19, ఏప్రిల్ 2022, మంగళవారం

రామాయణానుభవం_ 33

 🌹రామాయణానుభవం_ 33


రాముడు అడవులకు వెళ్ళి అయిదు రాత్రులు గడిచాయి. అయిదు సంవత్సరాలు అయినట్టుగా ఉంది నా ప్రాణానికి,అని దశరథుడు అంటుండగా

సూర్యుడు అస్తమించాడు. చీకట్లు అలము కున్నాయి. రాజు విలపించి విలపించి మూర్ఛపోయాడు. నిద్రపట్టింది. అర్ధరాత్రిలో మెలకువ వచ్చింది.  కౌసల్యా ! అన్నాడు......


నిన్ను వివాహం చేసుకోకముందు, నేనప్పటికి ఇంకా యువరాజును. ఒక వర్షరుతువులో సరయూ నదీతీరానికి వేటకు వెళ్ళాను. రాత్రిపూట. ఆ నదిలోకి ఏనుగు దిగిన చప్పుడు అయ్యింది. నేను వెంటనే ఘోరశరం సంధించి ఆ శబ్దం వచ్చిన వైపు విడిచిపెట్టాను. హాహాకారాలు చేస్తూ ఒక మనిషి నీటిలోకి పడిపోయిన చప్పుడు వినిపించింది.

అయ్యో! నాలాంటి తపస్విమీద బాణం వేసింది ఎవరు? దాహం తీర్చుకోడానికి ఇటు వచ్చాను. ఇది ఎవరి బాణం నన్ను కొట్టింది ఎవరు? నేను ఎవరికి ఏమి అపకారం చేసాను? వృద్ధులైన నా తల్లిదండ్రులకు ఇంక దిక్కెవ్వరు

మాటలు వినిపించాయి. నా హృదయం క్షోభించింది. చేతిలోంచి ధనుర్భాణాలు జారిపోయాయి చాలాసేపు నిశ్చేష్టంగా ఈ నిలబడిపోయాను. నెమ్మదిగా ఆ మాటలు వినిపించిన చోటుకు చేరుకున్నాను. దెబ్బతిని పడి ఉన్న తాపసకుమారుణ్ని చూసాను అతడు నన్ను దహించివేస్తున్నట్టు చూసాడు.


రాజా! నీకు నేను ఏమి అపకారం చేసాను? నా జననీ జనకులకోసం నీళ్ళు తీసుకువెడదామని వచ్చాను. ఇలా కొట్టావు ఈ ఒకే బాణంతో నన్ను మాత్రమే కాదు, అంధులూ వృద్ధులూ అయిన నా తల్లిదండ్రుల్ని కూడా సంహరించావు. నేనిక్కడ ఇలా పడి ఉన్నాననే సంగతి మాత్రం నా తండ్రికి ఎలా తెలుస్తుంది? తెలిసిమాత్రం ఏం చెయ్యగలడు? ఓ రాజా నువ్వే త్వరగా వెళ్ళి చెప్పు. మా తండ్రి కోపించాడంటే అగ్నిలా దహించివేస్తాడు. మా ఆశ్రమం ఇక్కడికి దగ్గరే.చెప్పి బతిమాలుకో. రాజా ! ఈ బాణం నా గుండెల్లోనుండి తెసేయ్. ఇది నన్ను బాధిస్తోంది. అని ఆమునిబాలకుడు అభ్యర్థించాడు. బాణం ఉంటే బాధిస్తోంది. బాణం పెరికివేస్తే ప్రాణాలు పోతాయి. ఏంచెయ్యాలో నాకు తోచలేదు. గుండెలు చిక్కబట్టుకుని ధైర్యం తెచ్చుకున్నాను. మునికుమారా! బ్రహ్మహత్యా మహాపాతకం నుంచి నన్ను రక్షించు అని ప్రాధేయ పడ్డాను. ఓ మహారాజా ! నేను బ్రాహ్మణుడను కాను. ఒక శూద్ర స్త్రీ కి వైశ్యుని వల్ల జన్మించాను. అంటూ బిడ్డడు బాధతో విలవిలలాడిపోయాడు. నేను బాణం పెకలించాను. మునికుమారుడు నా చేతుల్లోనే ప్రాణాలు వదిలేసాడు.


నీటి కుండను తీసుకొని ఆ ముని బాలుడు చెప్పిన ఆశ్రమానికి వెళ్ళాను. ఆ వృద్ధ దంపతులు ఆలస్యానికి తగిన కారణాలు పరి పరి విధాల ప్రశ్నించారు.ధైర్యం కూడదీసుకుని నేను పెదవి విప్పాను. జరిగిపోయిన మోరం విన్నవించాను. ఇది నా అజ్ఞానంవల్ల జరిగింది. క్షమించమని వేడుకొన్నాను. నమస్కరించి నిలబడ్డాను.


వృద్ధుల దుఃఖానికి అంతంలేకుండా పోయింది. మహారాజా ! ఇంతటి పాపం నువ్వు తెలిసిచేస్తే ఈ పాటికి నీ తల ఆ వెయ్యిముక్కలై ఉండేది. తెలియక చేసావుకాబట్టే ఇంకా జీవించి ఉన్నావు. మమ్మల్ని మా కుమారుడి దగ్గరికి తీసుకువెళ్ళు అన్నాడు అంత దుఃఖంలోనూ ఆ మహర్షి. నేను ఆ ఇద్దరినీ నడిపించుకుని అక్కడకి నదీతీరానికి  తీసుకువెళ్ళాను. పరిపరివిధాల తలుచుకుని తలుచుకుని వృద్ద దంపతులు శోకించారు. వారి తపశక్తి వల్ల మునిబాలుడు దివ్యవిమానం అధిరోహించి స్వర్గస్థుడయ్యాడు. వారు తర్పణాలు విడిచిపెట్టారు. అప్పుడు ఆ వృద్ధతాపసి నన్ను శపించాడు- నాలాగానే నీకూ

పుత్రశోకం కలుగుతుంది. దానితోనే కాలంచేస్తావు - అన్నాడు.ఇలా నన్ను శపించి ఆ ఇద్దరూ చితిని పేర్చుకొని దివంగతులయ్యారు.


 కౌసల్యా! అదిగో ఆ శాపఫల-

అనుభవిస్తున్నాను. 

ఈ పుత్రశోకంతోనే నేను మరణిస్తాను. ఇదే నాకు చివరి రోజు. దేవీ! ఒక్కసారి నన్ను స్పృశించు - అంటూ దశరథుడు బోరున విలపించాడు......

**


దశరథుడు శాప వృత్తాంతాన్ని కౌసల్య తో చెప్పి బోరున విలపించాడు....


దేవీ! ఈ చివరి ఘడియల్లో నా రాముణ్ణి చూడలేకపోతున్నానే అనేది మరీ బాధగా ఉంది. అదే ప్రాణాలను పెకలించి వేస్తోంది. హా రామా! ఓ రాఘవా ! హా నాథా ! హా ప్రియపుత్రా! అని బిగ్గరగా అరుస్తూ రాముణ్ని ధ్యానిస్తూ కౌసల్యాసుమిత్రల

సన్నిధిలో దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. కౌసల్యా సుమిత్రలు మూర్ఛపోయారు.


అర్ధరాత్రి గడిచింది. తెల్లవారింది. వందిమాగధులు యథావిధిగా వచ్చారు. స్తోత్రపాఠాలూ చేసారు. మంగళవాద్యాలు మ్రోగాయి. కానీ దశరథుడు నిద్రలేవలేదు. తక్కిన అంతఃపురకాంతలు శంకిస్తూ లోపలికి వెళ్ళారు. మూర్ఛపోయిన కౌసల్యా సుమిత్రలనూ, ప్రాణాలు విడిచిపెట్టిన దశరథుణ్నీ చూసారు. ఒక్కపెట్టున రోదించారు. మూర్ఛదేరిన కౌసల్య, రాజు శిరస్సును ఒడిలో పెట్టుకుని కైకేయిని దారుణంగా తిట్టిపోసింది


వార్త నగరమంతటా గుప్పుమంది. చల్లారిన అగ్నిలాగా, ఇంకిపోయిన సముద్రంలాగా, కాంతిలేని సూర్యునిలాగా దశరథుడు పడివున్నాడు.


మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు,, గౌతముడు, జాబాలి - వీరంతా వసిష్ఠుని నాయకత్వంలో సమావేశమయ్యారు. దశరథుని పార్థివ దేహాన్ని తైల ద్రోణి లో భద్రపరచారు.


 భరతశత్రుఘ్నులు కేకయుని దగ్గర ఉన్నారు. రాజు మరణించాడు. అరాజకం వచ్చింది ఇది ప్రజలకు దేశానికీ క్షేమంకాదు. కాబట్టి తక్షణ కర్తవ్యం ఆలోచించమని అందరూ వసిష్టుణ్ణి ప్రార్ధించారు. జవనాశ్వాలపై వేగంగా వెళ్ళి రాగలిగిన దూతలను ఆహ్వానించాడు వసిష్ఠుడు


దూతలారా ! మీరు వెంటనే బయలుదేరి త్వరగా కేకయ రాజధాని చేరుకోండి. దు:ఖం ఏమా త్రమూ మీ ముఖాల్లో కనపడకూడదు సుమా. భరతుడితో నా మాటగా కుశలం అడగండి. తరవాత- అత్యవసర కార్యక్రమం ఉంది, వసిష్ఠులవారు నిన్ను వెంటనే రమ్మన్నారు, అని చెప్పండి. రామవనవాసం కానీ మహారాజు మరణం కానీ ఇవియేవీ అతడికి చెప్పవద్దు. విలువైన అభరణాలూ వస్రాలూ కేకయులకూ భరతుడికీ బహుమానాలుగా తీసుకువెళ్ళండి. త్వరగా తీసుకురండి.


వసిష్ఠుని ఆజ్ఞను శిరసావహించి ఆ దూతలు బయలుదేరారు. హస్తినా పట్టణం దగ్గర గంగను దాటి తూర్పుగా ప్రయాణించి

పాంచాలదేశాలనూ, కురుజాంగల భూముల్నీ, శరదండా నదినీ, బాహ్లీకదేశాన్నీ, సుదామ పర్వతాన్నీ, విపాశా శాల్మలీ గిరిప్రజాలనూ త్వరత్వరగా దాటి రాత్రికి కేకయ రాజధాని చేరుకున్నారు.


సరిగ్గా ఇదే సమయం లో భరతుడికి పీడకల వచ్చింది,అది  చెబుతుండగానే

భరతుడు ఇలా చెబుతుండగానే వసిష్ఠ దూతలు సభలోకి ప్రవేశించారు. రాజుకు పాదాభివందనం చేసారు. భరతుడితో మాట్లాడారు. కుశల ప్రశ్నలయ్యాయి. వసిష్ఠుడు చెప్పమన్న రెండు ముక్కలూ జాగ్రత్తగా యథాతథంగా చెప్పారు. బహుమతులు అందించారు. దశరథమహారాజు క్షేమమా అంటూ మొదలుపెట్టి భరతుడు కుశల ప్రశ్నల వర్షం కురిపించాడు.  మా తల్లి కైకేయికి కుశలమే కదా ! ఏమయినా నాకు చెప్పమన్నదా అనికూడా అడిగాడు.


భరతుడు కేకయ మహారాజు దగ్గర సెలవు తీసుకున్నాడు. నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరాడు. కేకయ మహారాజు విలువైన బహుమతులు ఇచ్చి గుర్రాలనూ, ఏనుగులనూ, రక్షణగా కొంతసైన్యాన్నీ ఏర్పాటుచేసి భరత శత్రుఘ్నులను సాగనంపాడు. మేనమామ యుధాజిత్తు దగ్గర సెలవు తీసుకొని ఇద్దరూ రథం ఎక్కారు. తూర్పు ద్వారంనుంచి రథం కదిలింది. వాయువేగంతో ప్రయాణం సాగింది. కేకయుడిచ్చిన ఏనుగులూ గుర్రాలూ సైన్యమూ వెనకబడ్డాయి. దగ్గిరదారిని ఏడురాత్రులు ప్రయాణించి అయోధ్య చేరుకున్నాడు. అల్లంతదూరంలో అయోధ్యను చూసాడు. వెలాతెలా పోతోంది. (పాండు మౌక్తికంలాగా ఉంది) మునుపటిలా కోలాహలం వినిపించడం లేదు. ఉద్యానాలు ఖాళీగా ఉన్నాయి. నగరంలాగా లేదు అరణ్యంలా భాసించింది. ఇదేమిటి సారథీ! అని భరతుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు,వీధులలో అలికిడిలేదు. నిర్మానుష్యంగా ఉన్నాయి. అపశకునాలు ఎదురవుతున్నాయి. రాజప్రాసాదం చేరుకున్నాడు. ద్వారపాలకులు లేచి నిలబడి జయం పలికారు లోపలికి రథం సాగింది. మనస్సు వికలమవుతోంది. రాజు మరణిస్తే రాజధాని ఎలా ఉంటుందో మునుపు విని ఉన్నాడు. ఇప్పుడు

అదే ఆకారం, అదే వాతావరణం కనపడుతోంది. సారథీ! ఏమిటి ఇదంతా? అన్నాడు,ఇలా అంటూనే రాజ భవనం చేరాడు .....

కామెంట్‌లు లేవు: