27, అక్టోబర్ 2023, శుక్రవారం

కన్నులకాటుక

 కన్నులకాటుక చమత్కారం!


 శ్రీ బులుసు వేమకటేశ్వర్లు గారి "నీలమోహనం"యెడనెడ చమత్కార భాసురం!ఆచమత్కారం స్వభావసుందరం! అదిగోఆపద్యాన్ని రసజ్ఞులు

చిత్తగింతురుగాక!


"స్వామీ!కజ్జలరేఖలా కనుల? వహ్వా!! ప్రేయసుల్ గోపికా

భామల్,ముచ్చట లిట్లు దీర్చికొనిరే! వాదేలనీతోడ? మీ

ప్రేమల్ లోకమెఱుంగ ఱేపకడ గోపీ గండభాగమ్ములన్

గోమై కాటుక చుక్కలై మెఱసి నీకున్ కీర్తులందెచ్చులే!          14:ప.

    ఓస్వామీ!నీవిశాలనేత్రాలకు అందంగా అలంకరించిన యీకాటుకరేఖలు యెంతసొగసుగా ఉన్నాయో?ఈవిధంగా నీప్రియతమగోపికామణులు తమముచ్చటను దీర్చికొన్నారాయేమి,?వహ్వా!!బాగుబాగు!!

        ఎందుకయ్యా!అలాకోపంగా నావైపుచూస్తావు.?ఓహో?నీప్రేయసీమణుల నెకసెక్కమాడితిననియా?

          నీతో నాకు వాదములేల!మీ మీప్రేమలను ప్రపంచమెరుగదా?అందరకూ విదితమే?

ఎట్లందువా?

         రేయి రాసక్రీడలలో నీకన్నులకాటుక వారి గండభాగములకలంకృతమయి తెల్లవారుసరకి అందరకూ తేటతెల్లము జేయునుగదా!

    అవినీకీర్తిపతాకములై భాసించునులెమ్ము.

        ఇదీ దీని భావము.

నీవుగోపికాలోలుడవని కంఠోక్తిగా కవిచెప్పడు.వారికంఠభాగములందలముకొన్న కాటుక రేఖలే ,మీలౌల్యమునకు నిదర్శనమలంటాడు.

 ఎంతచమత్కారం!

నేనన్నాననికోపపడకయ్యో!నీచేతలే నిన్నుబయటపెడతాయిలే!యంటాడు.

       పైగా ఆకాటుక మరకలు (తెల్లనివికాదు-నల్లనివి) ఆయనకీర్తికిగుర్తులట!

జరిగినది జారత్వము.అందువలన వచ్చుకీర్తి యపనిందయే అందువలలననే ఆకీర్తికి నలుపురంగునాపాదించినాడుకవి!

   ఆహా!ఏమిభావుకత!!

కీలెరిగి వాతబెట్టుటయా?

పొగడుటయా?

నిందాస్తుతియే!!!


ఈతీరుగా ననిదంపూర్వకములైన చమత్కారములు పద్యాలలో కోకొల్లలు.ప్రతీపద్యంలోనూ ఏమున్నాదా ?యనురిరంసతో పద్యాలు చదువుకోవాలి.పుటలుత్రిప్పితే ప్రయోజనంలేదు.భావుకులైన రసజ్ఙభారతి పండితులారా!మంచికావ్యాలను చదవండి!

చదివించండి!కవినిప్రోత్సహించండి! కవికోరేదదే!

"ఆపరితోషాద్విదుషాం నసాధుమన్యే ప్రయోగవిజ్ఙానం"-

అన్నాడు కాళిదాసు.ఆమాట త్రైకాలిక సత్యం!!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: