21, ఫిబ్రవరి 2023, మంగళవారం

ప్రణవ ప్రకరణము

 

ప్రణవ ప్రకరణము






       ఇక్కడ ఓంబొమ్మలో 1,2,3,4,5 అంకెలు వేశారు.

శ్లో||
            ప్రథమం తారకంచైవ, ద్వితీయందండ ముచ్యతే |
            తృతీయం కుండులాకారం చతుర్థంచ అర్థ చంద్రికం |
            పంచమం బిందు సంయుక్తం, ఓం ఇతి జ్యోతి స్వరూపం ||

ప్రథమం తారకం చైవ : తారకం అంటే తరింపజేసేది, అని ఒక అర్థం. ఇక్కడ 1అంకె దగ్గర ఓంబొమ్మ చూస్తే ఒక అర్థ చంద్రాకారంగా గొడుగులాగా ఉంటుంది.
ద్వితీయం దండముత్యతే : 2అంకె దగ్గర నిట్టనిలువుగా గీత దండంలాగా ఒక కఱ్ఱలాగా ఉంటుంది.
తృతీయం కుండలాకారం : 3దగ్గర చూస్తే కుండలాకారంగా. కుండకు ఏ కర్వు ఉంటుందో ఆ కర్వు 3దగ్గర ఉంది.
చతుర్థంచ అర్ధచంద్రికం : ‘4’ దగ్గర ఏమో చంద్రుడు పూర్ణ చంద్రుడిపైన సగం తీసివేస్తే అర్థ చంద్రాకారం ఉన్నది.
పంచమం బిందు సంయుక్తం : దాని ప్రక్కన ఒక బిందువు పెట్టాం. బిందువు అంటే సున్నా.
ఓం ఇతి జ్యోతి స్వరూపం : ఇదే జ్యోతి స్వరూపం. జ్యోతి స్వరూపం ఎప్పుడు వచ్చింది? ‘కి పైన ఒక పొల్లుపెట్టాం. అదే జ్యోతి.

       కి పైన పొల్లుకు అంకె వెయ్యలేదు. పొల్లు లేదు. 1, 2, 3, 4, 5 చెప్పినప్పుడు పొల్లు చెప్పలేదు. అదే జ్యోతి స్వరూపం. ఈ జ్యోతి స్వరూపమే ప్రణవం. ప్రణవానికి ఓంకారానికి ఏమిటి తేడా? ‘ఓంకారం యొక్క అవ్యక్త స్థితి ప్రణవం. ప్రణవం యొక్క వ్యక్త స్థితి ఓంకారం. ఓంలో కార, ‘కార, ‘కార మాతృకలున్నాయి. ప్రణవం దగ్గర  ఏ మాతృకా లేదు. ఏ మాతృకా కాని ప్రణవం అమాతృక. ఒక రకంగా అమాతృకా ప్రణవం ఏమిటంటే, నాదము. నాదమంటే శబ్దము యొక్క అవ్యక్త స్థితి ప్రణవం. ఓంయొక్క అవ్యక్త స్థితి ప్రణవం. నిశ్శబ్దమే శబ్దంగా మారిందా? నిశ్శబ్దమే నిశ్శబ్దంగా ఉండగా, శబ్దాలు వచ్చాయా? మీరందరు ఆలోచించండి. నిశ్శబ్దం, నిశ్శబ్దంగా ఉండగా, నిశ్శబ్దమందు కొన్ని శబ్దములు వచ్చి, ఆ శబ్దములే ఆగిపోయినవా? ఎప్పుడూ నిశ్శబ్దమే రాజ్యమేలుతోంది. అప్పుడు సృష్టి లేదు. నిశ్శబ్ద బ్రహ్మమే శబ్ద బ్రహ్మగా మారాడు. అంటే శబ్దము నిశ్శబ్ద బ్రహ్మయందు అవ్యక్తంగా ఉన్నది. అప్పుడు నిశ్శబ్ద బ్రహ్మ నుండి శబ్దం వ్యక్తమైనది.

       శబ్దం ఏ రకంగా ఉంది? ముందు ఆ...ఆ...ఆ..అని వ్యక్తమైనవి. నోరు సున్నా ఆకారంలో పెట్టితే ఊ...ఊ...ఊ... అని వ్యక్తమైంది. పెదవులు రెండు మూస్తే మ్‌అని వ్యక్తమైంది.

       మూసి అలాగే ఉంచితే కారం కొనసాగేలా, ‘మ్‌అనే శబ్దం వచ్చింది. లో ఒక శబ్దం ఉన్నది. లో కూడా శబ్దం ఉంది. మ్‌అనటంలో కూడా ఒక శబ్దం ఉన్నది. అకార, ఉకారం, మకారం అనడం అంతా పూర్తి అయిన తరువాత కూడా ఓ...మ్‌అని శబ్దం కంటిన్యూ చేస్తున్నాం. ఒక మూగవాడు అ, , మ అని అనగలడా? మూగవాడు అనలేడు. మాట బయటికి వ్యక్తం కానివాడు శబ్దం బయటకు వ్యక్తం చేయలేనివాడు అనలేడు. ఎవరైతే శబ్దం బయటకు వ్యక్తం చేయడో వాడికి మాటలు రావు. అప్పుడు ఎట్లా అంటాడు? అదే మాటలు వచ్చినవాడు ఎలా అంటాడు? ఆఆఆ, ఊఊఊ మ్‌మ్‌మ్‌ అంటాడు. ఆ ఊమ్‌ అంటానికి ముందు వీటియందు అన్నిటిలో ఒక శబ్దం ఉంది. ఆ శబ్దమే తురీయం. ఈ శబ్దం అవ్యక్తంగా ఉన్నప్పుడు తురీయాతీతం. అందుకే ఇప్పుడు ఏమి చెయ్యాలి.  ఆ...ఆ... అంటూ ఉలోకి మారండి. ఆ..ఆ...ఊ.. అంటూ ఊలో నుండి మ్‌కు వెళ్ళి ఊఊ....మ్‌ అనండి. మకారం అయిన తరువాత వట్టి శబ్ద కంటిన్యూ చెయ్యండి. ఆ...ఊ...మ్‌... అనేది ఆగితే కేవలం ఒక శబ్దం ఉంటుంది. అదే తురీయం. మాట మొదలు పెట్టాక ముందు ఏమున్నది? నిశ్శబ్దం. నిశ్శబ్దం శబ్దంగా మారలేదు. నిశ్శబ్దమందు వేరుగా శబ్దములు కలిగి మళ్ళీ ఆగినవి. శబ్దానికి శబ్దానికి మధ్య నిశ్శబ్దమే ఉన్నది. నిశ్శబ్దం బ్రహ్మ ముచ్యతే.

       కారం అంటే స్థూలము, ‘కారము అంటే సూక్ష్మము. కారం అంటే కారణము స్థూల, సూక్ష్మ, కారణాలే, అకార, ఉకార, మకారాలు. అఉమ్‌లో కామన్‌గా ఉన్న శబ్దమే తురీయం. శబ్దం యొక్క అవ్యక్త స్థితి ప్రణవం. అంటే ప్రణవంలో శబ్దం అవ్యక్తంగా ఉన్నది. కనుక ప్రణవము నిశ్శబద్ద బ్రహ్మ కాదు, శబ్ద బ్రహ్మమే. తాత్కాలికంగా శబ్దం అవ్యక్తంగా కలిగినవాడు ప్రణవ స్వరూపుడు. ప్రణవ స్వరూపుడు తాత్కాలికంగా నిశ్శబ్దంగా ఉన్నా, శబ్ద బ్రహ్మ అందులో అవ్యక్తంగా ఉండి వ్యక్తమయ్యేసరికి అ,,మ కారములుగా వ్యక్తమయ్యాడు. ఈ ఓంకారమునకు అంతరార్థము చెప్పుకుందాము.

ప్రథమం తారకంచైవ: తారక యోగంలోకి వెళ్ళామండి.
ద్వితీయం దండముచ్యతే : వెన్ను దండాన్ని వెన్నుపూసను నిట్టనిలువుగా ఉంచాము.
తృతీయం కుండలాకారం : నిట్టనిలువుగా ఉన్న వెన్ను పూసలో కుండలి శక్తిని మేలుకొలిపాము. మూలాధారం నుండి పైకి  ప్రయాణం చేస్తున్నాము.
చతుర్థకం అర్థ చంద్రికం : అర్థచంద్రికం అంటే సహస్రారం పైన ద్వాదశాంతమున ఒక చంద్రకళా స్థానమున్నది. ఆ చంద్ర కళాస్థానమే అర్థ చంద్రిక.
పంచమం బిందు సంయుక్తం : బిందువుతో కల్సిపోయినది. బిందువుతో కలవడం వలన ఏమైంది. అర్థనారీశ్వరి యొక్క దర్శనం జరిగింది. శివుడు పార్వతి. అనగా ప్రకృతి పురుషులు కలయికగా ఉన్నట్టి చిత్‌ జడం, రెండు కల్సినటువంటి దర్శనం జరిగింది. ఓంకారం రూపంలో ఈ మాదిరిగా వచ్చింది. మళ్ళీ కి పొల్లుగా ఉన్నది ఏదో అదే జ్యోతి. 

       తారక యోగంలో ప్రవేశించి వెన్నుపూసను నిట్టనిలువుగా దండలాగా పెట్టి లోపల కుండలిశక్తిని జాగరణ చేసుకొని సహస్రారం దాకా ప్రయాణం చేసి అర్థనారీశ్వరుని దర్శించి, చంద్రకళా స్థానానికెళ్ళి జ్యోతి దర్శనం చేసుకోవాలి.

       ఇప్పటివరకు చెప్పినది ఒకసారి చూస్తే, ప్రణవమందు శబ్దం అవ్యక్తంగా ఉన్నది. ప్రణవం నిశ్శబ్దం బ్రహ్మ కాదు. ప్రణవమందు శబ్దం అవ్యక్తంగా ఉన్నది. ప్రణవమునుండి నాదం వచ్చింది. ప్రణవనాదము బ్రహ్మనాదము అంటారు. ప్రణవం నుండి నాదం వచ్చింది. ఆ నాదంలో కళలు లేవు. అ,,మలు ఎప్పుడైతే వచ్చినవో ఆ నాదం కళలతో కూడినది. ఆ కళలు అవ్యక్తంగా ఉండి సృష్టి బిందువుగా ఏర్పడి ఉంది. ఆ బిందువు నుండి అకార ఉకారమకారమనే కళలు వ్యక్తమయ్యాయి. ఈ విధముగా నాద బిందు కళలు మూడు వచ్చినవి. సృష్టి బిందువే వ్యాపించి సృష్టి బిందువునుండి విమర్శ బిందువు వచ్చి ఆ విమర్శ బిందువు నుండి మిశ్రమ బిందువు వచ్చి మూడు బిందువులయందు ప్రకాశం, మండలత్రయ ప్రకాశమై, ఆ మూడు బిందువులు త్రికోణముగా, త్రిభుజముగా కల్సినపుడు, అంతర దీపికగా ఒక ఎరుక పుట్టింది. అదే ప్రజ్ఞ.       

       ఎరుక పోవాలంటే ఏమి కావాలి? నిశ్శబ్ద బ్రహ్మ కావాలి. ప్రణవం ఏమిటి? శబ్దంయొక్క అవ్యక్త స్థితి, వ్యక్త స్థితి ఎలా ఉన్నది? త్రిపుటులుగా దృక్కు, దృశ్యము దర్శనములుగా, జ్ఞాత జ్ఞానము జ్ఞేయముగా, ధ్యాత ధ్యానము ధ్యేయముగా, అకార ఉకార మకారములుగా, స్థూల సూక్ష్మ కారణాలుగా, విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృతులుగా, విశ్వ తైజస ప్రాజ్ఞులుగా, అకార ఉకార మకారములును ఇన్ని రకాలుగా ఇన్ని త్రిపుటులుగా భావన చేస్తే ఈ మూడు రకాలుగా వచ్చిన యావత్‌ సృష్టియందు ప్రణవము సర్వ వ్యాపకముగా ఉన్నది. అందువలన ఈ సృష్టి యావత్తు ప్రణవాత్మకం. ఈ ప్రణవమే అన్నిటియందు వ్యాపించి ఆత్మగా, అన్నిటికీ కేంద్రంగా, అన్నిటికి అంతరాత్మగా ఉన్నది. అకార మాతృకలో ప్రణవం ఉన్నది. ఉకార మాతృకయందు ప్రణవం ఉన్నది. మకార మాతృకయందు ప్రణవం ఉన్నది. అర్థ మాతృకలో కూడా ప్రణవం ఉన్నది. అది అ మాతృక అయినప్పటికీ కూడా శబ్దం యొక్క అవ్యక్త స్థితి ఉన్నది.

       అసలు బ్రహ్మ ఎలా ఉన్నాడు? ముందు నిశ్శబ్ద బ్రహ్మగా ఉన్నాడు. తరువాత నాద బిందు కళగా ఉన్నాడు. కి కుడి ప్రక్క సున్నాలో చేర్చితే ఓం అయినది. ఓం నుండి సృష్టి వచ్చినది. ఓం యే మహత్తు. మహత్తు నుంచే మహదహంకారం ద్వారా సృష్టి వచ్చింది. ఓం నుండి మూడు గుణాల సృష్టి వచ్చింది. అకార ఉకార మకారాలే మూడు గుణాలు. ఓం నుండి త్రిపుటి వచ్చింది. ఓం నుండి జ్ఞాత జ్ఞేయం జ్ఞానం వచ్చినవి. ఓం నుండి స్థూల, సూక్ష్మకారణ సృష్టి వచ్చింది. ఓం నుండి మూడవస్థలు వచ్చినవి. వ్యష్టిలో సమష్టిలో కూడా జీవుడికి ఈశ్వరుడికి కూడా ఓంయే మూలం. సృష్టికి ఓంయే మూలం. అప్పుడు ప్రవణము ఆధార బ్రహ్మ అయ్యాడు.

       జగత్తుకు మూలం ఓంకారము. ఓం తనకు తానే పుట్టింది. నిశ్శబ్దంలోనుండి శబ్దం తనకు తానే వచ్చింది. నిశ్శబ్దం ఎప్పుడూ రాజ్యం ఏలుతుంది. అప్పుడప్పుడు శబ్దాలు వాటికవే వచ్చి మరల అణిగిపోతున్నాయి. శబ్దాలు పుట్టి అణిగిపోతున్నాయి. శబ్దాలు పుట్టి అణిగే లోపల మరో శబ్దం పుట్టేలోపు గ్యాప్‌లో నిశ్శబ్దమే ఉన్నది. శబ్దాలు ఎప్పుడూ లేనపుడు, శాశ్వతంగా నిశ్శబ్దమే ఉన్నది. త్రిపుటిలయొక్క ఎరుక, అనగా జ్ఞాత అనే ఎరుక, జ్ఞేయమనే ఎరుక, జ్ఞానమనే ఎరుక లేనపుడు బయలే ఉన్నది. జ్ఞాత జ్ఞాన జ్ఞేయముల యొక్క ఎరుకయొక్క గ్యాప్‌లో కూడా బయలే ఉన్నది. ఈ బయలంటే ఏమిటి? అన్ని రకాలుగా ఏమీ లేదు. ఏమీ లేదు. ఏమీ లేదు. బయలంటే ఎరుక పద్ధతిలో ఏమి చెప్పినా ఏమీలేదు. ఎరుక పద్ధతిలో చూసేవన్నీ ఏమీలేదు అనే దానికి సున్నా గుర్తు. కనుక బయలును ఎలా చూడాలి? నీకు తెల్సివన్నీ ఏమీలేవు అనే పద్ధతిగా చూస్తే సున్నా. కనుక ఈ ఓంకి వెనుక నిశ్శబ్ద బ్రహ్మ ఎలా ఉన్నాడు? సున్నాగా ఉన్నాడు? ఒకవేళ సున్నాయే నీవై నిశ్శబ్ద బ్రహ్మమే నీవై దృశ్య తాదాత్మ్యత లేకపోతే, దృశ్యాత్మ కాకపోతే, దృగాత్మ కూడా కాకపోతే, ఏమై ఉన్నావు? నీవు సున్నాగా ఉన్నావు. అంటే బయలుకు సంకేతం అయింది. అప్పుడు బయలైంది. గురువుగారు నీ వెనుక నీ మూలం ఏమిటి? అన్నారు. సున్నా! అంటే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీలేదు అని. ఈ విధముగా బయలును సూచించడానికి ‘‘ంఓం’’ అని సంకేతముగా చూపించడమైనది. నీ మూలం ఒకసారి చూసుకో అన్నారు. గొడ్రాలి బిడ్డ సామెతగా నీకు తల్లి లేదు, తండ్రి లేరు. నీ మూలం సున్నా అన్నాడు. నీ మూలాన్ని ఎప్పుడైతే సున్నాగా చూచావో అప్పుడు నీవే లేకుండా పోయావు. నీకు మూలం లేదు. కాని ఉన్నానంటున్నావు. ఎలా వున్నావు? ఉన్నాననుకుంటే ఉన్నావు. లేననుకుంటే లేవు. యత్‌భావం తత్‌ భవతిగా ఉనికిలోకి వచ్చావు. నీవు అభావం అయితే లేనేలేవు. నీ సంగతి ఇది! ఉన్నానుకుంటే ఉన్నావు. లేదనుకుంటే లేవు కనుక ఉండడము కల్ల. ఉండడము భ్రాంతి. అనుకోకపోవడం వల్ల ఉండటం ఏమిటి? అది భ్రాంతి. అనుకోవడంవల్ల లేకపోవడం ఏమిటి? ఏమి అనుకోకపోతే నీవు ఏమి లేవన్నమాట!

       ఏమి అనుకోకపోతే ఏమీలేదు అంటే నీవు నాదబిందు కళాతీతము. నీవు ప్రణవాతీతము నీవు నిశ్శబ్ద బ్రహ్మము. అదే బయలు. అందుకే ఓంకి వెనుక ప్రక్కన సున్నా పెట్టేసి, ఎడమ ప్రక్కన సున్నా పెట్టేసి నీకు మూలం లేదని నీ మూలాన్ని చూచుకో అని గురువుగారు పరబయలు చూపిస్తున్నారు. మూలం లేని గుర్తు ఎరిగే నేనేలేనప్పుడు నేననేఎరుక మాయ. కనుక నేనుపోవాలి. నా అంతట నేను పోలేను. కనుక లేకనే తోచిన నేనులేదని నిర్ణయమై నేను లేనని తెలిశాక భ్రాంతి రహితమై నేనేలేకుండా పోవాలి. లేనిదే ఉన్నట్లు తోచింది. లేనిదే లేకుండా పోతుంది. దేనిలోనుంచి వస్తే తిరిగి దాంట్లోకి పోతుంది. దేంట్లోనుంచి రాలేదుగా! అష్ట ప్రకృతుల లయం అంటే ఏమి చేశాము? కర్మేంద్రియాలను, విషయాలను, జ్ఞానేంద్రియాలను, పంచ ప్రాణాలను, అంతఃకరణ చతుష్టయాన్ని, జ్ఞాతను, వీళ్ళందరిని సూక్ష్మ భూతాలలోకి లయం చేశాము. వాటిని మహదహంకారంలోను, మహదహంకారంను మహత్‌లో, మహత్‌ను ప్రణవంలోను దానిని అవ్యక్తంలో లయం చేశాము. అవ్యక్తం మళ్ళీ తిరిగి వ్యక్తమవుతుంటే ఇక్కడే పరిపూర్ణ బోధ కావాలి. నీకు మూలం లేదని మహత్‌ వెనుక సున్నా చూపిస్తూ మహదహంకారమై, అష్ట ప్రకృతుల సృష్టి లేకుండా ఉండాలంటే తిరిగి రాకూడదు అంటే ఏమి చెయ్యాలి? మహత్‌గా ఉన్నప్పుడే నాకు మూలం లేదని షోడశి మంత్రం చెప్పుకోవాలి. అకార, ఉకార, మకార మాతృకల సృష్టి అంతా కూడా మిథ్య అని, ఓంకారం ద్వారా వచ్చిన సృష్టి అంతా మాయాకల్పితమని, లేకనే ఉన్నట్లు తోచినది తెలుసుకోవాలి. మూలంలో ప్రణవం కూడా ఈ రకంగా అభివ్యక్తమవుతుంది. కనుక అది కూడా మాయద్వారా కల్పితమే. కాబట్టి విచారిస్తే ఏమీ లేదు అనేది నిర్ణయం. ఏమీ లేదు. అనేదే బయలు.

       ఓంకారేశ్వరుని ఓంకారాన్ని ఉపాసనగా చేసి ప్రణవోపాసన చేసి బ్రహ్మ జ్ఞానం పొందుతానంటే పొందవచ్చు. ప్రణవోపాసన, బ్రహ్మోపాసన అనేది చెయ్యవచ్చు, కాని అది ఎరుక బ్రహ్మమే. బయలు నిర్ణయం కాదు. పరబ్రహ్మ నిర్ణయం కాదు. పరబ్రహ్మ నిర్ణయం కేవలం శ్రవణ, మనన, నిదిధ్యాసల వల్లనే అవుతుంది. కుండలిని జాగరణ వలన కాదు, శ్వాసమీద ధ్యాస, ధ్యానం వలన కాదు. ఈ ధ్యానం అంతా కూడా ఒక ధ్యాన వస్తువుమీద పెట్టారు. ధ్యాన వస్తువు కూడా కల్పితమే. ఓంకారమే కల్పితం అయ్యాక, కల్పిత ఓంకారంతో ఉపాసన చేస్తే కల్పిత బ్రహ్మమే అవుతావు కదా! ఓంకారం వలన అకార, ఉకార, మకార శబ్దములు వస్తే శబ్ద బ్రహ్మమే అవుతావు గదా! నిశ్శబ్ద బ్రహ్మ అయినా గాని శబ్దము యొక్క అవ్యక్త స్థితిలో ఉన్న నిశ్శబ్దం అయితే, మళ్ళీ వ్యక్త బ్రహ్మలోకి శబ్ద బ్రహ్మలోకి వచ్చి ఎరుక బ్రహ్మ అవుతావు గదా! కనుక నీకు మూలం లేదనప్పుడు వెనుక సున్నా పెట్టుకుంటే వ్యక్తా వ్యక్తములు రెండు కానిది ఏదో, అది బయలు. ఆ బయలు నిర్ణయాన్ని మనం గురు కృపతో తెల్సుకొని దృఢం చేసుకోవాలి. కనుక ప్రణవ ప్రకరణం అని ఏదైతే చెప్పామో అది అచల పద్ధతికి తిప్పాము. ఈ అచల పద్ధతికి తిప్పితే ఓంకారోపాసన ప్రణవ బ్రహ్మ ప్రణవేశ్వరుడు అయ్యేదాకా పనికి వస్తుంది. కాని ఆ తరువాత పరిపూర్ణ బోధలో ప్రణవము కూడా లేనిది అని తెలియాలిగా! కనుక అమాతృక అంటే అకార మాతృక లేదు. ఉకార మాతృక లేదు. మకార మాతృక లేదు. తురీయంలో ఉన్న అర్థ మాతృక లేదు. తురీయాతీతమైన అవ్యక్తము, లేక ప్రణవము లేదు. అది తిరిగి వ్యక్తం కాకపోతే అదే బయలు. అదే పరబ్రహ్మ. పరబ్రహ్మ నిర్ణయానికి ఓంకారమనేది ఒక సోపానము. ఓంయే మాయ ద్వారం. ఓంయొక్క అవ్యక్త స్థితి ప్రణవము. కనుక ప్రణవాతీత పరబ్రహ్మము అంటే బయలే. సాధనలన్నీ ప్రణవంతో ఆగిపోయినవి. ఆ పైన పరబ్రహ్మ అవ్వాలంటే ‘‘ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు’’ అని మొదలుపెట్టాము.

       ఇంతవరకు చెప్పిన బోధ అంతా శబ్ద ప్రమాణంగా జరిగింది. శబ్ద ప్రమాణమే శృతులు, శృతులే వేదాలు. కనుక వేదాలు వేదాంత పద్ధతిలో శృతి, స్మృతి పద్ధతిలో సాధనా పద్ధతులలో చేసిందంతా కూడా ప్రణవం వరకే. ప్రణవాతీత స్థితికి తీసుకెళ్ళాలంటే ఏ సాధన పనికిరాదు. గురుశిష్య న్యాయంగా జరగాలి. ఈ గురు శిష్య న్యాయంగా జరగాలంటే స్థూల దృష్టి, సూక్ష్మాతి సూక్ష్మ దృష్టిగా మారాలి. అప్పుడు చతుర్విధ శుశ్రూషలు స్థూలంగా కాకుండా సూక్ష్మంగా కూడా కాకుండా అశరీర పద్ధతిలో చెయ్యాలి. అశరీర పద్ధతిలో అంగ శుశ్రూష, అశరీర పద్ధతిలో స్థానశుశ్రూష, అశరీర పద్ధతిలో భావ శుశ్రూష, అశరీర పద్ధతిలో ఆత్మ శుశ్రూష చేసినప్పుడు అశరీరం పద్ధతిలో గురువులో మమైకం అవ్వడం ద్వారా, ఎరుక విడుస్తావు. దానికి ముందు గురువు పరబయలు దర్శింపచేసి ఎరుకను విడిపిస్తాడు. ఇక్కడితో ఈ జ్యోతి స్వరూపం అంతా కూడా ఎరుకే నుక, జ్యోతికి పరమైనది పరంజ్యోతి. ఈ పరంజ్యోతి సంగతే పరిపూర్ణ బోధగా అచల సిద్దాంతం అక్కడ మొదలవుతుంది. దీన్ని వేదాంతాతీత బోధ అంటారు. పరిపూర్ణ బోధను వేదాంతీత బోధ అంటారు. ఇంతవరకు జరిగినది ప్రబోధఅయితే ఆ వేదాంతాతీత బోధను నిజప్రబోధఅంటారు.

       ప్రణవముఅంటే అవ్యక్త శబ్దము. ఓంఅంటే శబ్దము ధ్వనిగా ఉన్నది. ధ్వని రూపములో బహిర్గతమైనది ఓం’. బహిర్గతము కాకమునుపు ఉన్నటువంటిది అవ్యక్త శబ్దము అది. ప్రణవమువ్యక్తావ్యక్తములు రెండూ కాని నిశ్శబ్ద బ్రహ్మమే అన్ని కాలాల్లో మార్పు చెందకుండా ఉన్నది. నిశ్శబ్దమందు శబ్దములు ఉత్పన్నమై మళ్ళీ నశిస్తూ ఉంటాయి. శబ్దములు సృష్టించబడి లయం చెందుతూ ఉంటాయి. శబ్దములకే ఆది, అంతము ఉన్నది. నిశ్శబ్దము శాశ్వతము. నిశ్శబ్దము శబ్దముగా మారలేదు. నిశ్శబ్దము నిశ్శబ్దముగానే శాశ్వతముగా ఉండగా, ఒక శబ్దము ఉత్పన్నము కావడానికి ముందు అవ్యక్త స్థితిలో, తరువాత మహత్‌ స్థితిలో, తరువాత కార, ‘కార, ‘కారములుగా వ్యక్తమైనది. అవ్యక్తస్థితిలో ఉన్నదానిని నాదముఅంటాము. దానినే ప్రణవముఅంటాము, ‘ప్రణవనాదముఅంటాము. వ్యక్త స్థితిలో ఉన్నదేమో ధ్వని రూపంగా ఉన్నది. దానిని ఓంకారముఅంటాము. ఓంమహత్తు. మహత్తునుండే సృష్టి ప్రారంభం అయినది. ఓంబిందువునుండి సృష్టి ప్రారంభమైనది. మహత్తుఅన్నా ఓంబిందువన్నా ఒక్కటే! తిరుగు ప్రయాణంలో మనమందరం ఓంబిందువుకు చేరాలి. ఓంనుంచి అవ్యక్తంకావాలి. ఓంకారంనుంచి ప్రణవ స్వరూపముకావాలి.

       ఓం ఇతి జ్యోతి స్వరూపం  జ్యోతిఅంటే ప్రకాశిస్తుంది అని అర్థము. ప్రకాశము అంటే పరమాత్మగా ప్రకాశిస్తుంది. పరమాత్మ ప్రకాశమది. ఆత్మ ప్రకాశము, బ్రహ్మ ప్రకాశము, పరమాత్మ ప్రకాశము, అదీ జ్యోతి అంటే! ఇంకో శబ్దములో తరించాలి అంటే, వెన్నుపూసని నిట్టనిలువుగా పెట్టుకుని, కుండలనీ శక్తిని జాగరణ చేసి, సహస్రారమందున్నటువంటి సహస్రదళ స్థానానికి లక్ష్యం పెట్టుకుని, తురీయంలోకి వెళ్ళాలి.

       మూడు అవస్థలలో ఉండి, మూడవస్థలకి అతీతముగా కూడా ఉండేది తురీయము’. నిశ్శబ్దము మూడు అవస్థలలో ఉంది. మూడవస్థలకి సాక్షిగా ఉంది. నిశ్శబ్దముతనకు తానే నిశ్శబ్దముగా శాశ్వతముగా ఉంది. అదీ తురీయమంటే. శబ్దముఒకప్పుడు ఉంటోంది, ఒకప్పుడు ఉండడం లేదు. కార, ‘కార, ‘కారములుగా మూడు రకాల శబ్దాలు ఉంటే, ఈ మూడు రకాల శబ్దాలకు మూలమైనది నాదం’. నాదమే తురీయము’. నాదాంతములో నాదము అంతమైతే నిశ్శబ్దముఉంది. నిశ్శబ్దమేమో శాశ్వతము. నిశ్శబ్దములో పరిణామము లేదు. నిశ్శబ్దములో వికారము లేదు. నిశ్శబ్దములోనుంచి ఏమీ పుట్టలేదు. నిశ్శబ్దములో ఏమీ లయం కాదు. శబ్దమే తనకు తానే పుట్టి, తనకు తానే కళల రూపములో ఉండి, ఆ ధ్వని తనకు తానే లయం అవుతూ ఉంటుంది. కనుక  కార, ‘కార, ‘కారములని ఎలా తీసుకున్నప్పటికీ, ‘ధ్యాతయొక్క ప్రకాశము, ‘ధ్యానముయొక్క ప్రకాశము, ‘ధ్యేయవస్తువుయొక్క ప్రకాశము. అలా తీసుకుంటూ విశ్వ, తైజస, ప్రాజ్ఞుల యొక్క ప్రకాశముగా తీసుకోవచ్చు. విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృతుల ప్రకాశముగా తీసుకోవచ్చు. స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలుగా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా తీసుకోవచ్చు. ఈ కార, ‘కార, ‘కార మాతృకలు ఇప్పుడు చెప్పిన అన్నిటికికూడా సంకేతము.

       లింగము’, ‘గుర్తుఅంటే సంకేతము. ఈ సంకేతాలన్నీ కూడా ఈ గుర్తులు అన్నీ కూడా ఎఱుకే’. ‘గుర్తులేకపోతే, ‘ఎఱుకలేకపోతే, ‘శబ్దములేకపోతే, ‘విశ్వ తైజస ప్రాజ్ఞుల అనుభవంలేకపోతే, ‘తురీయానుభవముకూడా లేకపోతే అప్పుడు ఏ అనుభవము కూడా లేకపోతే, ఏ ప్రపంచానుభవము లేకపోతే, ఏ శరీర సంబంధానుభవములు లేకపోతే, ఏ ఇంద్రియ సంబంధ అనుభవములు లేకపోతే, ఊహ లేకపోతే, ఆలోచన లేకపోతే, సాక్షిత్వము లేకపోతే ఇవన్నీ లేకపోతే ఏదైతే ఉన్నదో, అది ప్రణవాతీతము. అది పరబ్రహ్మము. అది తురీయాతీతము. తురీయాతీతమే పరబ్రహ్మ. సాధనలో ఏమిటంటే, తురీయాన్ని దాటి, తురీయాతీత స్థితిలో మనం ఉంటే, మనం ఆ పరబ్రహ్మమే.

       ఇక్కడ అతీతమైన మాట వాడుతున్నాము. తురీయాతీతము, ప్రణవాతీతము అని. వ్యక్తావ్యక్తములుగా ఉన్న శబ్దానికి కూడా అతీతము. ఆ అతీతస్థితినే పరము అంటాము. ఆ పరమైనదే పరబ్రహ్మ. ఆ పరమైనది ఉన్నది ఉన్నట్లున్నది. కనుక ఓంకి వెనుక ప్రక్క ఒక సున్నా పెడితే, ఆ సున్నాయే పరం. ప్రణవమే సృష్టికి మూలము, మూలాధారము, మూలకారణము, మూలకారణాంశము. ఈ సృష్టి అంతా కూడా మూలకారణమైన ఓంయొక్క అంశము ఉన్నది. అంటే, ప్రతీ దాంట్లో స్థూల సూక్ష్మ కారణాలు కలిసి ఉన్నాయి. స్థూలం ఏమో కార్యరూపంలో అనుభవానికి పనికి వస్తుంది పనిముట్టుగా! సూక్ష్మమేమో అనుభవిస్తుంది. కారణంఏమో ఏ అనుభవం రావాలో, ముందస్తుగా వాసనా రూపంలో ఉండి, ఆ కారణము. కార్యరూపము కాగానే, అనుభవాలు వస్తూ, పోతూ ఉంటాయి. కనుక కార్యకారణాలు ఉన్నంత వరకూ, అవి ప్రణవానికి, ఓంకారానికి లోబడి ఉన్నాయి.

       కార్య, కారణాలకి అతీతమైనది, పరమైనది, ఈ ప్రణవానికి, ఓంకారానికి ఎట్టి సంబంధము లేకుండా తనకు తానే స్వతఃసిద్ధమై ఉండి, దాని నుండి ప్రణవము పుట్టలేదు. దాని నుండి ఓంకారము పుట్టలేదు. అందువల్ల ప్రణవ స్వరూపుడికి, ఓంకార స్వరూపుడికి ఆ పరబ్రహ్మము మూలము కాదు. ఇలా మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదుఅంటే, ఆ ప్రణవ స్వరూపుడికి చెబుతున్నమాట. క్రింద నుంచి చెబుతున్నాము. మూలం లేని గుర్తెరిగే స్థూల శరీరము ఏమీ లేదు’, ‘మూలం లేని గుర్తెరిగే సూక్ష్మ శరీరము ఏమీ లేదు’, ‘మూలం లేని గుర్తెరిగే కారణ శరీరము ఏమీ లేదు’, ‘మూలం లేని గుర్తెరిగే విశ్వ తైజస ప్రాజ్ఞులు ఏమీ లేరు’, ‘మూలం లేని గుర్తెరిగే విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృతులు ఏమీ లేరు’, ‘మూలం లేని గుర్తెరిగే క్షరాక్షరులు ఏమీ లేనే లేరు’. ముందుగా సంకల్పమే అవ్యక్తముగా ఉండి, సంకల్ప రూపంలో తిరిగి వ్యక్తమౌతుంది కనుక విస్మృతిగా ఉన్నప్పటికీ, అవి అవ్యక్తముగా ఉన్నటువంటి స్మృతులే. స్మృతి రూపంలో వ్యక్త రూపంలో బహిర్గతమౌతున్నాయి. కనుక స్మరణ, విస్మరణలు లేవు.

       క్షేత్రము, క్షేత్రజ్ఞుడు లేడు. క్షరము, అక్షరము లేదు. ఇట్లా అష్ట తనువులు లేదు. స్థూల, సూక్ష్మ, కారణాలే కాకుండా విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృతులే కాకుండా, తురీయంలో ఉన్న ప్రత్యగాత్మ, పరమాత్మలు కూడా ఈ తురీయమే సర్వకారణము.  ఈ తురీయమే కారణము, మహాకారణము. కనుక స్థూల, సూక్ష్మ, కారణ సృష్టికి తురీయం మూలమైంది. ఆ తురీయంగా, మూలంగా ఉన్నటువంటి ప్రణవము. ఓంకారానికి అవ్యక్తంగా ఉన్నది. అనాహత శబ్దమే ప్రణవము, ఆ తరువాత ఉపక్రమించేటటువంటి, ఉపక్రమణకు, ఆ తరువాత విజృంభించేటటువంటి గుణమయ ప్రపంచానికి, నామ రూప వస్తువులకి కారణమైంది. కాని, దానికి కారణమేంటి? ప్రణవానికి కారణమేంటి? ఆ ప్రణవం పైన ఏదైతే ఉందో, అతీతంగా ఏదైతే ఉందో, ‘పరంఅనే పేరుతో ఏదైతే ఉందో, అది స్వతఃసిద్ధంగా, దానికదే ఉండి, ‘ఏకమేవా అద్వయం బ్రహ్మగా ఉండి, దానియందు నానా అస్తి న కించనఃనానా రకాలుగా ఏదైనా కాని, ఏ ఒక్కటి కూడా అస్తిత్వాన్ని పొంది ఉండలేదు. కనుక ఈ అస్తిత్వము, నానాత్వము భేదాలతో వచ్చినటువంటివి అన్నీ కూడా ఓంకారము వల్లే స్థూల, సూక్ష్మ, కారణ సృష్టిగా, ఆ సృష్టియే స్థూల రూపం వచ్చేసరికి, నామ, రూప, వృత్తి నటనలుగా ఉంటున్నది. మోక్షము కావాలంటే, వీటి అతీత స్థితికి వెళ్ళాలి. అతీత స్థితి వీటికి మూలమా? కాదా? ఇంతసేపూ మనం చెప్పుకునేది ఏమిటంటే, దీనికి అతీతంలో మూలం లేదని, క్షేత్రజ్ఞుడు అయిన వాడు, అక్షర పరబ్రహ్మ అయినవాడు, ప్రత్యగాత్మ అయినవాడు, పరమాత్మ అయినవాడు ప్రణవ స్వరూపుడు అయినవాడు కూడా తనకు మూలంలేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని, తాను గొడ్రాలి బిడ్డ సామెతగా, తాను లేకనే ఉన్నట్లుగా తోచాడని, తాను కూడా మాయా కల్పితుడే అని తెలుసుకుని, తాను దృక్‌ మాత్రమయినటువంటి ఎఱుక, తాను దృశ్యమైన ఎఱుక దృశ్య తాదాత్మ్య రూప ఎఱుక, సకల ఎఱుకలనుండి అతను విడుదల పొందాలి.

       ఎఱుకే లేక ఉన్నట్లు తోచింది కాబట్టి, ఎఱుకకు మూలం లేదు. ఎఱుక దృశ్యం కాదు. ఎఱుక దృశ్యం అయినదంటే అది భ్రాంతి. ఎఱుక దృశ్యం కాలేదు అంటే అది అవ్యక్తము, ఎఱుక యొక్క అవ్యక్త స్థితి. లేనెఱుకే అవ్యక్త స్థితిలో ఘన రూప అఖండ ఎఱుకగా ఉండి, వ్యక్త స్థితిలో ఖండ ఎఱుకలై, మూడు గుణాల చేత, మూడు ఖండ ఎఱుకలై, తమో గుణం చేత, జడజగత్తు అనే ఎఱుకయై, రజోగుణం చేత జీవుల, ప్రాణుల ఉనికిగా ఎఱుక పుట్టి, సత్వగుణ ఎఱుక త్రిమూర్తులుగా, అధిష్ఠాన దేవతలుగా, ఈశ్వరుని యొక్క ఇంద్రియాలైన అధిష్ఠాన దేవతలుగా ఉన్నది. ఈ సత్వగుణ ఎఱుకనేమో కేవలపుటెఱుక అంటారు. ఈ తమో గుణ ఎఱుకనేమో, మలినపుటెఱుక అంటారు. అసలు ఉన్నది తమోగుణం, సత్వగుణమే! రజోగుణం లేదు. ఆత్మయేమో సత్వగుణం, అనాత్మయేమో తమోగుణం. రజోగుణం లేదు. చిత్తేమో సత్వగుణం, జడమేమో తమోగుణం. అక్కడ కూడా రజోగుణంలేదు. చిత్‌ జడముల కలయికలో, చిత్‌ జడ గ్రంధిలో ఒక నేనుఅనేటటువంటిది రజోగుణ సంబంధముగా తోచింది. నేనుఅనేటటువంటి జీవుడు రజో గుణ సంబంధముగా తోచాడు. అంటే తమో సత్వ గుణముల యొక్క మిశ్రమముగా ఈ రజోగుణం ఆవిర్భవించింది. అందుకని ఈ రజోగుణాన్ని మిశ్రపుటెఱుక అంటాము. చిత్‌ జడముల యొక్క గ్రంధిలో పుట్టినది. అలాగే ఆత్మ, అనాత్మల యొక్క సందులో పుట్టినది. తమో, సత్వ గుణముల యొక్క సందులో పుట్టినది, వాటి యొక్క మిశ్రమము వలన కలిగినది, రజోగుణం కనుక రజోగుణాన్ని మిశ్రపుటెఱుక అంటారు.

       ఇట్టి ఎఱుకకు మూలం లేదు. అన్ని కాలాల్లో ఏదైతే ఉందో, అది ఉన్నదున్నట్లున్నది. అది దీనికి మూలంకాదు. అది దేనికీ మూలం కాదు. కాని దాన్ని బయలు అనుకుంటే, బయలందు లేని ఎఱుక బయలులోకి చేరి, ఎఱుక తనంతట తానే లేకనే ఉన్నట్లు తోచినది. మళ్ళీ ఎఱుక లయమైనప్పుడు, లేనెఱుక లేకుండా పోయింది. అట్లాగే ఓంకారములో లేని శబ్దము ఉత్పన్నమై, ఓంకార రూపమై, అకార, ఉకార, మకార సృష్టి చేసింది. మాయ మూలకారణాంశము అవ్వడం వలన అకార, ఉకార మాతృకల చేత, సంకేతముగా ఉన్నటువంటి, స్థూల సూక్ష్మ ప్రపంచములన్నీ కూడా లేకనే ఉన్నట్లు కల్పించబడ్డాయి. మాయ యొక్క లక్షణాలు, మూడు గుణాలు ఈ మూడు ప్రపంచాలకు ఉన్నవి. మాయ లేనిది కనుక మూడు ప్రపంచాలు లేనివే. మాయ లేకనే ఉన్నట్లు ఉంది కాబట్టి, మూడు ప్రపంచాలు కూడా లేకనే ఉన్నట్లు ఉన్నాయి. కనుక ఓంకి మూలం లేదు కాబట్టి, ‘ఓంకి మూలం సున్నా! ఈ సున్నాఅంటే ఎఱుక పద్ధతిలో సున్నా’! అంటే క్షేత్రజ్ఞుడు లేడని, అక్షర పురుషుడు లేడని, వ్యక్తావ్యక్తములు లేవని, మరి ఈ రకంగా కార్యకారణాలు ఏవీ లేవని, దానికదే ఉన్నదున్నట్లున్నదని, అవి స్థూల, సూక్ష్మ, కారణాలు కావని, వీటన్నింటికి ఆధారమైనటువంటి ప్రణవ బ్రహ్మము,  ప్రణవేశ్వరుడు కూడా కాదని, ఈ లేనివాటికి ఎవరైతే ఆధారమో వారున్నూ లేనివారే. ఈ లేని ప్రపంచానికి ఎవరైతే ఆధారమో, అట్టి బ్రహ్మకూడా లేనివాడే. ఇవన్నీ లేనెఱుక కాబట్టి, కారణ బ్రహ్మము కూడా లేనెఱుక. లేనెఱుక లేదు కనుక ఎఱుక బ్రహ్మము లేనివాడే. ఎఱుక బ్రహ్మము దాకా తెగ్గొట్టేస్తే, ఆ పైన ఎవరున్నారంటే బయలు. అన్ని రకాలుగా ఎఱుక సంబంధముగా ఉన్నవి ఏవీ లేవు అనేటటువంటి నిర్ణయంగా ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదుఅని చెప్తున్నాము. దాన్ని సున్నగా పెట్టాము. ఆ సున్నఎఱుకకు మూలం కాదు.

       నువ్వు అనుకుని కలగన్నావా? ఫలానా కలరావాలని కలగన్నావా? కల రాకూడదని పడుకున్నా కూడా కల వస్తోంది కదా! నీ ప్రమేయం లేకుండా కల వచ్చినట్లుగానే, ఆ ప్రణవాతీతమైనటువంటి ఉత్తబట్టబయలందు, నాద బిందు కళాతీతమైనటువంటి ఉత్తబట్టబయలందు, ఈ ప్రణవమనేది ప్రణవనాదమనేది, ప్రణవ బ్రహ్మమనేది, బ్రహ్మనాదమనేది, కారణ బ్రహ్మ, సర్వకారణ బ్రహ్మ, సర్వ కారణ ఈశ్వరుడు, ఇవన్నీ కూడా మాయచేత, లేకనే ఉన్నట్లు తోచారు. కలలో తోచినట్లు తోచారు. మూలకారణ అంశము కాబట్టి, తోచినవాడు, వీడు వేరుకాదు, వీరు కూడా మాయా స్వరూపులే. ఓంకారేశ్వరుడు, ప్రణవస్వరూపుడు మాయా స్వరూపులే. వీరంతా లేనివారే. ఉన్నంత కాలము లేని వారిగా, ఉన్నట్లున్నారు కాబట్టి, వీళ్ళని లేనెఱుక అనాలి. కలనుండి మేల్కొంటే ఏమీ లేదు. అలాగే ఇది లేనెరుక. లేనెఱుక ఎలా పోతుంది? యద్భావం తద్భవతి. భావాన్ని బట్టి ఎఱుక ఉన్నది. ఎఱుకను బట్టే ఉండుట ఉన్నది. ఎఱుక ఎట్టిదో, అట్టిదిగా ఉండడం జరుగుతుంది. ఎఱుక జీవుడు అంటే జీవుడుగా ఉండడం జరుగుతుంది. ఎఱుక ఈశ్వరుడు అంటే ఈశ్వరుడుగా ఉండడం జరుగుతోంది. ఎఱుక స్త్రీ అంటే, స్త్రీగా ఉండడం జరుగుతోంది. ఎఱుక అక్షరుడు అంటే, అక్షరుడుగా ఉండడం జరుగుతోంది. యద్భావం తద్భవతి’. అభావమందు ఎఱుకేలేదు. ఎఱుకే లేనప్పుడు అవ్వడం కూడా లేదు, ఉండడం కూడా లేదు, కనుక లేకుండుట అనేదే సత్యం.

       మరి ఉన్నది లేకుండా పోవాలంటే ఏమి చేయాలి? దాని మూలంలోకి వెళ్తే, ఇది లేకుండా పోతుంది. ఎలా? పృథ్వి జలంలోకి వెళ్తే, పృథ్వి లేదు. జలం అగ్నిలోకి లయమైతే జలం లేదు. అగ్ని వాయువులోకి లయమైతే అగ్ని లేదు. వాయువు ఆకాశంలోకి వెళ్తే వాయువు లేదు. అకాశము మహదహంకారములోకి పోతే ఆకాశము లేదు. మహదహంకారము మహత్తులోకి పోతే మహదహంకారము లేదు. మహత్తు అవ్యక్తంలోకి పోతే, మహత్తు లేదు. అవ్యక్తంతిరిగి వ్యక్తం కాకపోతే, ఉన్నది బయలు. అదే పరమ పదము.
       అవ్యక్తంతిరిగి మహత్తైతే అదే తిరిగి వస్తుంది. పునరావృత్తి కలిగి ఉన్నది. కనుక దీనికి చక్ర దోషం వచ్చింది. అవ్యక్తంలోకి తిరిగి వ్యక్తం అవ్వకూడదు. వ్యక్తావ్యక్తం కానిది ఒకటి పెడితే చక్రదోషం పోతుంది. ఆ చక్రదోషం పోవాలి అంటే, బయలే నిర్ణయం కావాలి. కనుక బయలు దేనికీ మూలం కాదు కనుక, ఎఱుకలో ఆఖరి మెట్టుగా, మలినపుటెఱుక పోగొట్టి, శుద్ధ చైతన్యానుభవంగా ఉన్న పరమాత్మ ప్రకాశానుభవం అన్న జ్ఞానాన్ని పోగొట్టుకుని, చివరికి విజ్ఞాన స్వరూపం కావాలంటే, ఆ విజ్ఞాన స్వరూపుడు బయలై ఉండాలి.

       బయలు నిర్ణయం కాకుండా, విజ్ఞానస్వరూపుడు అయితే, మళ్ళీ అతడు జ్ఞాన స్వరూపుడై, జ్ఞానియై, జ్ఞానమై అజ్ఞనానికి మూలకారణమై, అజ్ఞానాన్ని సృష్టిస్తాడు. తాను సృష్టించిన దాంట్లో, తానే ప్రవేశించి, సృష్టి కర్త బదులు, సృష్టిగా ఉన్న నామ రూప ప్రపంచాకారమే తాను అవుతాడు. నామ రూప ఆకారాలు తాను చెందుతాడు. తాను ఏమేమో అనుకున్నది తాను అయిపోతున్నాడు. తాను ఊహించిన నామరూపాదులు తన ఊహామాత్రంగానే ఉండి పోకుండా, అవిద్యాదోషం చేత, తానే ఆ నామరూపాలు అవుతున్నాడు. కనుక ఈ బ్రహ్మ సంకల్పం చేసి, సృష్టి చేసినప్పుడు ఆ బ్రహ్మే అవిద్య కారణంగా సృష్టితో తాదాత్మ్యం చెందినప్పుడు ఆ నామరూపాలే తాను అవుతున్నాడు. ఆ ఈశ్వరుడే తాను అవుతున్నాడు. ఆ జీవుడే తాను అవుతున్నాడు. మెల్లిమెల్లిగా క్రమక్రమంగా తనలో కలిగిన సంకల్పాలనుబట్టి దిగజారిపోతున్నాడు. సంకల్పమే ఎఱుక, నిర్వికల్పమే బయలు. సంకల్పం ఆగిపోయి నిర్వికల్పమైనా, తిరిగి సంకల్పములు పుట్టరాదు. అప్పుడు శాశ్వత నిర్వికల్పమే బయలు అవుతుంది. ఓంకారము యొక్క అవ్యక్తమే ప్రణవము. ప్రణవములో అవ్యక్త స్థితి ఉన్నంత సేపు, అది ఓంకారాన్ని సృష్టిస్తుంది. అనగా మహత్తుని సృష్టిస్తుంది. మహత్తు నుంచి మహదహంకారము, తన్మాత్రల సృష్టి పునరావృతి అవుతుంది. అందువల్ల దీనిని మనం అధిగమించాలి.

       ఈ చైతన్యానికి చలన గుణము ఉంది. వ్యాపకత్వము ఉంది. మళ్ళీ ఘన రూపము ఉంది. వ్యాపకత్వము కుంచించుకు పోవడము రెండూ ఉన్నవి. అసలు విశ్వమంతా కూడా బిందు స్వరూపం నుంచి వ్యాపకమై, కొంతకాలము వరకూ వ్యాపిస్తూనే ఉండి, కాల ప్రభావముచేత మళ్ళీ ఆ వ్యాపించినదంతా సంకోచిస్తూ, తిరిగి బిందురూపం అవుతుంది. వ్యాపకమౌతున్నంత సేపు సృష్టి జరుగుతూ ఉంటుంది. కుంచించుకు పోతున్నంత సేపు, సృష్టి మళ్ళీ లయమౌతూ, అవ్యక్తమౌతూ ఉంటుంది. కనుక ఉచ్ఛాస, నిశ్వాసాల్లో నీ ఊపిరితిత్తులు ఎలాగైతే వ్యాకోచిస్తూ, సంకోచిస్తూ ఉంటాయో, విశ్వం కూడా విశ్వ ఆవిర్భావానికి ఏ విధమైనటువంటి పరమాణు రూపం కాకుండా, అత్యంత సున్నితమైనటువంటి వాయువులు విశ్వరూపమై, అవి వ్యాకోచిస్తూ, సంకోచిస్తూ ఉంటాయి. వ్యాకోచిస్తూ ఉన్నంత సేపూ సూక్ష్మమై, స్థూలమై నామరూపమౌతూ ఉంటుంది. సంకోచిస్తూ ఉన్నంతసేపూ నామరూపాలు స్థూలంనుండి సూక్ష్మంలోకి, సూక్ష్మాలు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మహాకారణమందు లయమౌతాయి.

       ఈ మహాకారణము ఇవన్నీ కూడా వాయురూపమైనటువంటి మనస్సు, ఎందుకంటే బ్రహ్మమే మనస్సు. బ్రహ్మము నుండి మొట్టమొదటగా డైరెక్టుగా పుట్టినవాళ్ళు బ్రహ్మ మానసులు. అందుకని బ్రహ్మ మానసులు అంటే చైతన్యము ద్వారా నేరుగా వచ్చిన వాళ్ళు. చైతన్యమే తానై ఉన్నవాళ్ళు. చైతన్య నిష్ఠులు, బ్రహ్మనిష్ఠులు. ఆ చైతన్యమే అక్కడ దివ్యమనస్సు. వ్యష్టి మనస్సు రాక ముందు చైతన్యమే దివ్యమనస్సు. అదే బ్రహ్మమనస్సు. ఈ సృష్టి ఎలా వచ్చిందంటే, ప్రతీ దశలోనూ కొన్ని వ్యక్తమై సృష్టించబడ్డాయి. అన్నిటికి పరిణామం లేదు. బ్రహ్మం చైతన్యం అయితే, ఆ బ్రహ్మ యొక్క మనసైతే, ఆ మనసు ద్వారా బ్రహ్మమానస పుత్రులు బ్రహ్మనిష్ఠులుగానే పుట్టారు. దేహోపాధులు లేకుండానే పుట్టారు. ఆత్మ నుండి ఆకాశం వస్తే, ఆత్మ ఆత్మగా ఉండే ఆకాశంగా వచ్చింది కాని, ఆత్మ ఆకాశంగా మారలేదు. మళ్ళీ ఆకాశం నుండి వాయువు వస్తే, ఆకాశం అంతా వాయువు అవ్వలేదు. తొమ్మిది వంతులు ఆకాశంగా ఉండిపోయి, ఒక వంతు వాయువు అయ్యింది. వాయువునుండి అగ్ని వచ్చింది అంటే, ఒక వంతు వాయువు అగ్ని అయితే, తొమ్మిది వంతులు వాయువు, వాయువుగానే ఉంది. అలా మిగిలి ఉండకపోతే మోక్షానికి మీకు పరబ్రహ్మ దొరకడు. మాయా వరణములో పరబ్రహ్మ పరబ్రహ్మగా మూడు వంతులు వుంటే, ఒక వంతు బ్రహ్మ మాయావరణలో ఉంటాడు. అంతా మాయావరణలోకి దిగితే లక్ష్యమైన పరబ్రహ్మ ఉండదు. అప్పుడు మోక్ష ప్రసక్తియే ఉండదు. అటువంటి మూడు వంతులు బ్రహ్మ బ్రహ్మగా ఉంటే, ఒక వంతు బ్రహ్మము ఆకాశము అయ్యింది.  ఆకాశం తొమ్మిది వంతులు అలా వుండగా, ఒక వంతు వాయువు అయ్యింది. అందుకే అపంచీకృతమైనవన్నీ కూడా ఉన్నాయి.  అంతా ఆకాశములోకి దిగిపోతే అప్పుడు మోక్షం పొందడానికి ఏమి ఉందని? కొంత అలాగే ఉంటూ మిగతా సృష్టి పరిణామం చెందింది. కాబట్టి, ప్రతీ దశలోనూ దిగబడి ఉన్నాయి కొన్ని. ఆ దిగబడి ఉన్నటువంటివన్నీ మనకి ఇప్పుడు, తిరుగు ప్రయాణంలో అనుభవంలోకి వస్తే మనం పొందగలుగుతున్నాము.

       ఆత్మ కూడా ఎఱుకే! పరమాత్మ కూడా ఎఱుకే. చైతన్యము కూడా ఎఱుకే!  బ్రహ్మ నిష్ఠ అంటే ఎఱుక యొక్క స్థిరత్వము. ఎఱుక కాసేపు స్థిరంగా ఉంటుంది. కాసేపు వ్యాపకం అవుతుంది. కనుక ఆ స్థిరమైన ఎఱుకను, బ్రహ్మనిష్ఠ అన్నాము, ఆత్మనిష్ఠ అన్నాము. మళ్ళీ అది నిష్ఠ అన్నప్పుడు శాశ్వతముగా ఉండాలి. అంటే అచలం అవ్వాలి. నిష్ఠ అనే పేరే చెరిపేసి, అచలం అనే పేరు పెట్టాలి. అచలం అంటే, ఏమిటంటే ఎప్పటికీ, ఎప్పటికీ కదలదు. అచలం సిద్ధించకపోతే అవ్యక్తంగా ఉన్నప్పుడు బ్రహ్మనిష్ఠలో ఉండి, వ్యక్త స్థితిలోకి జారిపోతాడు. దిగజారిపోతాడు. అందువల్ల మనకు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక దశల వారీగా, ప్రతీ దశలో కూడా ఆ దశకు సంబంధించినటువంటి అనుభవమును అనుభవించి, ఆ అనుభవాన్ని అనుభవింప చేసేటటువంటి గురుతత్త్వం సహాయముగా ఉంటూనే ఉంటాయి. అందుకే  మెహెర్‌బాబా చెప్తారు. అన్ని భూమికలలోనూ, అన్ని భూమికలకు ఆవల కూడా ఉన్నారు, భూమికకు, భూమికకు మధ్య సందులో ఉండి, ఒక శిష్యుడు తన భూమికని, ఒకటో భూమికను అధిగమించి, రెండవ భూమికకు చేరాలంటే, ఒకటి - రెండు మధ్యలో ఉన్నటువంటి గురుతత్త్వము, అవతార తత్త్వము, భగవంతుడు క్రింది భూమికనుంచి, పై భూమికకు అనుభవానికి, అధిగమించడానికి అక్కడ సహాయపడుతాడు. గురువే ఉండక్కర్లేదు. ఆ భూమిక మధ్యలో ఆ భూమికానుభవం పొందుతున్నటువంటివారు ఉంటారు. అటువంటి వారిలో మమైకం అయినప్పుడు వారి అనుభవమే నీ అనుభవంగా నీకు సంక్రమిస్తుంది. ఇదీ వ్యవస్థ. ఆధ్యాత్మిక వ్యవస్థ.

       అవతార పురుషుని యొక్క సచ్ఛిష్యులతో దశల వారీగా ఆ దిగువ వారికి పై వారు సహాయం చేసే పద్ధతిలో ఒక నెట్‌ వర్క్‌ ఉంది. దానినే మండలి సభ్యులు అంటారు. ఆ నెట్‌వర్క్‌ ద్వారా అవతార తత్త్వము, చైతన్యానుభవాలు, గురు తత్త్వము ఆ జ్ఞాన భూమికలని, చైతన్య భూమికలని అధిగమింపచేస్తూ, అనుభవాలు పొందిస్తూ, ఉద్ధరించబడడం అనేటటువంటిది ఈ సృష్టితో పాటే అది కూడా వచ్చింది. ఈ సృష్టితో పాటే అదీ ఉన్నది. అది లేకపోతే ఎవరు అధిగమిస్తారు? అజ్ఞానంలో కూరుకున్నవారు ఎప్పటికీ అజ్ఞానంలోనే ఉంటారు. యద్భావం తద్భవతిగానే ఉంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. తనని తాను ఉద్ధరించుకోలేడు. వీళ్ళని ఉద్ధరించేవాడు ఒకడు కావాలిగా! అందుకే మహత్తు అనేటటువంటి సృష్టి ఎప్పుడు కలిగిందో, ఆ మహత్తు నుంచి గురుతత్వం వచ్చింది. ఆ తరువాతే మహత్తు నుంచి ప్రకృతి శక్తులు వచ్చి, సృష్టి అంతా వచ్చింది. మొదట్లో వచ్చిన గురుతత్త్వంలో ప్రకృతి శక్తులు అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఆ ప్రకృతి శక్తుల కంటే, ఇంకా గొప్ప శక్తులు ఆ గురుతత్త్వం కలిగి ఉన్నది. కనుక ప్రకృతిని శాసించ గలిగేటటువంటిది గురుతత్త్వము.

       ఎఱుక - బయలు అనేదానిని విడమరచుకోవాలి. అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి ఎఱుక  జ్ఞాన రూప అఖండ ఎఱుక వ్యక్త స్థితిలో ఉన్న ఎఱుక మూడు గుణాలచేత మలినపుటెఱుక, మిశ్రపుటెఱుక, కేవలపుటెఱుకగా జగత్తుగా, జీవుడుగా, ఈశ్వరుడుగా వ్యవహారం జరుగుతోంది. ఇది అంతా ఈ రకంగా ఎఱుక యొక్క లీలా విలాసం. మాయ యొక్క లీలా విలాసం. ఎఱుకన్నా, మాయన్నా ఒక్కటే. చైతన్యం యొక్క లీలావిలాసం, చిద్విలాసం. చైతన్యమన్నా, ఎఱుకన్నా, మాయన్నా ఒక్కటే. కనుక ఈ ఎఱుకకు మూలం లేదు అన్నప్పుడు, ప్రణవానికి మూలం లేదు అన్నప్పుడు, దేనికీ మూలంకాని బయలే ఉన్నది. అది ఉత్తబట్టబయలు ఏమీ లేదు. కనుక ఈ ప్రణవం దాకా ఎవరైతే సాధన చేత అధిగమిస్తారో, కుండలినీ చేత అధిగమిస్తారో, వేరే ఉపాయం చేత, అనుష్ఠానం చేత అధిగమిస్తారో, ఎఱుక బ్రహ్మమై ఉంటారు. ప్రణవ స్వరూపులై ఉంటారు. ఓంకార స్వరూపులై ఉంటారు. వారికే ఆ పరమపదమైనటువంటి ఉత్తబట్టబయలు, దానికి మూలం కాదని, షోడశి, ద్వాదశి మంత్రాలతోటి తన వెనుకున్నదంతా కూడా ఎఱుక పరంగా ఏమీ లేదని, సున్నా ని పెట్టుకుని, ఆ సున్నాని దర్శించి, ఆ సున్నా ద్వారా మనం రాలేదనుకుని, సున్నా ద్వారా రానప్పుడు గొడ్రాలి బిడ్డ అనుకుని, మనకు మనమే ఒక తల్లి ఉందనుకుని, ఒక మాతృక ఉందనుకుని, ఆ తల్లిదండ్రులున్నారనుకుని, దాని పేరే బ్రహ్మ అని పేరు పెట్టి, అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాము. తీరా చూస్తే, ఆ బ్రహ్మ నీకు మూలం కాదు కాబట్టి, ద్వాదశి, షోడశి మంత్రాలచేత నేనే లేకుండా పోయే పద్ధతిలో పోవాలి. అంటే,  నీకు అతీతంగా ఉన్నటువంటి, నాద బిందు కళాతీతంగా, ప్రణవాతీతంగా, సకల ఎఱుకలకు అతీతంగా ఉన్నటువంటి, ఉత్తబట్టబయలు అనే సున్నాని దర్శించడం ద్వారా గురువు దర్శింప చేస్తే, ఆ పరబయలు దర్శనమైనటువంటి నీవు, గురువు ద్వారా ఎఱుక విడిచి, మాయను దాటి, మాయకు పరమైన, మాయాత్పరమైన బయలు, ఎఱుకకు పరమైనటువంటి, చైతన్యానికి పరమైనటువంటి, చిత్పరమైనటువంటి బయలు, వ్యక్తమయ్యే ఆస్కారమున్న అవ్యక్త పరమునకంటే కూడా పరమైనది పరాత్పరమునకు లక్ష్యము పెట్టుకుని, అదిగా మిగిలి ఉంటాడు. దానిని లక్ష్యంగా పెట్టుకుని, గురువు ఎఱుక విడిపించగానే, శిష్యుడు పరబయలు దర్శించగానే తను గొడ్రాలిబిడ్డ సామెతగా, మూలం లేదని తెలిసి నాద బిందు కళా తీత స్థితిలో, ప్రణవాతీత స్థితిలో తాను బట్టబయలై ఉంటాడు. ఇదీ పరమపదము.

       లోకంబులు, లోకేశులు, లోకస్థులు దెగిన తుది నలోకంబగు, పెం
       జీకటి కవ్వల నెవ్వడు | నేనాకృతిగా వెలుగు నతని నే సేవింతున్‌ ||

       అక్కడ అకార, ఉకార, మకారములు కూడా త్రిపుటిలో లోకములు, లోకేశులు, లోకస్థులు అనే పద్ధతిలో కూడా తీసుకోండి. ఈ మూడూ కూడా ఎఱుకే కాబట్టి, ఎఱుక లేనిది కనుక మూడూ తెగిపోవాలి. కానీ మూడూ జట్టుకట్టి ఒకదానిని మించి ఒకటి, ఒకదానిని బట్టి ఒకటి ఉంటోంది. లోకము ఉంటేనే ఆ లోకానుభవంలో లోకస్థులు ఉన్నారు. లోకేశ్వరుడైనటువంటి ఈశ్వర సంకల్పం చేతనే, ఈ లోకస్థులైనటువంటి జీవులు తోస్తున్నారు. లోకేశుడు లేకపోతే లోకస్థులు లేరు. లోకస్థులుంటే తనకు కారణం ఆ లోకేశుడనే అనుష్ఠానం చేసుకుంటాడు. లోకాలేమో నామ, రూప, ప్రపంచాలుగా లేక నామరూపాలు లేకపోతే సూక్ష్మ ప్రపంచాలుగా, లేక ఏడు అథోలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలుగాను, ఊరనీఈ్వలోకాలు ఏడుగా భూలోక, భువర్లోక, సువర్లోక, జనలోక, మహాలోక, తపోలోక, సత్యలోకాలుగా ఈ పద్నాలుగులోకాలు సృష్టించబడ్డాయి.

       ఎవరిచేత సృష్టించబడ్డాయి? సృష్టి అంటే కల్పితం అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి చేత కల్పించబడ్డాయి? పంచబ్రహ్మల చేత. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. వీరిచేత కల్పించబడ్డాయి. వీరిలో ఈశ్వరుడు చేత లోకాలు కల్పించబడ్డాయి. ఆ లోకానుభవం పొందడానికి, ఆ లోకానుభవ వాసన ఉన్నటువంటి జీవులు, ఆ లోకంలో తగినటువంటి అనుభవము పొందడానికి, అనుగుణమైనటువంటి శరీరాన్ని సృష్టి కర్త బ్రహ్మ సృష్టిస్తే, ఆ లోకానుభవం పొందేదాక, విష్ణువు ఆ ఉపాధులను పోషిస్తే, ఆ ప్రారబ్దం, ఆ కర్మానుభవం, ఆ సాధనానుభవం. ఆ లోకానికి సంబంధించినది పూర్తికాగానే, ఆ లోకానికి సంబంధించిన ఉపాధిని రుద్రుడు లయం చేసుకుంటే, ఆ లోకములలో లోకానుభవానికి సంబంధించిన సంస్కారములు ఏ లోకస్థులకు ఉన్నవో ఆ లోకస్థులను ఆయా లోకాలలోకి ఆకర్షించేవాడు సదా శివుడు. ఇలా పంచబ్రహ్మలు లోకేశులు లోకస్థులను, లోకంబులను కల్పిస్తూ ఒక ఆట ఆడుతున్నారు. లోకమంటే మాయాకల్పితమైనది కనుక ఎఱుకే. లోకేశులు, కూడా ఎఱుకే. ఈశ్వరుడు కూడా ఎఱుకే. సచ్చిదానంద పరమాత్మ ఎఱుకే. లోకస్థులు 14 లోకాల్లో, ఊహాలోకాల్లో, స్వప్నలోకాల్లో ఎక్కడ ఉన్నా వారుకూడా ఎఱుకే. ఎఱుక మూడు రకాలుగా ఉన్నదని తెలిస్తే, ఆ ఎరుకపోతే అలోకంబగు, లోకం లేనప్పుడు లోకానుభవం లేదు. లోకానుభవం ఇచ్చేటటువంటి ఈశ్వరుడు లేడు. లోకానుభవాన్ని అనుభవంగా తీసుకునేటటువంటి లోకస్థులు లేరు. ముగ్గరూ లేకపోతే ఏమైందట? ముగ్గురి లేనితనమే పెంజీకటి. ఇక్కడ బయలు పెను చీకటి కాదు. బయలు వెలుగుకాదు. బయలు చైతన్యం కాదు. బయలు ప్రకాశము కాదు. బయలు చీకటి కాదు. చీకటి వెలుగులు రెండూ బయలు కాదు.  కనుక పెను చీకటి అంటే గాఢ తమస్సు, మూలావిద్య, మూల ప్రకృతి. వీటికి ఆవల ఏదైతే ఉన్నదో, అది మాత్రమే ఉన్నదో, దేనికినీ మూలము కాదో అదే ఉత్తబట్టబయలు ఏమీలేదు.

       ఆత్మ ప్రకాశము అంటున్నాము, పరమాత్మ ప్రకాశము అంటున్నాము. ఈ పరమాత్మ ప్రకాశము లేకపోతే, అది పెను చీకటి. పెనుచీకటి అంటే అర్థం ఏమిటి? సృష్టికి పూర్వం గాఢ తమస్సు ఉంది. లోకంబులు, లోకేశులు, లోకస్థులు లేనప్పుడు గాఢతమస్సే పెనుచీకటి రూపంలో ఉంది. ఈ త్రిపుటిని ప్రకాశింపజేసే ప్రకాశం పరమాత్మ ప్రకాశం ఎప్పుడైతే తురీయస్థితిలో ఉంటుందో, సర్వవ్యాపక స్థితిలో ఉంటుందో, దాంట్లో సృష్టిని సంకల్పించి, వ్యక్తం చేసేటటుంవంటి జ్ఞానవాసన ఉన్నదో, దాని ప్రకారం పంచబ్రహ్మల ద్వారా లోకంబులు, లోకేశులు, లోకస్థుల యొక్క సృష్టి జరిగింది. జరిగనవన్నీ ఆ ప్రకాశంలో తెలిసినాయి కాబట్టి, వీటియందు కూడా ఆ ప్రకాశం ప్రతిఫలించి ఉంటోంది. స్వయం ప్రకాశం, అక్కడ ప్రతిబింబ ప్రకాశంగా లేనప్పటికీ బింబప్రకాశం ఎప్పుడూ ఉంటుంది, అన్నిటిలో. కానీ, బింబ, ప్రతిబింబ ప్రకాశాలు రెండూ ఉన్నవి. ప్రతిబింబ ప్రకాశ వ్యవహారానికి, బింబ ప్రకాశము ఆధారము అధిష్టానము. ఆధారమైనప్పుడేమో ఎఱుక బ్రహ్మ ప్రకాశమైనది. అధిష్ఠానమైనటువంటిది తనకు తానై ఉన్న పరబ్రహ్మ ప్రకాశము అయి ఉన్నది.

       ఈ మూడూ తెగాలి. ఈ మూడు తెగితే అలోకమైనది. ఆ లోకంబులు, లోకేశులు, లోకస్థులు మూడు లేవు. వాటి యొక్క అనుభవాలు కాని, వాటియొక్క ఎఱుకలు కాని, అవి అనుభవించేటటువంటి, జ్ఞాత అనేటటువంటి, జ్ఞాతగా ఉనికి అనేటటువంటి ప్రకాశము లేదు. జ్ఞేయ వస్తువు ప్రకాశము లేదు. జ్ఞాన ప్రకాశము లేదు. ప్రకాశమే లేదు అన్నిరకాలుగా. అందుకని అది పెనుచీకటి పెనుచీకటికావల ఏకాకృతిగా ఏదైతే ఉన్నదో అది ఉత్తబట్టబయలు ఏమీ లేదు. దానినే సేవింతున్‌’ - నేను ఏకాకృతి వెలుగునతనిసేవింతున్‌’’ అతని అంటే ఆ పరమపురుషుడు, పురుషోత్తముడు, బయలే తానైనటువంటివాడు అచల పరిపూర్ణుడే తానైనటువంటివాడు, ‘వాడిని నేను సేవింతున్‌’ - వాడిని ఎలా సేవిస్తారయ్యా? ఎఱుకైతే అనుష్ఠాన పూర్వకంగా సేవించవచ్చు. బయలుని ఎలా సేవిస్తారు? బయలును సేవించడం కుదరదు.
       కనుక బయలైనటువంటి అశరీర గురువును సేవించండి. అది మళ్ళీ ఎలా సేవిస్తారు? అశరీరి గురువు శరీరం లేనివాడు కాబట్టి, మీ భావనలో శరీరం లేనివాడుగా భావన చేసి సేవించాలి. సద్గురువుకి ఒక స్థానం లేదు గనుక బయలందు స్థానం లేదు కనుక ఎఱుకకి ఎఱుక విడిచే స్థానం ఉన్నది. ఆ స్థానాన్ని అదే కల్పించుకుంది. దేశ కాల వస్తువులని, దేశ కాల వస్తువులందు ఎఱుక ఆ స్థానమందు నిలిచి వున్నది. మళ్ళీ స్థానము, పదవి వీటిని వెనక్కి తీసుకుంటే, జీవుడికి జీవుడనే పదవి, ఈశ్వరుడికి ఈశ్వరుడనే పదవి ఉన్నది. ఏ పదవీ లేనిది పరమపదము. ఏ పదమూ, ఏ పదవీ లేనిది పరమపదము. కనుక ఈ పదవిలన్నీ కూడా ఎఱుకలోనే ఉన్నవి. అందుకని స్థానము లేదు అశరీర గురువుకి. ఎఱుకలోనే స్థానాలున్నాయి. బయలైన గురువుకు స్థానం లేదు. బయలైన గురువు అభావం. ఆత్మ కూడా శుద్ధ సత్వగుణం అని చెప్పాము. ఆత్మ - శుద్ధ సత్వగుణం. అనాత్మ - శుద్ధ తమోగుణం. రెంటియొక్క మిశ్రమం  నేను, నేను అనే నీవు, ఈ రజోగుణం. ఆత్మ త్రిగుణ రహితం గనుక శుద్ధ సత్వగుణం కూడా పోవాలి. శుద్ధ సత్వగుణం కూడా పోతేనే బయలు. మూడుగుణాలు లేకపోవడమే బయలు. రహిత పద్ధతిగా పోవాలి. మళ్ళీ వచ్చేపద్ధతిగా కాదు. వ్యక్తావ్యక్త పద్ధతి కాదు. రహిత పద్ధతి అన్నప్పుడు వ్యక్తావ్యక్తము కాదని, రహిత పద్ధతిలో ఏమీలేదు అనేది శాశ్వతము.  అది పెను చీకటికి ఆవల ఏకాకృతిగా వెలుగు’ - ఎవరు వెలుగుతున్నారు? అశరీరి గురువు వెలుగుతున్నారని, అటువంటి గురువును సేవించాలి. చతుర్విధ శుశ్రూషల ద్వారా, అంగ స్థాన భావ ఆత్మలు లేనివని, శిష్యుడు కూడా తన పరంగా అంగ, ఆత్మ, స్థాన, భావ, ఆత్మలు లేనట్టి పద్ధతిలో, ఆ గురువుని ఇంట, వెంట, జంట పెట్టుకుని వెంబడించి, గురుశుశ్రూష చేస్తే, అటువంటి గురువును సేవించినప్పుడు, శిష్యుడు లేకుండా పోతాడు. అప్పుడు ఉనికి నాలుగు విధాలుగా ఉండే అవకాశం లేదు. గురువును అశరీర పద్ధతిగా, అంగ రహిత పద్ధతిగా, స్థాన రహిత పద్ధతిగా, భావ రహిత పద్ధతిగా, ఆత్మ రహిత పద్ధతిగా, శిష్యుడు ఆ గురువుకి సేవ చేసినప్పుడు శిష్యుడు లేకుండా పోతాడు. అంటే, గురుసేవ అన్నా, గురుశుశ్రూష అన్నా, ఆ శుశ్రూష ద్వారా శిష్యుడు లేనివాడు అవుతాడు. నాలుగు పద్ధతుల్లో ఉన్నవాడు కాబట్టి, ఈ నాలుగు పద్ధతుల్లో గురుశుశ్రూష చేస్తే, ఆ శిష్యుడు నాలుగు పద్ధతుల్లో లేకపోతే, ఇక ఏ పద్ధతిగానూ ఉండడు. ఇక ఏ పద్ధతిగానూ లేకపోతేనే బయలే ఉన్నది.

       అంతర్జ్యోతి బహిర్జ్యోతి | ప్రత్యక్‌ జ్యోతిః పరాత్పరః |
       జ్యోతిర్జ్యోతి పరంజ్యోతిః | ఆత్మజ్యోతిః శివోస్మ్యహం ||

       ఇది సాధన గురించి చెబుతున్నారు. బయట ప్రపంచం కనబడుతోంది బహిర్ముఖంగా ఉన్న ఇంద్రియాలకి. కాసేపు ధ్యాననిష్ఠుడై జ్యోతిని ధారణ చేస్తే, జ్యోతి ఆకారం చెందినటువంటి స్థితి అంతర్ముఖంలో కలిగితే, అంతర్జ్యోతి అయ్యింది. సర్వం ఖల్విదం బ్రహ్మంగా అయినప్పుడు, బయట నామరూప ప్రపంచాన్ని కూడా, విశ్వరూపంగా, బ్రహ్మాకారంగా చూసినప్పుడు అది బహిర్జ్యోతి అయినది. బ్రహ్మనిష్ఠలో ఉన్నవాడు అంతర్జ్యోతి. సర్వం ఖల్విదం బ్రహ్మగా ఉన్న జ్ఞాన దృష్టిచేత బహిర్జ్యోతి. లోపల ఉన్నటువంటి, బయట ఉన్నటువంటివి రెండు ఉంటాయా? లోపల, బయట అనేటటువంటిది ఏదైతే విభజనగా ఉంటుందో, సాధకుడు లోపల బ్రహ్మనిష్ఠుడిని, ఇంద్రియముల యొక్క బయట వ్యాపారం చేత, బయట ప్రపంచం తోస్తుంది. అపుడు లోపల, బయట అనే పేరు పెట్టాల్సి వచ్చింది. ఈ లోపల, బయట అనేది లేదు కాబట్టి అలా లేకుండా పోవడం కష్టం. బ్రహ్మనిష్ఠలో, అంతర్ముఖ సాధనలో, లోపలిది జ్యోతి స్వరూపంలో గోచరించింది. బయట కూడా నామ రూప జగత్తులో, జగత్తు కూడా బ్రహ్మమే. ఆ బ్రహ్మమే జగదాకారుడు, విశ్వాకారుడు, విశ్వరూపుడు అయ్యాడని, విశ్వరూప సందర్శనం జరిగింది (అర్జునినికి) అంటే, బ్రహ్మం విశ్వరూపంలో ఉన్నాడు అనేటటువంటి జ్యోతి దర్శనం జరిగింది. బహిర్జ్యోతి దర్శనం జరిగింది. విశ్వాన్ని నామ రూపంగా కాకుండా, విశ్వాన్ని కూడా జ్యోతి రూపంగా చూడడమే జ్ఞాన నేత్రము, జ్ఞాన చక్షువు, జ్ఞాన దృష్టి. ఆ దృష్టిని ఇచ్చాడు విశ్వరూప సందర్శనానికి కృష్ణపరమాత్మ. అర్జునునికి ఆ దివ్య దృష్టిని ఇచ్చాడు. ఆ దివ్య దృష్టితో విశ్వాన్ని దివ్యత్వంగా, దైవీచైతన్యంగా, చైతన్య రూపంగా చైతన్యం యొక్క విభూతులే దానియందున్నట్లుగా చూచాడు.

       అనేక ఆభరణాలన్నిటిలో కూడా విడివిడిగా ఆభరణాల యొక్క సొగసు, ఆకర్షణ చూడకుండా, ఆ ఆభరణాలలో ఉన్నది బంగారమే అనే దృష్టి తోచినప్పుడు, విశ్వసందర్శన, విశ్వరూప సందర్శన అలా చూసినప్పుడు బయట, లోపల కూడా జ్యోతి స్వరూపమే. అప్పుడు జ్యోతి స్వరూపం ఎప్పుడైతే బయట, లోపల దర్శనమైందో, వెంటనే లోపల, బయట అనే విభజన చెరిగిపోయి, ఒకే ఒక జ్యోతి ప్రత్యేకంగా, స్పెషల్‌గా కనబడుతోంది. అది ప్రత్యక్‌ జ్యోతి. ఈ ప్రత్యక్‌ జ్యోతియే పరాత్పరము. పరము అన్నప్పుడేమో అంతర్జ్యోతి,  బహిర్జ్యోతి, అంతర్జ్యోతి ఎప్పుడైతే ఒక్కటి అయ్యిందో, అది ప్రత్యక్‌ జ్యోతి. ఈ ప్రత్యక్‌ జ్యోతిలో ఏముంది? బహిర్జ్యోతేమో అనాత్మప్రపంచము. అంతర్జ్యోతేమో, అనాత్మకి పరమైనది పరమాత్మ. బహర్జ్యోతి అనాత్మ సంబంధమైతే, అంతర్జ్యోతి పరమాత్మ. అనాత్మకి పరమాత్మ పరమైతే, పరమాత్మకి పరమైనది పరాత్పరం. కనుక ఈ ప్రత్యక్‌ జ్యోతి పరాత్‌పరం అయ్యింది. పరమునకంటే పరం.

       అజ్ఞానమునకు పరమైనది జ్ఞానము. జ్ఞాన, అజ్ఞానములకు పరమైనది పరాత్పరం. అనాత్మ జడము. అనాత్మ భావన అజ్ఞానము. ఇలాగా పరము, పరము అని రెండు పరములు పెట్టాము. ఒక పరమేమో అనాత్మకంటే పరమైనది పరమాత్మ. రెండవ పరమేమో పరమాత్మ కంటే పరమైనది పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మమే పరాత్‌ పరం. ఈ పరబ్రహ్మానికి సరిగ్గా నిర్వచనం చెబితే, ఆ నిర్వచనం ప్రకారంగా, పరాత్‌ పరం సరిపోతుంది. ఆ పరబ్రహ్మాన్ని సృష్టికి బీజ ప్రదాతగా పెట్టుకుంటే, మరి పరాత్పార పరబ్రహ్మము అని మూడు పరాలు పెట్టాల్సి వస్తుంది. వీరు ఆ పరబ్రహ్మని బయలుగా నిర్ణయిస్తే, అదే పరాత్‌పరం. ఒక పరబ్రహ్మ తాను కారణమైతే సృష్టికి, కారణమైన బ్రహ్మకి పరమైనవాడు పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ దేనికీ కారణం కాదు అనగానే, అక్కడికి బయలు నిర్ణయం అయిపోయింది. ఇంకా ఏమీ అక్కర్లేదు. కొందరు ఏమంటున్నారంటే, ఆ పరబ్రహ్మ సృష్టికి బీజ ప్రదాత అంటున్నారు. అప్పుడు ఈ పరాత్పరుడే పరబ్రహ్మ అయినప్పడు, సృష్టికి అతీతంగా దేనికీ సంబంధం లేకుండా, తనకు తానే స్వతఃసిద్ధమై ఉన్నవాడే, బట్టబయలై ఉన్నవాడే కదా ఆ పరబ్రహ్మ!! అందువలన పరాత్పర పరబ్రహ్మ అని పేరు పెట్టవలసి వచ్చింది.

       ఎఱుక ఉన్నంతసేపూ ఒక పర చేర్చాలి. పరబ్రహ్మ జ్ఞానం నాకు అయ్యింది అన్నారంటే, దానికి పరమైనది బయలు అనాలి. జ్ఞానాతీతం అది. బయలు అనేది జ్ఞానాతీతం.

       జ్యోతిర్జ్యోతి పరం జ్యోతిః’ - ఇక్కడేమయ్యింది? ఇన్ని జ్యోతులు కలిపి ఒకే జ్యోతి అయ్యింది. బహిర్జ్యోతి కూడా అంతర్జ్యోతి తోటి సమానం అయ్యింది. ఎప్పుడైతే సమానం అయ్యిందో, అది ప్రత్యక్‌ జ్యోతి అయ్యింది. అద్వయంగా ఉన్నది. రెండవది లేని, ఏకమేవాద్వయంగా ఉన్న జ్యోతి. ఆ జ్యోతియే పరాత్పరం. ఈ పరాత్పరమైనది. ఇక్కడ ఒకమాట చూడండి. బ్రహ్మ యొక్క లక్షణాలు పరబ్రహ్మయందు లేవు. ఆత్మయొక్క లక్షణాలు పరమాత్మయందు లేవు. ఆ బ్రహ్మము పరమాత్మ, సత్‌చిత్‌ ఆనందమైతే, పరబ్రహ్మమందు సచ్చిదానందము లేదు. కనుక పరాత్పర అనేదాంట్లో సచ్చిదానందము లేదు అనేటటువంటిది గ్రహించాలి.

       పరుడు కాని వాడిలో అనృత జడ దుఃఖములు ఉన్నవి. పరుడైన వాడిలో సత్‌, చిత్‌, ఆనందము ఉన్నది. పరాత్పరుడైన వాడిలో సచ్చిదానందము లేదు. పరుడు కాని వాడికి అనృత జడ దుఃఖములు ఉన్నవి. పరుడైన వాడికి అనృత, జడ, దుఃఖములులేకపోగా సత్‌ చిత్‌ ఆనందముఉన్నది. పరాత్‌ పరడైనవాడికి సత్‌ చిత్‌ ఆనందముకూడా లేదు. అది కూడా లేకపోవడమే త్రిగుణ రహితము.

       ఎందుకని? ఆనందం అనేటటువంటిది సత్‌ అనేటటువంటి ఉనికి మాయావరణలోనే ఉన్నది. ఆ ఉనికి యొక్క అనుభూతి ఏదంటే, శుద్ధ సత్వగుణం. సత్‌చిత్‌ఆనంద అనుభవం అనేది శుద్ధసత్వగుణం వల్ల వచ్చింది. ఆ శుద్ధసత్వగుణం కూడా రహితమైతే, సత్‌చిత్‌ఆనందము కూడా ఉండదు. సత్‌అనేటటువంటి, శాశ్వత ఉనికి అనేటటువంటి చైతన్యానుభవం ఉండదు. చైతన్యం ఉంటేనే అనుభవం. విడగొట్టి చెప్పినప్పటికి సత్‌చిత్‌ఆనందం అనేది ఒకటే రూపం, ఒకటే లక్షణం. సత్తేచిత్తు, చిత్తేసత్తు. చిత్తు ఉన్నటువంటి ఉనికి యొక్క అనుభూతి ఏదో, అది ఆనందము. మూడు కలసి ఒకటే లక్షణం. ప్రకృతిని బట్టి అనృత, జడ, దుఃఖములకు వ్యతిరేకార్థములో సత్‌ చిత్‌ ఆనందము సృష్టించబడింది. కనుక పరము అనేది సృష్టించబడినప్పుడు, అది కూడా కల్పితమైనప్పుడు సత్యవస్తువు పరాత్పరం అనబడుతుంది.

       జ్యోతిర్జ్యోతి పరంజ్యోతిః’ - మరిక్కడ పరంజ్యోతికి ఏం చెప్పాలి? జ్యోతిలో జ్యోతి. జ్యోతియే తానైనటువంటి జ్యోతి. నేను నేనైన నేను, తనలో తాను రమించేటటువంటి బ్రహ్మము. ఇది జ్యోతిర్జ్యోతి. ఆ రమించుట ఆగిపోతే, అది పరంజ్యోతి. జ్యోతిలో ఉన్నటువంటి, తనలోతాను రమించుట అనేటటువంటి అద్వైత స్థితి ఏదైతే ఉన్నదో, జ్యోతికి పరమైనటువంటి పరంజ్యోతియని ఎప్పుడైతే అన్నామో, జ్యోతిలో ఉన్న తనలో తాను రమించుట అనేటటువంటిది కూడా పోయింది. దానికి కూడా అతీతం. దానికి కూడా విలక్షణం. పరంజ్యోతి అంటే బయలే. తనలోతాను రమించుట కూడా లేనిది పరంజ్యోతి. జ్యోతి అని పేరు పెట్టినప్పటికీ జ్యోతికి పరమైనది, జ్యోతి యొక్క లక్షణాలు లేనిది, ఆనంద లక్షణాలు లేనిది అని తీసుకోవాలి.

       ఆత్మజ్యోతిః శివోస్మ్యహం’ - ఆత్మ అంటే ఇక్కడ ఎవరు? సచ్ఛిష్యుడే అటువంటి పరంజ్యోతి స్వరూపుడు అయ్యాడు. ఆ సచ్ఛిష్యుడు జ్యోతి స్వరూపాన్ని పొందినప్పుడు  ఆ పరంజ్యోతియే ఈ జ్యోతి. ఆ జ్యోతి పరంజ్యోతియే! లోపలి జ్యోతియైనటువంటి సాక్షాత్కారము, బయటకూడా లోపలున్న జ్యోతినే దర్శించడము. ఈ దర్శించినటువంటి బయట, లోపల ఒకటే అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ అపరోక్షానుభూతి ప్రత్యక్‌జ్యోతి. ఈ అపరోక్షానుభూతిలో ఉన్న సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మఅని ఏదైతే ఉన్నదో అది పరం. ఆ పరమునకు పరమైనది బయలు. పరాత్పరం. మళ్ళీ జ్యోతినుంచి క్రిందికి వచ్చాము. జ్యోతిర్జ్యోతి  జ్యోతియే అంతరాత్మకూడా! జ్యోతి యొక్క అంతర్యామి కూడా జ్యోతియే.

       మొదటి జ్యోతి ప్రకాశము, రెండవ జ్యోతేమో ప్రకాశ ఘనము. మొదటి జ్యోతి ఆవరణ ప్రకాశము. రెండవజ్యోతి నిరావరణ జ్యోతి. అసలు నిరావరణ జ్యోతియే సత్యం. మాయకల్పించిన ఆవరణలో ఉన్నటువంటి ప్రకాశము, మాయావరణలో ఉంది కనుక, మాయయొక్క నిర్వచనం చేత, ఆ ప్రకాశం లేనిది కనుక, ఆజ్యోతి లేదు. కనుక ఇప్పుడు ఒక జ్యోతి స్వరూపుడు మాయావరణలో ప్రకాశిస్తూ ఉన్నప్పడు, ఆ మాయావరణ ప్రకాశమే పరమాత్మ అయినప్పుడు అది ఎనిమిదవ శరీరం అయినప్పుడు, ఆ శరీరం పేరు ఏమిటి? జ్యోతిర్మయ శరీరము. జ్యోతి యొక్క ప్రకాశం చేత వ్యాపకమైనది జ్యోతిర్మయం. ఆ జ్యోతిర్మయమే మాయావరణ యందు పరమాత్మ. ఆ పరమాత్మే అష్టతనువులలో ఎనిమిదవ శరీరము. కనుక జ్యోతిర్మయం అనేటటువంటి శరీరానికి అంతర్యామి, అంతరాత్మగా ఉన్నటువంటి జ్యోతియే ఆ పరబ్రహ్మ.

       జ్యోతిర్జ్యోతి’ - ఈ పరబ్రహ్మ ఇప్పుడు ఏమయ్యాడు? పరంజ్యోతి అయ్యాడు. కనుక ఆ పరబ్రహ్మ పరాత్పరుడు అయ్యాడు. ఈ పరంజ్యోతి అనేటటువంటిది మీకు అవగాహన కోసం, ఏదైతే సబ్జెక్టుగా, విషయంగా చెప్పానో, ఇక మీమీద అప్లై చేసుకోండి, ఆత్మ అంటే, నేను నేనైన నేను. ఆత్మ అంటే సచ్ఛిష్యుడు. ఇప్పడు సచ్ఛిష్యుడి మీదే అప్లై చేస్తున్నాము.

       ఆత్మజ్యోతిః’ - ఇప్పుడు ఆత్మకి ఒక జ్యోతి అనేటేటటువంటి అనుభవం, అపరోక్షానుభూతి కలిగింది. ఈ అపరోక్షానుభూతి పైన నిర్ణయించిన నిర్ణయంగా, తత్వమసి వాక్యార్థంతోటి, ఆత్మజ్యోతి అనేటటువంటి త్వం’, పరంజ్యోతి అనేటటువంటి తత్‌అనేటటువంటి దానికి భేదం లేదు అనే పద్ధతిలో, ఆత్మజ్యోతి ఏమిటయ్యా? అంటే, ‘శివోస్మ్యహం’ - ఆ శివుడే తానై ఉన్నాడు, ఆ శివుడే బయలు. ఇక అంతకంటే ఏమీ లేదు.

       హంసనే ప్రణవము అందురు. హంసఅంటే ఎఱుక. ప్రణవముఅన్నా ఎఱుకే. ఈ అనాహత శబ్దమగు ప్రణవమందు త్రివ్యాహృతులైన అకార, ఉకార, మకారములచే సృష్టి అయినది. ఈ ప్రణవము అనేటటువంటి, హంస అనేటటువంటి ఎఱుక, ప్రణవము అనేటటువంటిది, ఓంకార ధ్వనియొక్క అవ్యక్తస్థితి. ధ్వని ఎప్పుడొస్తుందండి? గంటకొడితే ధ్వని వస్తుంది. హత’ - అంటే కొట్టడం. అనాహత’ - కొట్టకుండా ఉండే ధ్వని. అంటే ధ్వని యొక్క అవ్యక్త స్థితి.

అనాహతమంటే ధ్వని గుణము. అదే నాదము.

       గంట ఉందండీ, కొడితే ఓంఅని శబ్దం వచ్చింది. గంట కొట్టక ముందు ఓంఅక్కడ అవ్యక్తంగా ఉంది. అక్కడ ధ్వని లేదుగా, గంట కొట్టలేదుగా. గంట కొట్టలేదు అంటే అనాహతం. కొట్టడం అంటే హతం. కొట్టకపోతే అనాహతం. అనాహతంలో ప్రణవము నిశ్శబ్దము. మహత్తు బిందు రూపం ఆ బిందువు విస్తరించడము ఆరంభించింది. వ్యాహృతి అంటే విస్తరించడం. త్రివ్యాహృది అంటే మూడుగా విస్తరించడము. ఏమిటా మూడు? అకార, ఉకార, మకారములుగా. ప్రణవమందు అకార, ఉకార, మకారములు ఏకీకృతంగా ఉన్నాయి. శబ్దమేమో అనాహతంగా ఉంది. శబ్దము ఉత్పత్తి అయ్యింది. అవుతూనే త్రివ్యాహృతంగా అయ్యింది. అకార, ఉకార, మకార మాతృకలుగా, మూడు పద్ధతులుగా, మూడు చీలికలుగా, మూడు విభాగాలుగా స్థూల సూక్ష్మ కారణాలుగా, త్రిపుటులుగా, త్రివ్యాహృతులైంది. అకార, ఉకార, మకారాలనే సృష్టి అయ్యింది. ప్రణవంవిన్నవారికి, స్మరించు వారికి జన్మ ఉండదు. అనాహత శబ్దం, ఎవరికైతే వినబడుతోందో, శబ్దం చెవులకు వినబడే శబ్దం హతశబ్దం. హతశబ్దం నిన్ను బంధిస్తోంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలన్నీ కూడా శబ్ద రూపంలో అవి నిన్ను బంధిస్తున్నాయి. అవి విషయాలుగా ఉండబట్టి, విషయాసక్తిగా నీకు ఉండబట్టి, విషయాలు నీకు తెలియబడడం బంధమైనది. అనాహతం దగ్గర శబ్దం కూడా లేదు గనుక, అనాహత శబ్దాన్ని ఎవరైతే వింటారో, అంటే అక్కడ వినడం లేదు. తానే ప్రణవ స్వరూపుడై, తానే ఆ ప్రణవనాద రూపుడై ఉంటాడు. తానే ఆ ప్రణవనాద రూపుడౌతాడు.

       ప్రణవ రూపుడు ఎవడైతే ఉన్నాడో, వాడు ఆ నాదరూప బ్రహ్మని స్మరించువాడు. ఈ స్మరణ అజపంగా, అప్రయత్నంగా జరుగుతుంది. స్మరించుట, అజపము, అప్రయత్నము, నిష్ఠ అన్నప్పుడు తదాకారమే, ఆ బ్రహ్మాకారమే తానైపోతాడు. ఏదైతే స్మరిస్తున్నాడో, ఆ స్మరణ రూపుడు అంటే తదాకారుడు. అట్టివారికి జన్మ ఉండదు. అంటే బ్రహ్మనిష్ఠుడై, చలించని వానికి జన్మ ఉండదు. అయితే ఈ జన్మ ఎటువంటిదో చెప్దాము. కేవలము అకార, ఉకారములతో ప్రణవము కాలేదు. మళ్ళీ దీనిని, ఈ మూడింటిని విభజన చేస్తున్నాడు. అకార, ఉకారాలతో అయినది. కారమను బిందువుతో చేరగా ఓంఅను అక్షరమైనది. ఓంఅన్నప్పుడే పెదవులు రెండూ కలిసి కారం వచ్చింది, అప్పుడు ఓంఅను అక్షరమైంది. ఇక్కడ అక్షరం అంటే ఏంటి? క్షరము కానిది. ఓంఅనేది అక్షరమైతే, ‘ఓంద్వారా ఓంకారేశ్వరుడి యొక్క, ఓంకార బ్రహ్మము యొక్క సంకల్పము చేత, వచ్చినవన్నీ కూడా ఊహామాత్రం, సంకల్ప మాత్రం. భావనామాత్రం. కనుక ఊహలాగిపోతే అవి ఆగిపోతాయి. ఊహలు లయమైతే, అవి లయమౌతాయి. ఊహ ఎప్పుడొస్తే, అప్పుడు సృష్టించబడుతాయి. ఊహలు కొనసాగుతూ ఉంటే, అవి కూడా కొనసాగుతూ ఉంటాయి. ఊహలో మార్పు వస్తే, వికారం చెందుతూ ఉంటాయి. ఊహఆగిపోతే అవి లయం చెందుతాయి కనుక ఊహద్వారా వచ్చినవి మాత్రమే సృష్టి, స్థితి, లయలుగా ఉన్నాయి. ఊహకు ఆధారమైన ప్రణవము, సృష్టి స్థితి లయములకు అతీతంగా ఉంది. కనుక అది కూడా బ్రహ్మమే. కాకపోతే ఎఱుక బ్రహ్మ. మూలం ఉందిగా దీనికి! మూలం లేనిదైతే అచల బ్రహ్మ. మూలం ఉన్నది కనుక ఎఱుక బ్రహ్మ. ఇక్కడ అక్షరము. క్షర అక్షరుడనే ద్వంద్వంలో అక్షరము. ఇదే ప్రణవము. ఇది వర్ణత్రయంతో కూడి ఉన్నది. అకార, మకారములు రెండునూ బ్రహ్మసంబంధమైనవి. ఉకారము మాత్రము త్రిపుటిగా తెలుపు, ఎరుపు, నలుపు వర్ణములు కలిగియున్నది. కనుక ఉకారమే మాయ. ఉకారమే త్రిగుణములు. ఇది ప్రకృతి సంబంధమైనది. ఉకారము గుణరహితుడగు పరబ్రహ్మ సంబంధమైన ’, ‘వాటికి గుణ సహితమగు ప్రకృతి సంబంధమైన ’, దానికి తాదాత్మ్య సంబంధమైన బిందువుతో కూడిక కలిగి ఓంఅయినది.

ఫై వ్యాసము

"సర్వ వేదాంత శిరోభూషణం" అను బ్లాగు నుండి సేకరణ

బ్లాగును చేరుటకు క్రింద క్లిక్ చేయగలరు

https://svsbblog.blogspot.com/p/15.html

గమనిక: ఈ వ్యాసము ఇక్కడ ముముక్షువులకు ఉపయుక్తముగా వుండునను భావనతో మాత్రమే  ప్రకటించబడినది.  ప్రకటించుటయందు ఎవరికైనా ఆక్షేపణలు వున్నా, తెలిపిన ఈ బ్లాగునుండి ఈ వ్యాసమును తొలగించుటకు బ్లాగరు సంసిద్దుడు.

 

కామెంట్‌లు లేవు: