శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
హఠాత్తుగా ఎదురైన ఈ పరిస్థితికి రవ్వంత నివ్వెరపోయింది సుకన్యాదేవి. తడిబట్టలతో
పరపురుషుల కంటబడినందుకు సిగ్గుపడింది. అయినా తనని తాను నిబ్బరించుకుని బదులు పలికింది.
నేను శర్యాతితనయను. చ్యవనమహర్షి భార్యను. మాతండ్రిగారు నన్ను వారికిచ్చి వివాహం చేశారు. నాభర్త
అంధుడు, వృద్ధుడు, మహాతపస్వి. పతివ్రతనై చ్యవనమహర్షికి అహోరాత్రాలూ సేవలు చేస్తూ ఆనందిస్తున్నాను.
ఇంతకీ మీరిద్దరూ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? దగ్గరలోనే ఉంది మా ఆశ్రమం. నా పతిదేవుణ్ణి
దర్శించాలన్నారుగదా! రండి. మా ఆశ్రమానికి వెడదాం. పావనం చేద్దురుగాని. మహర్షిని చూద్దురుగాని
- అని ఆదరంగా ఆహ్వానించింది. దస్రులు (అశ్వినులు) తడబడ్డారు. కొంచెం తటపటాయించారు.
బింకంగా సంభాషణ సాగించారు.
అయ్యో! మీ నాన్న నిన్ను తపస్వికి ఇచ్చి చేశాడా? ఎంత కఠినాత్ముడు! నువ్వు చూస్తే ఈ
అడవిలో నేలమీద నడుస్తున్న మెరుపుతీగలా మెరిసిపోతున్నావు. దేవలోకంలోకూడా నీలాంటి సుందరాంగి
లేదంటే నమ్ము. ఈ నారచీరలు కాదు, నువ్వు దివ్యాంబరాలు కట్టుకోవాలి. వాటికే నువ్వు తగుదువు.
రత్నాభరణాలు అలంకరించుకుని, తుమ్మెదల్లాంటి ముంగురులు ముఖపద్మంమీద నాట్యంచేస్తుంటే
నీరూపం చూడాలి. రంభాద్యప్పరసలు తలదించుకోవాలి. ఆహా! బ్రహ్మదేవుడు ఎంత దుర్మార్గుడు! నీకు
ఇలా నట్టడవిలో కాపురం రాశాడా; అదీ ఒక జడధారికి, అంధుడికి, వృద్ధుడికి భార్యవైపడిఉండే అవస్థ
కల్పించాడా? దారుణం. భామినీ! ఇది మహాదారుణం. విశాలనయనా! నాట్యశాస్త్ర పండితురాలిలా
కనిపిస్తున్నావు. నువ్వు ఆ కన్నులులేని కబోదికి పరిచర్యలు చెయ్యడమా? మరి మన్మథుడి బాణాలు
ఎవరిమీద పడుతున్నట్టు, ఏమవుతున్నట్టు?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి