24, ఏప్రిల్ 2024, బుధవారం

కర్మబంధితులై వుంటారు.

 💐వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు మనిషి జన్మను ఉత్తమం అనలేదు, దుర్లభం అన్నారు.💐


*అప్సరసలు దిసమొలగా కొలనులో దిగి జలకాలాడుతున్నారు. శుకముని ఆ దిశగా రావడం అందరూ చూశారు. ఎవరూ పట్టించుకోలేదు. శుకుణ్ణి పిలుస్తూ వ్యాసమహర్షి పరుగున వస్తున్నాడు. స్త్రీలు కంగారుగా బట్టలు చుట్టబెట్టుకోబోయారు.  విస్తుపోయాడా మహర్షి. "నవ యవ్వనంతో మెరిసిపోతున్న నా కొడుకును చూసినప్పుడు లేని కలవరపాటు వయోవృద్ధుడనైన నన్ను చూస్తే ఎందుకు కలిగింది?" అని అడిగాడు. "నీ కొడుకు నిర్మలుడు, నిస్సంగుడు" అన్నారు అప్సరసలు. "అనుక్షణం పరమాత్మ స్వరూపాన్ని ఉపాసిస్తూ, దర్శిస్తూ, పరవశిస్తూ, బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయినవాడు" అన్నది భాగవతం. ఆ స్థితిలో ఉన్నవాడిని 'ఆరూఢుడు' అంటారు. "ఇది నగరము, ఇది అరణ్యము, ఇది సౌఖ్యము, అది అసౌఖ్యము, ఇతడు పురుషుడు, ఆమె స్త్రీ' వంటి తేడాలేవీ అలాంటి పరిణత మనస్కులకు తోచవు.* *ఆరూఢుడికి ( బ్రహ్మజ్ఞానికి ) ఏది చూచినా బ్రహ్మమయమే. అతడు సంగములు సర్వమునూ కలిగి సంగి ( లోబడినవాడు ) కాడు.* *భోగములు సర్వమునూ చెంది భోక్త కాడు. లోకంలో సన్యాస దీక్షాపరుల పరమ గమ్యం అదే !*

 *సన్యాసం తీసుకోవడమనేది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ! "సన్యాసం స్వీకరించార"ని మనం అంటూ ఉంటాం. కానీ అది పుచ్చుకుంటే వచ్చేది కాదు. తిరకాసంతా -  మనసుతోనే ! "బంధానికైనా, మోక్షానికైనా కారణం మనసే" అన్నది ఉపనిషత్తు. అంటే సాధ్యమూ మనసే, సాధనమూ మనసే.*

*సన్యాసాశ్రమ స్వీకరణకు వైరాగ్యం తొలిమెట్టు. సన్యాసం అంటే కాషాయం కాదు. పరిపక్వ, వైరాగ్య, జీవన ఫలసాయం. భవబంధాలను, సుఖదుఃఖాలను పరిపూర్ణంగా చక్కగా విడిచిపెట్టటం (సత్ + న్యాసం ). అదే సన్యాసం. తన భారాన్ని పరమాత్మ పాదాల చెంత సమర్పించడం భరన్యాసం. అదే అనన్య శరణాగతి. అది మానసిక పరిణయం. వైరాగ్యభావసమృద్ధి.*


*స్త్రీ, ధన, పుత్ర వ్యామోహాలనే మూడింటినీ "ఈషణత్రయం" అంటారు. ఈషణం అంటే కోరిక, వ్యామోహం. దారేషణ,  ధనేషణ, పుత్రేషణ అనే మూడు రకాలైన మోహాలతో మానవులు పీడింపబబడుతుంటారు,*

*కర్మబంధితులై వుంటారు.వాటి కోసం ఎలాంటి తప్పుడు పనులు చేయడానికయినా సాహసిస్తారు. వైరాగ్యమనేది ఈషణ త్రయానికి ఎదురు చుక్క. వాటిని త్యజించి సద్గురువునాశ్రయించి దేహంలో ఆరు పువ్వులలో పూజలను చేస్తానని దృఢ సంకల్పాన్ని స్వీకరిస్తాడు సన్యాసి. దేహంలో ఆరు పువ్వులంటే షట్చక్రాలు. వాటినే షడాధార కమలాలని అంటారు. సాధన చేయగా చేయగా, హృదయాకాశంలో ఓంకారం గంటమాదిరి మోగుతుందట. అది తుదిమెట్టు. చివరికలా జ్ఞాన, వైరాగ్య, నిశ్చల, ఆనందపూర్ణులైనవారు జీవన్ముక్తులవుతారు. ఇదంతా ఒక్క మానవజన్మ లోనే సాధ్యం. వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు మనిషి జన్మను ఉత్తమం అనలేదు, దుర్లభం అన్నారు. మురిసిపోవటానికి కాదది, ముక్తి పొందటానికని చెప్పారు.*

*యోగజీవనమనేది సాధనతోనే సాకారమవుతుంది.*

కామెంట్‌లు లేవు: