19, ఏప్రిల్ 2022, మంగళవారం

రామలింగడి సమయస్ఫూర్తి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹


*🌷రామలింగడి సమయస్ఫూర్తి!🌷*                       

                🌷🌷🌷

తెనాలి రామలింగడంటే శ్రీకృష్ణదేవరాయలకు చాలా ఇష్టం.


ముఖ్యంగా ఆయన  హాస్య చతురత అంటే మరీనూ. ఎదుటి వారు ఎంతటి ఒత్తిడిలో ఉన్నా సరే... రామలింగడు ఇట్టే నవ్విస్తాడు. అదే సమయంలో కవ్విస్తాడు కూడా! ఎప్పుడన్నా సభకు తెనాలి రాకుంటే, ఆ రోజంతా ఏదో వెలితిగా ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ రోజు సభను తొందరగానే ముగించేవాడు.


ఇలా ఉండగా ఓ రోజు సభకు తెనాలి రామలింగడు దోషిగా వచ్చాడు. ఆయన మీద రాయలవారికి ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు చేసింది వేరెవరో కాదు.. రామలింగడి భార్యే! ఏదో విషయమై రామలింగడికి, ఆయన భార్యకు మధ్య మాటామాటా పెరిగి.. చివరికి కోపంతో ఆమె శ్రీకృష్ణదేవరాయల వారికి ఫిర్యాదు చేసింది.


ఈ ఫిర్యాదు స్వీకరించడం వ్యక్తిగతంగా రాయలవారికి ఇష్టంలేదు. అయినా రాజుగా తన విధి తాను నిర్వర్తించాలి కాబట్టి తప్పలేదు. అయిష్టంగానే శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగడిని విచారణకు పిలిపించాడు.


ముందు తెనాలి రామలింగడి భార్య తన వాదనను వినిపించింది. అవన్నీ చిన్న చిన్న విషయాలే. పెద్దగా తప్పు పట్టడానికి కూడా లేదు. మొత్తం శాంతంగా విన్న రాయలవారు 'నువ్వు ఏమైనా చెప్పుకునేది ఉందా?' అని రామలింగడిని అడిగాడు.

'నా భార్య చెప్పేదంతా నిజం కాదు. నేను నా భార్యను చాలా అపురూపంగా చూసుకుంటాను. తనంటే నాకు చాలా ఇష్టం. మా ఇంటిపేరులోనే మా వంశం వారికి భార్యంటే ఎంత ఇష్టమో ఉంటుంది' అన్నాడు తెనాలి రామలింగడు. రాయలవారు, సభలో ఉన్నవారు, ఆఖరుకు తెనాలి రామలింగడి భార్య కూడా విస్మయానికి గురయ్యారు.


'అదెలాగో చెప్పగలవా?' అని రాజు మరో ప్రశ్న సంధించాడు. 'తప్పకుండా ప్రభూ..! నా భార్య తేనెలా స్వచ్ఛమైనది, మధురమైనది, శ్రేష్ఠమైనది అనే అర్థం వచ్చేలా మా ఇంటి పేరు తేనె ఆలి. అంటే తేనె వంటి భార్యను కలిగి ఉన్నా అని అర్థం. అదే రానురానూ తెనాలిగా మారింది' అని చెప్పాడు.


ఇది విన్న వెంటనే అప్పటి వరకు కోపంగా ఉన్న తెనాలి రామలింగడి భార్య ముఖంలో చిరునవ్వు, సిగ్గు ప్రత్యక్షమయ్యాయి. ఆమె ముసిముసిగా నవ్వుతూ.. 'మహారాజా! మన్నించండి. నేను నా ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నా' అంది.

సమస్య ఇంత సులువుగా పరిష్కారం కావడంతో శ్రీకృష్ణదేవరాయలు వారిద్దరికీ కానుకలు ఇచ్చి పంపించారు.


ఇంతలో రాయలవారికి ఓ అనుమానం వచ్చింది. మరుసటి రోజు ఉదయం నడకలో.. 'అవును తెనాలి రామలింగా! నీకు అంత లౌక్యం, సమయస్ఫూర్తి ఉన్నాయి కదా... మీ దంపతుల సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చుగా... నా వరకు ఎందుకు తెచ్చినట్లు' అని అడిగాడు.


'మహారాజా! భార్యభర్తల గొడవలు తాటాకు మంటల్లాంటివి. అంతెత్తున ఎగసి, చప్పున చల్లారతాయి. చిన్న చిన్న విషయాలకే ఫిర్యాదుల వరకు వెళ్లొద్దు అని లోకానికి చాటిచెప్పడం కోసమే... సమస్యను మీ వరకు రానిచ్చాను. మన్నించండి' అన్నాడు రామలింగడు. తెనాలి తెలివిని మరోసారి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు శ్రీకృష్ణదేవరాయలు.

కామెంట్‌లు లేవు: