*నిత్యాన్వేషణ:*
*'వాతాపి గణపతి'* అనగా అర్థం ఏమిటి?
వాతాపి (ప్రస్తుత బాదామి, కర్ణాటక) చాళుక్యులలో ప్రముఖుడైన పులకేశి II (610–642 AD) నర్మదా తీరంలో ఉత్తర భారత హర్షవర్థనుడిని ఓడించటమే కాక, దక్షిణం లో ఉన్న బనవాసి కదంబులను, తలకాడు గాంగేయులను, చేర-చోళ, పాండ్యులందరిని ఓడించి తన సామంతులు గా చేసికుని చివరకి ఆంధ్రలో విష్ణుకుండినులను వశపరచుకుని తన సోదరుని విష్ణువర్థనుడిని వేంగి తూర్పు చాళుక్య రాజు గా చేస్తాడు.
ఈ క్రమంలోనే చాళుక్యులకి, పల్లవులకు శత్రుత్వం ఎక్కువవుతుంది (పల్లవులకు - విష్ణుకుండినులకు వివాహ సంబంధములు ఉండుట వలన) - పులకేశి II ఈ క్రమము లో మహేంద్రవర్మ పల్లవ రాజ్యాన్ని కొంతవరకు ఆక్రమించి, 642/643 AD లో కాంచీపురము పై మరలా దండెత్తివస్తాడు. అయితే, మహేంద్రవర్మ కొడుకైన నరసింహవర్మ పల్లవుడు చాళుళ్య పులకేశిని పల్లలూరు/పుల్లలూరు లో నిలువరించటమే గాక వాళ్ళని వాతాపి దాకా వెంబడించి, వాతాపి లో జరిగిన భీకర యుద్దంలో పులకేశి ని చంపడమే కాక వాతాపి ని 13 ఏళ్ళు పల్లవులు ఆక్రమించుకుని పాలించారు.
ఈ విజయం తరువాతనే నరసింహవర్మ కి 'మహామల్లుడు' అనే బిరుదాంకితునిగా పేరుగాంచాడు - మహాబలిపురం యొక్క అసలు పేరు 'మహామల్లపురము' (దానినే తమిళనాడు ప్రభుత్వం 'మామల్లపురం' గా పేరు మార్చింది - అరవం లో మల్లయోధుడు ని 'మామల్లన్' అంటారు.
పల్లవ నరసింహవర్మ సేనానాయకుడైన పరంజ్యోతి, వాతాపి లో ఉన్న గణపతి భక్తుడై ఆ విగ్రహాన్ని తన తో పాటు తీసుకొచ్చి తన స్వస్థలమైన 'తిరుచెన్-కట్టనకుడి' లో ప్రతిష్టించటం ద్వారా గణపతి పూజాభక్తి తత్వాన్ని తమిళనాడు లో ప్రవేశ పెట్టాడు. ఆ విధంగా 'వాతాపి' కి చెందిన గణపతి కి తమిళనాట స్థిర నివాసము ఏర్పడింది.
అయితే, 18 వ శతాబ్ధపు సంగీత త్రయములోని 'ముత్తుస్వామి దీక్షితారు' తన షోడశ గణపతి స్తోత్రాలలో భాగంగా ఈ గణపతి మూర్తిపై 'వాతాపి గణపతిం భజే' కీర్తన చేయటం (వాతాపి గణపతిని భజిస్తున్నాను అనే అర్థంలో)
ద్వారా 'వాతాపి' కి చెందిన గణపతి వైభవము నలుగడలా ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందినది.
కీర్తన/పాట నుడిపదవివరణ/సాహిత్యం:
వాతాపి గణపతిం భజే
హం వారణాస్యం వరప్రదం | | వాతాపి | |
భూతాది సంసేవిత చరణం
భూత భౌతికా ప్రపంచ భరణం
వీతరాగిణం వినత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం
పురాకుంభ సంభవమునివర
ప్రపూజితం త్రిభువన మధ్యగతం
మురారీ ప్రముఖ ద్యుపాసితం
మూలాధారా క్షేత్రాస్థితం
పరాది చత్వారి వాగాత్మకం
ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం
నిజ వామకర విదృతేక్షు దండం
కరాంబుజపాశ బీజాపూరం
కలుష విదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబం | | వాతాపి | |
మన గంధర్వ గాన కోకిల అయిన 'ఘంటసాల వెంకటేశ్వరరావు గారు' 'వినాయకచవితి' చలనచిత్ర ప్రార్థనా గీతంగా అతి మధురముగా పాడి ఈ కీర్తనా గీతాన్ని అజరామరం గావించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి