*అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా*
(ఎల్లనాడుల అమ్మనుడి పొద్దేడుక కైకట్టుగా)
.....*ఇన్ని మాతృభాషా దినోత్సవాలు అవసరమా*....
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా నాదొక చిన్న మాట .మనకు ఇన్ని మాతృభాషా దినోత్సవాలు అవసరమా !?అని ఆలోచిస్తే ,నిజంగా అవసరమే, ఎందుకంటే మనం ఎప్పుడూ జీవన సమరంలో జీతభత్యాల కోసం పరుగిడుతూనే ఉంటాం .అయితే ఈ ఒక్క రోజైనా మాతృభాష గురించి మనలో కొందరైనా ఆలోచిస్తారని ,ఆవేశిస్తారని ఇలాంటి రోజులు జరుపుకోవాలని భాషావేత్తల అభిప్రాయం. కనుక ఇలాంటి దినోత్సవాలు చాలా అవసరం.
మనిషిగా మనం జన్మనిచ్చిన అమ్మ ఒడిని ,మొదటగా మాట నేర్పిన అమ్మనుడిని మరిచిపోకూడదు. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ మమతానురాగాలు చవి చూడాలి. అమ్మనుడి గురించి చెప్పాలంటే ఆ మాతృభాషా సౌందర్యాన్ని, ఆ భాష గొప్పదనాన్ని తెలుసుకోవాలి.
భాషించినది భాష (నుడివినది నుడి), భాష ( నుడి) మానవుని భావాలను, ఆలోచనలను, అభిప్రాయాలను ,తలపులను ఇతరులకు తెలియజేయడానికి అదొక మాధ్యమం ( తెన్నువ) .మనిషి పుట్టినప్పుడు శిశువు తొలిసారిగా ,తన వారి ననుసరించి, తన సమూహంలో, సహజంగా, ప్రకృతి పరంగా ,తన పరిసరాలలోని భాషని ,విని , కని అనుకరించే మొదటగా మాట్లాడిన భాష మాతృభాష.
ఎవరి అమ్మవారికి గొప్ప అన్నట్లుగా, ఎవరి మాతృభాష వారికి గొప్పే కదా! కనుక ఎవరు అమ్మనుడిని వారు తప్పక రక్షించుకోవాలి. ఇంగ్లీష్ వారి వలసవాదం వలన, వారు కాలిడిన ,ఏలిన సీమలలో అనేక భాషలు ,అనేక సంస్కృతులు ,ఇంగ్లీషు ప్రభావం వలన, వారి మత ప్రభావం వలన కనుమరుగైనవి. ఒక భాష నశిస్తే, ఆ భాషకు చెందిన జాతి ,జాతి భావన ,సంస్కృతి ,సాంప్రదాయాలు కూడా నశిస్తాయి. ఇది చరిత్ర చెప్పిన, నిరూపించిన సత్యం .అంటే మన అమ్మనుడిని మనమే కాపాడుకోవాలి .ఎవరి భాషను వారే రక్షించుకోవాలి. రాబోయే తరాల కోసం భాషను పదిలపరుచుకోవాలి .పరిరక్షించుకోవాలి.
అందుకే ఇతర భాషల ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకొని, అమ్మనుడిని పరీక్షించుకోవాలనే తలంపుతోనే,ఆ భాష జాతి నైతిక బాధ్యతగా ,ప్రతి మనిషి కర్తవ్యం గా ,అమ్మనుడిని రక్షించుకోవాలoటూ గుర్తు చేయడానికే , ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏర్పాటు చేయడమైనది.
బంగ్లాదేశ్ లో తమ మాతృభాష బంగ్లాను నిలబెట్టుకోవడానికి ఉద్యమ నడిపి ఆ ఉద్యమంలో ప్రాణాలర్పించిన నలుగురి యువకుల ప్రాణత్యాగానికి గుర్తుగా ఫిబ్రవరి 21ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గా ప్రకటించింది.
ప్రపంచంలో దాదాపు 6000 పైచిలుకు భాషలు ఉన్నాయి .వాటిలో సొంత లిపి ఉన్న భాషలు దాదాపు 400 లోపే. కొన్ని భాషలకు ఇప్పటికీ సొంత లిపిలు లేవు .కనుక అమ్మనుడిని అందరూ కాపాడుకోవాలని, రేపటి జాతికి భాషను పునరoకితం చేయాలనే,ఉద్దేశంతో ఈ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆవశ్యకత ఎంతైనా ఉంది.
తల్లి ఒడిలో, తొలి బడిలో వెలసిన నుడి ,వెలిగిన నుడి ,నేర్చిన నుడి ,గుండె లోతుల నిలిచిన నుడి, మన అమ్మనుడి, అన్ని భాషల కన్నా అమ్మనుడి గొప్పది. దానిని గౌరవించాలి .నేర్చుకోవాలి, తన వారికి నేర్పాలి ,అప్పుడే ఆ భాష అంతరించిపోకుండా ఉంటుంది.
అయితే మనదేశంలో ఎక్కువగా తెలుగు ప్రాంతాలలో డాలర్లు మోజుతో ,ఇంగ్లీషు డాబుసరితో మాతృభాషను విస్మరించి , ఆంగ్లమాధ్యమం వైపు తల్లిదండ్రులు పరిగెడుతున్నారు, పిల్లలను బలవంతంగా పరిగెత్తిస్తున్నారు.
పరభాష లు నేర్వడం తప్పుకాదు. ముందు కనీసం ప్రాథమిక విద్య అయిన అమ్మనుడిలో ఉండాలి. ఎందుకంటే అమ్మనుడిలో విద్యార్థికి( నేర్వరి) పాఠము సులభంగా అర్థమవుతుంది. తన భాషలో చదివితే ,ఎక్కువ అవగాహనతో వివరణ అవుతుంది.
మాతృభాష గొప్పతనాన్ని గురించి, చదువు మాతృభాషలో ఉంటే ఎంత ఉపయోగకరమో ,విద్యార్థికి ఎంత వికాసవంతంగా ఉంటుందో, ప్రముఖులు గాంధీజీ ,రవీంద్రనాథ్ ఠాగూర్ ,నేతాజీ ,స్వామి వివేకానంద ఎందరో మహానుభావులు వివరించారు. మన దురదృష్టం అవన్నీ చెవిటి వాడి ముందుఊదిన శంఖములా అయిపోయాయి .ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియం పిల్లలను పరిశీలిస్తే ,అటు ఇంగ్లీషు రాదు, ఇటు తెలుగు రాదు. ఇప్పటి ప్రభుత్వాలు కూడా తెలుగు భాషను తమ ఓట్ల కోసం, రాజకీయం కోసం వాడుకుంటూ ,అమ్మనుడికి వెన్నుపోటు పొడుస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇలాగే సాగితే ఐక్యరాజ్యసమితి వారు ఈ మధ్య ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం రాబోయే 30 సంవత్సరాలలో మరుగయ్యే భాషలలో తెలుగు ఒకటనే మాట నిజం కాబోతుందేమోనని అనుమానంగా ఉంది. అవును నిజమే, ఇప్పటి పిల్లలలో 90% ఇంగ్లీష్ మాద్యములో చదువుతున్నారు ,వారికి తెలుగు రాయడం, చదవడం రాదు. ఇక తెలుగు అక్షరాలతో పనేముంది. ఇలాగే సాగితే ముందు తరాలు వారు తెలుగు అక్షరాలను మ్యూజియంలో (ముట్టు చూపులి )లో చూడవలసి వస్తుంది .
అందుకే ఆంగ్ల ఉద్యోగి మేకలే గొప్పదైన హిందూ సంస్కృతిని ,జాతిని చూసి, వీరిని జయించడం చాలా కష్టమని భావించి ,ఈ జాతిని నాశనం చేయాలంటే ,మొదటగా వారి మాతృభాషను నాశనం చేస్తే చాలు అని చెప్పాడు. అందుకే ఇంగ్లీషును ,వారి మతాన్ని జనంపై రుద్దారు. ఫలితం చూస్తూనే ఉన్నాము.
మాతృభాష అమ్మ పాలు లాగా మధురమైనది. పరభాష డబ్బా పాలవలే కల్తీకి అవకాశం ఉంటుంది. మన మాతృభాష కళ్ళు ఉంటుంది .పరభాష కళ్ళజోడు వంటిది .కళ్ళుంటే కదా కళ్ళజోడుకుతో పని. కనుక మనం మొదటగా అమ్మనుడిని కాపాడుకోవాలి ,మాతృభాషను ప్రేమించాలి, పర భాషలను ఆదరించాలి ,అవసరానికి పరభాషను నేర్చుకోవడంలో తప్పేమీ లేదు .మనం ఇతర భాషలకు వ్యతిరేకం కాదు .అలాగే ఏదైనా ఒక కొత్త మాట ఇతర భాషలు నుండి వస్తే దానికి మొదటగా మన అమ్మ నుడి నుండే కొత్త మాటను పుట్టించాలి. ఆ పనిని హిబ్రూ ,చైనా,జపాన్ ,కొరియా , తమిలులు ,కన్నడిగులు చేస్తున్నారు. అయితే మన తెలుగువారు ఇంగ్లీష్ మాటను సంస్కృతికరణ చేస్తున్నారు. చక్కగా ఆలోచిస్తే అచ్చ తెలుగులో మాటలను పుట్టించవచ్చు.
ఈమధ్య తెలుగు భాషా పరిరక్షణకు, అనేక వేదికలు ,సంస్థలు ముందుకు వచ్చి ఎంతో కొంత కృషి చేస్తున్నారు .అయితే తెలుగు నాట జరిగిన, జరుగుతున్న అనేక ప్రపంచ తెలుగు మహాసభలలో ఎలాంటి పురోగతి లేదని భావించవచ్చు. వారు కేవలం తీర్మానాలకు ,ఒకరిపై ఒకరు పొగడ్తలతో వేదికను అలంకరిస్తున్నారు .నిజానికి ఎవరు ప్రజలతో మమేకమై ,ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడి ఉద్యమించడం లేదనీ,అటువంటప్పుడు తీర్మానాలు, ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని తెలుగు భాషావేత్తల అభిప్రాయం. ఏది ఏమైనా ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా ,మనందరం ఒకసారి మాతృభాష గురించి మీకు మాట్లాడుకోవడానికి అవకాశం వస్తుందని పరస్పర భావాలను ఒకరినొకరు పంచుకోవడానికి సహకరిస్తుoదని అనడంలోఎలాంటి అనుమానం లేదు.
అయితే ఇప్పటికీ ,కొన్ని దేశాలలో మొదలిడు చదువు (ఎల్కేజీ) నుండి పెనుపాటి చదువు ( పీజీ) వరకు
సాంకేతిక, వైద్య చదువులుఅన్నీ కూడా వారి మాతృభాషలోనే జరుపుతున్నారు.
కనుక మనమంతా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా అమ్మనుడిని కాపాడుకోవాలి. అలాకాకుండా పరభాష వ్యామోహంలో పడితే, పరభాషను నేర్చి ,దాని వెంట ప్రాకులాడితే ,అనుకోకుండా ఆ భాషతో పాటు, ఆ భాష వారి సంస్కృతి ,సాంప్రదాయాలు మెల్లగా మనలోనికి ప్రవేశిస్తాయి. ఒకసారి చూస్తే మనకే అర్థమవుతుంది. ఇంగ్లీషు ప్రభావం వలన ,వారి మతము ,వారి తిండి ,వారి కట్టుబొట్లు ,వారి సంస్కృతి సాంప్రదాయాలు అన్ని వచ్చి మన సంస్కృతినీ పక్కకు నెట్టి ,అవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి .నిజమా !కాదా!?
కాబట్టి మన జాతి మన సంస్కృతి నిలవాలంటే, మన మాతృభాషలను నిలబెట్టుకోవాలి, మాతృభాష నిలబడాలి, కలబడాలి, కనబడాలి, వినబడాలి అప్పుడే ఆ భాష వలన జాతి, జాతి వలన దేశము ఒక విశిష్టమైన గౌరవాన్ని పొందుతాయి. జై మాతృభాష. జై జై అమ్మనుడికి కైమొడ్పులు.
*రాఘవ మాస్టారు కేదారి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి