4, నవంబర్ 2023, శనివారం

వేదాలు

 *వేదాలు*


వేదం సృష్టితత్త్వాన్ని, సృష్టికి మానవుడికి ఉన్న సంబంధాన్ని, మానవుడికి సృష్టికర్తతో గల అనుబంధాన్ని వ్యక్తం చేసింది. 


వేదం ఏ ఒక్కరో రచించిన గ్రంథం కాదు. సృష్టితత్త్వాన్ని, పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోవాలని ఆరాటపడిన మహర్షి సముదాయానికి అంతర్నేత్రానికి గోచరించిన ఒక దర్శనం. హృదయస్థానంలో వినిపించిన ఒక నాదం (శ్రుతి). 


వేదం *అపౌరుషేయం* అని కూడా పెద్దలు గుర్తించారు. *అపౌరుషేయం* అంటే మానవ మాత్రుడి రచన కాదు అని అర్ధం.


అనాదిగా అలా దిగి వచ్చిన వేదం వ్యాసమహర్షి కాలానికి చిక్కువడిన దారాల రాశిగా ఉంటే, ఆ చిక్కును విడదీసి, వేదవిభాగ నిర్ణయంచేసి, వేదం మనకు అక్కరకు వచ్చేలా చేశాడు ఆ మహర్షి. ఆనాటి నుండి అతడికి *వేదవ్యాసుడు* అనే పేరు వచ్చింది. సకల వేదాల సారాన్ని 555 సూత్రాలుగా “బ్రహ్మసూత్రాలు” రచించాడు. అయినా, ఆ మహర్షికి తృప్తి కలుగలేదు. 


వేదమనే విత్తనంలో నుంచి విశాలమైన పురాణ మహావృక్షాలను అంకురింప చేశాడు. అందుకే పురాణాలకు *వేదోపబృంహణాలు* అని పేరు. *ఉపబృంహణం* అంటే విత్తనాలు నుంచి మొలక రావడం. విత్తనంలో ఏమి ఉన్నదో మొలకలో, మొక్కలో, చెట్టులో అదే ఉంటుంది.


ఇలా వేదవాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురాణాలను రచించాడు వ్యాసమహర్షి. 


- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

కామెంట్‌లు లేవు: