మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*మాలకొండ లో తపస్సాధన..*
*(తొమ్మిదవ రోజు)*
"ఏకేన చక్రమపరేణ కరేన శంఖం
అన్యేన సింధు తనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయ హస్తముద్రాం
శ్రీ లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం౹౹"
"ఒకచేత సుదర్శన చక్రము, వేరొకచేత పాంచజన్య శంఖము, ఇంకొక చేత లక్ష్మీదేవిని చుట్టి, తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని, తన కుడిచేతితో అశేష భక్తకోటికి అభయం ఇస్తూ దర్శనం ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహా!..నాకు చేయూత నివ్వు!!"
అని శ్రీ ఆదిశంకరాచార్యులు చేసిన స్తోత్రం లోని శ్లోకాన్ని గుర్తుచేసుకుంటూ..శ్రీ స్వామివారు మాలకొండ కు చేరి, ముందుగా ఆ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో కొంత సేపు గడిపారు..మాలకొండ లో ఉగ్రరూపంతో వుండే ఆ లక్ష్మీ నరసింహుడు..ఈ యువక యోగి పట్ల ప్రసన్నుడై..తన అక్కున చేర్చుకున్నాడు..
శ్రీ స్వామివారు మాలకొండలోనే ఉత్తరంగా కొద్దిగా దిగువున, రెండు పెద్ద బండరాళ్లు చీలి ఏర్పడిన దారితో, ఒకే పెద్ద గొడుగు లాటి రాతి కింద వున్న శివాలయం వద్దకు వచ్చారు..ఆ శివాలయానికి మరికొద్ది దిగువున ఉన్న పార్వతీదేవి మఠం చూసారు..తన ఆవాసానికి ఆ అమ్మవారు కొలువైయున్న మఠం సరైనదని నిర్ణయానికి వచ్చారు..శివాలయం..దానిపైన వున్న రాతి గుహలు తన తపస్సుకు అనువైన ప్రాంతాలని నిర్ధారించుకున్నారు..
ఒకవైపు సాక్షాత్తూ వైష్ణవావతారం నృసింహుడు..మరో ప్రక్క ఆది దంపతులైన శివ పార్వతులు..తనకు ఇంతకంటే రక్షణ ఇచ్చే ప్రదేశం మరోటి ఎక్కడుంది?..ఇది తన మోక్షమార్గాన్వేషణలో మరో మజిలీ..ఇప్పటిదాకా తాను చేసిన సాధన ఒక ఎత్తు..ఇక చేయబోయేది మరో ఎత్తు!..గురువు బాలబ్రహ్మం చెప్పినట్లు, ప్రకృతి అనుక్షణం మాయను ప్రదర్శిస్తుంది..అందులో చిక్కకుండా ఏకాగ్రచిత్తంతో సాధన చేయాలి..ఎల్లవేళలా జాగురూకత తో ఉండాలి..దేహాభిమానాన్ని త్యజించాలి..మమకారాన్ని మనసులోంచి తుడిచివేయాలి..తానింతకాలం ఏ మోక్షం కోసం తపించి సాధన చేస్తున్నాడో అందుకు అనువైన ప్రదేశం కూడా లభించిందని సంతోషపడ్డారు..
పార్వతీదేవి మఠం లో నివాసం ఏర్పరుచుకున్నారు..మితాహారం భుజించడం..సాధన చేసుకోవడం..ఇవి రెండే కార్యక్రమాలు..మాలకొండ క్షేత్రం ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తుల కొరకు తెరచి ఉంటుంది..ఆ ఒక్కరోజు శ్రీ స్వామివారు శివాలయం పైనున్న గుహలలోకి వెళ్లిపోయేవారు..అక్కడ ఏకాంతంలో తపోసాధన చేసుకునేవారు..మిగిలిన ఆరు రోజులూ నరసంచారం వుండదు కాబట్టి, ఎక్కువభాగం శివాలయం లోనే తన తపస్సు కొనసాగించేవారు..
కానీ..కుతూహలం తో కూడిన మానవులున్న లోకం ఇది..ఎవరో యువక యోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని..మాలకొండ క్రింద ఉన్న గ్రామస్థులు పసిగట్టేశారు..వాళ్ళు కొండపైనున్న అడవి కర్రలు ఏరుకొచ్చి అమ్ముకునే వాళ్ళు..శ్రీ స్వామివారు శివాలయానికి వెళ్ళేటప్పుడు..తిరిగి పార్వతీదేవి మఠానికి వచ్చేటప్పుడు గమనించడం మొదలెట్టారు..వాళ్లలో వాళ్ళు శ్రీ స్వామివారి గురించి చర్చించుకోవడం కూడా జరుగుతోంది..శ్రీ స్వామివారిని చూసినప్పుడు పలకరించడం చేయసాగారు..తాను మౌనం లో వున్నప్పుడు చిరునవ్వే వారికి సమాధానం!..మౌనం వీడినప్పుడు..ముక్తసరిగా సమాధానం చెప్పి, వారిని పంపించివేసేవారు..ఇలా కాలం గడచిపోతోంది..
మాలకొండకు పశ్చిమంగా కొంత దూరం లో కంబాలదిన్నె అనే గ్రామం ఉంది..ఆ గ్రామ వాస్తవ్యులు శ్రీ చెక్కా కేశవులు గారు వైశ్య కులస్థుడు.. ఆయన మాలకొండ లక్ష్మీనృసింహ స్వామి వారి భక్తుడు..విజయవాడ లో వ్యాపారం చేస్తున్నారు..తన గ్రామానికి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా మాలకొండకు వచ్చి, శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దర్శనం చేసుకొని వెళుతూవుండేవారు..అదొక నియమం తో కూడిన ప్రక్రియ వారికి..అలా వస్తూ పోతున్న సమయం లో ఒకసారి శ్రీ స్వామివారిని చూడటం తటస్థించింది..శ్రీ స్వామివారిలో ఉన్న తేజస్సు, చెక్కా కేశవులు గారిని కట్టిపడేసింది..క్రమంగా శ్రీ స్వామివారిని తరచూ చూడటం..మెల్లిగా పలకరించడమూ చేశారు..శ్రీ స్వామివారు సైతం చెక్కా కేశవులు గారితో మాట్లాడారు..కేశవులు గారికి నమ్మకం కలిగింది..శ్రీ స్వామివారు, ఇలా ఎటువంటి సరంజామా లేకుండా..భూశయనం చేయడం..కేశవులు గారికి నచ్చలేదు..శ్రీ స్వామివారు నెత్తి నోరు కొట్టుకొని వారిస్తున్నా వినకుండా..ఒక ఇనుప మంచాన్ని, దోమతెరను..కప్పుకోవడానికి దుప్పట్లు వగైరా అంతా పార్వతీదేవి మఠం కు చేర్చారు..
"నాయనా!..ఇవన్నీ నాకు వద్దు..నేను సర్వసంగపరిత్యాగిని..అన్నీ వదిలేసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను..నన్ను మళ్లీ సంసారబంధం లోకి లాగకు..నీ కోరిక ఏమిటి?.." అని లాలనగా అడిగారు..
చెక్కా కేశవులు గారు చాలాసేపు తటపటాయించి..ఎట్టకేలకు తన మనసులోని కోరికను బయటపెట్టారు..విన్న స్వామివారు ఫక్కున నవ్వారు..
చెక్కా కేశవులు గారి అనుభవం..రేపటి భాగంలో..
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా.. పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి