12, ఆగస్టు 2023, శనివారం

చంద్రగ్రహ జననం - 4*

 *నవగ్రహ పురాణం - 22 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*చంద్రగ్రహ జననం - 4*



*“ఆ విధంగా భయాందోళనలకు గురైన శీలవతి నిశ్చేష్టంగా నిలిచిపోయింది”.* చంద్రగ్రహ జన్మ వృత్తాంతం వినిపిస్తున్న నిర్వికల్పానందులు అన్నారు.


*"ఆ విధంగా శపించింది ఎవరు గురువుగారూ ?”* విమలానందుడు అడిగాడు. *"ఆయన పేరు మాండవ్యుడు. ఆయన ఒక మహా తపస్వి... మహర్షి... శీలవతి భర్తను మోసుకొని వెళుతున్న దారి పక్కనే నిలువెత్తు శూలానికి గుచ్చబడి , ఆ మాండవ్యుడు. భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నాడు...”* నిర్వికల్పానంద చెప్పసాగాడు.


*"మాండవ్యుడు తన ఆశ్రమంలో తపోనిష్ఠలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారి మందిరంలో దొంగలు పడ్డారు. ధనంతో పారిపోతున్న దొంగలను రాజభటులు వెంటాడారు. దొంగలు అరణ్యంలోని మాండవ్య మహర్షి ఆశ్రమ ప్రాంతానికొచ్చారు. మాండవ్యుడు ఆశ్రమం ముందున్న చెట్ల కింద నిలబడి చేతుల్ని నిటారుగా పైకెత్తి తదేక నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు. చోరులు తప్పించుకునే ఉద్దేశంతో ఆయన ఆశ్రమంలో దాక్కున్నారు.


రాజభటులు వచ్చి మహర్షిని దొంగల గురించి అడిగారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు వాళ్ళకు సమాధానం చెప్పలేదు. చివరికి ఆ భటులు ఆశ్రమంలో దాక్కున్న దొంగల్ని పట్టుకొన్నారు. మౌనంగా ఉండిపోయిన మాండవ్యుడు కూడా ఆ దొంగల్లో ఒకరనీ , ముని వేషంలో నాటకం ఆడుతున్నాడనీ భావించి , ఆయనను కూడా రాజు వద్దకు లాక్కెళ్ళారు. రాజు దొంగలకు మరణ దండన విధించాడు. చోరుడై ఉండి , సాధువులా నటిస్తున్నాడన్న భావనతో మాండవ్యుడికి దారుణమైన 'శూలపోత' శిక్ష విధించాడు. భటులు మాండవ్యుడిని నేలలో పాతిన వాడి శూలానికి దిగవేశారు..


శూలాగ్రానికి దిగవేయబడిన మాండవ్యుడు భరింపరాని బాధను మౌనంగా అనుభవిస్తూ ఉండిపోయాడు. ఆ విధంగా శూలం మీద దుర్భరమైన శిక్షను అనుభవిస్తున్న మాండవ్యుడికి తాకింది. ఉగ్రశ్రవుడి పాదం. దాంతో ఆయన నరకయాతన ఎక్కువైంది. నిష్కారణంగా తన బాధను పెంచిన వ్యక్తి సూర్యోదయం కాగానే చనిపోవాలని శాపం పెట్టాడు మాండవ్యుడు. భర్తను మోసుకెళుతున్న శీలవతి నిర్ఘాంతపోయింది.


*"సూర్యోదయం కాగానే మరణిస్తారు ! ఇది మాండవ్య మహర్షి శాపం !"* మాండవ్యుడి పలుకు శీలవతి చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఏదో భయం , ఏదో ఆందోళన ఆమెలో సుళ్ళు తిరుగుతున్నాయి.


*"నాకెవరో శాపం పెట్టారు. సూర్యోదయం కాగానే చచ్చిపోతాను !"* ఉగ్రశ్రవుడు వణికే కంఠంతో పలవరిస్తున్నాడు. *“పొద్దు పొడిస్తే చచ్చిపోతాను. విన్నావా? త్వరగా నన్ను మన ఇంటికి చేర్చు.”*


శీలవతిని ఉగ్రశ్రవుడి కంఠం హెచ్చరించింది. భర్త మాటకు ఎదురాడి ఎరగని ఆ సాధ్వి మారు పలకకుండా , అప్రయత్నంగా వెనుదిరిగింది. *"విన్నావా ? సూర్యోదయం కాగానే నా ఆయువు తీరిపోతుందిట !"* ఉగ్రశ్రవుడి కంఠంలో ఏడుపు లీలగా ధ్వనించింది..


శీలవతి మెల్లగా నడుస్తూ ఆలోచిస్తోంది. సూర్యోదయం అయితే... తన భర్త మరణిస్తాడు. మాండవ్య మహర్షి శాపం తప్పక ఫలిస్తుంది. తన పతి దేవుడు మరణిస్తాడు... సూర్యోదయం అయితే... ఔను ! సూర్యోదయం అయితే ! సూర్యోదయమే కాకుంటే ? సూర్యుడు ఉదయించకుండా ఉంటే... ?!


శీలవతి అసంకల్పితంగా ఆగింది. ఆమెలో ఏదో ఆలోచన కుండలినీ శక్తిలా పడగ ఎత్తుతోంది. ఆమె కనురెప్పలు కదలడం మానేశాయి. ఏకోన్ముఖమైన నిర్ణయంతో ఆమె లేత పెదవులు కదిలాయి. *"నేను పతివ్రతనైతే , వివాహానికి ముందు భగవంతుణ్నే భర్తగా , వివాహానంతరం భర్తనే భగవంతుడిగా భావించిన సాధ్వినే అయితే ఇంక సూర్యోదయమే సంభవించకుండా ఉండుగాక !"*


శీలవతి కంఠం ఆ నిశ్శబ్ద నిశీధిలో స్పష్టంగా ప్రతిధ్వనించింది. ఆమె కాళ్ళు ఇంటి వైపు కదుల్తున్నాయి...

కామెంట్‌లు లేవు: