*శాసన సభ్యులు - సుపరిపాలన 10*
సభ్యులకు నమస్కారములు.
కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తమకంటూ ప్రచార మాధ్యమాలను (దిన పత్రికలు, దృశ్య, వినికిడి మాధ్యమాలు Tv లను) నెలకొల్పుకోవడం ఈ మధ్యన సర్వ సాధారణమైనది. తమ తమ ప్రచార మాధ్యమాల ద్వారా తమ రాజకీయ విధానాలను, సిద్ధాంతాలను, కార్యాచరణను ప్రజా సంక్షేమానికై ప్రచారం చేసుకుంటే మంచిదే మరియు ప్రజలు హర్షిస్తారు గూడా. కాని, కొన్ని రాజకీయ పార్టీల మరియు నేతల ప్రచార మాధ్యమాలు వింత మరియు విపరీత ధోరణులు అవలంబించడం ప్రజలు గమనిస్తున్నారు. కొన్ని ప్రచార మాధ్యమాలు తమకు మద్దతు ఇవ్వని మరియు తమను అనుసరించని పార్టీలపై, నాయకులపై సత్యదూరమైన ఆరోపణలు, అభూత కల్పనలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్నాయి. ఎన్నికల కురుక్షేత్రమప్పుడు ఈ మాధ్యమాల జోరు మరీ విపరీతంగా ఉంటుంది. కొన్ని పత్రికల రాజకీయ వార్తలు, వ్రాతలు... చదివే వారికి రోతలుగా భావించే హీన స్థాయిలో ఉంటాయి. రాష్ట్రాలలో, దేశంలో ఉన్న కొందరు పత్రికా మరియు దృశ్య మాధ్యమాల బడా అధినేతలు కూడా రాజకీయ నేతలకు, పార్టీలకు వంత పాడడం గూడా ప్రజలు గమనిస్తున్నారు.
ఇంతటితో సమస్యలు ఆగవు. పాలక మరియు ప్రతిపక్ష పార్టీల పంచన చేరకుండా వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలన్న కుతూహలము, నిజాయితీ కలిగిన వార్తా విలేఖరులపై మరియు పోటీ పార్టీల పత్రికా విలేఖరులపై దాడులను గూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. రాజకీయ పార్టీల మరియు నాయకుల ఇటువంటి అనుచిత కృత్యాల వలన సమాజంలో అలజడి, రక్షక భట శాఖ ప్రవేశము జరుగుతూ ఉంటాయి. ఇటువంటి దుశ్చర్యల వలన జర్నలిస్టు సంఘాల నాయకుల ఆందోళనలు, ప్రభుత్వానికి విజ్ఞప్తులు, బహిరంగ సభలు, ప్రదర్శనలు సమాజానికి కొత్తేమీ కాదు.
*అవుతే* అందరు శాసన సభ్యులు ప్రచార మాధ్యమాలను నెలకొల్పుకుంటున్నారు అను భావన/విషయము *సత్యదూరము*. ప్రజలు కోరునది, శాసన సభ్యులకు విజ్ఞప్తి చేయునదేమనగా *ఇటువంటి సందర్భాలలో మాన్యులైన శాసన సభ్యులు ఉచితానుచితాలు పాటిస్తూ ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేయాలని.*
*పార్టీలు ఏవైనా, వారి అధినేతలు ఎవరైనా నీతి నిబద్ధత గల శాసన సభ్యులు మేల్కొనాలి, నిజాలను గ్రహించి సమాజపు అభివృద్ధి, భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలను, విలేఖరులపై దాడులను నిరసించాలి, ఆపాలి. ప్రజా స్వామ్మ్యాన్ని కాపాడాలి*. ప్రజలు మూఢులు, మూర్ఖులు కారు. న్యాయ నిర్ణేతలు వారే. ఏ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించినా, వంత పాడినా స్థానిక నాయకుల సచ్చరిత్ర, స్వభావము, యోగ్యత, నడత, శీలము, మార్గ దర్శకత్వము, నీతి మరియు నిజాయితి గల అభ్యర్థులకే వారి ఓటు. *కావున నాయకులందరూ సచ్చీలురుగా ఉండాలి*.
ధన్యవాదములు.
(సశేషము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి