ఉలిపికట్టె:
తెలుగుసామెతల్లో ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది మరోదారి.
ఈ మాటకు ఉలిపికట్టె, ఉలిపిగొట్టు, ఉలిపిరిగొట్టు అనే రూపాంతరాలున్నాయి.
ఈ పదం చివరి కట్టె మొండికట్టె, కష్టాలన్నీ ఈ కట్టెతోగాని పోవు వగైరా పదబంధాల్లో వాక్యాల్లో వినిపించే శరీరార్ధకమైన పదమేగాని కేవలం కర్ర అనే అర్థమిచ్చేదికాదు. శరీరాన్ని కట్టెతో పోల్చి, కట్టెగా భావించి చెప్పేమాటలివి. ఉలిపి శబ్దాన్ని నామవాచకంగానూ విశేషణంగాను వాడ్తారు. నామవాచకంగా వాడినప్పుడు దానికి పొగరుబోతు, దుర్మార్గుడు, పెడమనిషి, కోపదారి మొదలైన అర్థాలున్నాయి.అదో చెట్టుపేరు కూడా. బాణాసంచా తయారీలో ఆ కట్టెముక్కల నుపయోగిస్తారు. ఉలిపిచెట్టు కర్రను కాల్చినప్పుడు చిటపటలాడుతుంది. ఆ కట్టెముక్కలాగానే మటమటలాడే వ్యక్తిని ఉలిపి (కట్టె/గొట్టు) అని వ్యవహరిస్తారు. దీని రూపాంతరమైన ఉలిపిరిని చాలా నిఘంటువులు ఆరోపంగా చేర్చలేదు. కానీ ఉలిపిరి కాగితం వంటి సమాసాల్లో తేలికైన, పల్చని, తిన్నగా చినగని మొదలైన అర్థాల్లో వాడుకలో ఉంది. ఉలిపిరికి ఉలిమిరి/ఉలిమిడి అనే చెట్టుపేరు రూపాంతరమైనా కావచ్చు. కారణం అది ఉలిపిచెట్టులాగ తేలికైన కట్టెమొక్క. వృక్షశాస్త్రంలో ఈ చెట్టుకు మూడువిథాల పేర్లున్నాయి. సాంకేతికంగా పూర్వం చీకటి పడ్డ తరువాత ప్రయాణించే బాటసారులు ఈ కట్టెలను ముట్టించి వాటిని కాగడాలుగా వాడి కౄరమృగాలను బెదిరించడానికీ వెలుతురువల్ల దారులను గుర్తించటానికి వాడేవారు. ఉలిపిరిని కాగడాకర్ర/కట్టె అని పిలవటం కద్దు. ఆ కట్టెలాగ మండిపడే వ్యక్తిని ఉలిపి(రి)కట్టె అంటారు. చిర్రుబుర్రులాడే, చిటచిటలాడే కోపదారి మనిషిని ఈ పేరుతో తక్కువచేసి వ్యవహరించేవారు. ఎర్రడాలున్న తెల్లమచ్చలనూ,తెలుపుమీద మసరగా ఉండే మచ్చలున్న మబ్బురంగునూ ఉలిపిరి అంటారు. కొందరు దీన్ని గాడిదరంగని వ్యవహరిస్తారు. జిల, మంట, చికాకు, బాధ పుట్టించే రోగాన్ని ఉలిపితెగులు అంటారు. గాడిదలాగ ప్రవర్తించేవ్యకిని ఉలిపిగొట్టంటారన్నమాట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి