12, నవంబర్ 2023, ఆదివారం

తత్వబోధ

 Inspiring Story


తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!



చెన్నై… మైలాపూర్… కాపాలీశ్వర కోవెలలో దర్శనం అయిపోయింది… గిరి ట్రేడింగ్ స్టోర్స్‌లోకి వెళ్లి ‘తత్వబోధ’ పుస్తకం కోసం వెతుకుతున్నాను… అక్కడ బోలెడన్ని పుస్తకాలు… అనేక సీడీలు… అభంగ్ నుంచి అరుణా సాయిరాం దాకా… భజనల నుంచి బాంబే జయశ్రీ దాకా… బొచ్చెడు సీడీలు… ఓహ్, సరైన ప్లేసులోకే వచ్చాం అనిపించింది… నా భార్య భారతీయర్ పాటల సీడీల కోసం వెతుక్కుంటోంది…


నేనేమో ఆ పుస్తకాల దొంతర్లలో ఆ తత్వబోధ అనే పుస్తకం కోసం అన్వేషిస్తున్నాను… దొరకడం లేదు… ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకదు, కాస్త ఆలస్యమైనా సరే ఇక్కడే వెతుక్కోవాలి, అది చదవాలి… క్యాషియర్ పక్కన ఓ అమ్మాయి నిలబడి ఉంది… నేనూ, నా భార్య తంటాలను గమనిస్తోంది… చామనఛాయకన్నా కాస్త నలుపే… దగ్గర్లోని ఏదైనా పల్లె నుంచి వచ్చి ఉండాలి… 17, 18 ఏళ్లుంటాయేమో… ఏ ఏడో తరగతో, ఎనిమిదో తరగతో చదివి ఉండవచ్చు బహుశా… పేదరికం వల్ల ఆపేసి, ఇక్కడ కొలువు చేస్తుండవచ్చు… జర్నలిస్టును కదా, ఆమెను చూడగానే ఏదేదో ఊహించేశాను… పాడు అలవాటు… కానీ మేం అంతే.


ఎవరో అనామకురాలు, నాకెందుకు అనుకుని… తిరిగి ఆ పుస్తకాన్వేషణలో పడ్డాను… సంధ్యావందనం నుంచి వివేకానంద చికాగో ప్రసంగాలు దాకా బోలెడు పుస్తకాలు… ఎక్కువ శాతం ఆధ్మాత్మిక సంబంధమే… అరగంట గడిచిందేమో… ఆమె చూస్తూనే ఉంది నన్ను… ఈ పిల్లకు ఏం తెలుసులే అని నేను కూడా ఆమెను ఆ పుస్తకం గురించి అడగలేదు… ఏముందీ, మనం సీడీలో, పుస్తకాలో సెలెక్ట్ చేసుకుంటే, ప్యాక్ చేసి ఇస్తుంది, అంతే కదా… అవును, మా బుర్రలు అలాగే ఆలోచిస్తుంటయ్ చాలాసార్లు… ఐనా ‘తత్వబోధ’ సారాంశాన్ని వదిలేయండి, కనీసం ఆ పుస్తకం దేని గురించో బేసిక్ ఐడియా ఉంటుందా సేల్స్ గరల్స్‌కు..? నెవ్వర్… అనుకున్నాను… ఈలోపు ఆమే నా దగ్గరకు వచ్చింది…


‘సార్, మీరు దేని గురించి వెతుకుతున్నారో నాకు చెబితే, నేను ఏమైనా సాయపడగలను…’


ఒక్కసారి ఆమె వైపు ఎగాదిగా చూశాను…


‘చూడమ్మా, నేను తత్వబోధ అనే పుస్తకం కోసం వెతుకుతున్నాను’ అని బదులిచ్చాను…


‘సంస్కృతంలో పబ్లిష్ చేసింది కావాలా..? లేక ఇంగ్లిష్, సంస్కృతం భాషల్లో పబ్లిష్ చేసింది కావాలా..?’ అనడిగింది ఆమె…


ఓహ్, ఈమెకు కొంత తెలిసినట్టే ఉంది… ‘సంస్కృతం ప్లస్ ఇంగ్లిష్’ అన్నాను నేను…


‘మీకు చిన్మయానంద మిషన్ వాళ్లు ప్రచురించింది కావాలా..? ఇందూ పబ్లికేషనా..? రామకృష్ణ మఠం వాళ్లదా..?’


‘ఓహ్, ఇంతమంది పబ్లిష్ చేశారా..? నిజంగా ఇవన్నీ నాకు తెలియదు, కానీ తత్వబోధ చదవాలని ఉంది’


‘మీకు తమిళం చదవడం తెలుసా..?’


‘ఎందుకు తెలియదు, నేను తమిళుడినే… (నిజానికి నా తమిళత్వం గురించి నేను పెద్దగా బయటపెట్టుకోను ఎక్కడా…)


‘అలాగైతే మీరు ఈ పుస్తకం తీసుకొండి’ అంటూ… నేను అరగంట నుంచీ వెతుకుతున్న దగ్గర నుంచే ఓ పుస్తకాన్ని తీసి ఇచ్చింది… ఎన్.శివరామన్ తమిళంలో రాసిన పుస్తకం అది… కవర్ పేజీ బాగుంది…


‘తమిళంలోనే కాదు, మీకు అవసరమైనచోట్ల సంస్కృత ఒరిజినల్ కంటెంటు కూడా ఉంటుంది’


ఈమెకు ఈ ఆధ్యాత్మిక పుస్తకాల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టే ఉంది… నేనేమో సాదాసీదా సేల్స్ గరల్ అనుకున్నాను… నేను విదేశాల్లో కొలువు చేసే ఓ పేద్ద జర్నలిస్టును… ఆమె దేహం కలర్, వృత్తి, ఆమె దుస్తుల పేదరికం, పల్లె ఛాయలు చూసి, మరీ ‘తత్వబోధ’ గురించి ఈ పిల్లకేం తెలుసులే అనుకున్నాను… ఛఛ అని మనసులోనే లెంపలేసుకున్నాను…


‘తత్వబోధ గురించి నాకేమీ తెలియదమ్మా, నిన్న ఒక ప్రసంగం విని ఈ పుస్తకం మీద మనసుపడ్డాను, అందుకే ఈ ప్రయత్నం…’


‘ఓహో, మీరు భారతీయ విద్యాభవన్‌లో గోదా వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగానికి వెళ్లారా..? ఆయన ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తిని ఇట్టే పెంచేస్తారు… సిటీలో ఆయనంత గొప్పగా ఆధ్యాత్మికం, వైరాగ్యం, సాధన, అర్చన, కర్మ వంటి సబ్జెక్టులపై ఎవరూ మాట్లాడలేరు… భారతీయ విద్యాభవన్‌లో ఆయన చేసే ప్రసంగాలకు చాలామంది వస్తుంటారు…’


ఈమె నేననుకున్నంత అజ్ఞాని ఏమీ కానట్టుంది…


‘ఇవన్నీ నీకెలా తెలుసు..? నీకూ ఈ సబ్జెక్టుల మీద ఇంట్రస్టు ఉందా..?’


‘అవును సార్, స్వామి వివేకానంద, రామకృష్ణల పుస్తకాలే కాదు, తత్వబోధ వంటి లోతైన వేదవివరణలూ చదివాను… నాకిష్టం…’


‘తత్వబోధ కూడా చదివావా..?’


‘అవును, ఇప్పుడు మీకు ఇచ్చిన పుస్తకం కూడా చదివాను… ఒక్కసారి మీరు చదివితే దీన్ని ఎల్లప్పుడూ మీ టేబుల్ మీద మీకెదురుగానే పెట్టుకుంటారు…’


‘ఈ పుస్తకం అంత గొప్పగా ఉంటుందా..? అసలేముంది ఇందులో..? చదివితే ఏమొస్తుంది..?’


‘జోక్ చేస్తున్నారా సార్..? తత్వబోధ గురించి తెలియకుండానే ఇంతసేపూ వెతికారా..?’


సీడీల వేటలో ఉన్న నా భార్య ఈ సంభాషణ వింటూనే ఉంది…


‘సార్, నాకు తెలిసినంతవరకూ… ఈ పుస్తకం చదివి జీర్ణం చేసుకోగలిగితే వేదాంతసారం బుర్రకెక్కినట్టే… సరళంగా, సులభగ్రాహ్యంగా… అది జీవితం పట్ల అణకువను నేర్పిస్తుంది… నేను అనే అహాన్ని వదిలిస్తుంది… ఇంకా ఎన్నో…’


‘ఒక్క పుస్తకం మన గుణాన్ని మార్చేయగలదా..?’


‘నిజమే సార్, కాకపోతే కంటెంటులోకి మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవాలి… అంకితభావం, చిత్తశుద్ధితో ఆచరణకు ప్రయత్నించాలి… అంతే…’


నేను కళ్లప్పగించి చూస్తున్నాను… వింటున్నాను… ఈలోపు నా భార్య అక్కడికి వచ్చింది… ఈమె ఉత్త సేల్స్ గరల్ కాదు, బుర్రలో పదునుంది అని మెచ్చుకుని… ‘ఆ పారిస్ హిల్టన్ గట్రా దేనికి..? నీ వాషింగ్టన్ పోస్టుకు ఈమె ఇంటర్వ్యూ రాయరాదూ ఈసారి…’ అన్నది నవ్వుతూ నావైపు చూసి… నిజమే కదా… వెరయిటీగా ఉంటుంది… Chat with an intelligent sales girl  అని రాద్దాం…


‘కాసేపు నీతో మాట్లాడాలమ్మా’ అన్నాను


‘దుకాణంలో రద్దీ ఉంది, ఇది ఇప్పుడు వదిలి రాలేను సార్, మా ఓనర్‌ను అడగండి…’


‘ఇంతకీ నీపేరేంటి..?’


‘కళైవాణి’ అని చెప్పి, ఇంకెవరికో ఏదో కావాలంటే గైడ్ చేయడానికి వెళ్లింది… నా భార్యకు ఆ పిల్ల తెలివి భలే నచ్చేసింది… మాటలో నమ్రత మరింత నచ్చింది… ఇద్దరూ ఓనర్ దగ్గరకు వెళ్లాం…


‘సేటూ, ఆ అమ్మాయి కళైవాణి….’


‘అవును, కష్టపడి పనిచేస్తుంది, మంచి అమ్మాయి’


‘ఈయన నా భర్త విశ్వనాథ్, వాషింగ్టన్ పోస్టులో సీనియర్ జర్నలిస్ట్’ అని నన్ను పరిచయం చేసింది… ఆయన ఆశ్చర్యంతో ఒక్కసారి దిగ్గున లేచి నిలబడ్డాడు… ‘ఆ అమ్మాయి ఇంటర్వ్యూ రాస్తాడట…’ ఓనర్ ఆ అమ్మాయిని పిలిచాడు… వీళ్లు అమెరికా నుంచి వచ్చారట, నీతో కాసేపు మాట్లాడతారట…’


‘సేటూ, గిరాకీ బాగా ఉంది ఈరోజు… రేపు ఉదయం ఇంకాస్త ముందుగా వస్తాను…’


మరుసటిరోజు వద్దామని నిర్ణయించేసుకున్నాను… నిజానికి నాకు మరుసటిరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా మిత్రులు, మద్రాస్ ప్రెస్ క్లబ్ మిత్రులతో ముఖ్యమైన అపాయింట్‌మెంట్లున్నయ్… ఐనాసరే…


ఈలోపు ఆమె కథ కాస్త తెలుసుకున్నాను… ఆర్కాట్ దగ్గర ఏదో చిన్న ఊరు… ఆమెకు అయిదుగురు చెల్లెళ్లు… కనడం తప్ప మరేమీ చేయని తండ్రి తాగీతాగీ ఓరోజు వీళ్లను వదిలి చచ్చిపోయాడు… తల్లి ఏవో పనులు చేస్తూ పోషించేది, రెండేళ్ల క్రితం ఆమె కూడా మరణించింది… ఆరుగురు పిల్లల బతుకులు బజార్నపడ్డయ్… ఈమె తొమ్మిది దాకా చదివింది… తప్పదు కదా, ఈ షాపులో కొలువు కుదిరింది… నెలకు 2500 జీతం… తన ఐదుగురు చెల్లెళ్లనూ చెన్నై కార్పొరేషన్ స్కూల్‌లో చేర్పించింది… ఆమే అక్క, ఆమే అమ్మ, ఆమే అయ్య… అన్నీ… pathetic…


‘అసలు తత్వబోధ వంటి లోతైన సబ్జెక్టులు చదవాలని ఎందుకు అనిపించింది నీకు..?’ అడిగాను మరుసటి రోజు ఉదయం…


‘ఇక్కడ చేరాక మొదట్లో ఏమీ అర్థమయ్యేది కాదు, కష్టమర్లు అడిగేది నాకు తెలిస్తే కదా నేను వాళ్లకు సాయం చేయగలిగేది… అందుకే రమణ, రామకృష్ణ, వివేకానందల చిన్న చిన్న పుస్తకాలు చదవడం దగ్గర్నుంచి మొదలుపెట్టాను… సబ్జెక్టు అర్థమయ్యేకొద్దీ ఆసక్తి పెరిగింది… వివేక చూడామణి, భగవద్గీతల దాకా వెళ్లిపోయాను… ఏ పుస్తకంలో ఏముందో సారాంశం చెప్పేయగలను…’


‘నీకొచ్చే 2500 జీతంతో ఆరుగురు ఎలా బతుకుతున్నారు..?’


‘పర్లేదు సార్, మా ఓనర్ సాయం చేస్తుంటాడు…’


‘ఇంతకీ నీకంటూ ఓ టార్గెట్ లేదా..?’


‘ఉంది సార్, నా చెల్లెళ్లందరినీ ఇంకా చదివించాలి… మంచి కొలువుల్లో చేర్చాలి…’


ఆ పిల్ల మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంతో అసలు మాటలే సరిగ్గా రావడం లేదు… అప్పటికప్పుడు ఓ సంకల్పం తట్టింది… నేనే అడిగాను…


‘నెలకు పదివేలు ఇస్తాను… మీ అందరికీ ఆసరా అవుతాను, సరిపోతాయా..? నాకెందుకో నీతో మాట్లాడుతుంటే అలా ఇవ్వాలనిపించింది…’


‘అవి చాలా ఎక్కువ సార్, కానీ మా ఓనర్‌ను అడగాలి… మంచికీ చెడుకూ ఆయనే మాకు పెద్దదిక్కు… ఆయన్ని కాదని నేనేమీ తీసుకోను… మర్యాద కాదు…’


నిజానికి ఆమె ఎగిరి గంతేస్తుంది అనుకున్నాను… కానీ ఆమె మొహంలో పెద్దగా ఏ ఉద్వేగమూ లేదు… దీన్ని స్థితప్రజ్ఞత అనాలా..? కష్టాల నుంచి అలవడిన నిబ్బరమా..? దంపతులమిద్దరమూ ఆమెను ఓనర్ దగ్గరకు తీసుకెళ్లాం, విషయం చెప్పాం… ఆయన సంతోషంతో ‘మీరు ఆ సాయం చేసి పుణ్యం కట్టుకొండి సార్, ఈ అమ్మాయి మీ సాయానికి అర్హురాలే…’ అన్నాడు… మీ ఖాతా నంబర్ చెప్పండి, నెలనెలా మీకే పంపిస్తాను, మీరు ఆ అమ్మాయికి ఇవ్వండి అన్నాను నేను…


‘వద్దు సార్, ఆమె పేరిట ఖాతా ఓపెన్ చేసి, మీకు డిటెయిల్స్ పంపిస్తా, ఆమె ఖాతాకే పంపించండి…’ అన్నాడు తను… నా వెంట వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్, నా ఫ్రెండ్ జాన్ పాల్ నన్ను ఆలింగనం చేసుకుని, నిజంగా ఓ మంచి పనిచేస్తున్నావు బ్రో అన్నాడు… ఆ పిల్లను ఉద్దేశించి నా భార్య చెబుతోంది… ‘నాలుగు రోజులు ఆగు, నిన్ను తీసుకెళ్లి అమెరికాలో వేదాంతసారం మీద ప్రసంగాలు ఏర్పాటు చేస్తాను…’ విమానం ఎక్కుతూ అనుకున్నాను నేను… ‘మన పల్లెల్లో ఇంకెన్ని రతనాలు ఉన్నాయో… చూడలేకపోతున్నాం… సాన బెట్టాలే గానీ ఎన్ని రత్నాలో, ఎన్నెన్ని మెరుపులో…’!!


సోర్స్ :: https://www.linkedin.com/pulse/20140729103615-81657483-the-sales-girl-in-chennai-giri-store-through-the-eyes-of-washington-post/


Share this Article

ముచ్చట.

కామెంట్‌లు లేవు: