12, ఆగస్టు 2023, శనివారం

బసవ పురాణం- 2 వ భాగము🔱🙏

 🙏🔱బసవ పురాణం- 2 వ భాగము🔱🙏


🍃🍃🍃🍃🍃🍃🍃🍃


అప్పుడు నేను ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాను. శిలాదుడు నన్ను చూచి పులకితాంగుడై సాష్టాంగ నమస్కారం చేసి ఎన్నో విధాల స్తుతించి ‘స్వామీ- నాకు పుత్ర సంతానం కలిగేటట్లు వరం ప్రసాదించవలసింది’ అని వేడాడు. నేను ‘తథాస్తు’ అన్నాను. అప్పుడు శిలాదుడు ‘మహాదేవా! కేవలం కొడుకు కలిగితే సరిపోదు. అతడు శివభక్తితో తరించాలి. వాడు తద్భిన్నంగా వుంటే మాత్రం నేను సహించను. తల నరికేస్తాను. అందుకని మీరే అతడికి అండగా నిలవాలి’ అని వేడుకున్నాడు.

అది విని నేను సంతోషించాను. అప్పుడు ఒకసారి నందీశ్వరుని వంక చూచాడు. ఎందుకంటే సృష్టికి ముందే నా అంశ వృషభరూపంలో వుంటుంది. అది కృతయుగంలో నాలుగు పాదాలమీద, త్రేతాయుగంలో మూడు పాదాలమీద, ద్వాపర యుగంలో రెండు పాదాలమీద, కలియుగంలో ఒకే పాదంమీద చరిస్తూ వుంటుంది. ఈ అంశయే ద్వితీయ శంభుడు. అట్టి నందీశ్వరుణ్ణి చూచి ‘నీవే శిలాదునికి కొడుకుగా పుట్టాలి. నీవు లోకంలో రెండవ శివుడనే పేర ప్రసిద్ధి చెందాలి’ అన్నాను.

నందికేశ్వరుని అవతారం

నా కోరిక ప్రకారం నందీశ్వరుడు అయోనిజుడై శిలాదుని ఇంట పుట్టాడు. అతడికి ‘నందికేశ్వరు’డని పేరు పెట్టారు. నందికేశుడు జన్మించినప్పటినుండి భక్తి క్షీరానే్న గ్రోలుతూ పెరిగాడు. గురుపద ధ్యానంతో వేదాంత సూక్తులతో శివాచార వర్తనంతో నా పాద పద్మాలను నిరంతరం మనస్సులో ఉంచుకొని నందికేశుడు పెద్దవాడైనాడు. అప్పుడు నందికేశుడు కనీ వినీ ఎరుగని భయంకర తపస్సు మొదలుపెట్టాడు. ఆ వేడికి బ్రహ్మాండం గజ గజ వణికిపోయింది.

బ్రహ్మాది సమస్త దేవతలూ భయంతో నా వద్దకు పరుగెత్తుకొని వచ్చారు. అది చూచి నేను నవ్వి ‘ఓరి వెర్రి జీవులారా! మీకెందుకంత భయం? మీ మీ పదవులు పోతాయనా? నందికేశ్వరుడు బ్రహ్మపదమో విష్ణు పదమో దేవేంద్ర పదవియో కోరి ఈ తపస్సు చేయడంలేదు. అందుకని మీరేమీ వణికిపోనవసరం లేదు.

అతనికి నా భక్తి తప్ప వేరే కోరికలు లేవు. కావాలంటే నా వెంట రండి చూపిస్తాను’ అని నేను నందికేశుడు తపస్సు చేస్తున్న శ్రీ పర్వత ప్రాంతానికి బ్రహ్మాది దేవతలతో సహా వెళ్లాను.

నందికేశుడు కన్నులు తెరిచి నన్ను చూచాడు. అప్పటివరకూ నేనతని మనస్సులో స్థిరంగా ఉన్నాను. ఇపుడు ఎదుటనే ఉన్నాను, ఇలా ప్రత్యక్షం కావడం చూచి అతని శరీరం పులకించింది. ‘నందికేశా! నీకు కావలసిన వరం కోరుకో’

అన్నాను. అది విని నందికేశుడు ‘‘స్వామీ! పెన్నిధి లభించినపుడు మన్ను అడిగే అవివేకి ఎవడైనా ఉన్నాడా? నాకు నీ దర్శనం లభించింది. అందుకే ఈ తపస్సు. వేరే నాకే పదవులూ గిదవులూ పనిలేదు. నిర్మల భక్తిని నాకు ప్రసాదించు’ అన్నాడు. అది విని నేను నందికేశుణ్ణి గాఢాలింగనం చేసుకున్నాను. ‘‘నాయనా! నందికేశా! నీ ఆలింగన సుఖం నాకెప్పుడూ లభించేటట్లు నిన్ను నేను వాహనం చేసుకుంటున్నాను. పూర్వమూ నీవే నా వాహనానివి’’ అని చెప్పి నేను నందికేశునికి ప్రమథగణాధిపతిగా పట్టం కట్టాను. సర్వజ్ఞత్వాన్ని ప్రసాదించాను.

నా వెంట బ్రహ్మ విష్ణు దేవేంద్రాది సమస్త దేవతలూ అది చూచి నందికేశునికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. నందికేశుడు వారిని దయతో చూచాడు. ఈ విధంగా దేవతలు తమ తమ భయాలను పోగొట్టుకున్నారు.

శ్రీశైల నైరుతీ ప్రాంతంలో నందీశ్వరుడు తపస్సు చేసిన ఈ ప్రదేశానికి నాటినుండి ‘నందిమండల’మని పేరు వచ్చింది. అచటికివచ్చిన సమస్త జీవజాలమూ మోక్షాన్ని పొందగలిగేటట్లు అనుగ్రహించాను. ఇట్టి నందికేశుని చరిత్ర విన్నవారూ విరచించినవారూ స్థిరబుద్ధి, దృష్ట అదృష్ట సమస్త సిద్ధులూ, వాక్సుద్ధి, భక్తి సంపదా పొందగలుగుతారు.

దేవీ! ఇట్టి నందీశ్వరుడు సాక్షాత్తు నేనే!’’ అని పరమేశ్వరుడు నారద పార్వతులు వినగా చెప్పాడు.

అప్పుడు పార్వతీదేవి ‘‘ఇంతటి నిరహంకారమూ, సదాచారము, నిరంతర భక్తి, ప్రభుభక్తి, సిద్ధ పాండిత్యమూ, నిత్య సత్యమూ, సౌకుమార్యమూ, ఆత్మతత్వమూ, విశుద్ధ చరిత్రమూ, పుణ్యగోత్రమూ, ఇంతటి మంగళకరమైన మూర్తి, కీర్తి, నందికేశునికి తప్ప మరెవ్వరికీ లేవు. అందుకే నందీశ్వరునికి తప్ప మరెవ్వరికీ మిమ్ము మోయగలిగే శక్తి కూడా లేదు. ఇతడు సాక్షాత్తు మీ అంశయే’’ అని పరమేశ్వరునితో అన్నది.

‘‘విన్నావా! నారదా! నందికేశుని ఘనత’’ అని శివుడు నారదునితో అన్నాడు.

ఇలా పరమేశ్వరుని దయార్ద్ర చిత్తంతో తల మునకలైన నందికేశుడు భయమూ, సిగ్గూ, సంతోషమూ వెల్లివిరిసే చూపులు తనకు ఆభరణ ప్రాయములుకాగా శరీరము పులకించి, కంటివెంట ఆనంద బాష్పాలు రాలుతుండగా పరమేశ్వరుని శరణు జొచ్చి చేతులు జోడించి తలపై పెట్టుకొని పరమశివుణ్ణి కొనియాడాడు.

అప్పుడు అంబికాధవుడు నందికేశుణ్ణి దగ్గరకు తీసి ప్రేమతో ఇలా అన్నాడు.


🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

కామెంట్‌లు లేవు: