12, నవంబర్ 2023, ఆదివారం

పునీతమైన ఇల్లు..గ్రామం..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*పునీతమైన ఇల్లు..గ్రామం..*


*(ఇరవై ఐదవ రోజు)*


శ్రీ స్వామివారు శ్రీధరరావు గారి ఇంటిలో విడిది చేశారు..ఆ రాత్రి గడిచింది..తెల్లవారుఝామునే లేచి ఆ ఇంటి ఆవరణలో దిగంబరంగా తిరుగసాగారు..దాదాపు ఒక ఎకరా స్థలం ఉన్న ఆ ఇంటి ఆవరణలో ప్రతి మూలా తిరుగుతూ చూస్తున్నారు..తెల్లవారే సరికే..మొగలిచెర్ల గ్రామమంతా వార్త ప్రాకిపోయింది.."శ్రీధరరావు ఇంటికి ఎవరో సాధువు వచ్చాడు..దిగంబరంగా వున్నాడు.."అంటూ చెప్పుకోసాగారు..


మరి కొద్దిసేపటికే.."ఆ భార్యాభర్తలకు పిచ్చిగానీ పట్టలేదు కదా..ఇలా ఒక దిగంబరిని ఇంట్లో పెట్టుకుంటారా?..ఎంత అప్రదిష్ట?.." అని కొందరూ..


"ఏ లంకెబిందెల కోసమో..లేకపోతే నిధుల కోసమో..ఆ సన్యాసిని ఇక్కడికి తీసుకొచ్చారు..లేకుంటే..ఇలాటి వాడిని ఇంటికి రానిస్తారా?.." అని కొందరూ..


వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు..కానీ కుతూహలం కొద్దీ శ్రీ స్వామివారిని చూడటం కోసం ఊరు ఊరంతా కదిలివచ్చింది..సాయంత్రం దాకా తిరునాళ్ళ ను తలపించేలా వచ్చి వెళ్లారు..


ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా..శ్రీధరరావు ప్రభావతి గార్లు చెక్కుచెదరలేదు..వాళ్ళు ఒక ధృడ నిశ్చయానికి వచ్చారు..ఎటువంటి వ్యాఖ్యలకూ స్పందించదలచుకోలేదు.. కొన్ని విషయాలు ఈ దృశ్య జగత్తుకు సంబంధించినవి..అవి కళ్ళకు కనిపిస్తాయి..కానీ..కొన్ని మనసుకు మాత్రమే గోచరం అవుతాయి..అవి దైవప్రేరితాలు..అలా మనసుకు గోచరమైన భావన ను నిజమని విశ్వసించి..అలా గోచరింపచేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శరణాగతి చెందడమే ఉత్తమ మార్గం..ఆ మార్గం లోనే పయనించాలని శ్రీధరరావు ప్రభావతి గార్లు నిర్ణయం తీసుకొని..దానికే కట్టుబడి వున్నారు..


శ్రీ స్వామివారి గురించి, వీళ్లిద్దరి బంధువర్గం లోనూ కొందరు హేళన తో మాట్లాడటం జరిగింది..అప్పుడూ మౌనంగానే వున్నారు..శ్రీ స్వామివారి తపోసాధనకు కానీ..వారి ఏర్పాట్ల కోసం గానీ..ఏలోటూ రానీయలేదు..


శ్రీధరరావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు కొడుకూ కోడలు చేస్తున్న ఈ పనికి పూర్తి అంగీకారం తో ఉండటం..ఆ దంపతులకు పెద్ద ఊరట నిచ్చే విషయం..


చిత్రంగా రెండు మూడు రోజుల్లోనే..పరిస్థితి తారుమారు అయింది..ఎవరైతే హేళన చేసారో..ఎవరైతే అపనమ్మకం తో ఉన్నారో..వారందరూ శ్రీ స్వామివారిని కీర్తించడం మొదలుపెట్టారు..శ్రీ స్వామివారిలో వారికి దైవాంశ కనబడసాగింది..కొందరు, శ్రీ స్వామివారు తమకు.. "పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి" లాగా కనబడుతున్నారనీ..మరికొందరు..తమకు సాక్షాత్తూ ఆ "పరమ శివుడు" లాగా కనబడుతున్నారనీ..నమస్కారం చేసుకుంటూ చెప్పుకోసాగారు..మరో రెండురోజుల కల్లా.. మొగలిచెర్ల గ్రామం మొత్తం..శ్రీ స్వామివారిని భక్తి పూర్వకంగా కొలవడం ప్రారంభించారు..


మొదట హేళనలూ..తిరస్కారాలూ..చూసి..ఆ వెంటనే భక్తిపూర్వక నమస్కారాలు చూసిన శ్రీధరరావు ప్రభావతి గార్లకు..తమ జన్మ సార్ధకత చెందిందని..ఆ స్వామి పాదం మోపిన తమ గృహం పావనం అయిందనీ..అనుభూతి చెందసాగారు..తాము ఆ యోగిపుంగవుడి సేవలో తరించే విధంగా తమకు శక్తి ప్రసాదించమని కులదైవం లక్ష్మీనారసింహుడిని ప్రార్ధించారు..


శ్రీ స్వామివారు వరుసగా మూడు రోజులపాటు సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు..ఆయనకు కేటాయించిన ఇంటి తలుపులు మూసివేసుకొని..లోపల ధ్యానం లో మునిగిపోయారు..చిత్రంగా ఆ మూడురోజులూ ఆ యింటి మీద వందలాది రామచిలుకలు వచ్చి వ్రాలాయి..ఆ యింటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరుగసాగింది.. ఆ సర్పాన్ని కొట్టాలని కొంతమంది ప్రయత్నం చేశారు గానీ..దంపతులిద్దరూ వద్దని వారించారు..అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించింది..రాత్రిపూట ఒకరకమైన నీలి రంగు కాంతి వలయం ఏర్పడసాగింది..శ్రీధరరావు గారు, ప్రభావతి గార్లు ఈ విచిత్ర పరిణామాల గురించి తన్మయత్వంతో చెప్పుకుంటుంటే విన్న సత్యనారాయణమ్మ గారు .."ఒక్కసారి స్వామివారున్న గది వద్దకు తీసుకుపొమ్మని" ప్రభావతి గారిని అడిగారు..ప్రభావతి గారు, ఆవిడను తీసుకొని ఆ గది వద్దకు తీసుకువెళ్లి..కిటికీ లోంచి శ్రీ స్వామివారిని చూపించారు..కొద్దిసేపటికే ఆవిడ ఏదో తెలీని అనుభూతితో.."అమ్మాయీ..ఈయన సామాన్యుడు కాదమ్మా..నాకు బ్రహ్మం గారిలాగా గోచరిస్తున్నారు.." అని నమస్కారం చేసుకున్నారు..


మూడోరోజు శ్రీ స్వామివారు సమాధి స్థితి నుండి బైటకు వచ్చారు..ఆరోజు సాయంత్రం మొగలిచెర్ల గ్రామస్థులు అందరూ శ్రీ స్వామివారిని చూడటానికి వచ్చారు..శ్రీ స్వామివారు ఆరుబయట అరుగు మీద పద్మాసనం వేసుకొని కూర్చుని..అందరితో ప్రశాంతంగా ముచ్చటించారు..సర్పం వచ్చిందని చెప్పగానే..శ్రీ స్వామివారు ఒక్కక్షణం కళ్ళుమూసుకుని.."అది దివ్య సర్పం..దానికి హాని తలపెట్టవద్దని..తాను తపస్సులో వున్నప్పుడు అలా తిరుగుతూ ఉంటుందనీ..మాలకొండ లో కూడా ఉండేదని.." చెప్పారు..ఆసరికే గ్రామస్థులలో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి..అందరూ శ్రీ స్వామివారిని దైవస్వరూపుడిగా మనసారా భావించి, కొలవసాగారు..


సాధువు..సన్యాసి..అవధూత..సద్గురువు..ఇలా అన్నీ కలబోసిన ఆ మహాత్ముడు..ఆ విధంగా ఆ దంపతుల జీవనాన్ని మలుపు త్రిప్పడానికి వారింటి లోనే అడుగుపెట్టాడు..


జ్ఞానబోధ..రామకోటి..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: