26, జూన్ 2024, బుధవారం

పోతన పాత్ర చిత్రణ



పోతన పాత్ర చిత్రణ 


                    ఉ:  కాటుక కంటినీరు  చనుగట్ల పయింబడ  నేలయేడ్చెదో?


                          కైటభ దైత్య మర్దనుని  గాదిలి కోడల!  యోమదంబ! యో


                         హాటకగర్భురాణి!  నిను  నాకటికైఁ గొనిపోయి   యల్ల   క


                         ర్ణాట  కిరాట  కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ  నమ్ము; భారతీ!


                                        --    చాటువు ;


                 ఉ:  కోపము తోడ నీవు  దధి భాండము  భిన్నము  సేయుచున్నచో


                        గోపిక  త్రాటఁగట్టిన  వికుంచిత  సాంజన భాష్ప  తోయ   ధా


                        రా పరిపూర్ణ  వక్త్రముఁ  గరంబులఁ బ్రాముచు  వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై  నటించుట  గృపాపర ! నామదిఁ   జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన  కవితల్లజులలో  పాత్ర చిత్రణ విషయమున  కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు  శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగిన వేషము.దానికితగనమాటలు .మాటలకు దగిన చక్కనిపదములకూర్పు. పోతన చిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో  మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును  నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి  దీనవదనయై  కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,."  అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా  నేలనమ్మా  విలపింతువు? ఓహో!  ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము.


                                   ఇఁక  రెండవ చిత్రము  చలనము. బాలకృష్ణుని కొంటేపనులను  దలచుకొని  కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో  పగులగొడితివి. ఆగోపికయు కోపమున  నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కాటుక కన్నీరుగార

దానినంతయు  నిరుచేతులతో  మొగమంతయు పులుముకొనుచు  వేడినిట్టూర్పులను  విడచుచు బాలునివలె నటించుట     నేడుదలచికొనిన  నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట  నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన  మోమును  చేతులతో  పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు అంతవాడ వింతవాడ వైతివే యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని  గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🙏

కామెంట్‌లు లేవు: