నాల్గవ కుమార్తె ఉండివుంటే?
చెన్నై హార్బర్ లో పరిపాలనాదికారిగా పనిచేస్తున్న నేను, నా పైఅధికారి అయిన శ్రీ యస్. గణేశన్ గారిని ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళాను.
వారి ఇంటి సభ్యుల గురించి, ఉద్యోగం చేసిన ప్రదేశాల గురించి అడిగిన తరువాత మహాస్వామివారు వారిని, “నువ్వు రోజూ సంధ్యావందనం చేస్తావా?” అని అడిగారు.
“లేదు, నా ఉద్యోగం రీత్యా నాకు అది కుదరని పని, పరమాచార్య నన్ను క్షమించాలి” అని బదులిచ్చారు.
ఒక నిముషం పాటు మౌనంగా ఉన్న స్వామివారు, “అందుకు నేనొక ప్రాయశ్చిత్తం చెప్పనా? నువ్వు చేస్తావా?” అని అడిగారు.
“తప్పక చేస్తాను”
“నీకు ముగ్గురు కుమార్తెలు అని చెప్పావు కదా, నీకు నాలుగవ కుమార్తె ఉండివుంటే ఏమి చేసేవాడివి?”
“ఆ అమ్మాయిని కూడా బాగా చదివించి మంచి ఇంట పెళ్లి చేసేవాడిని”
“నీకు నలుగురు కుమార్తెలు అని తలచి, ఆ నాల్గవ కుమార్తెకు ఏమేమి చేసేవాడివో, ఆ డబ్బును నేను చెప్పబోయే కార్యానికి వినియోగించు.
మన శాస్త్రాల ప్రకారం, నిత్యకర్మానుష్టానము, వేదాభ్యాసము వారి వారి సూత్రమును అనుసరించి వేరువేరుగా ఉంటుంది. సంధ్యావందన మంత్రాలు కూడా అందరికి ఒకలా ఉండవు. పండితుల సూచనల మేరకు, ఆ మంత్రాలను పరిశీలింపజేసి, శాఖ-గోత్ర-ప్రవరాదులను బట్టి వాటిని వర్గీకరించి, చిన్ని చిన్ని పుస్తకాలను ప్రచురణ చెయ్యి. ఆ పుస్తకాలను కళాశాల విద్యార్థులకు, పాలిటెక్నిక్స్ చదువుతున్న వారికి ఉచితంగా పంచు. కనీసం కొద్దిమందైనా భవిష్యత్తులో వారి సాంప్రదాయాన్ని బట్టి కర్మానుష్టానాన్ని మొదలుపెడతారు. మైలాపూర్ సంస్కృత కళాశాల పండితులను మీ ఇంటికి పిలిపించి, వారితో చర్చించి, ప్రచురణ చెయ్యి. . .”
ఎంతో ఉత్సాహంతో నా పైఅధికారి అందుకు అంగీకరించాడు. తరువాతి తరాలపై పరమాచార్య స్వామివారికి ఉన్న కరుణ అటువంటిది.
--- టి. ఎ. భాష్యం, ఉత్తర మాడ వీధి, చిన్న కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 6
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి