12, ఆగస్టు 2023, శనివారం

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-17🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-17🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*శ్రీహరి నిన్ను వివాహము చేసుకొనును ఇది యదార్ధము:*


పద్మావతికి అయిదు సంవత్సరాల వయస్సు వచ్చినది. విప్రులచేత అక్షరాభ్యాసం చేయించినాడు ఆకాశరాజు. ఆమె గురువులు చెప్పినట్లుగా జాగ్రత్తగా చదువుకొనసాగింది. ఆమెకు చదువు సులభముగా అబ్బేది. ఆమె సర్వసుగుణ ప్రకాశితయై అందరూ మెచ్చుకొనే విధముగా వుండేది. సర్వసుగుణాలు ఆమెలో యిమిడివుండేవి. ఆమెకు యుక్తవయస్సు వచ్చింది.


ఒకరోజున పద్మావతి గౌరీపూజ యధావిధిగా నిర్వర్తించి, అనంతరము ఉత్తమ కన్యకలైన చెలికత్తెలతో అంతఃపురములో ఆడుకొంటూ యున్నది. ఆ సమయానికి అంతఃపురానికి వచ్చాడు నారదుడు. తోడనే పద్మావతి చెలికత్తెలతో వెళ్ళి నారదునికి స్వాగతము చెప్పి సుఖాసీనుని చేసింది. పన్నీటిలో ఆ మునివర్యుని పాదకమలాలు కడిగి కన్నులకు అద్దుకొని పూజించింది.


నారదముని పద్మావతిని కుశల ప్రశ్నలు వేసినాడు. తరువాత ‘‘అమ్మాయీ! నీ భక్తికీ, శ్రద్ధకీ మెచ్చుకొంటున్నాను నేను. నీ భవిఫ్యద్ఘట్టాలు చెప్పాలని వున్నది. ఏదీ నీ యెడమచేతి నీయుము’’ అన్నాడు.


 మునిమాట అందునా నారదముని మాట వినుట మంచిదని ఆమెకు తెలియును. 


అందువలన చేయి నిచ్చింది. నారదుడు పద్మావతికి హస్త సాముద్రికము చెప్పసాగాడు. ‘అమ్మాయీ! నీ చేతిలో చాల మంచికుండలి పద్మ, స్వస్తిక, ఛత్ర, చామర, కులిక, ఆందోళిక మత్స్య, మాంగళ్యములున్నాయి! అందువలననే నీవు చంద్రముఖివి అయ్యావు. 


అందువల్లనే తామరపువ్వులవంటి కళ్ళూ, దర్పణాల వంటి చెక్కిళ్ళూ, దొండపండు వంటి ఎఱ్ఱదనము గల అధరమూ ముత్యాలబోలు పలువరుస, నీలాలకురులు, ఒక్కసారిగా మెరుపుతీగ బోలు దేహకాంతులు కలిగి యింతచక్కగా వున్నావు. 


లక్ష్మీకళ నీలో చాలా వున్నది కనుక నీవు కోరుకొనే విధముగా శ్రీహరి నిన్ను వివాహము చేసుకొనును. ఇది యదార్ధము అని చెప్పి నారదుడు వెడలిపోయెను.


యుక్తవయస్సు వచ్చిన అమ్మాయిని ఒక యింటి దానిని చేయడము తల్లిదండ్రుల బాధ్యత కదా! తగిన అల్లునకై ఆకాశరాజు ధరణీదేవి ఆలోచించసాగారు. 


ఆకాశరాజు అనేకానేకులైన రాజకుమారుల చిత్రాలను తెప్పించారు. చూశారు. ఉఁహూ అన్నాడు. మరికొందరిని తెప్పించారు. ఆ చిత్రాలలో కూడా తన కుమార్తెకు తగిన సుందరుడైన వరుడు కనబడలేదు. అందమైనది పద్మావతి. ఆమెను వివాహము చేసుకోవడము మహా అదృష్టము అని భావించి రాజకుమారులనేకులు ప్రయత్నించి చూశారు. కాని ఫలితము లేకపోయినది. చక్కగా మాట్లాడగ సద్ర్బాహ్మణులను ఆకాశరాజు దేశదేశాలకీ పంపించాడు.వారున్నూ తిరిగి తిరిగి వచ్చేరే కాని, తగిన వరుడు కనబడినాడనే వార్త తీసుకురాలేక పోయినారు. ఆకాశరాజుకు బెంగ ఏర్పడింది. ధరణీదేవి దిగులు ఇంక చెప్పనవసరము లేదు.


వానరసేవిత గోవిందా, వారధిబంధన గోవిందా; అన్న దాన ప్రియ గోవిందా, అన్నమయ్య వినుత గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.|17||


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: