5, జనవరి 2024, శుక్రవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


అంతలోకీ - యమధర్మరాజులాగా విశ్వామిత్రుడు వచ్చిపడ్డాడు. నీళ్ళు చల్లి హరిశ్చంద్రుణ్ణి

మూర్ఛదేర్చాడు. లే.లే. నా దక్షిణ నాకియ్యి. అప్పు తీర్చకపోతే ఇలాగే ఉంటుంది. రోజురోజుకీ దుఃఖం

పెరుగుతుంది అన్నాడు.


ఉత్తిష్ఠోత్తిష్ఠరాజేంద్ర స్వాం దదస్వేష్టదక్షిణామ్ |

ఋణం ధారయతాం దుఃఖమహన్యహని వర్ధతే

(21-3)

హరిశ్చంద్రుడు స్పృహలోకి వచ్చాడు. ముఖంమీద చల్లని నీళ్ళు జల్లిన మహర్షి వైపు

ఆప్యాయంగా చూశాడు. గుర్తుపట్టి హఠాత్తుగా మళ్ళీ మూర్ఛిల్లాడు. విశ్వామిత్రుడికి వొళ్ళు మండింది.

రాజా ! ధైర్యంగా బతకాలనుకుంటే ముందు నా అప్పు తీర్చు. సత్యానికి కట్టుబడి ఉండటమంటే

మాటలనుకొంటున్నావా? సత్యంవల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సత్యంవల్లనే భూగోళం నిలబడింది.

సత్యంలోనే ఉత్తమధర్మం ఉంది. సత్యంలోనే స్వర్గమూ ఉంది. నూరు అశ్వమేధాలనీ ఒక సత్యాన్నీ

చెరొకవైపూ వేసి తూచితే సత్యంవైపే మొగ్గు ఉంటుంది.


సత్యేనార్కః ప్రతపతి సత్యే తిష్ఠతి మేదినీ

సత్యే ప్రోక్తః పరో ధర్మః స్వర్గస్సత్యే ప్రతిష్ఠితః

అశ్వమేధసహస్రం తు సత్యం చ తులయా ధృతమ్ ।

అశ్వమేధసహస్రాద్ది సత్యమేకం విశిష్యతే ॥

(21-7, 8)

అయినా ఈ ప్రసంగాలతో నాకేమి పని. సూర్యుడు అస్తమించేలోగా నా దక్షిణ నాకివ్వకపోయావో

శపించానన్నమాటే - అని బెదిరించి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు భయంతో వణికిపోయాడు. బేలగా

విలపించాడు.

అంతలోకీ వారాణసీ వేదవండితు డొకడు బ్రాహ్మణబృందంతో తన ఇంటిలోనుంచి వీథిలోకి

వచ్చాడు. అతడిని చూసి మాధవీదేవి తన భర్తతో ఇలా అంది

నాథా ! మూడు వర్ణాలవారికీ బ్రాహ్మణుడు తండ్రిలాంటివాడు అన్నారు. తండ్రి ధనాన్ని కొడుకు

నిస్సంకోచంగా తీసుకోవచ్చు. అందుచేత మనం వీరిని ప్రార్థిద్దాం.

దేవీ ! నేను క్షత్రియుణ్ణి. ఒకరి దగ్గర చెయ్యిజాపను. దానం పట్టను. అప్రతిగ్రహం నా నియమఁ

నీకు తెలుసుగదా ! యాచన అనేది విప్రులకేకానీ మన క్షత్రియులకు కాదు. విప్రుడు సకలవర్ణాలవారికీ

గురువు. పూజనీయుడు. అందుచేత గురువును అసలు యాచించకూడదు. అందునా క్షత్రియులకు ఆది

సుతరామూ తగదు. యజన అధ్యయనదాన శరణాగతరక్షణ ప్రజాపాలనలు మాత్రమే క్షత్రియ

ధర్మాలు. దేహి అనే దీనాలాపం మననోట రాకూడదు. దదామి అనేదే మనమాట కావాలి. అదే ఎప్పుడూ

నా హృదయంలో ఆడుతూ ఉంటుంది.

-

న చాస్యేనం తు వక్తవ్యం దేహీతి కృపణం వచః

దదామీత్యేవ మే దేవి హృదయే విహితం వచః

(21-17)

కామెంట్‌లు లేవు: