నిన్న శ్రీనాథుడి గ్రంథాల్లో ప్రస్తావించిన కొన్ని వంటకాల్ని చూశాం కదా. వాటిలో కొన్నిటిని కష్టపడి పోల్చుకోగలిగాం. అలా గాకుండా ఫలానాది ఫలానా అని పోల్చుకునేలా దాని రెసిపీ గాని కనీసం రూపురేఖలు గానీ ఎవరైనా చెబితే ఎంత బాగుండును! అని అనిపిస్తే, ఆ లోటు తీర్చిన కవి ఒకాయన వున్నాడు. ఆయనే జైమినీభారతకర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు.
ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్నాడు. భోజనాలకి మునుల్ని గూడా పిల్చాడు. రావడ మంటే వచ్చారు గాని, వాళ్ళకి ఆ రాజభోజనాల్లో 'డెలికసీ' ఏమీ అంతు బట్టలేదు. వడ్డించే అమ్మాయిల్తో గొడవకి దిగారు
"తెగిన జందెము లేల తెచ్చెదరన, కావు
వినుడివి సన్న సేవియలు గాని
చింపి వల్కము లేమి చేసెడిదన, కావు
నెరవైన కండమండెగలు గాని
ఔదుంబరము లనర్హములొల్లమన,కావు
నమలి చూడుడు, మోదకములు గాని
ఫేనపుంజము లేల పెట్టెదరన, కావు నీ పాద మాన ఫేనికలు గాని
అంచు వాచంయములు వల్క నబ్జముఖులు
నగుచు నొడబడి చెప్పనందరు యథేష్ట
రుచుల భుజియించి వార్చి కర్పూరవీటి
కా సుగంధప్రసూన సౌఖ్యముల దనిసి"
- ( జై.భా 8 - 204)
ఒక వంటకం చూసి," ఏంటివి? జంధ్యం తుంపులు తెచ్చి విస్తట్లో వేశారు. తమాషాగా వుందా?" అని హుంకరించారు. అప్పుడు వడ్డించే వయ్యారి నెత్తి బాదుకుని " అవి సేవియలు సంయమీంద్రా" అంది. ఇప్పుడు మనకి ఏ మాత్రం సందిగ్ధత లేకుండా ' సేవియలు' అంటే ' సేమ్యాలు' అని తెలిసి పోయింది.
అలాగే గుడ్డపేలిక లని భ్రమపడ్డం వల్ల అవి 'కండమండెగలు' (పూతరేకు) అని తెలుస్తుంది. కర్ణాటకలో జైనులు దీనిని ' కట్టమండిగె' అంటారట. ఇది వారి సంప్రదాయ వంటకమట. పూతరేకుని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరిస్తే గుడ్డపేలికల్లా, అంటే అంత పల్చగా వుంటాయి.
అలాగే మేడిపండ్లు (ఔదుంబరములు) అని అనుమానపడడం వల్ల అవి లడ్డూలనీ సులభంగా బోధపడుతుంది. మేడిపండు ( అత్తిపండు) గుండ్రంగా లడ్డూలా వుంటుంది. బాగా పండిన పండు లడ్డూ రంగు లో వుంటుంది.
ఇక, ఫేనం అంటే నురుగు. 'నురుగు వడ్డించారేంటి?' అని అడిగితే ' కాదు, స్వామీ! అవి ఫేనికలు' అంటారు.
ఫేనికలంటే పేణీలు . అవి పాలనురగ లాగేవుంటాయి.
ఇంకో అవకాశం గూడా వుంది. ఫేనిక అంటే ' పీచు మిఠాయి' అయినా కావచ్చు. ఎందుకంటే అది అచ్చం పాల నురగలాగే వుంటుంది, రంగెయ్యకపోతే.
నవ్వకండి. పీచుమిఠాయికి (Cotton candy) చాలా చరిత్ర వుంది. 15 శతాబ్దంలోనే ఇటలీలో వుందంటారు. అదే సమయంలో భారతదేశంలోనూ వుండే అవకాశం వుంది. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్సు వంటి అనేక దేశాల్లో పిల్లలు యిష్టంగా తినే స్వీట్ అది.
. పద్యాలు యింకా దొరకాలి. మన సాహిత్యం సుసంపన్నం కావాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి