12, నవంబర్ 2023, ఆదివారం

ఆలోచనాలోచనాలు

 👌ఆలోచనాలోచనాలు 👍 సంస్కృత సూక్తి సుధ 💐                                      ***** త్యజేదేకం కులస్యార్థే, గ్రామస్యార్థే కులం త్యజేత్! గ్రామం జనపదస్యార్థే, ఆత్మార్థే పృథివీం త్యజేత్!!                  ఒకడ వలన కులం చెడిపోతున్నదనుకొంటే ఆ ఒక్కడిని విడిచిపెట్టాలి. ఒక కులం వలన గ్రామానికి నష్టం ఏర్పడితే ఆ కులాన్ని వదిలెయ్యాలి. ఒక గ్రామం వలన రాజ్యానికి ఇబ్బందులు ఏర్పడితే ఆ గ్రామాన్ని విడిచిపెట్టాలి. తనకే , తాను ఉన్న భూమి వలన కష్టాలు కలిగితే దానిని వెంటనే వదిలెయ్యడం మంచిది.        ***** అహో ప్రకృతి నా దృశ్యం, శ్లేష్మణో దుర్జనస్యచ, మధురైః కోపమాయాతి , కటుకై రుపశామ్యతి!!                      దుర్జనుడు, శ్లేష్మం --- ఈ రెండూ స్వభావం చేత సమానవైనవి. ఎట్లాగంటే తియ్యటి పదార్థాలు తింటే శ్లేష్మం (కఫం) వృద్ధి చెందుతుంది. చేదు పదార్థాలు తినడం వలన శ్లేష్మం నశిస్తుంది.                   ***** యస్మిన్ దేశేన సన్మానో, నప్రీతిర్నచ బాంధవాః, న విద్యా నాస్తి ధనికో, నతత్ర దివసం వసేత్!!                                   గౌరవము, ప్రేమ, బంధువులు, విద్య, దానం చేసే ధనవంతులు ఉండరో అక్కడ బుద్ధిమంతుడైనవాడు ఒక్క రోజైనా ఉండకూడదు.( ఉంటే ప్రమాదమని భావం.)           ***** రాజవత్పుత్ర దారాశ్చ, స్వామి సన్మిత్ర బాంధవాః! ఆచార్య వత్సభామధ్యే , భాగ్యవంతం స్తువంతిహి!!     భాగ్యవంతుడైనట్లయితే భార్య, బిడ్డలు ప్రభువును గౌరవించినట్లు గౌరవిస్తారు. సభలయందు ఆచార్యుని వలె జనులు కీర్తిస్తారు. బంధువులు, స్నేహితులు యజమానిని కొలిచినట్లు కొలుస్తారు. కాబట్టి భాగ్యవంతుడికే ఈ లోకంలో నేడు గౌరవమర్యాదలు లభిస్తాయని కవి భావన.         ***** మాతా నిందతి, నాభినందతి పితా.                భ్రాతా న సంభాషతే, భృత్యః కుప్యతి, నానుగచ్ఛతి సుతః,              కాంతాపి నాలింగతే,                అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాప మాత్రం సుహృత్, తస్మాదర్థముపార్జయ, శ్రుణు సఖేః, అర్థేన సర్వేవశాః!!                           ధనానికి ఎంతటి ప్రభావం ఉందో ఒకడు తన మిత్రునికి తెలియబరుస్తున్నాడు.         మిత్రమా! దరిద్రుణ్ణి తల్లి తిడుతుంది. తండ్రి సంతోషించడు. అన్నదమ్ములు మాట్లాడరు. సేవకులు కోపగించుకొంటూ ఉంటారు. కొడుకు వెంట రాడు. భార్య కూడా ప్రేమతో కౌగలించుకోదు. ఆఖరుకు ప్రాణస్నేహితుడు కూడా డబ్బు అడుగుతాడేమో అనే అనుమానంతో పలకరించకుండా, దూరంగా తప్పుకొని తిరుగుతాడు. కాబట్టి ధనాన్ని సంపాదించు. ధనం వలన అంతా నీ వశం అవుతారు.                         ***** ఆతురే నియమో నాస్తి  బాలే వృద్ధై తధైవచ, సదాచార రతే చైవ హ్యేష ధర్మ స్సనాతనః!!                            రోగగ్రస్తులకు, బాలురకు, ముసలివారికి, ఎల్లప్పుడూ మంచి ఆచారాలు పాటించేవారికి--- వీరికి వేరే నియమాలు అక్కరలేదు. ఇది పూర్వకాలం నుండి వస్తున్న ధర్మం.                      ***** గోమూత్ర మాత్రేణ పయో వినష్టం, తక్రస్య గోమూత్ర శతేన కిం వా, అత్యల్ప పాపైర్విపదశ్శుచీనాం, పాపాత్మానాం పాప శతేన కిం వా!!                                ఆవు పంచితం ఒక బొట్టు పడ్డా పాలు చెడిపోతాయి. అయితే గోమూత్రం ఎంత కలిసిన మజ్జిగకు చెరుపు లేదు. అట్లాగే పరిశుద్ధమైన సజ్జనులకు కొంచెం పాపం చేస్తేనే పెద్ద ఆపద సంభవిస్తుంది. కానీ ఘోరమైన పాపాలు చేసేవారికి , ఇంకా ఎన్ని పాపాలు చేస్తే మాత్రం నష్టం ఏముంటుంది? ( వెంటనే పాప ఫలితం కనబడదని కవి భావం.)                           ***** చివరగా ఒక చమత్కార శ్లోకం. ----            మహాకవి కాళిదాసు భోజ మహారాజుతో తెలియజేసినట్లు జనశ్రుతి.     దగ్ధం ఖాండవ మర్జునేనచ వృధా కల్పద్రుమై ర్భూషితం,    దగ్ధా వాయుసుతేన హేమరచితా లంకా వృధా స్వర్ణభూః,         దగ్ధ స్సర్వ సుఖాస్పదశ్చ మదనో హాహా! వృధా శంభునా,         దారిద్ర్యం ఘనతాపదం భువినృణాం కేనాపినో దహ్యతే!!                            కల్పవృక్షాలు గల ఖాండవ వనాన్ని అర్జునుడు , స్వర్ణభూమి అయిన లంకను ఆంజనేయుడు , అందరికీ సుఖాన్నిచ్చే మన్మథుణ్ణి శివుడు వృధాగా కాల్చివేశారు. కానీ అందరికీ ఇంత క్షోభను , కష్టాన్నీ, తాపాన్నీ కలుగజేసే దరిద్రాన్నెవరూ కాల్చివేయలేకున్నారు. ఓ భోజ మహారాజా! నీవైనా ఆ పని చెయ్యమని కోరుకొన్నాడు.( భోజుడు ఆ శ్లోక కర్తకు జీవనభృతులు ఏర్పరచాడని ప్రతీతి)               తేది 12--11--2023, ఆదివారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: