13, మే 2023, శనివారం

హనుమజ్జయంతి ప్రత్యేకం

 ॐ         హనుమజ్జయంతి ప్రత్యేకం -  2/11

       (ఈ నెల 14వ తేదీ హనుమజ్జయంతి) 


II. హనుమంతుడు - పరమాత్మకి మెచ్చిన దూత 


* మొదటి కలయిక 


    ఋశ్యమూక పర్వతము వద్దనుంచి వచ్చి, 

    శ్రీరాముని తొలిసారి కలసి మాట్లాడిన హనుమ మాటలు విన్న శ్రీరాముడు, 

    హనుమ గూర్చి లక్ష్మణునితో ప్రశంసిస్తూ, 

   "ఇట్టి దూత లేని రాజు తలపెట్టీన పనులు ఎలా సిద్ధిస్తాయి? 

    ఇట్టి గుణగణములు కల కార్యసాధకులైన దూతలు ఏ రాజువద్ద ఉంటారో, అతని కార్యాలు ఆ దూతలచే నిర్వర్తించబడి, సిద్ధిస్తాయి" అంటాడు.  


* సీతాదర్శనానంతరం 


    హనుమ విషయాలను శ్రీరామునికి నివేదించిన తరువాత,

   దూతలు మూడు తరగతులని శ్రీరాముడు పేర్కొన్నాడు. 

      (యుద్ధకాండ - 1వ సర్గ) 


(i) ఉత్తమ దూత:

       స్వామి శ్రేయస్సు దృష్టియందుంచుకొని, చేసికొని రమ్మన్న పనిని మాత్రమే గాక, దానికి అనుబంధంగా స్వామి ధ్యేయాన్ని సాధించే ఇతరపనులను కూడ సర్వాంగ సౌష్ఠవంగా సాధించువాడు ఉత్తమ దూత:

(ii) మధ్యమ దూత

         చేసికొని రమ్మన్నపని తూ.చ. తప్పకుండా అంతమటుకే చేసికొని వచ్చువాడు మధ్యమదూత. 

(iii) అధమదూత: 

          చేసుకొని రమ్మన్నపనిని సావధానమూగా చేయనివాడు అథమదూత. 


    ఈ సందర్భంలో సముద్రందాటి తిరిగి వచ్చిన కార్యసాధకుడైన హనుమను రాముడు "హనుమ ఒనర్చిన ఘనకార్యములు లోకములోనే 

అత్యద్భుతములైనవి, 

ఊహకందనివి, 

అనితరసాధ్యమైనవి" అని ప్రశంసించాడు.  

    హనుమకు తాను తన గాఢాలింగన సౌఖ్యాన్ని మాత్రమే ఇయ్యగలనని తెలిపాడు. 

    అదియే హనుమకు పరమ సుఖానుభవములను కల్గించగలదని పేర్కొన్నాడు. 

    అప్పటికి తానీయగలిగిన సర్వస్వము అదియే అన్నాడు.  

    పులకితగాత్రుడై, తాను అప్పగించిన కార్యమును సఫలమొనర్చిన హనుమని తన హృదయానికి హత్తుకొన్నాడు. 



* ఉత్తమ దూతయైన హనుమ దౌత్యము నెరిపిన సందర్భములు నాలుగు. అవి 


అ) సుగ్రీవుని దూతగ రామ సందర్శనము. 

ఆ) రాముని దూతగ సీతకు సందేశమందించడం. 

ఇ) సుగ్రీవుని దూతగ రావణునితో ముచ్చటించుట. 

ఉ) రాముని దూతగ భరతునితో సమావేశము. 


అ) సుగ్రీవుని దూతగ రామ సందర్శనము: 

    రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయపడ్డాడు. 

    హనుమ భయాన్ని వీడమన్నాడు. అప్పుడు ఆ రామలక్ష్మణుల వివరాలను తెలుసుకొని రమ్మని  హనుమంతునే పంపాడు సుగ్రీవుడు. 

    రామలక్ష్మణులు సుగ్రీవుని మైత్రికై ప్రయత్నిస్తున్న విషయం పసిగట్టి హనుమ, 

    కపిరాజ్యాన్ని సుగ్రీవునకు సంపాదించిపెట్టే పథకము రూపొందించుకొన్నాడు. 

    చూచి రమ్మన్నదానికన్న చాల ముందుకుపోయి ఆ ధ్యేయ సాధనకు రాచబాట పరిచాడు. 


ఆ) రాముని దూతగ సీతకు సందేశం: 

    సీత జీవించియున్నదో లేదో చూచిరమ్మని పంపిన వేరెవరైనా, చూచిన వెంటనే వెనుదిరిగి పోయి ఉండెడివాడు. 

    లేదా ఆ సంతోషంలో ఆమె ముందు దూకి కార్యము చెడగొట్టేవాడు కావచ్చు. 

    కానీ హనుమ అన్ని విషయాలని తర్కించుకొని 

  - సీతకు రాముని సందేశమూ, 

  - అంగుళీయకమూ అందించాడు. 

    సీత నుంచీ కబురూ, చూడామణీ తీసుకుని, తిరిగి రాముని వద్దకు వెళ్ళాడు. 


ఇ) సుగ్రీవుని దూతగ రావణునితో: 

    రావణునితో దౌత్యము నెరపమని హనుమకెవ్వరూ చెప్పలేదు. 

    అయినా వానర బలపరాక్రమాలు రావణునకు తెలిపి, 

    రాక్షసులలో మనోధైర్యాలు శిథిలపరచుట తన స్వామి కార్యమునకు అనుకూలములని ఆలోచించి నిర్ణయించుకున్నాడు.   


ఈ) రాముని దూతగ భరతునితో సమావేశము: 

    14 సంవత్సరాలు వనవాస దీక్ష పూర్తిచేసుకున్నాడు రాముడు. 

    తెల్లవారి అయోధ్యకు చేరకపోతే, భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు. 

    హనుమకు రాముడు సంగతి తెలిపి, భరతుని వద్దకు పంపాడు. 

    తనరాక భరతునకు ఆనందమైతే సరే. అట్లుకాక భరతునికి రాజ్యకాంక్ష ఉన్నట్లనిపిస్తే, 

    హనుమను వెంటనే తిరిగి తన వద్దకు వచ్చివేయమన్నాడు. 

    భరతుని అభిప్రాయం తెలిసికొనడం తేలికగాదు. 

    హనుమ పూర్వము నడిపిన దౌత్యములు రామునకు ప్రీతికల్గించాయి. 

    అట్లే హనుమ రామునికి సరియైనదౌత్యాన్ని భరతునితో నడిపాడు. 


          ఈ విధంగా హనుమ సుగ్రీవునికీ శ్రీరామచంద్రునికీ అత్యంత ప్రీతిపాత్రుడైన ఉత్తమ దూత. 


    విశ్వంలో ఏ దౌత్యమైనా, ఏ విధంగా ఉండాలో అందరూ తెలుసుకొనేలా, 

     తాను ఆచరించి చూపిన ఆదర్శవంతుడైన దూత హనుమంతుడు. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

కామెంట్‌లు లేవు: