19, ఏప్రిల్ 2022, మంగళవారం

రామాయణానుభవం_ 35

 🌹రామాయణానుభవం_ 35


పదమూడవ రోజు చేయవలసిన పితృకార్యాలు అన్నీ నిర్వర్తించి అంతఃపురం చేరారు భరత శతృజ్ఞులు.


శత్రుఘ్నుడికి  తూర్పు ద్వారం వద్ద  మంథర కనిపించింది. సర్వాభరణాలు ధరించి, విలువైన వస్త్రాలు దాల్చి, సుగంధద్రవ్యాలు పులుముకుని, మెడనిండా హారాలతో తాళ్ళతో కట్టిన కోతిలా కనిపించింది భరతుడు ఒక్క ఉదుటున వెళ్ళి పట్టుకున్నాడు. దీని మూలంగా ఇదంతా జరిగింది అంటూ శత్రుఘ్నుడికి అప్పగించాడు మంథర ఏడుపులకు అంతఃపురమంతా పోగయ్యింది. శత్రుఘ్నుడి కోపం చూసి మళ్ళీ అందరూ ఎటు వాళ్ళు అటు పారిపోయారు దాన్ని జుట్టుపట్టుకొని బరబరా లోపలికి లాక్కువచ్చాడు. విడిపించమని కైకేయి భరతుణ్ణి

అభ్యర్థించింది. 


భరతుడు మండిపడ్డాడు. శత్రుఘ్నా! ఎంత పాపం చేసినా స్త్రీలను సంహరించడం సమంజసం కాదు. క్షమించి వదిలెయ్, నేను ఈపాటికినేను  ఈ దుష్టచారిణి కైకేయిని సంహరించే ఉందును. ధర్మస్వరూపుడు రాముడు ఇటువంటి పనులు అంగీకరించడు. నువ్వు ఇప్పుడు ఈ కుబ్జను చంపితే, అది తెలిసిందంటే రాముడింక మనిద్దరితోనూ మాట్లాడనైనా మాట్లాడడు. ఇది నిశ్చయం. అందుచేత వదిలిపెట్టెయ్- అన్నాడు భరతుడు. శత్రుఘ్నుడు ఒక్క తోపుతో వదిలేసాడు. కైకేయీ పాదాల మీద పడింది. ఆవిడ ఓదార్చింది


పద్నాల్గవరో జు తెల్లవారింది. రాజాధికారులు భరతుడి దగ్గరికి వచ్చారు. ఆమాటా ఈమాటా చెప్పి, అరాజకం ఏర్పడింది పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధంగా ఉందని విన్నవించారు. రాజ్యం స్వీకరించి రక్షించమని ప్రాధేయపడ్డారు. భరతుడు అభిషేక భాండానికి ప్రదక్షిణం చేసాడు. అధికారులారా ! రాజ్యం జ్యేష్ఠుడికే దక్కాలి. ఇది మా వంశాచారం. మీరంతా ఎరుగుదురు. మరి ఇలా మాట్లాడుతున్నారేమిటి? ఇది మీకు తగదు, రాముడు నాకు అగ్రజుడు. అతడే రాజు అవుతాడు. నేను వెళ్ళి పధ్నాలుగేళ్ళు వనవాసం చేస్తాను. చతురంగసైన్యాలను సమాయత్తం చెయ్యండి నేను వెళ్ళి రాముణ్ని పిలుచుకువస్తాను. ఈ అభిషేకసంభారాలతోనే

బయలుదేరి వెడతాను. అక్కడే పట్టాభిషేకం చేసి నగరానికి తీసుకువస్తాను. యజ్ఞంనుంచి యాగాగ్నిలాగా తీసుకువస్తాను.


తెల్లవారింది. వందిమాగధులు స్తోత్రపాఠాలు చెయ్యబోయారు. మంగళవాద్యాలు మ్రోగాయి. అన్నింటినీ భరతుడు ఆపేసాడు. నేను మహారాజును కాను. ఈ రాజలాంఛనాలు ఆపండి అన్నాడు. తండ్రిని తలుచుకుని మళ్ళీ దుఃఖించాడు.


సభ ఏర్పాటు చేశారు సభలో అందరూ మంత్రి వర్గం పురోహితులను ఉద్దేశించి భరతుడు.....


మనమందరమూ రాముణ్నే అనుసరిద్దాం. అతడే మనకు రాజు. పురుషోత్తముడు. ముల్లో కాలకూ అతడే అర్హుడైన పరిపాలకుడు- అని భరతుడు పలుకుతోంటే విన్నవారంతా సంతోషించారు. రాముణ్ని వెనక్కి తీసుకురాలేకపోతే నేనూ లక్ష్మణుడిలాగే రామునితో ఉండిపోతాను. అన్ని ఉపాయాలూ ఉపయోగిద్దాం. అందరం కలిసి వెడదాం. మీ సమక్షంలోనే మాట్లాడతాను. రాముణ్ని తీసుకువద్దాం. బయలుదేరండి. సుమంత్రా! ప్రయాణానికి ఏర్పాట్లు చేయించు- అన్నాడు భరతుడు


మంత్రిపురోహిత దండనాయకసామంతాదులతో చతురంగబలాలతో జనసముద్రం కదిలింది. కౌసల్య, సుమిత్ర కైకేయి- బయలుదేరారు. అందరి మనస్సుల్లోనూ రాముణ్ని చూస్తామనే సంబరం. దు:ఖం తీరిపోతుందనే విశ్వాసం. కళకళలాడుతున్న ముఖాలతో కోలాహలంగా ప్రజలు బయలుదేరారు. గంగాతీరంలో శృంగిబేరపురం దగ్గర విడిదిచేసారు. గంగాజలంతో దశరథుడికి తర్పణాలు విడిచిపెట్టాలని తన ఆంతర్యం ప్రకటించాడు భరతుడు. చతురంగబలాలు విడివిడిగా విడిదిచేసాయి.....

**


మంత్రి పురోహిత చతురంగబలాలతో  భరతుడు శృంగిభేర పురం చేరాడు.


గుహుడికి చారుల ద్వారా వర్తమానం అందింది. మహాసముద్రంలాగా ఉన్న సైన్యాన్ని చూసాడు. తన వారందరినీ త్వరగా సమావేశపరిచాడు.

కోవిదారధ్వజంతో ఉన్న రథం మీద ఉన్నవాడే భరతుడు. దుర్బుద్ధి. మనల్ని బంధించడానికో వధించడానికి లేదా అడవులపాలయిన రాముణ్ని వధించడానికి వచ్చి ఉంటాడు. సందేహం లేదు. రాముడు నాకు ప్రభువు. మిత్రుడు. అందుచేత మీరంతా అన్ని విధాలా సన్నద్ధులై గంగాతీరాన్ని కాపలా కాయండి. నావలు సిద్ధం చేసుకోండి. భరతుడు రాముడిపట్ల అదుష్టుడు అని తేలితేనే ఇవ్వేళ ఈసేన గంగను దాటగలుగుతుంది. (లేకపోతే మొత్తం సైన్యాన్ని గంగలో ముంచెంయ్యడమే మన కర్తవ్యం)


ఇలా ఆజ్ఞాపించి గుహుడు తాను వినయంతో వినీతుడై మధుమాంసాలను బహుమతిగా తీసుకుని భరతు ణ్ని సమీపించాడు.


సుమంత్రుడు చూసి భరతునికి పరిచయం చేసాడు. మేము మీకు దాసులం. మీరంతా ఈ రాత్రికి ఇక్కడే విడిదిచేసి మా ఆతిథ్యం స్వీకరించి రేపు వెడుదురుగాని- అని గుహుడు సవినయంగా విన్నవించాడు.


భరతుడు సంతోషంగా అంగీకరించాడు. ఈ ప్రాంతమంతా గహనంగా ఉంది. భరద్వాజాశ్రమానికి దారి ఎటు? అడిగాడు


గుహుడు నమస్కరించే సంభాషించాడు.


సన్నద్ధులైన మా ధనుష్కులు మీ వెంట వస్తారు. నేనూ నీ వెంట ఉంటాను. కానీ ఒక్కమాట. ఈ మహాసైన్యం ఏమిటి?

శంకించవలసివస్తోంది. రామునికి అపకారం చేద్దామని వెళ్ళడం లేదు గదా నువ్వు !


ఆకాశంలా నిర్మలంగా ఉన్న భరతుడు మెల్లగా సమాధానం చెప్పాడు. మిత్రమా ! నాకు కష్టకాలం మళ్ళీ రాకూడదు నన్ను శంకించకు. రాముడు నాకు అన్నయ్య, పితృసమానుడు. అతణ్ని వెనక్కి తీసుకురావడానికే వెడుతున్నాను. ఇది సత్యం నమ్ము. మరోలా భావించకు భరతుడా ! నువ్వు ధన్యుడివి. ఈ లోకంలో నీకు సాటి వచ్చేవారు లేరు. అప్రయత్నంగా చేతికి వచ్చిన రాజ్యాన్ని విడిచిపెడుతున్నావంటే నువ్వు సామాన్యుడివి కావు. నీ కీర్తి లోకంలో శాశ్వతంగా ఉండిపోతుంది. రాముణ్ని వెనక్కి తీసుకురావాలి

అనే నీ కోరిక దీనికి కారణం- అంటూ గుహుడు తన సంతోషాన్ని ప్రశంసాపూర్వకంగా వెల్లడించాడు సూర్యుడు అస్తమించాడు. చీకట్లు అలముకున్నాయి. సైన్యం హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. భరతశత్రుఘ్నులు గుహుడితో .

నిద్రకు ఉపక్రమించారు....

కామెంట్‌లు లేవు: