ॐ నరకచతుర్దశీ - దీపావళీ శుభాకాంక్షలు
నరకాసురవధ జరిగాక, ఆనందంగా దీపావళి జరుపుకుంటాం.
మనలోని నరకుణ్ణి సంహరించి, జ్ఞాన సంపద పొంది, ఆత్మానందము అనుభవించడమే ఈ రెండు పండగల అంతరార్థం.
నరక చతుర్దశీ - దీపావళీ సందేశం
నరకుడు భూ పుత్త్రుడు. భౌతిక సుఖాలతోనే గడుపువాడు. స్త్రీలను చెఱబట్టినవాడు.
ప్రాక్ (తూర్పు) జ్యోతిషపురవాసి. అంటే సూర్యాది నక్షత్రాలు కల్గిన అంతరిక్ష నివాసి అని అర్థం.
సూర్యునితో కూడిన నక్షత్రాల అంతరిక్షం అంటే,
సరియైన బుద్ధి ప్రేరేపించబడడం ద్వారా వచ్చే, ఆత్మ జ్ఞాన ప్రకాశం.
అది పొందకుండా, కేవలం భూ సంబంధమైన దైహిక సుఖలోలత్వం అధర్మంగా పొందితే,
నరకానికి తీసుకొనిపోయే నరకుని చర్యలే అవుతాయి.
అది తెలుసుకొని, మనలోని నరకాసురుణ్ణి సంహరిస్తే,
ఆత్మ జ్యోతితో వెలిగే మన జీవితాలు దీపావళి వెలుగులే!
ఆశ్వయుజం - ముగురమ్మలు
ఆశ్వయుజ మాసంలో శ్రీమాతను ముగురమ్మల రూపాలలోనూ ఆరాధిస్తాం.
శరన్నవరాత్రులలో శక్తి స్వరూపిణిగా దుర్గాదేవిగా ఆరాధిస్తాము.
అందులోనే మూలా నక్షత్రంనాడు విద్యాప్రదాతయైన సరస్వతీదేవిగా ఆరాధిస్తాము.
ఈ మాసం చివరిలో దీపావళీ అమావాస్యనాడు లక్ష్మీదేవిగా ఆరాధిస్తాము.
క్రియా - జ్ఞాన శక్తులు దుర్గా సరస్వతులు అనుగ్రహిస్తే, సంపద లక్ష్మీ అనుగ్రహం.
ఇచ్ఛా - క్రియా - జ్ఞాన శక్తులకు సంబంధించి ముగురమ్మల రూపాలలో ఉన్న జగన్మాత అనుగ్రహం పొందుదాం.
***
ఈరోజు దీపావళి నాడు లక్ష్మీదేవిని కొలుద్దాం
శ్రీమహాలక్ష్మ్యై నమః
శ్రుత్యై నమోఽస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయ గుణార్ణవాయై I
శక్త్యై నమోఽస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమ వల్లభాయై ॥
- కనకధారా స్తోత్రమ్ (ఆదిశంకరులు)
తాత్పర్యం:
* సకల శుభకర్మల ఫలాలని ప్రసాదించే వేదస్వరూపిణియు,
* మహిమాన్వితమైన గుణములకు సాగరరూపిణియైన సౌందర్య(రతి)రూపిణియు,
* నూరురేకుల పద్మమునందు నివశించు మహాశక్తి స్వరూపిణియు,
* పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు భార్యయు, పుష్టిరూపిణియు అయిన లక్ష్మీదేవికి నమస్కారము.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి