19, ఏప్రిల్ 2022, మంగళవారం

రామాయణానుభవం_ 31

 🌹రామాయణానుభవం_ 31


లక్ష్మణా ! సూర్యోదయమవుతోంది. రాత్రి గడిచిపోయింది. అదిగో విను. నల్లకోయిల కూస్తోంది. నెమళ్ళ కూతలు వినబడుతున్నాయి. సౌమ్యుడా! వేగంగా ప్రవహిస్తున్న ఈ గంగానదిని దాటుదామా!


సౌమిత్రి సూచనను అందుకుని గుహుడు క్షణంలో నావను సిద్ధం చేయించాడు. రామలక్ష్మణులు ధనుఃఖడ్గాలను

యథావిధిగా ధరించి సీతతో నావను చేరుకున్నారు.


నేను ఏమి చెయ్యను? - నమస్కరిస్తూ నిలబడి అడిగాడు సుమంత్రుడు. రాముడు తన కుడిచేతితో సుమంత్రుణ్ని స్పృశిస్తూ....


సుమంత్రా! నువ్వు శీఘ్రంగా వెనక్కి వెళ్ళు. అయోధ్య చేరుకో. రాజుగారి సన్నిధిలో అప్రమత్తుడుగా సేవచేస్తూ ఉండు రాజాజ్ఞగా ఇంతవరకూ చేయవలసింది చేశావు. ఇంక తిరిగి వెళ్ళు. రథం విడిచిపెట్టి మేము కాలినడకతో అరణ్యాలలోకి వెడతాం


రామా! నువ్వు అడవులపాలయ్యావంటే - బ్రహ్మచర్యం, వేదాధ్యయనం, ఋజుత్వం, మృదుత్వం ఇవన్నీ వ్యర్థాలని భావిస్తున్నాను. రామా! దురదృష్టమంటే మాది. రేపటినుంచి పాపాత్మురాలూ దు:ఖభాగినీ అయిన కైకేయికి వశులం కాబోతున్నాం మాటమాటకు కళ్ళు తుడుచుకుంటూ విలపిస్తున్నాడు సుమంత్రుడు. అతణ్ని ఓదార్చడానికి రాముడు మళ్ళీ మళ్ళీ

మధురంగా మాట్లాడాడు.


సుమంత్రా! ఇక్ష్వాకు వంశస్థులకు నీకంటే మిత్రుడులేడు. దశరథుడు నా విరహంతో దుఃఖించకుండా ఉండేట్టు చూడు ఆయన వృద్ధుడు. పైగా కామభారంతో ఉన్నాడు. అందుకని నీకు మరీమరీ చెబుతున్నాను. కైకేయికి ప్రియం చెయ్యడంకోసం మహారాజు ఏది ఆజ్ఞాపిస్తే అది చెయ్యండి. అన్నివేళల్లోనూ తమ మనోరథం నెరవేరడం కోసమే మహారాజులు రాజ్యాలను ఏలుతూ ఉంటారు. కాబట్టి ఆయన సంతోషించేట్టు ప్రవర్తించు. మహారాజుతో నా మాటగా ఇలా చెప్ప - అయోధ్యను విడిచిపెట్టామని గానీ, వనాల్లో నివసించవలసి వచ్చిందనిగానీ మా ముగ్గురిలో ఎవ్వరూ దుఃఖించడం లేదని చెప్పు. పధ్నాలుగేళ్ళు గడిచాక మళ్ళీ మమ్మల్ని చూసి సంతోషించవచ్చని చెప్పు. కౌసల్యాదేవికి మేము ముగ్గురూము పాదాభివందనాలు చేసామని విన్నవించు. 


భరతుణ్ని త్వరగా రప్పించమని మహారాజుకు చెప్పు. భరతుడు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాక నువ్వు ఈ దుఃఖాన్ని మరచిపోతావు. 

భరతుడితో ప్రత్యేకంగా చెప్పు - రాజుగారినే కాదు కౌసల్యనూ సుమిత్రనూకూడా కైకేయితో సమంగా జాగ్రత్తగా చూసుకోమను.


సుమంత్రుడు దీనంగా బహువిధాలుగా యాచిస్తున్నాడు. 


భృత్యులపట్ల దయ కలిగిన రాముడుమాత్రం చలించలేదు సుమంత్రా! నీ భక్తినీ వాత్సల్యాన్ని నేను ఎరుగుదును. అయినా ఎందుకు తిరిగి వెళ్ళమంటున్నానంటే - నిన్ను చూసి కైకేయి సంతోషిస్తుంది. రాముడు అడవులకే వెళ్ళిపోయాడులే అని విశ్వసిస్తుంది. మహారాజును అసత్యవాదిగా శంకించదు. భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి, కైకేయి కోరిక తీరాలి అనేది నా మొదటి సంకల్పం. అందుచేత నా ప్రియం కోసం, దశరథుడి ప్రియం కోసం నువ్వు రథంతో సహా అయోధ్యకు వెళ్ళు. ఎవరెవరికి ఏమేమి చెప్పమన్నానో ఆవన్నీ జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళి చెప్పు.


గుహుడా ! ఇలా జనస్థానాల్లో ఉండడం నాకు యోగ్యంకాదు. ఆశ్రమాలకు వెళ్ళిపోవడం నా కర్తవ్యం. జడలు కట్టుకుని వెళ్ళిపోతాం. మర్రిపాలు తెప్పించు

గుహుడు వెంటనే తెప్పించాడు. అవి ఇద్దరూ జుట్టుకు పట్టించుకుని జడలు కట్టించుకున్నారు. పూర్తిగా ఋషులైపోయారు రాముని ఆజ్ఞమేరకు లక్ష్మణుడు ముందుగా నావ ఎక్కాడు. సీతను ఎక్కించాడు. తరువాత రాముడు ఎక్కాడు. రాముని అనుమతితో గుహుని అజ్ఞతో నావికుడు  నావను కదిలించాడు. సుమంత్రునికీ సేనాసహితుడైన గుహునికీ రాముడు వీడ్కోలుపలికాడు.

**


గుహుడు తెప్పించిన నావలతో రాముడు సీత లక్ష్మణుడు నదీ మధ్యభాగానికి చేరుకొంది.భక్తి భావం తో సీతా దేవి గంగానదికి నమస్కరించింది.నీవు త్రిపథగవు. బ్రహ్మలోకం చూచినదానవు. సముద్రరాజుకు ఇల్లాలివి. నాభర్త క్షేమంగా తిరిగి వచ్చి రాజ్యం పొందేటు ఆశీర్వదించు. నీకు ప్రియంగా లక్షగోవులూ, అనేకవస్త్రాలూ బ్రాహ్మణులకు సమర్పిస్తాను. కల్లుకుండలతో మాంస భోజనాలతో నీకు సమర్పణ చేయిస్తాను. నిన్నేకాదు నీ తీరాలలో నివసించే సకల దేవతలను పూజిస్తాను.ముగ్గురూ అవాలిగట్టుకు చేరారు.


లక్ష్మణా! సజనమో విజనమో ఈ అరణ్యంలో రక్షణ బాధ్యతలు నువ్వే చేపట్టాలి. నువ్వు ముందు నడు. సీత నీ వెనక నడుస్తుంది. ఆ వెనక్కాల నిన్నూ సీతనూ కాపాడుతూ నేను నడుస్తాను. మనం పరస్పరం రక్షించుకోవాలి. ఇక ఇప్పటినుండి వనవాసక్లేశం ఏమిటో సీతకు తెలుస్తుంది. పల్లాలూ కనబడరు.క్షేత్రాలూ, ఆరామాలూ ఉండవు.


కొంత దూరం నడిచాక సాయత్రం అయింది సంధ్యావందనం చేసి ఆహారాన్ని స్వీకరించారు ముగ్గురు.


తమ్ముడూ ! మహారాజు ఈ పాటికి దుఃఖించి దుఃఖించి నిద్రపోయి ఉంటాడు. కోరిక తీరిందని కైకేయి సంతోషిస్తూ

ఉంటుంది భరతుడు వచ్చి ఉంటాడు. రాజ్యం కోసం కైకేయి మహారాజు ప్రాణాలను పీక్కుతినడం మానేసి ఉంటుంది. మహారాజు వృద్ధుడు. నేనుకూడా వచ్చేసా అనాథుడు. ఏమిచేస్తాడు పాపం. కామార్తుడై కైకేయికి వశుడైపోయాడు. మనకు కలిగిన ఈ కష్టాలూ, మహారాజుకు కలిగిన మతివిభ్రమముూ చూసాకనాకుకు అనిపిస్తోంది అర్ధధర్మాలకంటే కామమే గొప్పది అని. నాలాంటి అనుకూలుడైన కొడుకును దశరథుడు తప్ప మరింక ఏ తండ్రి అయినా, ఎంత తెలివి తక్కువవాడయినా వదులు కుంటాడంతావా?


*అర్థధర్మే పరిత్యజ్య యః కామ మనువర్తతే*

*ఏవ మాపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా*


అర్ధర్మాలను విడిచిపెట్టి కామాన్నే సేవించినవాడు దశరథుడిలా ఆపదలపాలు కాక తప్పదు.


లక్ష్మణా! నా కారణంగా సుమిత్రాదేవికి దుఃఖాలు కలగకుండుగాక! నువ్వు వెంటనే అయోధ్యకు వెళ్ళు. నేనొక్కణ్నే సీతతో దండకారణ్యాలకు వెడతాను. అయోధ్యలో నా తల్లికి కూడా నువ్వే దిక్కుగా ఉండు. కైకేయి క్షుద్రురాలు. ద్వేషంతో అన్యాయం చేస్తుంది. మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. ఎదిగి చేతికి అందివచ్చి సుఖపెట్టవలసిన సమయంలో విడిచి వచ్చేసాను నాలాంటి కొడుకును ఏతల్లీ కనకూడదు. మా అమ్మ దురదృష్టవంతురాలు. మళ్ళీ శోకసాగరంలోనే మునిగి పోయింది.


ఇలా రాముడు ఏవేవో మాట్లాడుతూ, ఆ రాత్రివేళ ఆ విజనారణ్యంలో దుఃఖిస్తూ ముఖమంతా కన్నీరు అలుముకొనగా కొంతసేపటికి విరమించి విశ్రమించాడు. చల్లారిన అగ్నిలా ఉన్నాడు. సద్దుమణిగిన సముద్రంలా ఉన్నాడు. లక్ష్మణుడు ఎంతగానో ఓదార్చాడు


పురుషోత్తమా! నిజమే. ఇవ్వేళ అయోధ్య వెలావెలాపోతూ ఉంటుంది. చంద్రుడు అస్తమించిన రాత్రిలా ఉంటుంది ఓ కానీ నువ్వు ఇలా దుఃఖించడం నిష్ప్రయోజనం. నన్నూ సీతనూ మరింత దుఃఖింపజేస్తున్నావు. మేము ఇద్దరం నిన్ను విడిచిపెట్టి క్షణకాలం కూడా జీవించం. ఒడ్డునపడిన చేపలం అయిపోతాం. తండ్రినిగానీ తల్లినిగానీ శత్రుఘ్నుణ్నిగానీ చూడాలనే కోరిక నాకు లేదు. నువ్వు లేనిదే స్వర్గమయినా నాకు అవసరం లేదు.


మెల్లగా తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. ముగ్గురూ అక్కడినుంచి బయలుదేరారు. గంగాయమునల

సంగమస్థలంవైపు నడకసాగించారు. ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ మధ్యాహ్నానికి ప్రయాగ చేరుకున్నారు. సమీపం లో భారద్వాజాశ్రమం....


[ *న చ సీతా త్వయా హీనా*

*నచాహ మపి రాఘవ ముహూర్త మపి జీవావో*

*జలా న్మత్స్యా వివో ధృతౌ* ||


శ్రీరామచంద్రా! నీవు లేనిదే సీతమ్మ బ్రతుకదు, నేను కూడ నీవు లేనిచో జీవించను, ఒకవేళ జీవించినచో నీటి నుండి ఒడ్డు పైకి తీయబడిన చేపలు వలె క్షణకాలము జీవింతుమేమో.


వాల్మీకి రచన లో అద్భుత శ్లోకం.పరమాత్మ పట్ల జీవుడు స్థితిని తెలిపే శ్లోకం గా పెద్దలు  విశేషం గా కొనియాడుతారు.]

కామెంట్‌లు లేవు: