అరుణోదయ శోభలు
కవిసార్వభౌమ! శ్రీనాధమహాకవి !
సీ: చిఱుసానఁ బట్టించి చికిలి సేయించిన
గండ్ర గొడ్డలి నిశాగహన లతకు ;
గార్కొన్న నిబిడాంధకార ధారాఛ్ఛటా
సత్త్రవాటికి వీతిహోత్ర జిహ్వ :
నక్షత్ర కుముద కాననము గిల్లెడు పొంటె
ప్రాచి యెత్తిన హస్త పల్లవాగ్ర
మరసి మింటికి మంటికైక్య సందేహంబుఁ
బరిహరింపంగఁ బాల్పడ్డ యవధి ;
గీ: సృష్టి కట్టెఱ్ఱ తొలుసంజ చెలిమికాఁ డు
కుంటి వినతామహాదేవి కొడుకుఁ గుఱ్ఱ
సవితృ సారధికట్టెఱ్ఱ చాయ వేలుప
పరుణుఁ డుదయించెఁ బ్రాగ్దిశాభ్యంతరమున.
కాశీఖండము- 1 ఆ :121 పద్యము: కవిసార్వభౌముడు శ్రీనాధుడు!
ఇది శ్రీనాధమహాకవి వర్ణించిన అరుణోదయ వర్ణనము. అనూరుడే అరుణుడు. అతడే సూర్యుని రథసారధి.ప్రభాతంలో తూర్పున మసక చీకటులను చీల్చుకుంటూ ప్రభాతంలో మనకు తొలిసారిగా దర్శనమిచ్చేవాడే యరుణుడు.
ప్రత్యూషకాలంలో అతని దర్శనం యేతీరున నున్నదో శ్రీనాథుని మాటటలోనే వినండి!
భావము: ఆకాశంలో చిక్కటిచీకటి అడవి తీగవలె దట్టంగా అల్లుకు పోతే దాన్ని ముక్కలు గానరకేందుకు వస్తున్న పదునైన గండ్ర
గొడ్డలివలె నున్నదట.
ఆకాశమనే యజ్ఙశాలలో నేతిధారల వలన లేచిన ధూమ సముదాయాన్ని వెలికి ద్రోసే అగ్ని జ్వాల వలెనునన్నదట!
ఆకాశంలో నల్లని యాకాశంలో మిణుకు మిణుకు మనితారలు మెరుస్తున్నాయి. ఆదృశ్యం ఆకాశమనే సరోవరంలో పూచిన కలువ పూలవలెనున్నది. ఆకలువ పూలను కోసేందుకు ప్రాగ్దిశాంగన యెత్తిన హస్త పల్లవ సదృశంగా నున్నదట!
ఏది భూమో యేది యాకాశమో తెలిసి కోలేని రీతిగా భూ నభముల రెంటిని చీకటిక్రమ్మగా ఆరెంటికి హద్దులను
తెలుపుటకు ఏర్పడిన సరిహద్దు సిబిరమువలె అరుణోదయమున్నదట!
సృష్టిలో నన్నిటికన్న నెర్రని వాడు తొలిసంజకు చెలికాడు. కుంటి. వినతాప్రియనందనుడు. సూర్యరథసారథి అరుణుడు
తూరుపు కొండపై నుదయించు చున్నాడు.
ప్రాభాతంలో అరుణోదయమే ప్రొద్దు పొడుపు నకు గుర్తు!
స్వస్తి!🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి