సహస్ర గోదానం చేయుటలో ఉద్దేశ్యమేమిటి ?
ఉత్తరగోగ్రహణము తెలుసు మరి దక్షిణగోగ్రహణ మాటేమిటి ?
..........................................................
షోడశ (16) మహదానాలలో గోదానము ఎంతో విశిష్టమైంది. షోడశదానాలలో గోదానం ఎలా చేయాలో ఎందుకు చేయాలో తెలుసుకొందాము.
రైతు దేశానికి వెన్నెముకైతే, ఆ రైతుకు వెన్నెముక వంటిది గోవు. వ్యవసాయంలో గోసంపదలు లేకుండా పంటలు పండించడం దుస్సాధ్యం. గోసంపదలు ఇచ్చే పాలే లేకపోతే మనిషి దైనందిన మనుగడ ఎంత ధైన్యంగా వుంటుందో ఊహించుకోవచ్చును.
ఏ దేశములనైనా మనిషి మనుగడకు కారణమైతున్న గోవు హిందువులకు పవిత్రమైంది. నిజం చెప్పాలంటే సకల మానవాళికి కూడా ఆరాధ్యమనే చెప్పాలి.
వ్యవసాయాభివృద్ధికి పాడిని పెంపొందించడానికి గోవులు అత్యవసరము. అందుకే అప్పటి రాజులు చక్రవర్తులు భూస్వాములు,ధనవంతులు గోవులను నిమ్నజాతివారికి, శూద్రలైనవారికి, బ్రాహ్మణులకు, రైతులకు దానంగా ఇచ్చేవారు.
గోదానాన్ని ఎలా చేయాలో చూద్దాం.
ఒక ఎద్దును వేయిగోవులతో కలపాలి. ఆ వేయి గోవులలో శ్రేష్టమైన 10 ఆవులను ఎంచుకోవాలి. వాటిని మంచి వస్త్రాలతో అలంకరించాలి. కొమ్ములకు బంగారు కుప్పెలను తొడగాలి. కాలి గిట్టలను వెండి ఆభరణాలతో అలంకరించి చప్పరములోనికి తీసుకురావాలి. చప్పరమంటే రాతికూసాలను (స్తంభాల) నాలుగు ప్రక్కలాపాతి, పైన నలుచదరమైన కప్పులను (బండలను) పైకప్పులుగా వేయాలి. చప్పరమంటే శాశ్వతనిర్మాణము. బాటసారులు సేదతీరటానికి దారి కిరువైపులా, పుణ్యాత్ములైనవారు చప్పరాలను నిర్మించి చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారు.
అలాంటి చప్పరములో (సత్రము లేదా దద్దలము) బంగారుతో చేసిన నందికేశ్వరుని నిలపాలి. దాత సర్వ ఔషధాలతో మిళితమైన నీటితో స్నానము చేసి, తడిబట్టలతో విడవకుండా, చేతులలో పూలను వుంచుకొని, గోమహత్మ్యమును స్మరిస్తూ నందికేశ సహిత దశ గోవులను పూజించాలి. నందికేశ్వరుడిని ధర్మదేవతగా పూజించాలి. అలా పూజించిన తరువాత ఆ పూజలను నిర్వహింపచేసిన గురువుకు రెండు ఆవులను నిమ్నులకు 2 ఆవులను, ఎద్దును, మిగిలినవాటిని రైతులకు, బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి.
మిగిలిన 990 గోవులను దేశములోని వ్యవసాయదారులకు, పాలుపెరుగులు వృద్ధిచేసే గొల్లలకు దానంగా ఇవ్వాలి. ఇలా దానంగా ఇవ్వడము వలన గోసంతతి వృద్ధి అవుతుంది. వ్యవసాయాన్ని పాడిని అభివృద్ధిపథము
వైపు నడిపించడం జరుగుతుంది. దాత కూడా తనకు శివలోక సన్నిధి లభిస్తుందని భావిస్తాడు. గోసంతతి అభివృద్ధి కొరకు వృషభాన్ని దానంగా ఇస్తారు.
ఒకప్పుడు భారతదేశములో రాజులు ప్రజలు తమకున్న సంపదలలో గోసంపదే గొప్పదని భావించేవారు. ఎంత గోసంపద వుంటే అంతగా ధనవంతులన్నమాట.
గతములో గోవులను దొంగలించడము వాటిని సంతలలో రైతులకు అమ్ముకోవడము సర్వసామాన్యవిషయము. ఇప్పుడు కూడా వీధులలో నిర్భయంగా తిరుగుతున్న గోజాతిని అపహరించి కొనుకొంటున్న సంగతి వార్తాపత్రికలలో చూశాము కదా !
పాండవుల అజ్ఞాతవాసాన్ని బట్టబయలు చేయాలన్న సంకల్పముతో దుర్యోధనుడు రాజన్య, పరివారముతో ఆలోచించాడు. విరాటుని మత్స్య దేశము సుఖశాంతులతో సుభిక్షంగా వుందని కనుక పాండవులు అక్కడే వుంటారని వారు అభిప్రాయపడ్డారు.
సుశర్మ అనే త్రిగర్తదేశపు రాజు అనేకసార్లు మత్స్యదేశముపై దండయాత్రచేసి కీచక విరాటుల చేతులలో పరాజితుడైనాడు. కీచకుడు గంధర్వుని చేతిలో హతమైనాడు, కనుక విరాటుని గోవులను సంగ్రహిస్తే విరాటుని రక్షించటానికి పాండవులు బయటకు వస్తారని అప్పుడు వారి జాడను పసిగట్టి మరలా అరణ్యవాసానికి పంపవచ్చునని తెలియచేస్తాడు.
అతని ఆలోచనను అంగీకరించిన దుర్యోధనుడు విరాటుని గోవులను గ్రహించాలని నిశ్చయించాడు. మొదటగా సుశర్మ దక్షిణదిశగా వెళ్ళి గోగ్రహణం చేస్తాడు. ఇది విన్న విరాటరాజు గోవులను కాపాడటానికి బయలుదేరాడు.
విరాటుడు చారుల ద్వారా సుశర్మ గోగణాలతో ఎటు వెళుతున్నాడో తెలుసుకుని అటు వైపు తన సేనలను నడిపించాడు. విరాటుని తమ్ముళ్ళు శతానీకుడు, మదిరాశ్వుడు, సూర్యదత్తుడు తమతమ సేనలతో విరాటుని వెంబడించారు. విరాటుని కుమారుడు శంఖుడు కూడా తన శంఖాన్ని భయంకరంగా పూరిస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యాడు.
కంకుభట్టుగా వున్న ధర్మరాజు తన తమ్ములైన వలలుడు ( భీముడు), తామ్రగ్రంధి (నకులుడు), తంత్రీపాలుళ్ళను ( సహదేవుడు) విరాటరాజు వెంట పంపాడు. ఒకానొక సందర్భంలో విరాటుడు, సుశర్మ చేతిలో బంధీగా చిక్కుతాడు. అప్పుడు వలలుడు సుశర్మను ఓడించి బంధిగా చేస్తాడు. ధర్మజుని సోదరులు దక్షిణగోగ్రహాణాన్ని భగ్నము చేస్తారు.
విరాటుడు దక్షిణగోగ్రహణ రక్షణకై వెళ్ళినపుడు దుర్యోధన, దుశ్శాసన, భీష్మ, ద్రోణాదులు ఉత్తరగోగ్రహణం చేస్తారు. బృహన్నల రథసారధిగా ఉత్తరకుమారుడు యుద్ధానికి వెళ్ళడము ఆ తరువాత ఏమి జరిగిందో మనకు తెలుసు.
గోగ్రహణ కాలానికి ఆశ్వయుజ శుక్ల పక్ష అష్టమి తిథి నాటికే పాండవుల అజ్ఞాతవాసము ముగిసింది. ఈ సంగతి తెలుసుకోలేక సుయోధనుడు గోగ్రహణానికి పాల్పడ్డాడు.
............................................... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి