కొన్ని.


1. ఒలుపు పప్పు 

2. మంచున బిసికిన పంచదారలు

3. బేసము

4.బిడము

5. తోరుండలు

6. పండ్యారము    

7.పూరగము

8. కమ్మని తాలింపు సొజ్జెపిండి

9.తింత్రిణీ కరసోపదేహ దుర్ధురములు

10.జంభీరరసం 

11.తాటిపండు

12.ఇప్పట్లు 

13.గొల్లెడలు

14.అంగారపొలియలు 

15. సారసత్తలు

16.బొత్తరలు

17. మణుగు బూవులు

18.మోరుండలు

19.బిసకిసలయములవరుగులు

20.ఉక్కెర

21.బలుపలు

22.ఇలిమిడి


పై వంటకాలను ఎవరైనా ఎప్పుడైనా విన్నారా.


పై పిండివంటల గురించి నేను విన్నది ఇదిగో. 


1. ఒలుపుపప్పులు


ఒలుపు పప్పులంటే మామూలుగా పొట్టుతీసిన పప్పులైతే వాటిని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన పని లేదు గదా! ఒలుపుపప్పులంటే nuts అయిండొచ్చని నా ఉద్దేశం. ఆ రోజుల్లో ఏ యే నట్స్ లభించేవో తెలీదు. బహుశా ఒల్చిన గుమ్మడిగింజలు, చారపప్పు, బాదం, వేరుసెనగపప్పు లాంటివి అయివుండొచ్ఛు.


2. మంచున పిసికిన పంచదార


ఇది బహుశా ice cream అయి వుండొచ్చు. అంటే పాలు లేకుండా వట్టి రంగువేసిన ఐస్ క్రీం అన్నమాట. పల్లెటూర్లలో పెరిగిన వారికి తెలిసి వుండొచ్చు. విందు అయి చేతులు కడుక్కున్నాక, తాంబూలానికి ముందు యిది యిచ్చేవారేమో!


3. బేసము‌ 


బేసము అంటే బ్రౌను దొర గారు sap  అనే అర్థం యిచ్చాడు. చిన్నప్పుడు యిప్పటిలా అన్నం బిరుసుగా ఉండి మునివేళ్ళతో కలిపేవాళ్ళం కాదు. శుభ్రంగా అరిచెయ్యి తగలేట్లు ముద్దచేసి తినేవాళ్ళం. అప్పుడు గుజ్జువంటిది ఒక పల్ఛటిపొరగా అరిచేతికి అంటుకుని వుండేది. దాన్ని కంచం అంచు మీద గీస్తే వచ్చేదాన్ని 'బేసం' అనేవాళ్ళు. 

మరి, విందుల్లో పెట్టే బేసం ఏంటో! బేసన్ అంటే మన ఇతర భారత భాషలలో సెనగపిండి.  బేసిన్ లడ్డూ పేరిట తెలుగు వాళ్ళూ ఒక పిండివంట చేస్తారు. అలాంటి దేదైనా కావచ్చునేమో మరి.


4.బిడము 


ఇది అట్టుప్పు, a cake of salt, అయిండొచ్చు. ఇప్పుడు స్వగృహా షాపుల్లో అమ్మే 'చెక్కలు' లాంటివి కావచ్చును.


5. తోరుండలు


తెలియదు. ఇదేదో కొత్తగా ఉంది. 


6.పణ్యారము. 


రాయలసీమ వాళ్ళు  'పొంగణాలు', కోస్తా ప్రాంతం వాళ్ళు ' పులిబొంగరాలు' అనే యీ snack ని తమిళులు 'పణ్యారం' అంటారు. శ్రీనాథుడి కాలంలో ఆ పదం తెలుగువాళ్ళు గూడా వాడేవారేమో!


7. పూరగము. తెలియదు. 


8. కమ్మని తాలింపు సొజ్జెపిండి


రవ్వని రాయలసీమలో ' సొజ్జె' అంటారు. ( హిందీ ' సూజీ'). కనుక  'కమ్మని తాలింపు సొజ్జెపిండి' అంటే ఉప్మా అన్నమాట. దీని మరాఠీ counterpart సాంజా.


9.తింత్రిణీక రసోపదేహ దుర్ధురములు


అయ్య బాబోయ్! ఇది తినడం మాట దేవుడెరుగు! బంతిలో కూర్చున్నవాడు యిది కావాలని అడిగేసరికి వడ్డించేవాడు చివరికి వెళ్ళిపోయి వుంటాడు. ఇది పేరులా లేదు

పేరాగ్రాఫులా వుంది. ఏ పులిహోరకో ('తింత్రిణీక రసం' అంటే చింతపండురసం అనే ఒక్కమాట అర్థమయింది లెండి) description లా వుంది.


10. జంబీరరసం


జంబీరం అంటే నిమ్మ. జంబీరరసం అంటే నిమ్మషర్బత్. Welcome drink అయివుంటుంది


11.తాటిపండు


నిజంగా తాటిపండో, లేక ఆ పేరు గల ఏదైనా స్వీటో! నిజంగా తాటిపండైతే శిష్టులకు నిషిద్ధం మరి!!


12.ఇప్పట్లు


 గిరినులు ఇప్పపువ్వుల్ని పిండిలో కలిపి రొట్టెలు చేసుకుంటారట.అవే ఇప్పట్లు కావచ్చు. ఇప్పపూలు   శిష్టులకీ నిషిద్ధం  కాదను కుంటాను.


13. గొల్లెడలు - తెలియదు


14. అంగారపొలియలు


అంగార దొల్లెలు అంటే fried wheat cakes అన్నారు బ్రౌను దొర గారు. అవే యివేమో! 'అంగార' అని ఉంది కనుక నిప్పులమీద కాల్చిన పుల్కాలేమో!


15.సారసత్తలు 


సారసత్తలు అంటే ఉప్పువేసి బియ్యం పిండిని బాగా ఉడికించి, ఉండలుగా చేసి వాటిని ఇడ్లీకుక్కర్లో ఆవిరికి పెట్టి బైటికి తీసి చక్కిలాల్లా ఒత్తుకోవచ్చు.  లేక పోతే పాకంలో వేసుకుని తియ్యగానూ తినొచ్చు. ఇవేనేమో. 


16.బొత్తరలు - తెలీదు


17. మణుగుపూవులు - జంతికలు


18.మోరుండలు


గారెలపిండిని ఉండలుగా చేసి కాల్చి మజ్జిగపులుసులో వేస్తే అవి మోరుండలని  విన్నాను.


19. బిసకిసలయమ్ముల వరుగులు


అన్ని కూరలూ అన్ని seasons లో దొరకవు. అందుకని వాటిని ఉప్పులో నానేసి ఎండబెట్టి అవి దొరకని season లో వేయించుకుని తింటారు. వాటిని ' 'వరుగులు' అంటారు. 'బిసము' అంటే తామర. తామర తూడులు తింటారట. ఆ తామర తూడుల వరుగులే 

'బిసకిసలయమ్ములవరుగులు  


20.ఉక్కెర


చిన్నప్పుడు బియ్యప్పిండిలో పంచదార వేసి ఉడికించి పిల్లలకి పెట్టేవారు. అంటే అది ఆనాటి farex అన్నమాట. దాన్ని 'ఉక్కెర' అనేవారు. పెద్దవాళ్ళ విందుల్లో ఉక్కెర అంటే ఏ హల్వా వంటిదో అయి వుండొచ్చు


21 బలుపలు. -. తెలియదు

22. ఇలిమిడి - తెలియదు. చలిమిడి కావొచ్చేమో


ఇందులో కొన్ని snacks  లా వున్నాయి. కొన్ని breakfast items గూడా(ఇడ్లీ, దోసె లాంటివి) వున్నాయి. అవన్నీ భోజనంలో ఎలా తింటారు అని మనకి అనుమానం రావచ్చు. వాళ్ళు ప్రాతస్సంధ్య, మధ్యాహ్నసంధ్యా అయ్యాక ఏకంగా భోంచేసేవారనుకుంటా. అందుకే అన్నీ అన్నంలోనే!

 

మన తెలుగులో ' నిఘంటు కమిటీ' వంటిదేమైనా వుంటే వాళ్ళు పూనుకుని యీ వివరాలు నిఘంటువుల్లోకి ఎక్కిస్తే మన పూర్వులు ఏం తినేవారో తెలుస్తుంది.వారు ఎంత నాగరికంగా బ్రతికారో అర్థమౌతుంది.


సేకరణ

కామెంట్‌లు లేవు: