29, మే 2022, ఆదివారం

సాధకుడు- సంసారం

సాధకుడు- సంసారం 

అనాదిగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉదయిస్తున్న సందేహం ఏమిటంటే సాధకునికి సంసారం ప్రతిబంధకమా?? ఇది ఏ ఒక్క సాధకుని సమస్య కాదు జ్ఞ్యానాన్వేషణలో ప్రయాణించే ప్రతి సాధకుని హృదయంలో తలెత్తే ప్రశ్న. నేను ఒక ప్రశ్న వేస్తాను, వంటచేసె  తల్లికి చంకలోని శిశువు ప్రతిబంధకమా  కాదా. దీనికి సమాధానం కాదు అంటే ఫై ప్రశ్నకు కూడా కాదు అని చెప్పాలి. లేక అవును అయితే దానికి కూడా అవును అని చెప్పాలి. నిజానికి ప్రతి తల్లికి తమ సంతానం మీద అపారమైన ప్రేమ ఉండటం కద్దు.  అలాఅని చంకలో పిల్లవానిని ఎత్తుకొని వంటపని చేయలేదు కదా.  కాబట్టి ఆ తల్లి ఆ పిల్లవానికి ఏదైనా ఆటవస్తువు ఇచ్చి వానిని ఏమార్చి తనపని తాను చేసుకుంటుంది.  కానీ సాధకుని విషయంలో ఆలా సంసారాన్ని ఏమార్చి తన సాధన తాను చేసుకోలేడుకదా సంసారం అంటే చాలా బాద్యతాయుతమైనది.  నిజానికి రోజులో చాలా సమయం భార్య పిల్లల విషయంలోనే గడపాల్సి వస్తుంది. ఇల్లు అంటేనే పనులు, సమస్యలు. మన మహర్షులు సంసారాన్ని సాధకుడు తామరాకు మీద నీటి బిందువులా వుంటూ జీవించాలని చెప్పారు.  కానీ అది ఎంతవరకు ఆచరణ సాధ్యము అనేది ప్రశ్నర్ధకం. 

స్థిత ప్రాజ్ఞుడిగా జనక మహారాజును పేర్కొంటారు. అలా ఇప్పుడు మనం ఎంతవరకు ఉండగలం అంటే అది ఎంతమాత్రం వీలుకాదు అని చాలామంది అనవచ్చు. ఆధునిక విజ్ఞనాభివృద్దితో పాటు సగటు మనిషి అవసరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక్కప్పుడు భోగప్రదంగా వున్నది ఇప్పుడు అవసరంగా మారుతున్నది. మనిషి చుట్టూ వున్న  సమాజం, అతని జీవన సరళి మనిషిని రోజులో చాలా సమయాన్ని వివిధ విషయాలమీదికి  మళ్ళిస్తుంది.  గతంలో ఒక సంసారికి దొరికే తీరిక సమయం ఇప్పుడు మనుషులకు కరువు అయ్యింది.  అటువంటప్పుడు దైవ చింతనకు సమయం కేటాయించటం దుర్లభమైపోతున్నది. ఒక వైపు జీవితంలో సౌకర్యాలు పెరిగాయి అంటున్న మరోవైపు సమయం దొరకకుండా పోతున్నది. 

జీవితం ఒక పరుగు పందెం: ఉదయం లేచిన దగ్గరనుండి ఏదో ఒక సమస్య ఇంట్లో సామానులు లేవని, నీళ్లు రావటం లేదని, కరంటు పోయిందని, అది పనిచేయడంలేదు, ఇది పనిచేయటంలేదా అని అనేక విధాలుగా సగటు సామాన్య సంసారి అనేక విధాల సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. రోజులో ఒక్క క్షణం కూడా తీరిక దొరకడంలేదు. ఇక మనస్సు దైవం మీదకు ఎలా మళ్లుతుంది. కాసేపు మనస్సు ప్రశాంతంగా ఉండాలని ఏదైనా గుడికి వెళితే అక్కడ మానసిక ప్రశాంతత విషయం అటుంచి అక్కడి వాళ్ళు అది కొను, ఇది కొను పూజకు ఇంతకట్టు కొబ్బరికాయను అంటకట్టు అని నిలువు దోపిడీ చేస్తున్నారు.  కొన్ని గుడులకు వెళితే గుడికి ఎందుకు వచమురా ఇంట్లోంచి దేముడిని మొక్కుకుంటే సరిపోయేదిగా అనే విధంగా తయారయ్యాయి.  గుడులు ఆధ్యాత్మిక కేంద్రాలుగా పూర్వం ఉండేవట.  మరి ఇప్ప్పుడు వ్యాపార కేంద్రాలుగా అవుతున్నాయని చెప్పటానికి బాధపడుతున్నాను. ఎంతసేపటికి గుడికి భక్తులను ఎలా ఆకర్షించాలి, భక్తులనుండి ఎలా డబ్బులు వాసులు చేయాలి అనే విషయం మీదే ఎక్కువ శ్రార్ధ చూపుతున్నారు. చక్కగా రోజుకు ఒక ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమం అంటే పురాణం కాలక్షేపం, హరికథ గానం, సంగీత కచేరీలు పెట్టి సందర్శకులను భక్తి, వైరాగ్య మార్గంలో నడిపిద్దామన్న ఆలోచన గుడి నిర్వాహకులకు లేకపోవటం  శోచనీయం. ఇక కొన్ని ప్రైవేట్ ఆధ్యాత్మిక కేంద్రాలు అని చెప్పుకునే సంస్థలు సంస్థ నిర్వాహక మండలిలో విభేదాలు, పోట్లాటలు, గొడవలు, కోర్టుల్లో కేసులు. ఇలా అయితే మన హిందువ సంస్కృతీ ఎలా పునరుద్ధరించ బడుతుంది అనేది సందేహాత్మకమే. 

ఇంట్లో ధ్యానం: ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేద్దామని కొందరు సాధకులు సదా కోరుకోవటం కద్దు.  దానికి ఉషోదయ కాలంలో నిద్రనుంచి మేల్కొనటానికి ఎంతమంది శరీరం సహకరిస్తుంది అనేది మొదటి ప్రశ్న అథవా నిద్రనుంచి లేచిన మనస్సు ఎంతవరకు స్థిరంగా ఉంటుందన్నది రెండవ ప్రశ్న.  నిద్రలేచిన దగ్గరినుండి రోజు అనేక జీవన వ్యాపారాలతో మునిగిన మనస్సు అవే ముద్రలు కలిగి వుంది ధ్యానంలో వాటిమీదే మనస్సు  పోతుంది. మనస్సుని ప్రస్తుత కాలంలో నిగ్రహించటం ఆ విశ్వామిత్రుని వల్ల కూడా కాదేమో. 

ఇల్లు గడవటం: ఈ రోజుల్లో ప్రతి వస్తువు ఖరీదు రోజు రోజుకి పెరిగి పోతున్నది. ఎంతోకష్ట పడితే తప్ప సగటు మానవుడు తన దినందిక అవసరాలను చేరుకోలేక పోతున్నాడు.  అటువంటి తరుణంలో సామాన్యు గృహస్తు తన జీవన అవసరాలమీద కాలాన్ని వెచ్చిస్తాడా లేక దైవ చింతనలో కాలం గడుపుతాడా, అంటే తప్పకుండ జీవన అవసరాలకే కాలాన్ని గడిపి మిగిలితే ఆ మిగిలిన సమయాన్ని దైవచింతనకు కేటాయించాలని అనుకోవటంలో తప్పులేదనిపిస్తుంది. ఈ సందర్భంలో ఆధ్యాత్మిక జగత్తులో వినిపించే ఒక కధ చూద్దాం. 

ఒకసారి నారద మహర్షి శ్రీ విష్ణుమూర్తి గారివద్దకు వచ్చి నారాయణ భూలోకంలో మానవులు మీ దివ్యనామ జపం చేయకుండా అనేక సాంసారిక విషయాలలో విలీనమై వుంటూ తమ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు వారిని మీరు ఉద్దరించాలి అని వేడుకుంటారు.  నిజమే మహర్షి మీరు చెప్పినట్లు వారు నన్ను మారుస్తున్నారు కానీ ఏమిచేద్దాము వారి కార్యకలాపాలు వారివి వారిని మనం ఎలా కాదనగలం అని  బదులిస్తారు. దానికి పరమాత్మా నేను త్రిలోక సెంచరీని అయి కూడా నిత్యం నారాయణ స్మరణ మారువను కదా మరి వారు కూడా వారి వారి పనులల్లో ఉండి కూడా నారాయణ నామ స్మరణ చేయవచ్చు కదా అని అంటారు. అప్పుడు స్వామి నారదమహర్హిని పరీక్షించనెంచి నారదా ఇదిగో ఈ బంగారు గిన్నెను తీసుకో దీనినిండా ఆముదము వున్నది దీనిలోంచి ఒక్క బిందువు కూడా జాగ్రత్తగా పట్టుకొని ఒకసారి మూడులోకాలు తిరిగి రాగలవు? అని అంటారు.  సరే స్వామి మీరు ఏ ప్రయోజనము ఆశించి నాకి పరిక్ష పెట్టారో తప్పక నేను మీరు చెప్పినట్లు చేస్తాను అని ఆ స్వర్ణ పాత్ర పట్టుకొని బయలుదేరుతారు.  మొదట్లో కొద్దీ కొద్దిగా నారాయణ స్మరణ వేగం తగ్గింది ఎందుకంటె ఇప్పుడు నారదులవారి మనస్సు తన చేతిలోని పాత్ర మీద వున్నది ఆలా ఆలా ఆ పాత్రను ఏకాగ్రతగా చూస్తూ అందులోంచి ఆముదం క్రింద పడకుండా జాగ్రత్తగా మూడు లోకాలు తిరిగి చివరకు వైకుంఠానికి చేరుకుంటారు.  అక్కడ శ్రీ మహావిష్ణువుని చేరుకొనే లోపు శ్రీ మహా లక్ష్మి ఎదురు పడుతుంది తల్లిని చూసి అమ్మ ప్రక్కకు తప్పుకోండి నేను ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా ఇందులోని ఆముదము తోణుకుతుంది అని అంటారు.  ఇదేమిటి మహర్షి ఇలా ఆ పాత్రను పట్టుకొని జాగ్రత్తగా నడుస్తూ బాహ్య స్మృతి లేకుండా  నడుస్తున్నారు అనగా దానికి  మహర్షి జరిగిన వృత్తాంతం మొత్తం వెల్లడించి నిశ్శబ్దంగా శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకొని స్వామి మీరు చెప్పినట్లుగానే ఈ పాత్రలోని ఆముదం తొణకకుండా తీసుకొని వచ్చాను అని అన్నారు నారదా ఇంజంగా ఆ పాత్రలోని ఆముదము ఒక్క చుక్క కూడా జారలేదా అని శ్రీ మహావిష్ణువు నారదుల వారిని అడిగారు లేదు  స్వామి నేను ఒక్క ఘడియ కూడా నాదృష్టిని పాత్రనుంచి తొలగించకుండా జాగ్రత్తగా పెట్టుకొన్నాను అని అన్నారు. అది సరే కానీ నారద నీవు ఎప్పుడు నాసన్నిధికి వచ్చిన నారాయణ,నారాయణ అని గానం చేస్తూ వచ్చేవాడివి కదా మరి ఇప్ప్పుడు నిశ్శబ్దంగా ఎలా వచ్చావు అని  అడిగారు. ఏమి చెప్పమంటారు స్వామి మీరు నాకు వప్పచెప్పిన పని (task ) అటువంటిది నా మనస్సు దీన్నే మీద తప్ప మరిదేనిమీద లేదు లేకుంటే ఎక్కడ ఆముదం తొణుకుతుందో అని దిగులు చేత పూర్తిగా గిన్నె నుండి మనస్సుని  మరల్చలేదు. అందుచేత నే నేను తమ దివ్య నామస్మరణ చేయకుండానే మీ సమక్షానికి వచ్చాను అని బదులు చెప్పారు. అప్పుడు స్వామివారు నవ్వి నారద నేను నీకు ఒక్క చిన్న పని చెపితేనే దానిలో లీనమై సదా స్మరించే నారాయణ నామాన్నే నీవు మరచి పూర్తిగా నీ జాసను గిన్నె మీదనే ఉంచావే మరి భూలోకంలో నిత్యము మానవుల మనస్సు  అనేక విషయం వాంఛలమీద వుండి ఉండటం చేత వారు దైవ స్మరణ మరవటంలో ఆశ్చర్యం ఏముంది అని చెపుతారు.  కాబట్టి మిత్రులారా సంసార జీవనం చేస్తూ సాధన చేయటం అనేది రెండు నావలా మీద ప్రయాణం  లాంటిది. అంటే గృహస్తు మోక్ష పిపాసి కాకూడదా గృహస్తు మోక్షానికి అర్హుడు కాదా అంటే కాదని చెప్పలేము కానీ ఒక సన్యాసి, ఒక అరణ్యంలో జీవనం చేసే యోగి, హిమాలయాలలో వుండే యతి తమ జీవన సాఫల్యం కేవలం కైవల్యంలోనే వున్నదని నమ్మి అహర్నిశలు అవిరామ కృషి చేస్తారు కాబట్టి వారికి మోక్షమ్ము కరతలామలకం అవుతుంది.  అదే నిత్యం అనేక జీవన  వ్యాపారాల్లో మునిగితేలే గృహస్తుకు అత్యంత శ్రమదమాలకు ఓరిస్తే తప్ప మోక్ష సిద్ది కలుగదు. 

సాధకుడు ఉషోదయకాలంలో నిద్రనుచి మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని సాధన చేస్తూ ధర్మబద్ధమైన జీవనం సాగిస్తూ ఉంటే కొంతవరకు మోక్షము సింద్దించటానికి వీలు  ఉండవచ్చు. 

ఇది ఇట్లా ఉండగా ఇంకొక విషయం సాధకునికి అవరోధంగా ఉండవచ్చు కూడా.  సాధకుడు నిధిజసలో ఉంటే బాహ్య స్మృతి కోల్పోవటం సర్వ సాధారణం.  సాధకునికి సామాజిక కట్టుబాట్లు నిరోధించలేవు.  అంటే చక్కగా దుస్తులు ధరించాలి, చక్కగా కేశాలంకరణ చేసుకోవాలి.  ఇతరులతో సఖ్యతతో గడపాలి ఇవ్వన్నీ కూడా సాధకుని సాధనకు అవాంతరాలుగానే చెప్పవచ్చు. నిధిజాసలో వున్నసాధకునికి బాహ్య స్పర్స్య, స్మృతి వుండవు కాబట్టి చూసే వారికి సాధకుని ప్రవర్తన వింతగా గోచరించవచ్చు. 

ఒకసారి సాధకుడు తన కుమారునితో కారులో వెళ్ళాడు.  కుమారుడు కారు డ్రైవు చేస్తున్నాడు.  పెట్రోల్ పోయించటానికి కారుని పెట్రోల్ బ్యాంకువద్ద నిలిపితే నిధిజాసలో వున్న సాధకుడు కారు దిగాడు.  అక్కడ అందరు మోటారు సైకిళ్ళు, కార్లు తీసుకొని వచ్చారు. సాధకునికి బాహ్య స్మృతి లేదు.  కారులో వున్నవాడు ఉండకుండా క్రిందికి ఎందుకు దిగాడు అని అడగవచ్చు దానికి సమాధానం సాధకుడు కూడా చెప్పలేడు.  ఒక స్కూటరిస్ట్ హారన్ కొట్టితే సాధకుడు గమనించలేదు.  నాన్న మీకు హారన్ సవుండు వినిపించలేదా అన్న పిలుపుతో స్మృహ లోకి వచ్చాడు సాధకుడు,  నాన్న శరీరం మాత్రమే అక్కడ వుంది నాన్న అక్కడ లేదని ఆ కుమారునికి తెలియదు కదా!.   ఇలా సమాజంలో వుంటూ నిధి జాసలో ఉండటం కుదురుతుందా 

నిది జాసలో వున్న సాధకుడిని ఒక ఉపమానంతో తెలుప ప్రయత్నిస్తాను.  ఇంటిలోని అన్ని తలుపులు తెరచి ఉంచి యజమాని ఇల్లు వదలి వెడలితే ఎలా ఉంటుంది.  అలానే నిధి జాసలో వున్న సాధకుని శరీరం కూడా అంతే మనిషి బాహ్య స్మృతి లేకుండా ఈ సమాజంలో సంచరించగలడా?  అటువంటి మనిషిని సమాజం ఆదరిస్తుందా. అన్నది ప్రశ్నర్ధకం.  పూర్తిగా సదా  స్మృతిలో వుండి (ever active )  వారినే ఏమార్చి మోసగించాలని చూసే ఈ మాయా సమాజంలో సాధకుడు మనగలడా? 

అరణ్యంలో జంతువులు సదా సాధకునికి (యోగులకు) అండగా ఉంటాయి.  ప్రక్రుతి పూర్తిగా సాధకునికి సహాయకారిగా ఉంటుంది.  అక్కడ సాధకునికి ఎలాంటి సామాజిక భాద్యతలు వుండవు.  యేవో కందమూలాదులు తింటూ ఎక్కడో గుహలో తన జీవితాన్ని గడిపే సాధకునికి మోక్షము కరతలామలకం అవుతుంది.  మరి సమాజంలో ఉండి గృహస్ట  జీవితం గడిపే సాధకునికి సాధన ఎంతవరకు సాగుతుంది.  అనేది ప్రతి సాధకుడు యోచించాలసిన అంశం.   ఆలా అని ప్రతి సాధకుని సన్యాసిగానో, మౌనిగానో మారమని నేననను. ప్రయత్నం చేయటం మానవ ధర్మం ఇక ఆపై దైవేచ్ఛ. ఇప్పటికి అనేక వందల సంవత్సరాలుగా తపమాచరించి తాపసులు హిమాలయాలలో వున్నారంటే ఆశ్చర్యపడ నవసరం లేదు. 

గృహస్తు సాధన చేయకూడదని నేననను.  కానీ గృహస్ట ధర్మం నిర్వహిస్తూ సాధన చేయటం అనేది మాత్రం కత్తిమీద సాము వంటిదే.  ఆలా అని సాధన మానకూడదు.

కాబట్టి సాదాకా ఇంకా జాప్యం చేయక ఇప్పుడే మేల్కొని జన్మ సార్ధకత చేసుకో 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

కామెంట్‌లు లేవు: