27, అక్టోబర్ 2023, శుక్రవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


సుకన్యా చ్యవనుల కథ

వ్యాసుడు చిన్నగా నవ్వి వివరాలు చెప్పాడు. జనమేజయా! నీ సందేహం సమంజసమే

శర్యాతికి నాలుగువందలమంది భార్యలున్నారు. అందరూ అందగత్తెలే రాజపుత్రికలే. వారందరికీ

ఒకేఒక్క గారాల కూతురు ఈ సుకన్య.

ఒకరోజున ఈ అమ్మాయి రాజధానికి చేరువలోనే ఉన్న ఒక సరోవరానికి వెళ్ళింది. అది

మానససరోవరానికి అన్నింటా సాటివచ్చే సరోవరం. రేవుల్లోకి దిగేందుకు వీలుగా మెట్లు ఉన్నాయి.

స్వచ్ఛమైన నీళ్ళు. నీటిపక్షుల కలకూజితాలు. రకరకాల కమలాలు. తుమ్మెదలు. నాలుగు వైపులా

గట్లమీద ఎత్తుగా ఒత్తుగా పెరిగిన చెట్లు. వాటికి అల్లుకొని పుష్పించిన లతలు, శుకపికాలాపాలు,

చెట్లమధ్యన ఒక శుభప్రదేశంలో భార్గవుడైన చ్యవనుడు తపస్సు చేసుకుంటున్నాడు. పరమ శాంతుడు.

విజనప్రదేశంకదా అని అక్కడికి చేరి తపోదీక్ష స్వీకరించాడు. ఇంద్రియాలను నిగ్రహించుకొని, నిరాహారుడై

మంచినీళ్ళయినా ముట్టకుండా, కూచున్న చోటనుంచి కదలకుండా మహాదేవిని ఉపాసిస్తున్నాడు. అతని

చుట్టూ తీగెలూ లతలూ పెరిగి పుట్ట ఏర్పడింది. పిపీలికాలు చేరాయి. అందులో ఒక మహర్షి తపసు

చేసుకుంటున్నాడని ఎవరూ అనుకోరు. పైకి కనిపించడు. అంతా ఒక మట్టిపుట్ట.

ఆ ప్రాంతానికి వెళ్ళింది ఈ సుకన్య. శర్యాతి తనభార్యలతో కలిసి సరోవరంలో జలక్రీడలు

ఆడుతున్నాడు. సుకన్యయేమో తన చెలికత్తెలతో వనవిహారం చేస్తోంది. ఆ పువ్వులూ ఈ కాయలూ

తుంపుతూ అంతా కోలాహలంగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు. వారి అందెల సవ్వడులు అడవిలో

సుకుమారంగా మారుమ్రోగుతున్నాయి. సుకన్య రవ్వంత అలిసిపోయి ఆ పుట్టదగ్గర చతికిలబడింది. దాని

రంధ్రాలలోకి చూపులు నిగుడించింది. లోపల ఏవో రెండు మిడుగురులు మెరుస్తున్నట్టు కనిపించింది.

ఏమిటో తెలుసుకోవాలనిపించింది. ఒక పొడవాటి సన్నని పుల్లను తీసుకుని పాడవబోయింది.

అందులో ఉన్న చ్యవనుడు సుకన్యను చూశాడు. రతిదేవిలా కనిపించింది. ఎండిపోయిన

గొంతును పెగల్చుకుని కల్యాణీ! ఏమిటది? విశాలాక్షీ! దూరం జరుగు. చంద్రవదనా! నేను తపశ్విని

కృశోదరీ! ఈ పుట్టను నాశనం చెయ్యకు- అని సన్నగా హెచ్చరించాడు. అయినా సుకన్య ఆగలేదు. ఇదేదో

వింత, తెలుసుకుందామని చాపల్యంకొద్దీ ఆ రంధ్రాల్లో పొడిచింది. చ్యవనుడికి కళ్ళు పోయాయి. ఏమి

జరిగిందో తెలుసుకోలేని సుకన్య తన చెలికత్తెలతో మళ్ళీ ఆటల్లో పడింది. లోలోపల ఏదో శంకగానే ఉన్నా

క్రీడల్లో మునిగిపోయింది

కామెంట్‌లు లేవు: